"అదే....ఆ విషయం గురించే అడగాలని అనుకుంటున్నా....నువ్విప్పుడు ఆఫీసుకి వేళ్ళలా... ఈ రోజు ఆఫీసు మానెయ్యకూడదూ-చిన్నప్పుడు నువ్వు కడుపు నొప్పనీ, కాలు నొప్పనీ దొంగ వేషాలు వేసి బడి ఎగ్గొట్టేవాడివటకదా! మీ అమ్మ చెప్పింది. అలా ఈ వేళ ఆఫీసు ఎగ్గోట్టేయ్యరాదూ?" మళ్ళీ రాంపండు షర్టు గుండీమీద చెయ్యి వెయ్యబోయింది రాజీ.
రాంపండు ఆమె చేతిని చట్టుక్కున పట్టుకుని ఆపాడు.
"అది నిజమే అనుకో....కానీ అప్పుడు బడి ఎగ్గోడ్తే మా అమ్మా నాన్న నన్ను తన్నకుండా అడ్డకానికి మా నాయనమ్మ వుండేది. ఇప్పుడు అలా ఎవరున్నారు?మా బాస్ సర్వోత్తుమారావు గురించి నీకు తెలీదు చీల్చి చెండాడేస్తాడు.అతని పేరు సర్వోత్తమారావు అని వాడి అమ్మా,బాబు పెట్టారుగానీ నిజానికి అతని పేరు సర్వానికృష్ణరావు అని పెట్టి వుండాల్సింది."
"అయితే మీ ఆఫిసులో అసలు ఎవరూ శలవులే పెట్టరా? ప్లీజ్ పండూ ఈవేళ శలవు పెట్టవా సరదాగాకాస్సేపు పెకాడుకుందాం. మద్యాహ్నం మ్యాట్నీకి ఏ సినిమాకైనా వెళదాం... ఇంట్లో వుండీ వుండీ నాకు బోర్ కొడ్తుంది రాంపండూ ! గారంగా అంది రాజీ.
"నిజమే అనుకో!నాక్కూడా ఆఫీసుకు వెళ్ళీ వెళ్ళీ బోర్ కొడ్తుంది. కానీ ఈ వేళ ఆఫీసులో మీటింగ్ ఒకటి ఏడ్చిందే. వెళ్ళకపోతే మా వాడు అగ్గిరాముడైపోతాడు..."
రాంపండు చేతి వాచ్ వంక చూశాడు.
"బాబోయ్! ఆఫీసుకి టైమైపోతుంది. నేనింకా వస్తా_"సోఫాలోంచి లేచాడు. "సాయంత్రం త్వరగా వస్తానులే. బయటికి ఎక్కడికైనా వెళదాం. సరేనా?అయినా యింట్లో టీవి వుండగా బోరేంటీ....అందాకా దాంతో కాలక్షేపం చెయ్యి."
"టీవీనా? కాలక్షేపమా? మీరే మీ కళ్ళారా చూసి తరించండి !" కోపంగా అంటూ టీవీ అన్ చేసింది.
"నమస్కారం!"టీవీలో ఓ ఎర్ర కళ్ళాయన ప్రత్యక్షం అయి నమస్కారం పెడ్తూ చేవుల్దాకా నవ్వాడు.
"హహహ....గొగ్గిపళ్ళు....!"నవ్వాడు రాంపండు.
"ఇప్పుడు చిన్నపిల్లల కార్యక్రమంలో పిల్లలకు కాగితం పడవలు తయారు చేయడం హి....ఇసుకతో గూడులు కట్టడం హి హి....నేర్పిస్తాం హి హి హి..."
"చిన్నపిల్లల కార్యక్రమానికి అలాంటి అనౌన్సరా ?జడుసుకుని జ్వరం తెచ్చుకోరూ?హహహ"సంబరంగా నవ్వాడు రాంపండు.
అనౌన్సర్ యింకా యిలా ప్రకటించాడు.
"ఈ చిన్నపిల్లల కార్యక్రమం తర్వాత మహిళల కోసం మరో కార్యక్రమం. దీంట్లో పులిసిన పిండితో పుల్లట్లు వెయ్యడం ఎలా, ముగ్గుపిండి పొదుపుగా వాడ్తూ తక్కువ ముగ్గు పిండితో పెద్ద ముగ్గు వెయ్యడం ఎలా మొదలయిన విషయాలు చెమ్మచెక్క అమ్మాజీ తెలియచేస్తారు."
హహహ-హొహొ హొ....చూశావా రాజీ!టీవీ చూస్తుంటే హెంత నవ్వు వస్తుందో దీని సిగతరగా!" చూశావా చూశావా టీవీ ఎంత కాలక్షేపమో....ఇంక బోరేం కొడుతుంది ?నేను రిటైరయ్యాక టీవీ ముందే ఇరవై నాలుగ్గంటలూ కూర్చుంటా ..."అన్నాడు రాంపండు సంబరంగా.
"అయితే అప్పుడు కూడా నాతో గడపవన్నమాట!..."విసురుగా టీవీ కట్టేస్తూ అంది రాజీ.
రాంపండు మొహంలో నవ్వు మాయం అయింది."సర్లె....సర్లె...అప్పటి సంగతి గురించి ఇప్పుడు వాదించు కోవడం ఎందుగ్గానీ"అంటూ వాచ్ చూస్కుని....
"అమ్మో నా ఆఫీసు!" అన్నాడు గుమ్మంవైపు వేగంగా అడుగులు వేస్తూ.
"సరే!కనీసం సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా రండి...ఈవేళ ఏ సినిమాకో, పార్కుకో వెళ్దాం"అంది రాజీ.
"ఓ !అలాగే....!అలాగలాగే! అలాగలాగలాగే...."అంటూ బయటికి పరుగు తీశాడు రాంపండు.
* * * * *
టేబుల్ మీది పైల్సన్నీ చకచకా ట్రేలలో సర్దేసి, కొన్ని కాగితాలు టేబులు సొరుగులో వేసి తాళం వేశాడు రాంపండు.
అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలైంది.
"ఏంటి....టేబుల్ మొత్తం క్లీన్ గా సర్దేశావు?"బాస్ సర్వోత్తమరావు క్యాబిన్లోంచి బయటికి వచ్చిన బ్రహ్మజీ రాంపండు ని అడిగాడు.
"ఎందుకేమిటి? ఇప్పుడు కాన్పురెన్స్ హాలులో మీటింగ్ వుంది కదా....అక్కడికి వెళ్ళద్దూ"అన్నాడు రాంపండు.
"వెళ్ళొద్దు!ఇప్పుడు మీటింగ్ లేదని బాస్ చెప్పాడు"చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు బ్రహ్మజీ.
"పీడా వదిలిపోయింది, మీటింగ్ లో అడ్డమైనా డెసిషన్సూ తీసుకుంటారు. వాటిని పాటించలేక మనం చావాలి."
బ్రహ్మజీ అతని ప్రక్కసీట్లో కూర్చంటూ అన్నాడు. "తప్పు నాయనా!మీటింగ్ ఇప్పుడు లేదని అన్నాను గానీ అసలు లేదని అనలేదు కదా!మీటింగ్ ని రెండు గంటలనుండి నాలుగ్గంటలకు పోస్టుపోన్ చేశారు."
"నాలుగ్గంటలకు మీటింగ్ అంటే కనీసం మూడు గంటలు పైనే అవుతుంది.అంటే ఏడు దాటుతుంది....మనం ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది పైనే అవుతుంది"గుండేలమీద చేయ్యేసుకుంటూ అన్నాడు రాంపండు.
"అంతేకదా మరి? నువ్వు తీరికగా విచారిస్తూ వుండు.నేను మీటింగ్ పోస్టుపోన్ అయిన విషయాన్ని మిగతా స్టాప్ కి చెప్తాను"అంటూ సీట్లోం చి లేచి వెళ్ళిపోయాడు బ్రహ్మజీ.
రాంపండుకి రాజీ గుర్తుకు వచ్చింది. దాంతోపాటే ఆమె యింటికి త్వరగా వచ్చి బయటికి ఎక్కడికైనా తీసుకెళతానని యిచ్చిన వాగ్దానం కూడా గుర్తుకు వచ్చింది.
"ఛీ.... చీచీ....థూ....థూథూ...థూథూథూ...."అన్నాడు బాధగా.
"ఏంటీ? టేబులంతా ఉమ్ములేస్తున్నావా?"
"ఎవడ్రా నువ్వూ "అనుకంటూ తలెత్తిన రాంపండు ఎదురుగా కనిపించిన సర్వోత్తమరావుని చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు.
"ఏంటిసార్!మీరిలా వచ్చారు?"అన్నాడు.
ఏం రాకూడదా?"సీరియస్ గా చూస్తూ అడిగాడు సర్వోత్తమరావు.రావచ్చు.కానీ మీరు ప్యూన్ తో కబురు చేస్తే నేనే క్యాబిన్ లోకి ఎగిరొచ్చి మీ ముందు వాలేవాడిని కాద్సార్?"
"ఎగిరొచ్చి వాలడానికి నువ్వేమైనా కాకివా, పిచికవా?హహహ"పగలబడి నవ్వాడు సర్వోత్తమరావు.
తను కూడా నవ్వకపోతే బాగుండదని రాంపండు కూడా నవ్వాడు "హహహ...."
అప్పుడే అక్కడికొచ్చిన బ్రహ్మజీ కూడా పకపకా నవ్వాడు.
"ష్!సైలెన్స్ ఆపండి....ఈ నవ్వుడు వ్యవహారం నాకు నచ్చదు.ఆఫీస్లో ఇలా నవ్వితే డిసిప్లిన్ వుండదు"సీరియస్ గా అన్నాడు సర్వోత్తమరావు.
"ఎస్సార్!"అన్నాడు రాంపండూ, బ్రహ్మాజీ ఇద్దరూ ఏడుపు మొహాలు పెట్టి.
"అవునుగానీ-నువ్వెందుకయ్యా అంతచేటున నవ్వావ్?"బ్రహ్మజీని అడిగాడు సర్వోత్తమరావు.
"సారీ సర్!అదేదో మీరేసిన జోకే అనుకుని నవ్వాను...వీడేసిందని తెలిస్తే చచ్చినా నవ్వేవాడిని కాద్సార్!"అన్నాడు బ్రహ్మజీ.
"షటప్....ఈ వ్యవహరాలు నాకు నచ్చావ్...మీటింగ్ నాలుగ్గంటలకని అందరికీ చెప్పానా?"
"చెప్పాను సార్."
"సరేగానే ఇందాక నీ ఉమ్ముల వ్యవహారం ఏంటీ?.....ఆఫీసులోని టేబుల్స్ మొత్తం నీ ఉమ్ముల్తో చెత్త చెండాలం చేద్దామనా నీ వుద్దేశం?" రాంపండుని అడిగాడు.