కళ్ళు మూసి తెరిచేటంతలో జరిగిపోయింది అది!
మెరుపులాంటి వేగంతో భగవాన్ తన జెర్కిన్ జేబులో నుంచి సంకెళ్ళు తీశాడు. మరుక్షణంలో ఆ సంకెళ్ళు తన చేతికీ, రాజా చేతికీ కలిపి వేసేశాడు.
'క్లిక్' మనే శబ్దంతో సంకెళ్లు లాక్ అయిపోయాయి.
వెంటనే విజయగర్వంతో చెయ్యి పైకెత్తాడు భగవాన్. అతని వేళ్ళు రెండు విజయసూచకంగా విక్టరీ సైన్ ని చూపిస్తున్నాయి. అతని చేతితోపాటు ఆటోమాటిక్ గా రాజా చెయ్యి కూడా పైకి లేచింది.
ఇద్దరి చేతులనీ కలిపి బంధించిన సంకెళ్లు తళతళ మెరుస్తూ కనబడుతున్నాయి.
అక్కడే ఉన్న సెక్యూరిటీ పర్సనల్ అలర్టు అయిపోయారు.
అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గానే వుంది.
ఎంత టైట్ సెక్యూరిటీ ఉన్నా కూడా జరిగే అఘాయిత్యాలు జరిగిపోతూనే వుంటాయి కదా!
కొన్నేళ్ళ క్రితం మ్యూనిక్ ఒలింపిక్స్ లో కూడా అలాగే జరిగింది. ఎంతో సెక్యూరిటీ వున్నా కూడా టెర్రరిస్టులు కొందరు జొరబడి ఇజ్రేలీ స్పోర్ట్స్ మెన్ ని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేశారు.
ఇప్పుడు...ఇక్కడ కూడా అలాగే జరగబోతోంది.
అందరిలో టెన్షన్!
తక్షణం సెక్యూరిటీ పర్సనల్ వెపన్స్ ని భగవాన్ మీదికి గురిపెట్టారు.
భగవాన్ భయపడలేదు.
పైపెచ్చు పిశాచంలా నవ్వాడు.
"డోంట్ షూట్!" అన్నాడు పెద్దగా. నన్ను షూట్ చేస్తే నాతోబాటు యీ రాజాగాడూ చస్తాడు. వీడితో బాటు మీరూ చస్తారు. నేను హ్యూమన్ బాంబ్ ని! అర్ధమయిందా? యా! ఐ యామ్ ఏ హ్యూమన్ బాంబ్! ఐ యామ్ అబౌట్ టూ ఎక్స్ ప్లోడ్! ఏం నమ్మట్లేదా? అంటూ జర్కిన్ జిప్ కిందికి లాగాడు.
భగవాన్ జెర్కిన్ కి తగిలించి ఉన్నాయి గెలాటిన్ స్టిక్స్... అనేకమైన వైర్లు. వాటితోబాటు చిన్న మెటల్ బాక్స్ లాంటిది ఒకటి.
"నేను చావడానికే ఇక్కడికి వచ్చాను. కానీ నేను చచ్చే ముందు వందమందిని చంపిగానీ చావను" అన్నాడు భగవాన్ ఉన్మాదిలాగా.
"ఎవరు నువ్వు?" అన్నాడు రాజా. అతని మొహంలో నదురూ బెదురూ కనబడడం లేదు.
"నేనా? నేను యునైటెడ్ టెర్రరిస్టుల మెంబర్ని" అన్నాడు భగవాన్.
"అంటే?"
"ఇండియా అంటేనే అదొక దగుల్బాజీ దేశం! పేరుకే అక్కడ ప్రజాస్వామ్యం. బిగ్ బ్రదర్ లాగా, బుల్లీ లాగా ప్రవర్తిస్తుంది ఇండియా. అందుకే పొరుగు దేశాలన్నిటికీ ఇండియా అంటే అంత అలర్జీ! ఇండియాలో జనానికి హక్కులు వుండవు. రాక్షస ప్రభుత్వం! అందుకే పంజాబ్ లో తీవ్రవాదం. అందుకే అస్సాంలో తీవ్రవాదం. అందుకే కాశ్మీర్ లో మిలిటెన్సీ. అందుకే ఎవరికి వాళ్ళు యెక్కడికక్కడ ఇండియా నుంచి విడిపోయి మర్యాదగా మా బ్రతుకు మేం బ్రతుకుతాం అంటున్నారు" అన్నాడు భగవాన్ విషం కక్కుతున్నట్లు.
"యూ ఆర్ టాకింగ్ షిట్" అన్నాడు రాజా.
అక్కడ జరుగుతున్న ఊహాతీతమైన సంఘటనను ఫెయిత్ ఫుల్ గా రికార్డ్ చేస్తున్నాయి వందలకొద్దీ టేప్ రికార్డర్లు, కెమేరాలు, వీడియో కెమేరాలూ....
అనుకోకుండా ఇంత ఎగ్జయిటింగ్ స్టోరీ దొరికినందుకు ఉర్రూతలూగి పోతున్నారు దేశ దేశాల న్యూస్ సర్వీసెస్ తాలూకు విలేఖర్లు. CNN, NBC టీవీల కెమేరాలు అక్కడ జరిగిపోతున్న దానిని జాగ్రత్తగా ఫాలో అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పబ్లిసిటీకి స్కోపు!
అందుకే ఆ స్థలాన్ని, ఆ నిమిషాన్ని, ఆ మనిషిని ఎన్నుకున్నాడు భగవాన్.
అతనికి కావలసింది పబ్లిసిటీ.
అది అపారంగా లభిస్తోంది ఇప్పుడు.
చెలరేగిపోతూ అన్నాడు భగవాన్-
"ఎక్కడికక్కడ ఎన్ని తీవ్రవాద ఉద్యమాలు వచ్చినా, అన్నిటినీ తొక్కెయ్యడానికి తెగ ఆరాటపడిపోతుంది ఇండియా. అందుకే యిలా లాభం లేదని తీవ్రవాదులం అందరం ఐక్యమయ్యాము. యునైటెడ్ టెర్రరిస్ట్స్ అనే ఈ ఆర్గనైజేషన్ లో పంజాబ్ తీవ్రవాదులు ఉన్నారు. కాశ్మీర్ మిలిటెంట్స్ ఉన్నారు. ఉల్ఫా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎల్.టి.టి.ఇ. కూడా మాతో కలిసింది. టెర్రిఫిక్ కాంబినేషన్! ఇక ఇండియాని పడుకోబెట్టేస్తాం! డౌన్ విత్ ఇండియా! డౌన్ విత్ ఇండియన్ ఇంపీరియలిజమ్! డౌన్ విత్ డిక్టేటర్ షిప్! లాంగ్ లివ్ అవర్ స్ట్రగుల్!" అని డ్రమటిక్ గా ఒక్కక్షణం ఆగి మళ్ళీ అన్నాడు భగవాన్.
"ఇప్పుడు మీరు బీభత్సాన్ని చూడబోతున్నారు. నేను ఈ మీటని నొక్కుతాను. వెంటనే ఈ బెల్టు బాంబు పేలిపోతుంది. వెంటనే ఈ బెల్టు బాంబు పేలిపోతుంది. నాతోబాటు ఈ రాజా, వాడితోబాటు మీలో కొందరు కూడా చావక తప్పదు."
రెడీనా?
గుడ్ బై ఫ్రెండ్స్!"
అందరూ అదిరిపడి పది అడుగులు వెనక్కివేశారు.
ఉన్మాదిలా నవ్వుతూ మీట నొక్కాడు భగవాన్.
ఆశ్చర్యం!
ఏమీ కాలేదు.
బెల్టు బాంబు పేలలేదు.
మరుక్షణంలో రాజా చెయ్యి మెరుపు వేగంతో వచ్చి భగవాన్ మెడని పట్టేసుకుంది. ఆ చేతికి సంకెళ్ళు లేవు ఇప్పుడు.
భగవాన్ వాగుతుండగా సైలెంటుగా సంకెళ్ళు వదిలించేసుకున్నాడు రాజా.