శరశ్చంద్రిక
నవీన విశ్వవిద్యాలయాల్లో
పురాణ కవిత్వంలాగా
శ్రవణ యంత్రశాలల్లో
శాస్త్రీయ సంగీతం లాగా
ఇలా వచ్చేవేం వెన్నెలా?
ఎలా వర్ణించను నిన్ను?
మహా కవులు లోగడ చెప్పిందే
మళ్ళీ మళ్ళీ చెప్పాలా?
ఏదో కాస్త భాషా జ్ఞానం
ఇంతో అంతో చ్ఛందస్సంపదా
ఐదో పదో అలంకారాలు
ఆరో, అందులో సగమో ఆవేశం
ఇలాంటివే ఏవో పోగుచేసి
ఇదివరకు నిన్నెప్పుడూ చూడనట్టు
ఇవ్వాళే కొత్తగా కనిపెట్టినట్టు
ఏమని వర్ణించను నిన్ను?
ఏది రాసిన ఏంలాభం?
ఇదివర కెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నాకన్నా
బాగానే అని వుండొచ్చు.
అలాంటప్పుడు మళ్ళీ
కలం కాగితం మీద పెట్టి
కళంకంలేని తెల్లదనాన్ని
ఖరాబు చెయ్యడ మెందుకు?
అనాది నుంచీ నువ్వు
అంత మంది కవులకీ
ఉపాదేయ వస్తువుగా నిలిచి
ఉపకారం చేశావు
అలాగే నేనూ ఒకప్పుడు
రొమాంటిక్ ప్రమాదంలో పడి
అమాయకంగా నీ బ్యూటీ
అభివర్ణించాను వృత్తాలలో
ఇవాళ మళ్ళీ అలాగ
ఎలాగ రాయగలను నేస్తం?
ఇరవయ్యో ఏడు నాకు మళ్ళీ
ఎలా వస్తుంది చెప్పూ?
అంచేత నీ గురించి
అనవసరావేశాలు పెంచి
అన్యాపదేశంగానో లేదా
అర్థాంతరన్యాసంగానో
సొంత కోపాలేవో పెట్టుకొని
పంతాలూ పట్టింపులూ పట్టుకొని
ఎవరినీ ఈ వ్యవహారంలో
ఇరికించదలుచుకోను నేను!
ఇంతకీ ఆవేశాల కేముంది?
ఎవడి బతుకు వాడు బతుకుతున్నాడు
ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా
ఎంతగా పైపై భేదాలున్నా
ఎంతగా స్వాతిశయం పెగినా
ఎంత బలం ధనం జవం పెరిగినా
అంతరంగం అట్టడుగున మాత్రం
అంతమందినీ మానవులమే!
అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణసోమా!
సముద్రంమీదా అరణ్యంమీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!
(అదిగో మళ్లీ కవిత్వం-
అనుకున్నాను మొదటే నేను
వెన్నెల పేరెత్తితే చాలు
వెర్రెత్తిపోతుంది మనస్సు)
అన్నట్టు ఏమి చెప్మా
అందామని అనుకున్నాను
ఏమీలేదు! ఏమీ లేదనే
ఇంతసేపూ చెబుతున్నాను.
చెప్పొచ్చిందేమిటంటే
చెప్పడాని కేమీ లేదని!
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం.
ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?
అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఏమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో
ఇక్కడినుండి వెళ్ళేదెక్కడికో
ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి
చెబితేమాత్రం నమ్మకండి!
కాళ్ళక్రింద భూమి
కరిగిపోతున్నప్పుడు
పూర్వం వేసిన పునాదులు
కదిలిపోతున్నప్పుడు
మనిషికీ మనిషికీ మధ్య
మాయపొరలు కప్పినప్పుడు
మనసుకీ మనసుకీ మధ్య
మంచు తెరలు కమ్మినప్పుడు
ఏ నక్షత్రానికి తగిలించాలి
ఈ మన విషాద శకటాన్ని?
ఎవరు మళ్ళీ అతుకుతారు
ఈ విరిగిన జీవిత శకలాల్ని?
అంతా అగమ్యగోచరం
అంతా అరణ్యరోదనం
ద్వేషం ఇచ్చే పర్సెంటేజి
ప్రేమం ఎలా ఇవ్వగలదు?
కష్టపడి ఆర్జించిన స్వాతంత్ర్యం
గద్దలు తన్నుకుపోతాయి
కంచిమేక పాపం ఎప్పుడూ
కసాయివాణ్ణే నమ్ముకుంటుంది.
ఇంతకీ ఈ భూమికి
ఏ మాత్రం ఈడొచ్చిందని?
సగటు మానవుడి వయస్సు
పదకొండో, పన్నెండో
ఈ కుర్రాళ్ళని చూసి
ఎందుకలా నవ్వుకుంటావు
మబ్బుతునక జేబురుమాలు
మాటు చేసుకొని, జాబిల్లీ!