ప్రస్తుతం పారడైజ్ సిటీలో భారతీయ సంతతివారిదే మెజారిటీ... కానీ వాళ్ళకి మనదేశంలో మైనారిటీ వర్గానికి ఉన్న హక్కులూ, భద్రతా కూడా లేవు. కారణం... చిత్రద్వీప్ డిక్టేటరయిన జనరల్ భోజాకి ఇండియా అంటే అకారణమైన కార్పణ్యం వుంది.
చాలా జాతుల నెత్తురు ప్రవహిస్తోంది భోజా శరీరంలో.
అతని ముత్తాత ఆఫ్రికా అరణ్యాలనుంచి బ్రిటిష్ వారు బానిసగా పెట్టి తెచ్చిన 'మసాయ్' తెగకు చెందిన నీగ్రో
మసాయ్ తెగవారి శౌర్యాన్ని గురించీ, క్రౌర్యాన్ని గురించీ, రక్త దాహాన్ని గురించీ ఆఫ్రికా అంటే తెలిసినవారు వైనవైనాలుగా చెబుతూ వుంటారు.
అతని తల్లి తరపు ముత్తాత ఒక అరబ్... అతనొక సముద్రపు దొంగ. భోజా తండ్రి బ్రిటిష్ వారి దగ్గర తలారిగా పనిచేశాడు అడవి దున్న తలనయినాసరే ఒక్క కత్తివేటుతో ఎగరగొట్టగలడనే ప్రతీతి వుండేది అతనికి. తన తండ్రి వంశంలో చైనీస్ రక్తం, తల్లి వంశంలో ఇంగ్లీషు రక్తం కూడా కలిశాయని సగర్వంగా చెప్పుకుంటూ వుంటాడు జనరల్ భోజా.
అతను ఎక్స్ పర్ట్ కుక్: పౌరశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం వుంది అతనికి: వయసురాగానే ఓ భూస్వామి ఇంట్లో వంటవాడిగా చేరాడు అతను. కానీ తమకు వండిపెట్టిన వాటికంటే అతను తినేస్తున్నవే ఎక్కువని ఇంటి యజమాని కనిపెట్టాక, అతనికి ఉద్యాసన చెప్పడం జరిగింది. అదే అనుభవం మరిరెండు యిళ్ళలో కూడా జరిగాక, ఇంక ఇలా లాభం లేదని తిన్నగా వెళ్ళిపోయి బ్రిటిష్ ఆర్మీలో కుక్ గా కుదురుకున్నాడు అతను.
పరిస్థితుల ప్రాబల్యంవల్ల బ్రిటిష్ వాళ్ళు ఆ ద్వీపానికి స్వాతంత్ర్యం యిచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎర్రతేలు కుట్టినట్లు ఒక పనిచేసి వెళ్ళిపోయారు. తాము ఇంకా ఆ ద్వీపంలో ఉండగానే, తమ ఆధ్వర్యంలోనే అక్కడ ఎన్నికలు జరిపించి, తమకు విధేయుడయిన ఆ వంటవాడిని నిలబెట్టి గెలిపించి, అతనికి పట్టంగట్టి పోయారు. ఆ ద్వీపంలో అవే మొదటి ఎలక్షన్లు, అవే చివరి ఎలక్షన్లు కూడా:
ప్రపంచంలో ప్రతిచోటా జరిగేదే అక్కడా జరిగింది. ఫలానివాడు ఏదో ఊడబొడిచేసి ఉద్దరిస్తాడని వెర్రి మొర్రి ఆశలు పెట్టుకొని జనం ఒకడికి ఓట్లేసి గెలిపిస్తారు. కుర్చీని లంకించుకొని అందులో కూర్చున్న మరుక్షణం నుంచి వాడు ప్రజలను మర్చిపోయి, "నీకూ బ్బెబ్బెబ్బే: నీ నాన్న కి బ్బెబ్బెబ్బే::" అని ఈసడించుకొని, తన పదవినీ, అధికారాన్నీ లంకించుకోవడానికి ఎన్నికల ద్వారా దక్కవలసిన ఆ పదవి వారసత్వంగా తన కుటుంబానికి దక్కెట్లు చేయటానికి తాపత్రయపడటం మొదలెడతాడు. అందులో ఒక భాగమే నోరెత్తుతాడనీ, నోరెత్తగలడనీ... అనుకున్న వాడి నోరు ముందరే నొక్కెయ్యడం: వీలైతే శాశ్వతంగా:
జనరల్ భోజా కూడా అంతే: తను గద్దె ఎక్కువగానే ప్రత్యర్థులనందరినీ ఉప్పుపాతర వేయించాడు. జర్నలిస్టులని జైల్లోకి తోయించాడు కానీ అతని ప్రత్యర్థి జగ్ నాధ్ మాత్రం ప్రాణాలు దక్కించుకొని ఇండియా పారిపోయి అక్కడ చిన్న క్లబ్బు ఒకటి నడుపుతూ గుట్టుచప్పుడు కాకుండా కాలక్షేపం చేస్తున్నాడు. జగ్ నాధ్ అనేది జగన్నాధం అనే పేరుకి అపభ్రలాశం: అతను భారతీయ సంతతికి చెందినవాడు. అందుకే అతనంటే భోజాకి మహాద్వేషం:
ఆ రోజు -
తన 'పాలెస్' లో రోజూకంటే ముందుగానే నిద్రలేచాడు జనరల్ భోజా. ఒక చిన్న గిన్నెడు మంచినూనె తాగాడు.... అప్పటికే అతని "ఆస్థాన వస్థాదు" వచ్చి వినయంగా కాచుకొని ఉన్నాడు. అలవాటుగా వస్తాదుతో నలభై నిమిషాలు కుస్తీ పట్టాడు భోజా. తర్వాత ఇరవై నిముషాలసేపు బస్కీలు,దండేలూ తీశాడు. దానితో అతని కసరత్తు పూర్తి అయింది.
అప్పటికి అతని "ఇంగ్లీష్ భార్య" జెన్నీఫర్ లేచి తయారుగా ఉంది. "నా ఇంగ్లీషు భార్య" అని అతను గొప్పగా చెప్పుకుంటాడు గానీ ఆమె మంచి కుటుంబానికి చెందిన మనిషేం కాదు. లండన్ లో సోహో ప్రాంతంలోని ఒకనైట్ క్లబ్బులో బట్టలు వలిచేసి కస్టమర్స్ ని అలరించే స్ట్రిప్ టీజ్ డాన్సర్ గా పనిచేస్తూ వుండేది. ఆమె డాన్సు చూసి మోహించి పెళ్ళి చేసుకు తెచ్చుకుని, చిత్రద్వీప్ కి ఆమెని "ఫస్ట్ లేడిని" చేసేశాడు జెనరల్ భోజా.
ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ కి కూర్చున్నారు. పందిమాంసం, బ్రెడ్డూ ఆరంజి జ్యూసూ, కాఫీ.
మొగుడి మొహం అదో రకమైన ఎగ్జయిట్ మెంటుతో వెలిగిపోతూ ఉండటం గమనించింది జెన్నిఫర్. అనుమానంగా అడిగింది.
"ఏమిటి విశేషం:"
"ఏమీలేదు." అని అన్నాడు భోజా నానుస్తూ
"ఏదో ఉంది. మళ్ళీ ఏ కుర్రదాని మీదన్నా చూపు పడిందా:"
"అబ్బెబ్బే:" అని బట్లరు వైపు ఓరగా చూశాడు జనరల్ భోజా. బట్లరుకి బొత్తిగా ఇంగ్లీషు రాదు. తనకిమాత్రం బొట్లేరు ఇంగ్లీషు ముక్కలు కాసిని వచ్చు.
"ఇవాళ ఎందుకింత పెందలాడే లేచావ్?" అంది జెన్నీ - జెన్నిఫర్.
"ఎయిర్ పోర్టు కెళ్ళాలి."
"నేనూ వస్తాను ."
"నువ్వు రాకూడదు ఇవాళ:"
"నాకు తెలుసు: ఎవరో కొత్తకుర్రదాన్ని తగులుకున్నావ్ నువ్వు:" అంది జెన్నీఫర్ పెడసరంగా.
భార్యవైపు చూశాడు జనరల్ భోజా. ఊరికే తిని కూర్చోవడం వల్ల అపరిమితంగా లావెక్కిపోయి, బాగా పాలిచ్చే జెర్సీ ఆవులా కనబడుతోంది ఆమె ప్లేటులోని మాంసాన్ని కొయ్యడానికి కత్తి చేతిలోకి తీసుకొన్నప్పుడు .... అప్పుడు మొదటిసారిగా వచ్చింది అతనికా ఆలోచన.