కమాండరు ప్రశ్నల పరంపరకు ఆమె చెక్కు చెదరలేదు. నిబ్బరంగా అంది:
"మన రాష్ట్ర మేప్ ను తీసుకున్నాను, మీరు వున్న ఈ ప్రాంతాన్ని వెదుక్కుంటూ వచ్చాను, అంతే! నేను యూనివర్శిటీ స్టూడెంటును. టెర్రరిజం గురించి రిసెర్చ్ చేస్తున్నాను. టెర్రరిస్టుల జీవన విధానాలను ప్రత్యక్షంగా చూడాలని, వారి ఆలోచనా సరళిని ఆన్_ద_స్పాట్ అవగాహన చేసికోవాలని, వారితో కలిసిమెలిసి తిరగాలని నా అంతట నేనే వచ్చేశాను. తప్పా?"
"నోరు ముయ్యి!" కమాండరు ఆవేశంగా అరిచాడు.
"ఒట్టు! నేనేమీ అబద్దం ఆడడం లేదు. నిజమే చెబుతున్నాను. నా పేరు ఆషా. కావాలంటే ఎవరినైనా పంపి యూనివర్శిటీలో ఎంక్వయిరీ చేయించండి!" ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా చెప్పసాగింది.
"ముందు వీళ్ళిద్దరినీ చెట్టుకు కట్టేయండి!" ఆషాను, కిరణ్ కుమార్ ను చూపుతూ ఆజ్ఞాపించాడు కమాండరు. అది సుగ్రీవాజ్ఞ.
"ఒకరి తరువాత ఒకరుగా వీళ్ళు మన స్థావరానికి రాగలిగారు అంటే గుండెలు తీసిన గూఢచారులై వుంటారు. నిస్సంకోచంగా ప్రభుత్వం ఏజంట్లు! ఇరువురినీ చెట్టుకు కట్టేసి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండి!" కమాండరు కఠినంగా ఆదేశించాడు. అది శిలా శాసనం.
వెనువెంటనే ఇరువురినీ సాయుధులు చెట్టుకు కట్టివేశారు.
ఆటోమాటిక్ రైఫిల్స్ ను గురిపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు....
ఆషా, కిరణ్ కుమార్ మిత్తువ ముంచుకొస్తున్నట్టు కళ్ళు మూసుకున్నారు.
కౌంట్ డౌన్ ప్రారంభమయింది....
* * *
సమతా నర్శింగ్ హోమ్.
రోగులను చూస్తున్న డాక్టరు సునంద బూట్ల శబ్దం విని తల ఎత్తింది. ఎదురుగా ఎస్.పి. నవీన్, ఇన్ స్పెక్టర్ వీరేష్ వున్నారు. ఠీవిగా నిలిచివున్నారు.
"సారీ టు డిస్టర్బ్ యు, డాక్టర్! మీతో కొంచం మాట్టాడాలి...."
ఆమె అంగీకారం కోసం ఎదురు చూశాడు నవీన్.
"సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ లో జరిగిన విషయాల గురించా?"
నవీన్ ను గుర్తుపట్టి అడిగి, వెంటనే నాలుక కరచుకుంది లేడి డాక్టరు సునంద.
"అవును" అన్నట్టు తలతిప్పాడు నవీన్. అతను ఆమె ప్రవర్తననే పరిశీలనగా చూస్తున్నాడు.
"జస్ట్_ఎ_మినిట్!" తను పరీక్షించిన పేషెంట్ కు ప్రిస్క్రిప్షన్ రాస్తూ, నిదానంగా అన్నది సునంద. మందుల కాగితాన్ని పేషెంట్ కు ఇచ్చి, జాగ్రత్తగా చెప్పి, లేచి సైగ చేస్తూనే లోనికి నడిచింది నిదానంగ.
పోలీస్ అధికారులు ఆమెను అనుసరించారు.
డాక్టరు పర్సనల్ గదిలో వారికి కుర్చీలను చూపుతూ తనూ కూర్చుంది సునంద.
"డాక్టర్ ! ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సంఘ విద్రోహ సక్తుల గుట్టు రట్టు చేయడానికి ప్రభుత్వం నన్ను ప్రత్యేకాధికారిగా నియమించింది. మీ సహాయ సహకారాలు మా కెంతో అవసరం!" తాము వచ్చిన సందర్భాన్ని వెంటనే ప్రస్థావించాడు నవీన్. అరమరికలు, అధిక ప్రసంగాలు అతనికి అలవాటు లేనివి.
"నన్ను ట్రెయిన్ లో కేవలం ఒక్కసారి చూసి, నా అడ్రసును ఎలా కనుక్కోగలిగారు?" డాక్టర్ సునంద ఆశ్చర్యంగా అడిగింది. అతని చురుకుదానానికి అబ్బురపడింది.
"వెరీ సింపుల్! జస్ట్_రిజర్వేషన్ చార్ట్ చూశాను. అందులో అందుబాటులో వున్న మీ అడ్రసును వెతుక్కుంటూ వచ్చాను!" చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు నవీన్.
"చెప్పండి_మీ దర్యాప్తుకు నేనెలా సహకరించగలను?" కుతూహలంగా అడిగింది డాక్టరు సునంద. అవతల పేషెంట్లు వున్నారని ఆమెకు గుర్తువచ్చింది.
"సహాయం చేయాలీ అనే ఉద్దేశమే వుండాలిగాని, పోలీస్ దర్యాప్తుకు ప్రతి వ్యక్తి ఏదో విధంగా ఎంతోకొంత సహకారాన్ని అందించవచ్చు. ఆ రోజున_సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ లో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని, మీతోపాటు ప్రయాణించిన వారి గుర్తులను చెబితే చాలు_మాకు ఎంతో మేలు చేసినవారువుతారు!"
"సారీ! నాకేమీ తెలియదు. తోటి ప్రయాణీకులెవ్వరూ నాకు గుర్తులేరు. నేనెవ్వరినీ గుర్తించలేను!" ఖంగారు ఖంగారుగా చకచకా అనేసింది సునంద.
డాక్టరు సునంద కంటస్వరం కంపించడాన్ని గుర్తించాడు నవీన్.
"నో_నేను నమ్మను! మీరు కావాలనే దాచేస్తున్నారు. తోటి ప్రయాణీకులు ఒక్కరూ మీకు గుర్తుండదా! ట్రెయిన్ దిగి ప్రయాణీకులందరూ ప్రాణ భీతితో బిలబిలమంటూ పరుగెత్తినా, ధైర్యంగా మీరు ఒక్కరే ఆ కంపార్ట్ మెంట్ లో వున్నమాట అబద్ధమా? నా అరచేతిలోని టైమ్ బాంబును అత్యంత సాహసంతో దూరంగా విసిరివేసి స్పృహలో లేని నన్ను కాపాడిన విషయాన్ని అప్పుడే మరచిపోయారా? నాకు స్పృహ రావడానికి మీరు చేసిన ప్రథమ చికిత్సను కూడా మరిచారా డాక్టర్? లేక మీకు భయమా? ఎందుకు అబద్దం ఆడుతున్నారు? ఏదేని ఒక చిన్న క్లూ అయినా ఇస్తారేమోననే ఆశతోనే మిమ్ము వెదుక్కుంటూ వచ్చామండీ! రైట్! మీరు ఇంకా నాటి సంఘటన షాక్ లోనే వుంటే_ఫరవాలేదు, ఇప్పుడే చెప్పాలనిలేదు_తేరుకున్న తరువాత, తీరిగ్గా ఆలోచించుకుని, ఒక్కొక్కటీ గుర్తుచేసుకుని, మీకు చెప్పాలని అనిపించినపుడే నాకు ఫోన్ చేయండి డాక్టర్, ఇదుగో నా టెలిఫోన్ నెంబరు_గుడ్ బై!" గంభీరంగా అంటూనే తన విజిటింగ్ కార్డును ఆమె చేతి ముందు టేబుల్ మీద పెట్టి గిరుక్కున వెనుదిరిగాడు నవీన్. అతని ననుసరించాడు వీరేష్.