ఒకరోజు హార్స్ రైడింగ్ నేర్చుకుంటూ ఒక్కోసారి తుపాకీ పట్టుకుంటూ షూటింగ్ నేర్చుకుంటూ పరిజనానికీ, ఊరి జనానికి వినోదం కలిగిస్తూనే ఉంది సౌదామిని.
ఒకరోజు మేనేజరు ధర్మలింగాన్ని పిలిచి చెప్పింది రాజ్యలక్ష్మి.
"ఈ ఇంటి పరువు మర్యాదలు గంగలో కలిసిపోతుంటే చూస్తూ వుంటారా ధర్మలింగంగారూ? ప్రశ్నించే స్థానం నుండి ఆయన నన్ను త్రోసివేసారు. మీరైనా కల్పించుకుని మాట్లాడి చూడండి."
"రాజాసాబ్ వ్యక్తిగత వ్యవహారం గురించి నేనేం మాట్లాడగలను అమ్మగారూ? నేను ఆఫీసులో మేనేజరునే గానీ....." నసిగాడు ధర్మలింగం.
"మీ తాతదండ్రుల కాలం నుంచి మాకు దివాన్ జీలుగా వుండి మా క్షేమాన్ని కాంక్షించారు ధర్మలింగంగారూ! ఈ రోజు ఆఫీసుకు మాత్రమే పరిమితమంటుననారు. ఇది రాజాసాబ్ వ్యక్తిగత వ్యవహారమే కాదు ఇంటి పరువు మర్యాదకు సంబంధించినది."
"మగవాడు ఇంటిని సానికొంపగా మార్చినప్పుడు ప్రశ్నించే అధికారం ఒక్క పత్నికి మాత్రమే వుంటుంది అమ్మగారూ" "హయగ్రీవంగారి అమ్మాయి మరణం కారణంగా మామధ్య తలెత్తిన విభేదాల గురించి మీకు తెలియకుండా వుండలేదనుకుంటాను. నాపైన కక్ష సాధించడానికే ఇప్పుడో మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టాడనిపిస్తూంది. అలాంటప్పుడు నేను ప్రశ్నించి లాభమేమిటి? అసలు మామధ్య మాటలులేవు. అందుకే ఆయనను మందలించడానికి మీకంటే నాకెవరూ కనిపించలేదు. మీకు కబురుపెట్టాను"
"మీరు నా మీద ఈ బాధ్యత పెట్టినప్పుడు నేను నిర్వహించక తప్పదు అమ్మగారూ" అని సెలవు తీసుకున్నాడు ధర్మలింగం.
సాయంత్రం ఆఫీసు మూసే ముందు ఒక గంట ఆఫీసు వ్యవహారాలు చూడడం అలవాటు మోహనవంశీకి. ఫైళ్లు రిజిస్టర్లు చూసి అవసరమైన సంతకాలు పెడుతుంటారు.
ఆయన సంతకాలు పెట్టి వెళ్లిపోయేముందు "మీతో ఒక విషయం మాట్లాడాల్సి వుంది దొరవారూ" అన్నాడు వినయంగా ధర్మలింగం
"చెప్పండి" లేవబోతున్నవాడు కూర్చొన్నాడు. "ఆఫీసు విషయం కాదు! మీరు అనుమతిస్తే దర్బార్ హాలుకు వచ్చి మాట్లాడుతాను!"
"సరే పదండి!" ఆఫీసు నుండి ప్యాలెస్ కి వచ్చి దర్బార్ హాల్లో కూర్చొన్నారు.
"ఉ! ఇక చెప్పండి ధర్మలింగంగారూ!"
"రాజా వాసుదేవరావుగారి వంశానికి ఇంతవరకు ఒక ప్రత్యేకత అంటూ ఉంటూ వచ్చింది. సంస్థానాలు పోయినా ఆ రీతి రివాజులు, పద్దతులు, మర్యాదలు - అలాసాగుతూ వస్తున్నాయి. ఈనాటికి మీరు వాటిని అలక్ష్యం చేయడం నేర్చుకున్నారా అనిపిస్తూంది!" ఆయన ముఖంలో మారే భావాల కోసం కొంచెం సేపు ఆగాడు. ఆయన చెక్కుచెదరని శాంతంతో వింటుండడం చూసి ధైర్యం వచ్చింది. తిరిగి కొనసాగించాడు. " మీ తాతతండ్రుల కాలంలో సైతం చిల్లర వ్యవహారాలేమన్నా వుంటే ఇంటి బయటే చూచుకోవడం రివాజు. అంతఃపురస్త్రీల కళ్ళలో ఏదీపడేది కాదు! ఇంతవరకు మీరు ఇదే పద్దతిలో వుండి ఇప్పుడిప్పుడు ప్యాలెస్ నే మీ వినోదవిలాసాలకు కేంద్రం చెయ్యడం, మా కళ్ళముందే ఈ ఇంటి గౌరవం పతనం కావడం మా అందరికీ తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నది! హద్దుమీరానేమో క్షమించండి! నేను జీతానికి పనిచేసేవాడినే కావచ్చు! కాని, మా తాతతండ్రులు సైతం మీ దగ్గర దివాన్ జీలుగా పనిచేశారు. వాళ్ళు కేవలం జీతం తీసుకొనే నౌకర్లుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఈ ఇంటి మంచి చెడ్డల గురించి, సుఖదుఃఖాల గురించి ఈ ఇంటి మనుష్యుల్లాగే స్పందించడం నేనెరుగుదును. మా తాతగారంటే మీ తాతగారికి చాలా అభిమానముండేది! మా నాన్నగారిపట్ల మీ తండ్రిగారికి చాలా ఆత్మీయత వుండేది. ఈ ఇంటితో మాకేర్పడిన అనుబంధం కారణంగానే నేనీనాడు ఈ సాహసం చేస్తున్నాను"
"మీ సాహసాన్ని నేను అభినందిస్తున్నాను, ధర్మలింగంగారూ! మా మంచి చెడ్డలు కేవలం నౌకర్లుగాకాక స్వంత మనుష్యుల్లా చూచుకొనే వాళ్ళేకావాలి! ఆ స్వామి భక్తే కావాలి మాకు! ఈ స్వామి భక్తిమీదనే మా సంక్షేమం, మా ఎస్టేట్ సంక్షేమం ఆధారపడివుంది" మనస్పూర్తిగా అన్నాడు మోహనవంశీ, "సౌదామిని విషయమే కదా మీరు మాట్లాడేది! మీరంతా అనుకొన్నట్టు ఆమె చిల్లరమనిషి కాదు. డబ్బుకోసం నా వెంటపడిన మనిషి అసలేకాదు. ఆమె తండ్రిది రాయల్ ఫామిలీ కాకపోయినా మనల్ని చిటికెలో కొనేయగల కోటీశ్వరుడు! కోట్లలో వ్యాపారం చేసే పెద్ద పారిశ్రామిక వేత్త! సౌదామిని పై చదువంతా స్టేట్స్ లోనే సాగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది. సోషల్ టైప్. అమెరికాలో క్రితం సంవత్సరం నాకామెతో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం త్వరలో వివాహం చేసుకోబోతున్నాం.
ఆయన చివరి మాటకు ధర్మలింగం షాక్ తిన్నట్టుగా అయ్యాడు. "మహాలక్ష్మీదేవి లాంటి రాజ్యలక్ష్మీదేవి గారికి అన్యాయం జరుగుతుందని మీరాలోచించలేదా?" అడిగాడు మ్లానంగా.
"మహాలక్ష్మికి భూలక్ష్మి పోటీ తప్పదుకదా?" చిరునవ్వుతో లేచాడు మోహనవంశీ. "కాని, ఈ విషయం ఇప్పుడే బహిర్గతం చేయకండి. సమయం వచ్చినప్పుడు నేనే వెల్లడిస్తాను"
* * *
ఒక రోజు తుంగభద్ర, హనీ పులి -మేక ఆట ఆడుకొంటున్నారు సరదాగా.
హనీ ముఖానికి పులిముఖం కప్పుకొని , చేతులు నేలకి ఆన్చి గాండ్రుగాండ్రు మంటూ తుంగభద్రమీదికి లంఘిసల్తున్నాడు. ఆమె మేకలాగే దీనంగా అరుస్తూ తప్పించుకొంటూంది!
ఎప్పుడూ రెండో అంతస్తులోకిరాని సౌదామిని ఆరోజు వచ్చింది. తుంగభద్రను ప్రక్కకు తప్పుకోమని సైగచేసి, మేకలా తానాడసాగింది.
త్వరలోనే పులికి చిక్కిపోయింది మేక.
"చంపకు చంపకు పులిరాజా!" దీనంగా వేడుకొంది సౌదామిని. "నన్నొదిలిపెడితే నీకొక చక్కని కథ చెబుతాను. ఏం?"
కథ అనగానే అతడిముఖంలో ఆశ తొంగి చూసింది. "చెప్పు కథ!"
సౌదామిని అతడిని ఒళ్లో కూర్చోబెట్టుకొంది. "నీకు ఏ కథ చెప్పాలి? పులి ఆవు కథ చెప్పనా? అవునూ నీకు కథలంటే ఇష్టమా?"
చాలా చాలా ఇష్టం అన్నట్టుగా జోరుగా తలూగించాడు హనీ.
"మరి నా జట్టుకడితే నేను రోజూ బోల్డు కథలు చెబుతాను. నాకు ఇన్ని కథలొచ్చు తెలుసా......? ఇంతకీ నీ పేరేంటి?"
"హనీ!"
"అంటే తేనె అన్నమాట. నీ బుగ్గలు తేనె కారుతున్నట్లుగా వున్నాయి! అందుకని ఆపేరు పెట్టారన్నమాట! హనీ, హనీ , నాకో ముద్దీయవా? కొంచెం నీ బుగ్గల్లో తేనె రుచి చూస్తాను" చిన్న పిల్లలా ప్రాధేయపడుతూ అడిగింది.
"మరి కథ చెప్పవా?"
"మరి ముద్దియ్యవా?"