'మరో వాయి పాలతో!' అన్నాడు మునీంద్రుడు.
ఇదంతా గమనించిన పక్కనున్న ఋషి నవ్వాడు.
'నవ్వకయ్యా మునీశ్వరా! కడుపులో పాయసం అర ఖాళీ లేదన్నాను. అంతేకానీ భక్ష్యాల అరఖాళీ లేదన్నానా ఏమిటీ? చూస్తుండు ఇలాగే చిత్రాన్నాల అర, చారు అర, పెరుగు అర, ఆయా వాటితో నింపేస్తాను. బ్రహ్మ సృష్టి విచిత్రం తమకు తెలియదా ఏం?' అన్నాడు ఆ మునీంద్రుడు.
అతని చమత్కారానికి అందరూ నవ్వారు.
'నవ్వకండి! పొరపోతుంది' అన్నారు ఒకరు.
'పొరపోతే ఒక అర ఖాళీ అవుతుంది! ఆ ఖాళీలో మరికొంత పదార్ధం నింపొచ్చు' అన్నాడు ఆ మునీంద్రుడు.
దాంతో మళ్ళీ నవ్వులు విరిశాయి. అలా నవ్వుల్తో పరాచకాలతో ముగిసింది విందు.
విందు తర్వాత నవనవలాడే తమలపాకులతో తాంబూల సేవనం జరిగింది. కర్పూర సువాసనలు, కస్తూరి గుబాళింపులూ నలువురి నోటా మరింత వాసికెక్కాయి.
12
చిరుగజ్జెల మ్రోతతోపాటు చిరు చిరు నడకల ధ్వని, ఆపై రెట్టింపు కస్తూరి మేళవించిన తాంబూల సేవనంతో గుమాళించే మగువ పొలుపు-అటూ తిరిగాడు దేవేంద్రుడు.
'మహేంద్రులకు నమస్కారం!'
శిరసు వంచి వినమ్రంగా నమస్కరించి, ఘటించిన చేతులు అలాగే ఉంచి నిలుచుంది.
ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు.
'త్రిలోకాధినాధులు దీర్ఘాలోచనలో ఉన్నారు!'
చిరునవ్వే సమాధానం అయ్యింది.
'తమరింకా ఆ సుందరిని మరిచినట్లు లేదు'
'మరిపా! హూ! ఎంత మాటన్నావ్? అహల్యను మర్చిపోవడమా! ఆ అందాల సుందరి రూపం గుండెల్లో శాశ్వత ముద్ర వేసింది. ఆ రూపం ఇక్కడ శాశ్వతం! ఆ సోయగం ఇక్కడ శాశ్వతం. మానవులు అదృష్టవంతులు. అలసటతోనో, నిద్రతోనో కనులు మూసుకోగలరు. కమ్మని రూపాన్ని అంతరంగంపై చూసుకోగలరు. అమరులకా అదృష్టం లేదు. రెప్పపాటెరుగని అనిమేషులం కావడం వల్ల మాకు కన్ను మూతపడదు. కల లేదు. కలలో కాంతను కన్నారా కాంచడమూ లేదు. అయినా అహల్య రూపం అప్రతిమానంగా మా కళ్ళెదుటే నర్తిస్తుంది'
'ఆ మాట మీ నోట వినాలనే అలా పలికాను' గుంభనంగా నవ్వుతూ అందా యువతి.
ఇంద్రుడు నవ్వాడు.
మేలి ముసుగు చాటున- మోమెత్తి చూపకుండా- శిరసు వంచి మాట్లాడుతున్నదా యువతి.
ఇంద్రుడు- ఆమె ఎదురుగా నిలుచుని ఉన్నా, ఆమెపై దృష్టి నిలపకుండా ఎటో చూస్తూ మాట్లాడుతున్నాడు.
తన మాటలకి ఇంద్రుడు సమాధానంగా నవ్వడం విందామె.
పెదవులు కదిలీ కదలకుండా నవ్వు వెలికి వచ్చీరాకుండా నవ్వుతూ ఇంద్రుడలా నవ్వగానే- కొంత చొరవ తీసుకుందామె.
'తమకోసం తనువువేర్పడినా- తన కోసం తమంతవారు బరిలోకి దిగి భూప్రదక్షిణం చేసి వచ్చినా - ముక్కోటి దేవతల ఒక్కమాటతో శాంతించగల తమరు తమకంతో తన కోసం పరమేష్టినే ప్రశ్నించినా- ఆ సుందరి తమవైపు ఓ చూపు విసిరిందా? తమరిని క్రీగంటనయినా చూసి ఒక్క పలుకైనా పలికిందా! పలికితే ముత్యాలు రాలేవా? రత్నాలు జారేవా? అంత ఆర్భాటం జరిగినా అమరేంద్రులు తమరు వాదిస్తూ ఉన్నా తనని కల్పించిన ఆ చతురాననుడు జడధారికి ధారబోస్తే, అదే తన దారంటూ వెళ్ళిపోవడం భావ్యంగా ఉందా ప్రభూ!'
'సుందరీ!' గర్జించాడు ఇంద్రుడు.
ఆ గర్జనకి ఆ యువతీ భయపడింది.
'ఇంకేం మాటాడక! అహల్యను ఇంకొక్క మాటన్నా మేం సహించం! ఆమె అప్పుడు పితృ పరాధీన! ఆమెకు స్వయంవర అవకాశం లేదు! శుల్కంగా తండ్రి ఏర్పరచిన నియమాన్ని, నిబంధనని ఎవరు పూర్తిచేశారని ఆమె తండ్రి భావిస్తే- అతనికిచ్చి కన్యాదానం చేస్తే- అతడే తన ప్రత్యక్షదైవంగా భావించ వలసిన కులీన ఆ అహల్య! కన్నవారికి, కట్టుకున్నవారికీ పేరు ప్రఖ్యాతులు తేగల గుణశాలి ఆమె!'
'మహేంద్రులకి ఇంకా మమత తీరలేదు' చిన్నగా నవ్విందా యువతి. కోరి కల్పించుకున్న సుందరి.
'కోరికలు తీర్చకుండా చేజారిపోయినా మక్కువ ఎక్కువైందే తప్ప, మమత ఏమాత్రం తగ్గలేదు ప్రభూ!'
'ఏమంటివే! ఏమంటివే! జగజంత్రీ! మహేంద్రుడు మక్కువ పడతాడే కానీ మోహించడే! నేను అహల్యను ఆశించింది ఆమె అందచందాలు కోరి కాదు. ఆమె అనురాగాన్ని ఆశించాను. అంతటి అందగత్తె, అందచందాలణు ఆస్వాదిస్తే అమరేంద్రుని వైభవానికి యోగ్యంగా ఉంటుందనే భావించాను.
కానీ ఆమెని మోహించి వివశుడ్ని కాలేదు. అహల్య పుట్టీ పుట్టకముందే మా అంతరంగ దేవాలయంలో అర్చామూర్తిగా వెలిసింది.'