Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 19


    శేషాచలం అనే రైతు - మోహనరావుని చూసి నమస్కారం చేసి - లాంచనప్రాయంగా ఆ కబురూ ఈ కబురూ చెప్పి ---- "మా రెండోవాడు స్కూల్ ఫైనల్ ప్యాసయ్యాడండి --' అన్నాడు.
    ఆ సమాచారటుద్దేశ్యం తెలిసిన మోహనరావు మనసులో ఇబ్బంది పడ్డాడు.
    
                                             12
    "నన్ను క్షమించు వసూ!" అన్నాడు రాజారావు.
    వసుంధర అతన్ని క్షమించినట్లు లేదు. ఆమె నోరు విప్పలేదు.
    "నీ నోటమాట పలికితే రాలిన ముత్యల్నేరుకోడం కోసం ఆత్రుతగా వచ్చాను- మాట్లాడవా?"
    వసుంధర మాట్లాడలేదు.
    "నీ పెదవులు కదిలి ముఖానికి చిరునవ్వు రూపాన్నాపాదిస్తే పడే రత్నాలు తీసుకోవడం కోసం వచ్చాను. నవ్వవా?" అన్నాడు రాజారావు.
    వసుంధర నవ్వలేదు.
    "అయితే నన్ను క్షమించలేవా?" బాధనభినయిస్తూ అన్నాడు రాజారావు.
    వసుంధరలో చలనం లేదు కాబట్టి క్షమించలేదనే అనుకోవాలి .'
    "సరేలే వసూ - నేను చేసిన తప్పుకు పాపపరిహారంగా ఇక్కడే నీ దగ్గరే వుండిపోతాను. పెళ్ళాం మోజులోపడి చెల్లెలి పెళ్ళి గురించి పట్టించి కోలేదన్న అపవాదుకు గురయినా బాధపడను....'
    'అలా చేయమని ఎవ్వరూ అనలేదు. కానీ అక్కణ్ణించిక్కడికి రెండు గంటల ప్రయాణం కదా రాగానే ఒక్కసారైనా ఇక్కడికి వచ్చారా. మిమ్మల్ని చూడాలని నేనెంతగా తప్పించిపోతున్నానో తెలుసా?"
    తెలుసా అన్నది వసుంధర ఊతపదం. దానికి జవాబుగా "తెలియదు" -- అనడం రాజారావుకు రివాజు. అదే అతనిప్పుడు చేశాడు. వసుంధర నవ్వింది.
    'అమ్మయ్య - ముత్యాలూ - రత్నాలు కూడా దొరికాయి --- " అన్నాడు రాజారావు.
    "బాగానే వుంది.చేసేవన్నీ చేసేసి మాటలతో మరిపించేస్తారు నన్ను...."
    'అది కాదు వసూ - పెళ్ళిళ్ళలో ఒకోసారి విస్తళ్ళలో భోజనాలు వడ్డించి అందర్నీ పిలిచేస్తారు. తీరా భోజనానికి పిలిచేక మగ పెళ్ళి వారికి సంబంధించిన ముఖ్య అతిధి రాలేదని కాసేపు కూర్చోవలసోస్తుంది. ఎదురుగా వంటకాలు, కడుపులో ఆకలి- నిముషమొక యుగంలా గడుస్తుంది ......ఆ బాధ నర్దం చేసుకోగలిగితే నేనింత కాలం నీ దగ్గర కెందుకు రాలేదో అర్ధమవుతుంది ?" అన్నాడు రాజారావు.
    "కాలేదు...." అంది వసుంధర.
    'అన్నీ తెలుసు నీకు. దూరంగా ఉన్నంత కాలం ఎలాగో అలా సహించ గలను కానీ దగ్గరగా ఉంటే క్షణం విరహం సహించలేను నేను. నీతో ఏకాంతాన్ని కోరతాను. కానీ ఈ పుట్టిన గడుగ్గాయికి ఇరవై రోజులు నిండే వరకూ వాడి ముఖం మీ నాన్నగారు చూడనివ్వరు. నాకంటే వాడే నీకు ముఖ్యం కాబట్టి - వాడే ఎప్పుడూ నిన్నంటి పెట్టుకుని వుంటాడు. అటువంటప్పుడు అయిదు, పది నిముషాలకు మించి నీతో మాట్లాడం కుదరదు. ఒకసారి వాణ్ణి చూసేతంతు ముగిసిందంటే - ఇంకేముంది - నిన్ను మా ఊరుకు తీసుకు పోతాను . మీ నాన్నగారు కూడా అంగీకరించారు ..." అన్నాడు రాజారావు.
    పిల్లాడి ఏడుపు వినిపించింది. వసుంధర లోపలికి పరుగెత్తింది. 'చూశావా ? అప్పుడే మనని విడదీసేశాడు....' అన్నాడు రాజారావు. ఆ క్షణంలో అతనికి తన రక్తంలో రక్తమైన ఆ బాబుని చూడాలని గాడంగా కలిగింది. కానీ పెద్దల నిర్ణయానికి తల ఒగ్గి మర్నాడు ఉదయం దాకా అతను అగదల్చుకున్నాడు.
    రాజారావు మనసుకు బాధ కలిగించే విషయమింకొకటుంది ఎన్నార్ధం పైగా వయసున్న అతని కూతురు రాజకుమారి తండ్రిని గుర్తుపట్టింది కానీ దగ్గరకు రావడం లేదు. ఏదో ఒక క్షణం దగ్గరకు వచ్చినా అతను సరిగ్గా పలకరించే సమయానికి --"మామయ్యా----' అనుకుంటూ పరిగెత్తుకు పారిపోతుంది.
    వసుంధరకు పుట్టింట్లో దిగవిడిచేనాటికి రాజకుమారి రాజారావును విడిచి క్షణం కూడా వుండలేకపోయేది. అతను వెళ్ళిపోయేక తండ్రిని తలచుకుంటూ అప్పుడప్పుడు ఏడుస్తూండేదని కూడా ఉత్తరాలు రాసింది వసుంధర. కానీ అది క్రమంగా తండ్రిని మరిచిపోవడమే కాక - ఇప్పుడతన్నొక పరాయి వాడుగా భావించే స్థితికి వచ్చింది.
    మనమనుకునే అనుబంధాలు రక్త సంబంధాలు కేవలం సాహచర్యానికి సంబందించినవి మాత్రమే నని రాజారావుకు అనిపించింది. తను చిన్నతనం లోనే ఎవరి పిల్లనైనా పెంచుకుని వుంటే ఆ పిల్ల కూడా రాజకుమారి అంత చనువుగా తన దగ్గర మసలి వుండేది. ఎటొచ్చీ ఆమె తన కన్నకూతురు కాదని తెలుసును కాబట్టి తను -- అట్టే ఇదిగా వుండలేడు.రక్త సంబంధమనేసరికి మనసు పీకుతుంది. అది కేవలం మనసుకు సంబంధించిన విషయం.
    మర్నాడు తంతు ముగిసింది. పిల్లవాడికి నామకరణం పూర్తయ్యాక - రాజారావు తనివితీరా కొడుకు ముఖాన్ని చూశాడు. ఆ చిన్నముఖంలో ఇంకా ఒక రూప,మంటూ ఏర్పడలేదు. కొద్దిగా మనిషి అకారమున్న మాంసం ముద్దలా కనబడుతున్నాడు . ముఖంలో కొట్టవచ్చినట్లు కనబడేది ముక్కు మాత్రమే.
    "వీడాట్టే అందంగా ఉన్నట్లు లేదు ------" అన్నాడు రాజారావు.
    వసుంధర ముఖం చిన్న బుచ్చుకుంది -----' తెల్లని తెలుపు వీడు, వీడి అందాన్ని చూడగలగాలంటే ఇంకో రెండు నెలలు పడుతుంది."
    'చాలా ఖచ్చితంగా చెబుతున్నావ్....'
    'అవును మరి - ఆడది అనుభవాన్నంత తొందరగా మరిచి పోలేదు...." అంది వసుంధర.
    రాజకుమారికి కూడా ఒక రూపు రావడానికి రెండు నెలలకు పైగా పట్టిందని గుర్తు కొచ్చింది రాజారావుకి.  
    వసుంధర త్వరత్వరగా బాబు విశేషాలు కొన్ని ఏకరువు పెట్టేసింది. వీడికి రాజకుమరికీ చాలా తేడాలున్నాయి. వీడికి విపరీతమైన నిద్ర, ఎప్పుడూ అలా పడుకునే వుంటాడు. ఒక్కోసారి గంటల తరబడి నిశ్శబ్దంగా వుంటే అనుమానం వచ్చి ఊపిరాడుతుందో లేదోనని చూసిందిట వసుంధర. అట్టే ఏడవడు. రంగు మాత్రం తెల్లని తెలుపు. వాడి శరీర ఛాయ నీళ్ళు పోసినప్పుడు చూడాలి. పచ్చగా దబ్బపండులా మెరిసి పోతుంటాడు. జుట్టు మాత్రం తక్కువ - రాజకుమారితో పోలిస్తే . నీళ్ళు పోసేటప్పుడు కూడా అట్టే కదలడు. మెదలడు. చక్కగా పోయించుకుంటాడు. మనిషి కాస్త పుష్టిగా వున్నట్లే లెక్క.
    "వీడి ముక్కు కాస్త పెద్ద సైజులో కనబడుతోంది. మా నాన్నగారి పోలిక తెల్తుందేమో - ఆ నిద్రా అదీ కూడా నాకు అనుమానంగానే వుంది ....' అన్నాడు రాజారావు.

                                                  13
    "వంశోద్ధారకుడు వెలిశాడు" అంది పార్వతమ్మ మనవడి నందుకుని ముద్దు లాడుతూ.
    "అమ్మా - మనవణ్ణి చూసిన ఆనందంలో అప్పడాలు చేసిందీ లేనిదీ చెప్పడం మరిచిపోయావ్ --" అన్నాడు రాజారావు.
    "చాల్లేరా వేళాకోళం - అప్పడాల పిండి తినాలనుందన్నావు కదా --- నువ్వొచ్చేదాకా వాటి పని వాయిదా పడింది ---" అంది పార్వతమ్మ.
    "ఒంట్లో కులాసాగా వుంటోందా అత్తయ్యా -----' వసుంధర అడిగింది.
    పార్వతమ్మ ముఖం నీరసంగా అయిపొయింది. మానవన్నెత్తుకునే ఓపిక కూడా నశించినట్లుంది - చటుక్కున పక్కన కూర్చున్న మూడో కూతురి ఒళ్ళో మనవణ్ణి పడుకో బెట్టింది ---"ఏం చెప్పేదే - అన్నీ బాగానే వున్నాయి. గుండె నీరసం మాత్రం తగ్గలేదు. ఎప్పుడొస్తుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. చాలా బెంగగా వుంటుంది....' ఆవిడ మాట కూడా నీరసంగానే వచ్చింది.

 Previous Page Next Page