"....ఈరోజు ఉదయమే మేము హైద్రాబాద్ నించి తిరిగొచ్చాం.....' అంటూ వివరించాడు రాజారావు మోహనరావుకి.
అన్నీ తాపీగా విని మోహనరావు ----' అయితే నాన్నగారు మన అంచనా మేర తప్పకుండా ఉంటున్నారన్న మాట. ఏమైతే నేం అన్నీ సక్రమంగా జరిగాయింతవరకూ ....' అన్నాడు.
'అదే మరింత బాధగా వుంది. పనులేప్పుడూ అలాగే అవుతాయి. మీరే అనవసరంగా కంగారు పడతారు ------అంటున్నారు నాన్నగారు ---' అన్నాడు రాజారావు.
"ఆయనేమంటే మనకెందుకు ? పనులై పోవడమే కావాల్సింది ....' అని ఒక్క క్షణం ఆగి --" ఇంతకూ ఖర్చు లే దశలో ఉన్నాయి. ఎంత అవసరపడుతుందో ఖచ్చితంగా తేలిందా -----' అన్నాడు మోహనరావు.
"వదిన తెచ్చిన వెయ్యీ నేను తెచ్చిన మూడు వేలూ కాక ---ఈజీగా మరో అయిదు వేలు ఖర్చు కావచ్చు ----' అన్నాడు రాజారావు."
"చచ్చాం --" అన్నాడు మోహనరావు --" నాకు ప్రావిడెంట్ ఫండ్ లోనింకా గ్రాంటు కాలేదు. గ్రాంటు కాగానే చెక్కు తయారు చేసి రిజిష్టర్ పోస్టులో పంపుతానని నా కొలీగ్ వాగ్దానం చేశాడు. కానీ ఒకవేళ ఆ డబ్బు రెడీ కాకపొతే ఇబ్బంది పడాల్సుంటుంది మనం నేను క్యాషు రెండు వేలు తీసుకొచ్చాను....."
రాజారావు అలోచించి ------' దాన్ని గురించి మనమిప్పట్నుంచి కంగారుపడనవసరం లేదు. నువ్వు రెండు వేలు తెస్తే మనదగ్గర క్యాషు రెడీగా ఆరువేలున్నట్లు లెక్క. అవికాక ఇంకొక రెండు వేలుంది కానీ రెండ్రోజులలో అది భీమరాజు గారి తమ్ముడికి చ్చేయాలి -----' అన్నాడు.
'అయితే సరే - మనమిప్పుడెం చేయాలి ....' అన్నాడు మోహనరావు.
"ముందుగా బట్టలు కొనాలి. పెళ్ళిలో అదే పెద్ద ఖర్చు...."
'అదేమిటి - మరి తిండి సంగతి ....." అన్నాడు మోహనరావు.
"సరే - ఆది ఈ రోజునించే మొదలు .....' అంది విరజ క్రీగంట భర్తను చూస్తూ.
వాతావరణంలో కాస్త ప్రశాంతత వచ్చింది. అనడరికీ మనసులు తేలిగ్గా ఉన్నాయి.
"ఇప్పుడు అర్జంటుగా చేయవలసిన పనేమిటంటే శుభలేఖలు . నాన్నగారిని తీసుకుని రేపు నువ్వు రాజమండ్రీ వెళ్ళు....." అన్నాడు రాజారావు.
మోహనరావు రాజమండ్రీలో చదువుకునే రోజుల్నుంచీ కొంతమంది ప్రెస్ వాళ్ళతో పరిచయముంది. తన పరిచయాల్ని తెగకుండా మెయింటైన్ చేసుకుంటూ రావడం మోహనరావు ప్రత్యేకత.
"ఆ విషయంలో ఏ ఇబ్బందీ లేదులే ------నేనూ నాన్నగారూ రేపు వెడతాం. ఒకటి రెండ్రోజుల్లో ఆ పని పూర్తి అవుతుంది --" అన్నాడు మోహనరావు.
"అంటే ముహూర్తానికి పదిహేను రోజులు ముందుగా శుభలేఖలు సిద్దమవుతాయి. ఫరవాలేదులే --పెళ్ళికి ముందే కదా ---' అన్నాడు రాజారావు.
'ఇంక ఏయే పనులున్నాయో తెల్చుకోవడమూ ------మనలో మనం పనులన్నీ విభజించుకోవడమూ ఇప్పటి బాధ్యత ----' అన్నాడు మోహనరావు.
"పనులెన్నున్నాయో చెప్పగలం కానీ - అవి పూర్తి కావడానికి ఎన్నాళ్ళు పడతాయో తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటె ఈ దిక్కు మాలిన ఊళ్ళో ఉప్పు కూడా దొరికే లా లేదు . కట్టే పుల్లలతో సహా అన్నీ రాజమండ్రి నుంచే రావాలి ....." అన్నాడు రాజారావు.
'అవునూ - పెళ్ళి ఈ ఊళ్ళో ఎందుకు చేస్తున్నారు - రాజమండ్రిలో ఏ సంత్రం లోనైనా అయితే బాగుండేది ---- చాలా చౌకలో తెలిపోయుండే వాళ్ళం ------" అన్నాడు మోహనరావు.
వెంకట్రామయ్య వాళ్ళకు కూతవేటు దూరంలోనే ఉన్నట్లున్నాడు - చటుక్కున అయన రంగ ప్రవేశం చేశాడు.
"ఏం మనుషులురా మీరు ----పెళ్లనగానే సత్రం గురించి ఆలోచిస్తారు - మనకేమైనా స్వంతిల్లు లేదు కనుకనా...." అన్నాడాయన కాస్త దురుసుగా.
"మనకంటే భాగ్యవంతులే సత్రం పెళ్ళిళ్ళు చేస్తున్నారు. స్వంతిల్లు లేకకాదు. సదుపాయాల్లేని ఊళ్ళో ఉన్నాం కాబట్టి ......' అన్నాడు మోహనరావు.
"ఏ సదుపాయాలూ లేకుండానే ఈ ఊళ్ళో ఆరువేల జనం బ్రతుకుతున్నారంటావా? ఈ ఊళ్ళో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన వారందరికీ - మీకొచ్చిన ఊహ తట్టనేలెదంటావా?" అన్నాడు వెంకట్రామయ్య.
ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
'లక్ష్మీ ఇంటికి పెద్దాడబడుచు. ఊరంతా మనమంటే అభిమానంగా ఉంటున్నారు. ఏ అవసరం పడినా తలో చెయ్యి వేస్తారు. ఉన్న ఊళ్ళో స్వంతిట్లో పెళ్ళి చేసుకుకోవడం సంప్రదాయం. నేను సంప్రదాయానికి తల ఒగ్గేమనిషిని. మిగతవాళ్ళ సంగతులు నాకు తెలియవు.....' అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య.
అయన బాధ పిల్లల కర్ధం కాదు. పిల్లలిది వాస్తవిక వాదం. ప్రతిదీ ఖర్చును బట్టి అంచనా వేస్తారు. సెంటిమెంటు ప్రాధాన్యత వాళ్ళకు తెలియదు.
అయన వెళ్ళిపోయాక చాలాసేపు పిల్లలంతా అదే చర్చించుకున్నారు. అందరికీ కూడా రాజమండ్రీ అయితే అన్ని విధాలా సదుపాయంగా ఉండేదని తోచింది. ఎందుకంటె సత్రం అద్దెకు తీసుకుంటే అట్నించి మగపెళ్ళి వారూ ఇంట్నించి అడ పెళ్ళి వారూ అక్కడకు వెడతారు. వంట సామాగ్రితో సహా సమస్తమూ సత్రంలో అద్దెకు లభిస్తాయి. ఎప్పుడేది కావాలంటే ఆ వస్తువు క్షణాల మీద దొరుకుతుంది.
ఈ గ్రామం సంగతి తీసుకుంటే వంటసామాగ్రి వీళ్ళనీ వాళ్ళనీ అడిగి తెచ్చుకోవాలి. ఏ వస్తువు కావాలన్నా రాజమండ్రినుంచి తెచ్చుకోవాలి....
"ఏమైనా మనం చేయగలిగిందేమీ లేదు. ఈ విషయంలో అయన చెప్పిందానికి తల ఒగ్గవలసిందే ....' అన్నాడు రాజారావు.
"సరే - రేపట్నించీ అయిదారు రోజులపాటు మనందరికీ రాజమండ్రీ ప్రయాణాలు. రెండు జట్లుగా బయల్దేరడం. ఒక జట్టులో కనీసం ముగ్గురు మనుషులుండాలి. ఒకళ్ళ దగ్గర డబ్బుంటుంది. ఒకళ్ళు బేరాలు చేస్తారు. మూడో మనిషి కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని గుర్తుంచుకుని - మిగతా ఇద్దరికీ కోనేవరకూ గుర్తు చేస్తుండాలి -------' అన్నాడు మోహనరావు.
"బాగుందిలెండి - ఇలా అయితే ఇంటిల్లిపాదీ రాజమండ్రిలోనే ఉండాలి. ఇంట్లో ఎవరూ ఉండరు ...' అంది విరజ.
"నన్నుండిపొమ్మంటే నాకేమీ అభ్యంతరం లేదు....' అన్నాడు మోహనరావు.
"మీ ఎత్తు నాకు తెలుసులెండి. మీరు మీ నాన్నగారికేమీ తీసిపోరు. ఆయనది పాపం కనిపించిపోతుంది. మీది కనిపించదు. అంతే తేడా - మీరు ప్రతిరోజూ ఇల్లు కదిలి తీరాల్సిందే .....' అంది విరజ.
'అన్నయ్య సంగతి నాకు తెలియదు కానీ - రేపు రాత్రికి నేను కాకినాడ వెళ్ళాలి. ఈ ప్రాంతాలకు వచ్చి కూడా ఇంతవరకూ తన దర్శనం చేసుకోలేదని మా ఆవిడ ఈపాటికే అలిగి వుంటుంది...." అన్నాడు రాజారావు.
'అలుగుతుందని ఆవిడ మీద వంకెందుకు - నీ దృష్టి అటు పోయిందని చెప్పరాదూ ---' అంది విరజ.
'అంతా నాలాంటి వాళ్ళే అనుకుంటుందిరా మీ వదిన ------' అన్నాడు మోహనరావు . విరజ సిగ్గుపడింది.
ఇంతలో ----"అన్నయ్యా - నీ కోసం ఎవరో వచ్చారు -----' అంది ఆఖరి చెల్లెలు - మోహనరావు నుద్దేశించి. మోహనరావు లేచి వెళ్ళాడు.