Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 19


    తల్లిమాట కాదనలేకపోయింది తులసి. ఫలితంగా అందరూ ఒక యింట్లోకి మారారు. అలా మారిన మరుక్షణంనుంచీ తులసి అందుకు పశ్చాత్తాపపడని రోజు లేదు.
    నీలకంఠం చలిచీమలాగా సుమతిని ఏదో మనసు కుళ్ళబొడిచే మాట అనటం.... సుమతి రెచ్చిపోయి నోటికొచ్చినట్లు తిట్టిపొయ్యటం.... ఇద్దరూ పిల్లల సంగతి మరిచిపోయి హోరాహోరీ కాట్లకుక్కలలాగ పోట్లాడుకోవటం.... చివరకు సుమతి మూర్ఛపోవటం, పిల్లలు గోలగోలగా ఏడవటం, నిత్య కార్యక్రమంలో ఒక భాగమైపోయింది. ఇంట్లో ఉన్నంతసేపూ తులసి మనసు భరించలేనంత చీదరచీదరగా ఉండేది... ఆ ఇంట్లోంచి, ఆ వాతావరణంలోంచి పారిపోవాలి. ఎలా? పెళ్ళి చేసుకుంటే బయట పడగలదు. పెళ్ళి అనుకోగానే సూర్యం గుర్తుకొచ్చాడు. ఇప్పుడు సూర్యం మంచి హోదాలో ఉన్నాడు. తన మనసులో ఇలాంటి ఆశలు పెంచుకోవటం మంచిది కాదేమో!
    ఆ రోజు ఆదివారం అవటంవల్ల తులసి ఒకమూల కూచుని ఏదో పుస్తకం చదువుకోసాగింది.
    "తులసీ!" అంటూ అక్కడకు వచ్చింది సుమతి.
    అక్క తన దగ్గరకు రావటం ఆ సమయంలో అంత బాగుండలేదు తులసికి. సుమతి నోరు విప్పి మాట్లాడటం మొదలుపెడితే మొగుడిమీద నేరాలు తప్ప మరొకమాట ఉండదు. తన మాటలు వింటున్నారో లేదో పట్టించుకోదు. ఎదుటివాళ్ళను నోరెత్తి మాట్లాడనియ్యదు. ఒకే ధోరణిలో అంతులేని కసితో దహించుకుపోతూ, మొగుడిమీద నేరాలు చెప్పిందే చెపుతూ కూచుంటుంది. మరో విషయంలోకి మాట మార్చాలని చూసినా వినిపించుకోదు. చచ్చినట్లు చెవులప్పజెప్పి కూచోవలసిందే!
    "ఇది విన్నావా? ఎదురింట్లో శ్రీలత ఎవరితోనో లేచి పోయిందిట!" అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి.
    తులసి మామూలుగా "అలాగా!" అంది సంభాషణ తుంచెయ్యాలని, కానీ సుమతి తులసి పక్కనే కూలబడింది.
    "మొగుడు మంచివాడు కాడుట! రోజూ తంతాడుట. ఇంకా మా ఆయనే నయం."
    "అవును. చాలా నయం!"
    "వాడెవడో మొగుడికి స్నేహితుడట. ఇద్దరికీ ఎలా కలిసిందో, ఎప్పుడు కలిసిందో గుట్టుచప్పుడు కాకుండా లేచిపోయారు."
    "మంచిపని చేశారు."
    "మంచి పనా! లేచిపోవటం మంచిపనా!"
    "మరి మొగుడలా తంతోంటే లేచిపోక ఏం చేస్తుంది?"
    "అయితే మాత్రం? నా మొగుడు నన్ను ఇన్ని విధాల నరకయాతన పెడుతున్నా, నేను లేచిపోతున్నానా?"
    "అందరూ లేచిపోగలరా! అలా లేవదీసుకుపోయి హాయిగా బ్రతకగలం అనుకున్నవాళ్ళు లేచిపోతారు!"
    "లేచిపోయి హాయిగా బ్రతకగలరా? అలా లేవదీసుకుపోయి సుఖపెట్టేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు?"
    అక్క మాటలకు నిర్ఘాంతపోయి చూసింది తులసి. ఆ చూపులకు సుమతి కళవెళపడి అంతలో తేరుకుని ఒక చవట నవ్వు నవ్వి, "నాకు బొత్తిగా మతిపోతోంది. ఒక మాట కొకటి మాట్లాడుతున్నాను. ప్రాణం పోయినా సహిస్తాను కాని ఇంట్లోంచి లేచిపోతానా?" అని ఏదో పని ఉన్నట్లు తులసి దగ్గర నుంచి లేచిపోయింది.
    రోజులు గడుస్తున్నాయి. సూర్యానికి తనమీద ఉన్న అభిప్రాయ మేమిటో తులసికి అంతు పట్టడంలేదు. అతడు ఎప్పుడూ నవ్వుతూ ఆప్యాయంగానే మాట్లాడినా, అతనికీ తనకూ మధ్య ఏదో తెర అడ్డం ఉన్నట్లుగానే అనిపిస్తోంది తులసికి.
    "ఇవాళ మీకు వీలయితే మా ఇంటికొకసారి రాగలరా? మీరు వస్తానంటే, నేనే తీసికెళ్తాను" అన్నాడు సూర్యం ఒక రోజు.
    తులసి వెంటనే సంతోషంతో "ఓయస్. తప్పకుండా వస్తాను" అని కొంచెం భయం నటిస్తూ "కృష్ణారావు కూడా ఉంటాడా?" అంది.
    సూర్యం నవ్వి "ఉండడు లెండి!" అన్నాడు.
    ఆ సమాధానానికి చాలా ఆనందించింది తులసి. ఒకవేళ కృష్ణారావు కూడా ఉన్నా రావటానికి ఒప్పుకునేదే!
    ఆ సాయంత్రం బస్ స్టాప్ కి దారితీస్తోన్న సూర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ "మీ కారేది?" అంది తులసి.
    "సారీ! నాకు కారు లేదు. ఆ కారు కృష్ణది. మనం బస్ లో వెళ్ళవలసిందే!"
    "అయితే మీరు రోజూ బస్ లోనే వెళ్తారా?"
    "కృష్ణ పనికట్టుకుని వచ్చి కారులో తీసికెళ్తే కారులో వెళ్తాను. లేకపోతే బస్ లో..."
    కృష్ణారావు లేకుండా హాయిగా సూర్యం పక్కన కారులో కూచుని....ఇలా రకరకాలుగా ఊహించుకున్న తులసి ముఖం కొంచెం చిన్నబోయింది.....
    సూర్యం తులసి ముఖంలోకి చూస్తూ "బస్ లో రాలేరా? టాక్సీలో వెళ్దామా?" అన్నాడు.
    తులసి వెంటనే తేరుకుని "భలేవారే? నేను బస్ లో రాలేకపోవటం ఏమిటి?" అంది. మనసులో 'టాక్సీలో వెళ్ళినా బాగుండును' అని అనుకుంది.....
    కానీ సూర్యం బస్ స్టాండ్ కేసి దారితీశాడు. బస్ లో కూడా ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూచోలేదు. చెరో మూల కూచోవలసి వచ్చింది. దిగవలసిన స్టాప్ వచ్చాక సూర్యం తులసితో "దిగండి" అని తను బస్ దిగాడు. తులసి బస్ దిగి సూర్యంతో అతని ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లు కూడా తులసికి నిరుత్సాహమే కలిగించింది. పెద్ద బంగళాకాదు. మామూలు రెండు గదుల చిన్నవాటా..... ఇంచుమించు తాము అద్దెకుంటున్న ఇంటిలాగానే ఉంది. అయితే పొందికగా అమర్చి శుభ్రంగా ఉంది.....
    "రండి! కూచోండి. క్షణంలో మీకు కాఫీ తయారుచేసిస్తాను." అన్నాడు సూర్యం. పేము సోఫావైపు చెయ్యి చూపుతూ.
    తులసి కూచుని "కాఫీ మీరే తయారు చెయ్యాలా? వంట మనిషి లేదూ?" అంది.
    సూర్యం నవ్వి "అడుగడుగునా మీకు ఆశ్చర్యాలే! నాకు వంటమనిషి లేదు. పనిమనిషి మాత్రమే ఉంది. నాకు వంట చాలా బాగా వచ్చు. ఎప్పుడైనా మీకు వంటవాడు కావలసి వస్తే నాకు కబురు చెయ్యండి" అన్నాడు.

 Previous Page Next Page