Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 19


    అది పట్టణంలో సంచలన వార్తే అయింది.
    "అది హత్యకాదు, ఆత్మహత్యే!"
    "కాదు - ఖచ్చితంగా హత్యే!"
    "ఏమో! ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు? ఈడొచ్చిన పిల్ల కదా! కారణం ఇంకేమైనా ఉంటుందబ్బా?"
    అక్కడ చేరినవాళ్ళు గుసగుస లాడారు.
    ఆమెది సహజ మరణం కాదు. ఆమె ఉరి వేసుకుంది. శవం ఉన్న తీరును బట్టి, ప్రాథమిక దర్యాప్తులో ఇన్ స్పెక్టర్ వీరేష్ ఆమె ఆత్మహత్య చేసుకుందన్న అభిప్రాయానికి వచ్చాడు.
    ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోడానికి గల కారణం గురించి, అందుకు ప్రేరేపించిన వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి కావలసిన ఆధారాలు లభిస్తాయేమోనని నేర స్థలం చుట్టూ మరొకసారి తిరిగి పరిశీలించాడు వీరేష్.
    ఆ గదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉన్నాయి. వాటిలో ఏదైనా 'సూసైడ్ నోట్' ఉన్నదేమోనని పరిశీలించాడు. అలాంటిదేమీ కనిపించలేదు.
    అదే క్షణంలో, దూరంగా వున్న సమ్రాట్ ను గమనించాడు ఇన్ స్పెక్టర్ వీరేష్. మెరుపులాంటి ఆలోచన తట్టింది.
    వెంటనే గదిలో కిందపడి ఉన్న పుస్తకాలలో కనిపిస్తున్న కొన్ని తెలుగు నవలలను తీసి పేర్లు చూశాడు. మరుక్షణం అతనిచూపులు తీక్షణంగా మారాయి. ఆవేశంగా బయటకు వచ్చి సమ్రాట్ భుజం మీద చేయి వేశాడు.
    అనుకోని ఈ సంఘటనకు సమ్రాట్ క్షణం ఖిన్నుడయ్యాడు.
    "మీరొకసారి ఇటు వస్తారా?"
    సమ్రాట్ ఇన్ స్పెక్టరును అనుసరించాడు.
    ఇద్దరూ జనం లేని చోటుకు వెళ్ళారు.
    "చనిపోయినామె మీకు తెలుసా?"
    ఇన్ స్పెక్టర్ ప్రశ్నకు నెత్తిన పిడుగు పడినట్టు క్షణం అదిరిపాటు చెందాడు సమ్రాట్.
    ఇన్ స్పెక్టర్ ప్రశ్నలోని ఆంతర్యం ఏమిటో?
    అతని నుంచి వెంటనే సమాధానం రాకపోవడంతో ఇన్ స్పెక్టరు రెట్టించి అడిగాడు.
    సమ్రాట్ సమాధానంగా తెలుసునని తల ఊపాడు.
    "ఎలా?"
    "అభిమానిగా...."
    "మీరు నాతో పోలీస్ స్టేషన్ కు రావలసి ఉంటుంది."
    "ఎందుకు?"
    "ఆమెకు ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు మిమ్మల్ని ప్రశ్నించాలి."
    "ఆమె ఆత్మహత్యకూ నాకూ సంబంధం ఏమిటి?"
    "ఆమె మీ అభిమాన పాఠకురాలు. ఆమెతో మీకు అనుబంధాలు, సంబంధాలు ఉన్నాయి!" ఇన్ స్పెక్టర్ గొంతులో హేళన ధ్వనించింది.
    "అందుకు సాక్ష్యాధారాలేమన్నా ఉన్నాయా ఇన్ స్పెక్టర్?" సమ్రాట్ గొంతు సవరించుకుని అడిగాడు.
    "ఆమె గదిలో చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలలో మీ నవలలు కూడా కొన్ని పడిఉన్నాయి. అంతకంటే ఆధారాలు కావాలా?"
    "సారీ ఇన్ స్పెక్టర్! నాకు ఆమె ఒక్కటే అభిమాని కాదు. భారతదేశంలో అనేక వేలమంది అభిమానులున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలకూ, జనన మరణాలకూ, నాకూ ఏమిటి సంబంధం? నా నవలలు ఆమె గదిలోనే కాదు, నా అభిమానులందరి ఇళ్ళలోనూ వున్నాయి. అంతేకాదు. అన్ని లైబ్రరీలలోనూ ఉన్నాయి. మార్కెట్ లో కావలసినన్ని దొరుకుతాయి!"
    "బుల్ షిట్! తలతిక్క వాదం వద్దు. మర్యాదగా స్టేషన్ కు నడు!" ఇన్ స్పెక్టరు ఆవేశంగా సమ్రాట్ మెడ మీద చేయి వేసి ముందుకు నెట్టాడు.
    "ఇన్ స్పెక్టర్! హద్దు మీరుతున్నారు. రేపు కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను, జాగ్రత్త..." సమ్రాట్ ముఖం ఎర్రబడింది.
    ఆ మాటలతో ఇన్ స్పెక్టర్ భ్రుకుటి ముడిపడింది. "అలాగా!" అంటూనే వెంటనే అతని మీదినుంచి చేతిని తీసివేశాడు.
    "మిస్టర్ ఇన్ స్పెక్టర్! నాతో మీకేమైనా అవసరం అనిపిస్తే నా లాయరును కలుసుకోండి." సమ్రాట్ ఆవేశంగా అని క్షణం కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు.
    సరైన సాక్ష్యాధారాలు లేనిదే ఏ చట్టమూ ఎవరినీ శిక్షించదు. ప్రస్తుత పరిస్థితులలో సమ్రాట్ ను ఎవరూ ఏమీ చేయలేరు. ఆవేశం కాదు ఇప్పుడు కావలసింది _ సరైన సాక్ష్యం.
    ఇంతమంది ఇక్కడ ఉన్నారు. శవాన్ని చూసి 'అయ్యో పాపం' అనేవాళ్ళే కాని సాక్ష్యం చెప్పేవాళ్లు ఒక్కరూ లేరు! ఈ వ్యవస్థే ఇంత!
    మనుషుల మనస్తత్వాలు మారనంత వరకు ఈ కోర్టులు, ఈ చట్టాలు చనిపోయిన గౌతమికి ఏం న్యాయం చేయగలవు? తనవంటి పోలీసు ఆఫీసరులు ఎంతమంది ఉన్నా స్త్రీలకు ఏం రక్షణ కల్పించగలరు?
    ఒక పౌరుడుగా, ఉద్యోగిగా తన నిస్సహాయతకు ఆవేదన చెందాడు వీరేష్.
    గౌతమి శవం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సాహితి, కళ్యాణి.


                                                  *    *    *    *


    గౌతమి ఆత్మహత్య చేసుకుందని తెలిసి బిందుమాధవి హతాశురాలయింది.
    ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే వాళ్లను ఈ సమాజం ఎందుకు సహిస్తుందో ఆమెకు అర్థంకాకుండా వుంది.
    ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నినాదాలు ఇచ్చినా చరిత్రలో మొదటి నుంచీ స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉంది!
    ఎందరో రచయితలు తమ రచనల ద్వారా స్త్రీకి స్వేచ్చా సమానతలు కావాలని చాటిచెప్పినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది.
    సభ్య సమాజంలో పురుషుడు స్త్రీని తోటి ప్రాణిగా గుర్తించనంత కాలం స్త్రీ అబలగానే, నిస్సహాయురాలిగానే మిగిలిపోతుంది.
    గౌతమి జీవితం లాగే సాహితి జీవితం కూడా ఏమైపోతుందోననే బెంగ పట్టుకుంది బిందుమాధవికి.
    తను ఒంటరిది. సాహితి హద్దుమీరి ప్రవర్తిస్తున్నది. తల్లిదండ్రులు లేని పిల్లకు ఏదైనా అపచారం జరిగితే సభ్య సమాజం తననూ, తన పెంపకాన్నీ వేలెత్తి చూపించదూ?

 Previous Page Next Page