గుండెను చేత్తో అదుముకొంటూ అర్ధాంతరంగా ప్రాణాలు విడుస్తున్న మొహంలోని ప్రశ్నార్ధకంలా ఆ మెరుపు భయం కలిగిస్తోంది.
"ఇప్పుడు మనందరం ఒక తీవ్రమైన సమస్యలో చిక్కుకున్నాం. బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ ద్వారా చలపతిరావ్ అనే పేషెంట్ శరీరంలోకి ఎయిడ్స్ ప్రవేశించిందని అందరికీ తెలుసు."
ఎవ్వరూ మాట్లాడని నిశ్శబ్దాన్ని తొలచుకొని గంభీరంగా వినిపించింది పరమేశ్వరం గొంతు. అతను ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు.
"ఈ సమస్య ఏ ఒక్కరిదో అయితే మనమందరం సమావేశమయ్యే అవసరం ఉండేది కాదు.
ఈ హాస్పిటల్ పరువు ప్రతిష్టల దగ్గర నుండీ.... కార్డియాక్ సర్జరీలో మనతో పోటీపడుతున్న ఇతర హాస్పిటల్స్ ఈ పరిస్థితిని క్యాష్ చేసుకొనే వరకూ ఇది ముడిపడి వుంది" అని కాస్త ఆగి మళ్ళీ అన్నాడు.
"లెట్స్ కమ్ టు ద పాయింట్!
పరీక్షలన్నీ పూర్తి అయిన రక్తం బ్లడ్ బ్యాంక్ లో ఎందుకు లేకపోయింది?" మెత్తగా ప్రశ్నతో ముగిస్తూ, సగం నెరసిన వెంట్రుకల్లోకి వేళ్ళు జొనిపి బట్టతల సవరించుకొన్నాడు.
ఆయన స్వరం మృదువుగానే వున్నా సీరియస్ నెస్ తాలూకు గాఢతని సంతరించుకొని వుంది.
తన సీట్లో ఇబ్బందిగా కదిలాడు భగవంతం. పరమేశ్వరం, తప్పంతా శరత్ చంద్ర మీదకే తోస్తాడని, అందరూ అతన్ని కార్నర్ చేయవచ్చనీ ఆశపడి వున్నాడు.
"సర్! అతనిది అరుదైన గ్రూప్ అవడంవల్ల మన దగ్గర రిజర్వులో లేకపోయింది!" లేచి నిలబడి అన్నాడు బ్యాంక్ ఆఫీసరు. అతని గొంతులో భయం ఉట్టిపడుతోంది.
"బట్! ఇటీద్ ది ప్రెస్టేజియస్ ఇష్యూ ఆఫ్ అవర్ సూపర్ఇస్పెషాలిటీ హాస్పిటల్! ఏ గ్రూప్ అనేది ఇమ్మెటీరియల్!
ఇక్కడికి వచ్చే రోగి అన్నీ దొరుకుతాయనే నమ్మకంతో వస్తాడు. నీ గ్రూప్ రక్తం మా దగ్గర దొరకడు - నువ్వే తెచ్చుకో పో అంటే, అతనెక్కడికి పరుగెట్టాలి?
ఇరవై నాలుగు గంటలూ ఈ పనిలో వుండే మనకి దొరకని రక్తం, కొద్ది నిమిషాల్లో అతను గాలించి సృష్టించగలడా? దీనికి మనమే ఏదో పరిష్కారం ఆలోచించాలి! ఎలా చేస్తే బ్లడ్ కలెక్షన్ ఇంప్రూవ్ చెయ్యగలమో ఆలోచించి చెప్పండి!" అన్నాడు పరమేశ్వరం.
చూపు దించుకొని నీళ్ళు నములుతూ అన్నాడు ఆఫీసరు. "కష్టమేమో సార్! మిగతా గ్రూపుల రక్తం సేకరించడం కొంత వరకు ఫరవాలేదు కానీ ఎ.బి. గ్రూపువాళ్ళని కనుక్కోవడం కూడా కష్టమే. అందులోనూ, రెగ్యులర్ డోనర్స్, రక్తం అమ్ముకోడానికి అలవాటు పడ్డారు. దానం చేయమంటే వినరేమో సార్."
అతను చెప్పేదీ నిజమే అనిపించింది శరత్ చంద్రకి.
"కానీ, మరి ఎలా? అవసరం, ఇబ్బందులని గమనించి రాదుకదా! ఈ విషయంలో మనమేదో ఒకటి చెయ్యకపోతే చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువే ఉంటుంది! చలపతిరావుని చూస్తున్నాం కదా" అన్నాడు పరమేశ్వరం.
శరత్ చంద్రకి కొంత సంతోషం కలిగింది! పరమేశ్వరం మాట్లాడిన తీరు, విషయాన్ని అర్ధం చేసుకున్న విధానం నచ్చింది.
"ఒక పని చేయవచ్చు!" అన్నాడు ఆలోచిస్తూ-
ఏమిటన్నట్లు చూశాడు పరమేశ్వరరావు.
"బ్లడ్ బాంకులో ఏ గ్రూపు రక్తం అయిపోయినా 'ఎమర్జెన్సీ బులెటెన్'లా టి.వి., రేడియో, పేపర్లలో రక్తదానం కోసం అభ్యర్ధించవచ్చు! ఊరికే రక్తదానం చేయడం అనికాకుండా దాని అవసరాన్ని, అర్జెన్సీని, ప్రాణాలను కాపాడవలసిన కర్తవ్యాన్నీ వివరించితే జనం కదులుతారనే నా ఉద్దేశం. అంతేకాకుండా రక్తం ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి నష్టం ఉండదన్న విషయం కూడా అర్ధమయ్యేలా చెప్పాలి!" అన్నాడు.
అతని సూచన పరమేశ్వరానికి నచ్చింది. "బాగుంది డాక్టర్! మీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను" అన్నాడు.
భగవంతం యిబ్బందిగా కదిలాడు కుర్చీలో.
"ఎయిడ్స్ వుందన్న మీ అనుమానం నిర్ధారించడానికి ఇంకెంత టైము పడుతుంది?" మైక్రో బయాలజిస్టుని ప్రశ్నించాడు పరమేశ్వరం.
"అడ్వాన్స్ డ్ టెస్ట్ లు చేస్తున్నాం! మరో 48 గంటల్లో ఖచ్చితంగా చెప్పగలను సార్! లేచి నిలబడి చెప్పాడతను.
అప్పుడర్ధం అయింది శంకర్ కి. ఎయిడ్స్ వుందని గట్టి అనుమానము మాత్రమేనని, కానీ ఎయిడ్స్ వున్నట్లుగానే నోటీసు వచ్చినట్లు చెప్పాడు భగవంతం! 'అయితే అలా జరగలేదన్నమాట. రోగికిచ్చిన రక్తం నుండి శాంపిల్ కోసం తీసిన రక్తాన్ని చేసిన ప్రైమరీ పరీక్షల్లో అనుమానం వచ్చిందన్నమాట!' అనుకున్నాడు.
"అసలు వాళ్ళనొదిలేసి కొసరువాళ్ళను పట్టుకుంటాడేమిటయ్యా ఈ డైరెక్టరు?" అసహనంగా అన్నాడు భగవంతం!
ఏం మాట్లాడాలో తెలీక మొహంలో సన్నగా నవ్వు కదిలించి మళ్ళీ సీరియస్ గా కూర్చున్నాడు శంకర్.
"అనుమానం వున్నా అది నిర్ధారణ అయ్యేవరకూ 'ఎయిడ్స్' కేసు అనే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. సో.... దీనంతటివల్లా హాస్పిటల్ కి లక్షల నష్టం జరగబోతోంది" నిట్టూరుస్తూ అన్నాడు పరమేశ్వరం.
అందరి మొహాల్లో ఆందోళన తొంగిచూసింది. ఎయిడ్స్ అని నిర్ధారణ అయితే రోగికి వాడిన మెషినరీ అంతా తగలబెట్టవలసి వుంటుంది. ఆ మిషనరీ విలువ లక్షల్లో ఉంటుందని అక్కడందరికీ తెలుసు.
భగవంతం మాత్రం లోలోపల సంతోషించాడు.
బ్లడ్ టెస్టు పూర్తి కాకుండా ఆపరేషన్ ఎందుకు చేశావనీ, ఇంత నష్టానికి నువ్వే కారణమనీ డైరెక్టర్ శరత్ చంద్రని మందలిస్తాడని చాలా ఆశపడ్డాడు.
"డాక్టర్ భగవంతం!" పరమేశ్వరం పిలుపుకి ఉలికిపడి చూశాడు.
"ఆ పేషెంట్ ని ప్రత్యేకంగా వుంచి అతని దగ్గర ఇద్దరు కార్డియో థొరాసిక్ సర్జన్స్ ని నియమించండి" హెడ్డాఫ్ ది డిపార్ట్ మెంట్ కి బాధ్యత అప్పగించాడు పరమేశ్వరం.
అక్కడున్న వైద్యుల మొహాల్లో ఒక్కసారిగా మార్పు కనిపించింది. ఆ మార్పు భగవంతాన్ని ఉత్సాహపరిచింది.
'రోగి దగ్గర ఎవరుంటారు' అన్నట్లు అందరి మొహాల్లోకి చూశాడు. ఎవరూ మాట్లాడలేదు. అందరి కళ్ళలోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఎవరూ సిద్ధంగా లేనట్లు అందరూ తలలు వంచారు.
వీస్తున్న గాలి ఆగిపోయినట్లు ఆ గది వేడెక్కింది.