నిఖిత తల్లిదండ్రులు అటువంటి అటుపోట్లకి తట్టుకోగలిగారు.
చెట్టుమీద నుంచి పడటంవల్ల దశరధ్ వెన్నెముక విరిగింది. ఇక జీవితాంతం పక్కమీదే వుండాలని డాక్టర్లు చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి అంతకన్నా పెద్ద షాక్ ఏముంటుంది? ఆ వార్త తెలియగానే ఆ కుటుంబం మీద విషాదం నీలినీడలా వ్యాపించింది. రాము, నిఖితలు ఇంకా చదువు మధ్యలోనే వున్నారు.
వీటన్నిటికన్నా ముఖ్య విషయం మరొకటి వుంది.
దశరధ్ ని ఆ షాక్ నుంచి బయటకు తీసుకురావడం! తనిక జీవితంలో లేచి నడవలేడన్న చేదు నిజంకన్నా పెద్ద ఘాతం మనిషికి మరొకటి వుండదు. కానీ దానికన్నా తన కుటుంబం ఏమైపోతుందన్న వ్యధే అతడికి ఎక్కువైంది. సంపాదించి నిల్వచేసిన కొద్ది డబ్బూ హాస్పిటల్ ఖర్చులకి సరిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు.
ఆ సమయంలో అతన్ని- అతని కుటుంబం మొదట మానసికంగా!
ఆదుకోవటం అంటే ఆర్థికంగా కాదు- మొదట మానసికంగా!
దశరధ్ ని ఆ షాక్ నుంచి బయటకు తీసుకురావటం! తనిక జీవితంలో లేచి నడవలేడన్న చేదు నిజంకన్నా పెద్ద ఘాతం మనిషికి మరొకటి వుండదు. కానీ దానికన్నా తన కుటుంబం హాస్పిటల్ ఖర్చులకి సరిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు.
ఆ సమయంలో అతన్ని- అతని కుటుంబం మొదట మానసికంగా!
'మనకేమీ కాదు, మనందరం సమిష్టిగా పనిచేస్తాం! నీ వెనుక మే మందరం వున్నాం' అన్న ధైర్యం కన్నా మనిషికి కష్టకాలంలో కావల్సింది మరేమీ లేదు.
నిఖిత పార్ట్ టైమ్ గా ఒక టైప్ ఇనిస్టిట్యూట్ లో చేరింది. రామూ ట్యూషన్ లు చెప్పటం ప్రారంభించాడు. కౌసల్యకి దశరధ్ ఆఫీసులోనే చిన్న ఉద్యోగం ఇచ్చారు.
సైనికాధికారి గాయంతో కూలిపోగానే, సుశిక్షితులైన సైనికులు చెల్లాచెదరై పోకుండా తమ తమ స్థానాల్లో చేరి దుర్గాన్ని కాపాడుకున్నట్టు ఆ కుటుంబ సభ్యులు తమ ఇల్లు విచ్చిన్నం అయుపోకుండా కాపాడుకున్నారు. నిఖితకి టైప్ ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తే చాలా తక్కువ ఇచ్చేవారు. అయితేనేం? అక్కడ డబ్బుకన్నా 'ఫీలింగ్' ముఖ్యం. ఆ ఫీలింగే దశరధ్ కి ధైర్యాన్నిచింది.
కాస్త నిలదొక్కుకున్నాక రామూని ట్యూషన్ చెప్పటం మానెయ్యమని అన్నది కౌసల్య.
"అదేమిటమ్మా? నేను మానేస్తే ఎలా?" అన్నాడు అతను వప్పుకోకుండా .
"నువ్వు ప్రస్తుతం చెపుతూన్న ట్యూషన్లు నాన్నగారు తీసుకుంటానన్నారు. దానివల్ల ఇంకా ఎక్కువమంది చేరే అవకాశముంది. డబ్బుకోసం మనం మరీ ఇబ్బంది పడే అవసరం లేదు".
రామూ ఆశ్చర్యంగా "ఆ స్థితిలో నాన్నగార్ని....." అన్నాడు.
"ఆయన స్థితికి ఏమీ కాలేదు రామూ! మనందరం ఆయనపట్ల సానుభూతి చూసిస్తే..... ఆయనకే అది బావోదు. పైగా మీరిద్దరూ చదువుకుంటున్నారు. నీవైతే ముఖ్యంగా చదువుమీద చాలా ఏకాగ్రత నిలపాలి. ఇంకెంత? ఒక నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నీ చదువు పూర్తవుతుంది. నువ్వు బాగా చదవాలంటే ఇటువంటి బాధ్యతలు వుండకూడదు. అయినా ఇదంతా ముఖ్యంకాదు. అసలు విషయం మరొకటి కూడా వుంది. ముందే చెప్పానుగా, వెన్నెముక విరగటం వలన జీవితం అయిపోయింది అన్న నిరాశ నాన్నగారికి కలగనివ్వకూడదు. ఆ బాధ్యత కూడా మనమీద వుంది".
రామూ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. ఎవరికయినా ఇదంతా చెప్తే 'ఎంత కమర్షియల్ ఆలోచిస్తుంది?' అని ముక్కున వేలేసుకుంటారు. చెవులు కొరుక్కుంటారు. అంతేగానీ 'ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తుందీ!' అనుకోరు.
ఆ క్షణం నుంచీ అతనికి తల్లిదండ్రుల మీద గౌరవం రెట్టింపయింది. మరింత ఏకాగ్రతతో చదవసాగాడు. నిఖిత మాత్రం ఉద్యోగం మానలేదు. తల్లీ, కూతురు ఉద్యోగాలు చేస్తూంటే, కొడుకు చదువుకోవటం అన్నది మామూలు పరిస్థితుల్లో అయితే చాలా చిత్రంగా కనబడుతుంది. కానీ మానసిక సంబంధాలు బాగా పటిష్టంగా వున్న ఆ సంసారంలో వారికి ఏమీ వింతగా తోచలేదు.
బయటవాళ్లకి వింతగా తోచినా- అది వారికి సంబంధించిన విషయం కాదు.
2
ధాత్రి నిఖితవైపు సంభ్రమంగా చూసింది.
తనతో కలిసి అష్టాచెమ్మా ఆడిన అమ్మాయి, ఇంత వ్యక్తిత్వాన్ని సంతరించు కోవటం ధాత్రికి అద్భుతంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత కలిసినా నిఖిత, ఇంత ఎదిగిపోయిందని ఎవరూ అనుకోరు.
ఇదే సంఘటన తమ కుటుంబంలో జరిగితే ఎలా వుంటుందని వూహించింది ధాత్రి. అసలా ఊహాకే కంపించిపోయింది. ఏడవటం తప్పమరింకేమీ చేసేదికాదు తన తల్లి! తను కూడా అంతే. తండ్రికి అలా అవగానే ఇక అది తమ బ్రతుక్కి 'ఆఖరు' అని అందరూ అనుకుని ఏ దగ్గిర బంధువుల సాయం కోసమో యాచిస్తూ తిరగడం ప్రారంభించేవారు. తన డాన్స్ ప్రోగ్రామ్ లు, తన గేమ్....... అన్నీ అర్థంతరంగానే వదిలేసేది.
"ఏమిటి ఆలోచిస్తున్నావు ధాత్రి?"
"ఇంతటి విషాదాన్ని ఇంత సింపుల్ గా ఎలా చెప్పగల్గుతున్నావా అని! ఏమిటో ఈ జీవితాలు..... ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదుకదా" అంది ధాత్రి దిగులుగా.
"జీవితమంటేనే ఒక మిస్టరీ ధాత్రీ. అయితే అందులో పెద్ద సస్పెన్స్ కి ప్రతిక్షణమూ మనం ప్రిపేర్ అయివుంటే ఇక ఏ విషాదమూ మనల్ని ఏమీ చేయలేదు".
ఆమెలో వున్నదీ తనలో లేనిదీ ఏమిటో ధాత్రికిఅర్థం అయింది. పదహారేళ్ళ వయసులో సినిమాస్టార్ లవ్వాలనుకునే వాళ్ళూ, ఏ మాత్రం కష్టపడకుండా పాతికేళ్ళకే లక్షలు సంపాదించాలనుకునే వాళ్ళు- ఆ కేటగిరిలోకి వస్తుంది తను! తన గమ్యాలు గొప్పవి. 'నేనిది చేయగలను- నేనది చేయగలను' అని నిరంతరం అనుకుంటూనే కాలం గడిపేస్తూ వుంటుంది. కాలంతో పాటు గమ్యమూ ముందుకు నడుస్తుందే తప్ప- తను మాత్రం దాన్ని చేరుకోలేదు.
నిఖిత అలాకాదు. విధి ఏ గమ్యాన్ని నిర్దేశించినా దాన్ని ఒక ఛాలెంజిలాగా తీసుకుని తన పని నిర్వర్తిస్తోంది.
ధాత్రి ఆమెతో మరి కొంచెంసేపు మాట్లాడి అక్కణ్ణుంచి బయల్దేరింది. లూనా మీద వెళ్తూంటే ఆమెలో ఎన్నో గతస్మృతులు కదలాడసాగాయి. తాము నాటిన మామిడిచెట్లు, పార్కులు, తాము ఆడుకున్న ఆటస్థలం........వరుసగా అన్నిటినీ చూసుకుంటూ వెళ్ళసాగింది. అయిదారు సంవత్సరాల క్రితపు జ్ఞాపకాల్తో ఆమె వాహనం నడుపుతూ, వీధి మలుపు తిరుగుతుండగా ఎదురునుంచి మోటార్ సైకిల్ వచ్చి ఆమెని ఢీ కొంది.
అదృష్టవశాత్తూ పక్కన గడ్డి వుండటంతో ఆమెకి దెబ్బలు తగల్లేదు. ఈలోపు మోటార్ సైకిల్ నడుపుతున్న యువకుడు బండి ఆపి స్టాండ్ వేసి దగ్గరకొచ్చాడు. "దెబ్బ తగిలిందా?" అన్నాడు ఆమెని నిశితంగా చూస్తూ.
ధాత్రి కోపంగా "అంత స్పీడేమిటి మిస్టర్? ఇంకా నయం ఏ ఎముకో విరగలేదు అదృష్టం" అని కాళ్ళూ చేతులూ దులుపుకుంటూ లేచి నిలబడింది.
"టర్నింగ్ లో హారన్ కొట్టాలని తెలీని నీకు లైసెన్సు ఎవరిచ్చారు ధాత్రి?" అని అడిగాడు అతను చిరునవ్వుతో.
ధాత్రి ఉలిక్కిపడింది. అతన్ని పరీక్షగా చూసి "అరే ప్రీతమ్ నువ్వా!" అంది ఆశ్చర్యంగా, సంతోషం మిళితమైన స్వరంతో.
"నేనే. బాగా పోడుగయ్యావు సుమా! చూడగానే గుర్తుపట్టలేక పోయాను. చాలా రోజుల తరువాత కలిశాం కదూ. బహుశా అయిదారు సంవత్సరాలై వుంటుంది" అన్నాడు. నిజంగానే ధాత్రి వయసుతోపాటు కొత్త అందాల్ని చాలా సంతరించుకుంది.
"అవును, నువ్వూ చాలా పోడుగయ్యావ్" అంది అంతనివైపు చూస్తూ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే చాలాసేపు నిలబడి మాట్లాడుకున్నారు. వెడుతూ వెడుతూ ప్రీతమ్ ఆమె డాన్సింగ్ స్కూల్ అడ్రస్ తీసుకొని "రేపు సాయంత్రం వస్తాను" అన్నాడు. ఆమె తలూపింది. అతడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ "మనం ఈ ఆక్సిడెంట్ కి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. యాక్సిడెంటల్ గా మనిద్దర్నీ కలిపింది" అన్నాడు నవ్వుతూ. ధాత్రి కూడా నవ్వింది.
ఈ చిన్న యాక్సిడెంట్ వల్ల పెరిగిన పరిచయం ఏ యాక్సిండెంట్ కి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.
3
పన్నెండేళ్ళ అబ్బాయి మంచంమీద అచేతనంగా పడివున్నాడు. చేతికి గుచ్చి వున్న సూదిలోంచి సెలైన్ ఒక్కొక్క చుక్కా అతని శరీరంలోకి ప్రవేశిస్తోంది. ముక్కులోపల దూర్చిన ట్యూబ్ లోంచి ఆక్సిజన్ గుండె ఆగిపోకుండా వుంచే ప్రయత్నం చేస్తోంది.
అతని తల్లీ, తండ్రీ చెరోవైపున కూర్చొని వున్నారు. ఇద్దరి కళ్ళల్లోంచి నీళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి. అతడు ఎగిరిపడుతున్నప్పుడల్లా వాళ్ళ గుండెలు చెదిరిపోతున్నాయి. గట్టిగా పట్టుకొని అతడికి ఆసరా యిస్తున్నారు. చెదిరిపోయిన ట్యూబుల్ని సరిచేస్తున్నారు.
రెండు గంటల తర్వాత అతడు నెమ్మదిగా కదిలాడు.
కళ్ళు తెరవగానే అతడి దృష్టి తండ్రిమీద పడింది. తండ్రి కళ్ళు ఎర్రగా ఉబ్బివున్నాయి. ఆయన అంతగా దుఃఖించడం అతనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా, డిగ్నిటీ తగ్గకుండా వుండేలా సీరియస్ నెస్ ని మెయిన్ టెయిన్ చేసే తండ్రిని, ఆవిధంగా చూడటం ఆ కుర్రవాడి మనసుని కదిలించి వేసింది. ఇలాటి తల్లిదండ్రుల్ అకోసం తను ప్రాణాల్ని ఇచ్చినా బుణం తీరదనుకున్నాడు.
కొడుకు కళ్ళు తెరవడంతో తండ్రి వంగి నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు. జుట్టులోకి వ్రేళ్ళు పోనిస్తూ "ఎందుకురా? ఎందుకిలా చేశావ్? మేమేం పాపం చేశామని? నీకేమైనా అయితే మేం భరించగలమా? మేం బ్రతగ్గలమా?" తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ అంటోంది.
అతను కరిగిపోయాడు. "తప్పయిపోయిందమ్మా! ఇంకెప్పుడూ యిలా చేయను సారీ" అనబోయాడు. గొంతులోంచి మాట రావటంలేదు. ఎవరో రెండుచేతులతో గొంతును పట్టి నొక్కినట్లు ఊపిరాడటంలేదు. గట్టిగా అరవబోయాడు. చివరికి గొంతులో అడ్డు పడిందేదో ఒక్కసారిగా తొలగిపోయినట్టు "అమ్మా....." అన్న కేక గట్టిగా బయట కొచ్చింది.
అవినాష్ చప్పున కళ్ళు విప్పాడు. అతడి వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అప్పుడు రాత్రి పదిగంటలవుతూంది.
అతడి కలకి అతడికే భయమేసింది. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఆత్మహత్యా ప్రయత్నం మళ్ళీ కల రూపంలో ఇన్నేళ్ళకి తనని ఎందుకు వెంటాడిందో అతడికి అర్థంకాలేదు. అతడు ఏ మానసికశాస్త్ర పుస్తకాలూ చదువుకోలేదు. చదివివుంటే అతడికి అర్థమైవుండేది. చిన్నప్పుడు ఏ విధమైన ఒంటరితనంతో అతడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడో యిప్పుడు యవ్వనంలోకి వచ్చాక కూడా అతడ్ని అదే ఒంటరితనం బాధిస్తూంది. అందుకే ఆ కల......
ఆఫీస్ ఫైల్స్ తీస్తే చూడబుద్ధి కావటంలేదు. ఏకాగ్రత నిలవటం లేదు. తను వుండాల్సింది ఈ నాలుగ్గోడల మధ్యా కాదనీ, బయట నలుగురిలో తిరగాలనీ అనిపిస్తూంటుంది. కానీ ఏదో సంకోచం.....ఇన్ఫీరియారిటీకాంప్లెక్స్.
తను, తన తల్లి, తండ్రి సర్కిల్! ఆ సర్కిల్ లోంచి బయటికి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా తను వెళ్ళలేకపోతున్నాడు. వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఇలాంటి భయంకరమైన కలలు వెంటాడుతున్నాయి.
తన తల్లిదండ్రుల కట్టడిలో తనెందుకు అంతలా బందీకృతుడయిపోయాడో అతడికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూంది. ఎప్పుడో చిన్నప్పటి ఆ సంఘటన ఇంకా ఫ్రెష్ గా అతన్ని పలకరిస్తూనే వుంది.
ఆనాడు తన ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పుడు తనకోసం వాళ్ళుపడ్డ శ్రమ. ఆరాటం, ఆ తర్వాత తీసుకున్న శ్రద్ధ, అనుక్షణం కనిపెట్టి రక్షించుకోవటం-అన్నీ అతడి మీద గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఏ తండ్రులూ ఏ పిల్లలకీ ఏర్పరచని సౌకర్యాలు తన కమర్చారని అతడనుకున్నాడు. తన తల్లిదండ్రులకి తన పట్ల వున్న ప్రేమ సరిగ్గా అర్థంచేసుకోగలిగాను అని అతడనుకున్నాడు.