Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 19


    అసంఖ్యాక ప్రజల నిజమైన అవసరాన్ని గుర్తించు, ఆ అవసరం తీర్చే వస్తువును కనిపెట్టు. దాన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టు. నీ యుద్ధంలో సగభాగం విజయవంతంగా పూర్తయినట్లే-" మాలిని ఓ క్షణం ఆగి త్రినాథ్ కళ్ళలోకి చూసింది.

    ఆకలితో వున్న సింహంలా వున్నాడు అతను.

    అతని ఆకలి భౌతికమైనది కాదు. మానసికమైనది. ఆలోచనాపరమైనది. మేధాపరమైనది. ఇలా అందిస్తే అలా అందనంత ఎత్తుకు ఎదిగిపోవాలనే లక్ష్యశుద్ధి పరమైన ఆకలి అది.

    "నిద్రాణమై వున్న నీ సబ్ కాన్ షస్ నెస్ ని డబ్బు సంపాదన కొరకు నిద్రలేపు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోటానికి నీలోని సామాజిక స్పృహను కదిలించు. డబ్బు సంపాదన తప్పుకాదు. ఈవిల్ కాదు. సంపాదించే మార్గాన్ని బట్టి అది మంచా చెడా అనేది నిర్ణయం జరుగుతుంది. టు...బి. మెటీరియలిస్టిక్- ఆకలి ముందు ఆ అత్యవసరమైన అవసరాల ముందు ప్రేమలు, అనుబంధాలు నిలబడలేవు. మనిషి అవసరాల్ని తీర్చి, ఆనందాన్నిచ్చే సంపాదన డబ్బు దెయ్యం కాదు. తప్పుకాదు. చెడు కాదు. తెలివితేటల్ని అమ్ముకోవటం- ఆ తెలివితేటలతో తయారుచేసే వస్తూత్పత్తుల్ని అమ్ముకోవటం తప్పుకాదు. ఆ వస్తువుల్లో నాణ్యత లేకపోవటం తప్పు.

    కన్నకొడుకైనా మంచి కూర చేయకపోతే తల్లిని తిడతాడు.

    భార్య అయినా మంచి చీర లేకపోతే మల్లెపూలు పెట్టకపోతే గునుస్తుంది. పండక్కి తీసుకురాకపోతే అల్లుడు, కూతురు కినుక వహిస్తారు. ఎంతో ఖర్చుపెట్టి చదివించిన కొడుకు ఉద్యోగం తెచ్చుకోలేకపోతే తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా చూస్తారు. ఎందుకంటావ్? కేవలం డబ్బులేకే. అంతదాకా ఎందుకు? నీకు పైసా ఆస్తి లేదనేగా ఆ సుదర్శన్ రావు అలా ప్రవర్తించింది? నీ చేతిలో చిల్లిగవ్వ లేదనేగా సిద్ధప్ప తల్లి వైద్యం లేకుండానే బయటకు తోయబడింది?

    ఇప్పటికి- ఇంకెన్నిటికో సమాధానం చెప్పి సంతోషాన్ని ఇవ్వగల ఆ డబ్బును సంపాదించటం తప్పుకాదు..." మాలిని మాటలు ఆ ప్రాతఃకాలపు నిశ్శబ్ధ ప్రాంగణంలో గీతోపదేశంలా సాగిపోతున్నాయి.

    ఇంకొద్ది నిమిషాల్లో తెల్లవారుతుందనగా ఆమె ఆరోజు పాఠాల్ని చెప్పటం ముగించింది.

    ఇద్దరూ నిశ్శబ్దంగా జీప్ వైపు నడుస్తున్నారు.

    ఉన్నట్టుండి ఆమె ఆగిపోయింది.

    "తొలి ప్రయత్నంగా ఏం చేయబోతున్నావ్ మిస్టర్ త్రినాథ్?" ఆమె అటు తిరిగే ప్రశ్నించింది.

    "పెట్టుబడికోసం ప్రయత్నిస్తున్నాను..." అన్నాడు మెల్లగా.

    "ఎలా...?"

    "ప్రియాంకకు ఒక అవసరాన్ని కలిగించి, ఆ అవసరాన్ని మరొకరి ద్వారా తీర్చి వారి దగ్గర అప్పు తీసుకొని-

    ఆమె మరేం మాట్లాడలేదు.

    త్రినాథ్ ఎగిరి జీప్ ఎక్కాడు.

    అప్పటికి ఇది మూడో ఉదయమే. కాని ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న డ్రైవర్ లా నేర్పుగా, వేగంగా ప్రమాదరహితంగా జీప్ ని ముందుకు దూకిస్తున్నాడు త్రినాధ్. మాలిని సాలోచనగా, క్రీగంట త్రినాధ్ నే చూస్తోంది.

    జీప్ నగర పొలిమేరల్లో ప్రవేశిస్తుండగా అందామె. "మనిషి వేషభాషలు కూడా కొన్ని పనులు సులభంగా సాధించుకోవటానికి ఉపయోగపడతాయి. భాష, తత్సంబంధమయిన పరిజ్ఞానం, నీ ఏకాగ్రత, పట్టుదల వలన సాధ్యం కాబోతున్నాయి. వేషం మాత్రం ప్రస్తుతం నీ చేతిలో లేని డబ్బువలనే సాధ్యం అవుతుంది..."

    రోడ్ మీంచి దృష్టి మరల్చకుండానే అన్నాడు త్రినాధ్. "అయితే అప్పు పెట్టండి" అంటూనే జీప్ ని రెడీమేడ్ బట్టల షాప్స్ వున్న వీధి వైపు మరల్చాడు.

    షాప్స్ తెరవటానికి ఇంకో అరగంట టైముంది.

    షాప్స్ తెరిచే వరకూ ఇద్దరూ మౌనంగానే కూర్చున్నారు జీప్ లో.

    కరక్టుగా 9-30కి షాప్ లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారు షాప్ లోకి.

    మాలిని త్రినాధ్ కి రెండు జతల బట్టల్ని సెలక్ట్ చేసింది. త్రినాధ్ అప్పటికప్పుడు ఓ జాత్ బట్టల్ని వేసుకుని వచ్చేసరికి మాలిని బిల్ పే చేసింది.

    ఇద్దరూ బయటకొస్తుండగా త్రినాధ్ అన్నాడు. "రెడీమేడ్ బట్టల వెనుక కాలం విలువ లెక్కించబడుతోంది కదా? బట్టలు కొనటం, అవి తీసుకొని మరో చోటకు వెళ్ళటం, వాటిని కుట్టటం కోసం ఇవ్వటం ఈ జాప్యాన్ని కుదించటమే గదా రెడీమేడ్ బట్టల వ్యాపారమంటే?

    కొత్త బట్టల్లో హుందాగా కనిపిస్తున్న త్రినాధ్ కళ్ళల్లో అపార శోధన... నథింగ్ బట్ కామన్ సెన్స్... ఉన్న మెదడుకు ఒకింత పదును పెడితే తెలియవచ్చే వ్యాపార మెళకువలు... కిటుకుల్ని అమిత వేగంతో అంచెలంచెలుగా అవగాహన చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు.

    మాలిని ఆలోచనల్నుంచి తేరుకుని చిరునవ్వుతో చూసింది.

    జీప్ మరలా బయలుదేరింది.

    ఆమె ఇంకా త్రినాధ్ గురించే ఆలోచిస్తోంది. నిన్న మొన్నటివరకు అక్షరం ముక్కరాని జీవమున్న ముడిపదార్ధం, ఒక మంచుముద్ద, కనీసం తన కడుపు నింపుకోవటం, తన ఒంటిని నిండా కప్పుకోవటం కూడా తెలీని ఒక అనామకుడు. అనుకోకుండా ఎదురైన అవమానం, అవసరం ఇతని జీవితాన్ని ఎంతటి గొప్ప మలుపు తిప్పబోతున్నాయి!

    ఫ్రమ్ రేగ్స్ టూ రిచెస్... పూటకు గతిలేని స్థితి నుంచి కోట్లకు అధిపతులైన ప్రతి వ్యక్తి అవమానం నుంచో... నిర్లక్ష్యం నుంచో... అవసరం నుంచో పైకి వస్తాడు కాలు.

    అరవై డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ తో ముందుకు దూకిస్తున్న త్రినాధ్ ఓసారి తలతిప్పి కొద్ది క్షణాలు మాలినివైపు చూసి మరలా డ్రైవింగ్ మీద దృష్టిని కేంద్రీకరించి అన్నాడు-

    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"

    "ఏం లేదు" అందామె కేజువల్ గా.

    "ఉంది. మీరు చెప్పటం లేదు"

    ఆమె మౌనంగా వుంది.

    "తెలివిగలవారి మెదడు ముఖ్యంగా రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఆలోచించటం, రెండు పరిశీలించటం. మీ చూపుల్లో పరిశీలన లేదనిపిస్తోంది.

    మాలిని విస్మయంగా త్రినాధ్ వైపు చూసింది. మాట్లాడే ప్రతి మాట నిర్ధుష్టంగా, విస్రబ్ధంగానే కాదు ఎంతో చనువుగా పలకరిస్తున్నట్లు, తీక్షణంగా నిలదీస్తున్నట్లు స్లోమోషన్ బుల్లెట్స్ లా వుంటాయి. అవతల వారి అంతరంగాన్ని పసిగట్టే ప్రాయడియన్ ఎక్స్ రేల్లాంటి చూపులు... తన అనుమానానికి అర్ధం లేదేమో?

    "ఇతను నిజంగా ఈ ఛాలెంజ్ లో నెగ్గగలడా? అన్నదే మీ ఆలోచన అయుండాలి" త్రినాధ్ మాటలు సూటిగా వున్నాయి.

    మాలిని ఉలిక్కిపడింది. అవుననే సమాధానం మాటల్లో చెప్పలేక ఒకింత గిల్టీగా ఫీలయి మౌనం వహించింది. ఆమెకు తెలుసు దాన్నే తన సమాధానంగా తీసుకుంటాడని.

    ఆ క్షణానే తొలిసారి త్రినాధ్ పై ఆమెకో ఇష్టం ఏర్పడింది.


                                                  *    *    *    * 


    త్రినాధ్ కు టెంపరరీ బేస్ మీద ఓబరాయ్ హోటల్ లో బేరగా నాలుగు రోజులపాటు ఉద్యోగం ఇస్తున్నట్లు ఓ లెటర్ వచ్చింది. అదిప్పుడు హిందూ చేతుల్లో కదులుతోంది.

    "ఇంతింత చదువుకున్న మాకే ఏ వుద్యోగమూ రాక రోడ్లుపట్టుకు తిరుగుతుంటే అక్షరం ముక్క రాని నువ్వు అంత పందెం కాస్తావా? మెడ మీద తలకాయుండే చేసావాపని...?" సైంటిస్ట్ మాటలో ఉక్రోషం తొంగి చూసింది.

    త్రినాధ్ సమాధానం చెప్పలేదు.

    "అసలేం చూసుకొని ఈ ధైర్యం...? వ్యాపారం చేయాలంటే పెట్టుబడి వుండాలి. నువ్వు ప్రస్తుతం వేస్తున్న ప్లాన్ మూలంగా ఐదో, పదో రావచ్చు. ఆ కొద్ది మొత్తంతో ఏం చేయగలవు? ఒకవేళ చేసినా నీకు ఎంతోమంది టెక్నికల్, ఫైనాన్షియల్, మార్కెటింగ్, ప్రొడక్షన్, ఎక్స్ పర్ట్స్ లేకుండా నువ్వొక్కడివేం చేయలేవు" సైంటిస్ట్ త్రినాధ్ వైపు చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు.

    తపన, పట్టుదల వున్నవాడు తన కెదురయ్యే నిర్లక్ష్యం, విమర్శలు అవమానంలోంచి సయితం దారి వెతుక్కోగలడు. సరిగ్గా త్రినాధ్ విషయంలో అదే జరిగింది.

    అప్పటికే త్రినాధ్ సైంటిస్ట్ మాటల గురించి ఆలోచించటం, ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది.

    త్రినాధ్ నిశ్శబ్దంగా లేచి నిలబడ్డాడు.

    రెండు చేతులు ఫాంట్ జేబుల్లో పెట్టుకొని ఓసారి తల పైకెత్తి "నిజమే... నాకిప్పుడు మేధావులు, సాంకేతిక నిపుణులు కావాలి" అని ఒకడుగు ముందుకేసి హిందూ చేతిలోని ఆర్డర్స్ తీసుకొని ఒకడుగు ముందుకేసి ఆగిపోయి తలమాత్రమే సైంటిస్ట్ వైపు తిప్పి "వార్ని కొంటాను" అంటూ వేగంగా ముందుకు కదిలిపోయాడు.

    సైంటిస్ట్, ఇంజనీర్ స్థాణువులై పోయారు. ఏదో అనేందుకు తెరిచిన వారి నోళ్ళు అలాగే నిశ్చలంగా వుండిపోయాయి.

    హిందూ మాత్రం త్రినాధ్ కంఠంలో ధ్వనించిన ఆత్మ విశ్వాసానికి విస్తుపోయింది.


                                                *    *    *    *


    ప్రియాంక అవమానించిన తరువాత బోస్ కాలేజీ మానేశాడు. ఇంట్లో బెదిరించటం, డబ్బు తీసుకోవటం, బార్స్ కెళ్ళటం, చిత్తుగా తాగి మత్తులోకి దిగి ఆ అవమానాన్ని మరిచిపోయే ప్రయత్నం చెయ్యటం దినచర్యగా మారింది.

    బోస్ తండ్రి ఛటర్జీ ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్ లో లైసెన్సింగ్ ఆఫీసర్. ఉద్యోగంలో చేరిన మొదట్లో సిన్సియర్ గా వున్నా సుదర్శనరావు లాంటి స్టాల్ వర్ట్స్ ప్రదర్శించిన సామ, దాన, భేద, దండోపాయాల ముందు తలవంచి సంతకాలు పెట్టి, వారిచ్చింది తీసుకోక తప్పింది కాదు. ఆ దారిలో లక్షలు సంపాదించినా అది కేవలం తన నిస్సహాయత మీద కసి మూలంగానే. అనుక్షణం గిల్టీగా ఫీలయ్యే ఆయనకు వున్న బాదొక్కటే. ఈ పాపపు సొమ్ము తన కొడుకు భవిష్యత్తును పాడుచేస్తోందని.

    అడిగినప్పుడు డబ్బు ఇవ్వకపోతే మొండివాడైన తన కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడని భయం.

    ఇటీవల కొడుకులో వచ్చిన మార్పును ఆయన గమనించటం, దానికి కారణం తెల్సుకోవటం కూడా జరిగింది.

    అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు. రాత్రి తాగిన మత్తులో అప్పటివరకూ మగతగా పడుకున్న కొడుకు లేచి నిర్లక్ష్యంగా తన గదిలోకి రావటం, బీరువా తెరిచి కనీసం లెక్క కూడా చూసుకోకుండా చేతికందినన్ని వందరూపాయల నోట్లను జేబులో కుక్కుకోవటం, దూకుడుగా వెళ్ళిపోవటం తన కళ్ళముందే జరిగింది.

    ఆయన తన బాధను గొంతులోనే నొక్కిపెడితే, భార్య మాత్రం బయటకే భోరున ఏడ్చింది.

    "కడుపున పుట్టిన వాళ్ళు సుఖపడాలని కట్టుకున్న వాడ్ని సంపాదన కోసం వేధించటమే తెలుసు నీలాంటి తల్లులకి. పెద్దల సంపాదనను హామీగా చూసుకొని నిష్ప్రయోజనంగా మారినప్పుడు తన కడుపున చెడబుట్టాడని కుళ్ళికుళ్ళి ఏడవటమే నీలాంటివాళ్ళకు చివరకు మిగిలేది.

    అవసరమే అన్నీ చూపిస్తుంది, నేర్పిస్తుంది. అది నీ గారాబంతో వాడికి తెలియకుండా పోయింది. ఇప్పుడేడ్చి ఏం లాభం? నీ కొడుకు చెడింది కాక ఎవరో పెళ్ళికాని అమ్మాయిని నలుగురిలో ముద్దు పెట్టుకొని అవమానించాడట. నీ కడుపు తీపి మరో తల్లి కడుపుకోతకు కారణమైంది ఏడువ్. బాగా ఏడువ్.కన్నందుకు కాదు అలా పెంచినందుకు" ఛటర్జీ ఈ మాటలంటూనే కోపంగా బయటకు నడిచాడు.   

    అక్కడ తనకిచ్చిన ఆఫీస్ జీప్ లేదు. డ్రైవర్ మాత్రం భయపడుతూ నిలబడుతున్నాడు. ఏం జరిగిందో ఆయనకర్ధమయింది. ఈ దేశంలో ఇప్పుడు వెనుక లక్షలుండి శ్రమ విలువ తెలియక చెడిపోయిన లక్షలాది కొడుకుల తండ్రుల లిస్ట్ లోకి చేరిన ఛటర్జీ నడిరోడ్డు మీద నిలబడిపోయాడు.

 Previous Page Next Page