తనకోసమే. నుంచుందా అనుకున్నాడు. గబగబా అడుగులు ముందుకువేశాడు.
సింగి, సింగన్నను చూసింది.
ఎవరూ లేరు.
తాను ఒక్కతే.
ముందు సింగన్న.
పచ్చని అడవి.
అతడు మగాడు!
తాను ఆడది
తుళ్ళి పడ్డది.
"మా జట్లోల్లను చూసిన్రా!"
నవ్వాడు సింగన్న, "ఉస్స్ పిట్ట ఒక్కతైనాది?"
"ఉన్నవుగద నువ్వు!" నవ్వింది. పెదవులు కరచుకుంది.
సింగన్న అడుగు ముందుకు వేశాడు.
సింగి గుండె గుబగుబ లాడింది. వెనక్కు తగ్గింది. అలా వెళ్ళి ఒక చెట్టు అనుకొని నుంచుంది. ఏదో గొణుగుతూంది. బొటన వేలుతో నేల రాస్తుంది. కళ్ళతో మాట్లాడుతూంది.
సింగన్న అలా చూస్తూ నుంచున్నాడు. తన ఎదుట పరువం పొంగుతూంది, పాడుతూంది, నవ్వుతూంది.
ఒక కాలు చెట్టుబోదెకు ఆనించింది సింగి.
అతనిలో జలపాతం వెలిసింది.
"ఉస్స్ ఏమట్ల చూస్తవు?" అడిగింది సింగి రాత్రి నవ్వింది. చూపులు నేల కర్పించింది. ఇప్పుడేమో ఎందుకు చూస్తున్నావని అడుగుతూంది.
"అడవిని చూస్తున్న."
"అట్లనా"
మళ్ళీ నిశ్శబ్దం.
చెట్టుబోడెను ఆనుకొని సింగి.
ఎదురుగా సింగడు.
ఇద్దరి గుండెలూ గుబ గుబ లాడుతున్నాయి. ఇద్దరూ ఏదో మాట్లాడాలను కుంటున్నారు. ఇద్దరి చూపులూ ఒకే విషయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
"పోదామా?" అడిగాడు సింగడు.
"నీతోనా?"
"రావా?"
"తెచ్చుకుంటే."
అవును సింగిని తాను తెచ్చుకోవాలి. ఎలా వస్తుంది తెచ్చుకోందే. అప్పుడు గాని అతనికి నియమాలు అర్థంకాలేదు. కోయపడుచు అందరితోని సరసమాడుతూంది. కాని సాన్నిహిత్యం భర్తకే.
ఆ విషయమే ఎరుక పరిచింది సింగి. అవును అతని ఎదకు ఆకలిగా ఉంది. ముందు మెత్తని శరీరం. అందమైంది. యవ్వనంలో ఉన్నది. ఎవ్వరేం చేయగలరు? తనను ఎవరు అడ్డగలరు? అతడూ కొన్ని నియమాలకు బద్ధుడే! తన ఎద ఆకలి తీరదు. ఆ విషయం తెలుసు. కంటి ఆకలి తీర్చుకో దలచుకున్నాడు.
చూస్తూ నుంచున్నాడు.
అతడు ఆమెను చూస్తున్నాడు.
ఆమె అతనిని చూస్తున్నది.
ఇద్దరూ తన్మయులై ఉన్నారు.
ఇద్దరూ ఏదో ఆనందంలో మునిగి ఉన్నారు.
సూర్యునికి ఏం తెలుసు వారి ముగ్ధ ప్రేమ? అతడు క్రుంగిపోయాడు. చీకట్లు వ్యాపిస్తున్నాయి; వారు మాత్రం గమనించలేదు.
పులి గాండ్రుమంది.
అదిరిపడ్డది సింగి.
వచ్చి సింగన్న చేయి పట్టుకుంది గట్టిగా.
ఎవరూ మాట్లాడలేదు. అతని జంతువు పసిపట్టునట్లు ముక్కు పుటాలదిరించి వాసన చూశారు. పులి వస్తున్న జాడ కనిపించింది.
"వస్తున్నది పులి" మెల్లగా చెవిలో చెప్పినట్లు చెప్పాడు. గబగబా చెట్లెక్కించాడు సింగిని. తాను కూడా గబగబా ఎక్కాడు.
పులి గాండ్రుమన్నది.
మేఘం ఉరిమింది.
వర్షం మొదలైంది.
పులి చెట్టు మొదటికి దూకింది. ఒక్క గంతు వేసింది. పడిపోయింది. చెట్టును గోళ్ళతో గీరింది. గాండ్రు గాండ్రుమంటూ చెట్టుచుట్టూ తిరుగసాగింది.
చిమ్మున చీకటి.
జోరున వర్షం.
దట్టపు అడవి.
చెట్టుకింద పులి.
పులి కదలదు. వారు దిగరు. చలి వణుకు, రెండు మండే గుండెలు.
రేయి గడిచింది. వాన వెలిసింది. అడవి తడిసింది. పులి నిలిచింది. జంట బెదిరింది.
పులి కదిలేట్లులేదు. సింగన్న దగ్గర తుపాకి ఉన్నది. కాని ఒక్క దెబ్బకే మందుంది. కదలడం లేదంటే అలా పడుకొని ఉన్నా ఆ ఒక్క దెబ్బతో కొట్టేవాడే. పులీ తెలివికలదే. అది చెట్టును చూచింది. చెట్టుమీద మనుషులను చూచింది. వారి దగ్గర తుపాకిని చూచింది. దానికీ ప్రాణభయమే. మనిషికీ ప్రాణభయమే. ఇద్దరికీ పంతమే. అది పంతాల పోరాటం.
పులి మనిషిని కొట్టాలనుకుంటుంది, మనిషి పులిని కొట్టాలనుకుంటున్నాడు. అది పోరాటమే. కాని ఎవరికీ అదును చిక్కటం లేదు. ఎవరికీ గురి దొరకటం లేదు. ఆకలి చెట్టుమీదా ఉంది. చెట్టుకిందా ఉంది. కాని పట్టుదల, అది ఆకలిని తెలియనీయదు.
పాపం సూర్యుడు చూడలేక పోయాడు. క్రుంగిపోయాడు. మళ్ళీ చీకట్లు. పులి చుట్టూ తిరిగింది. మొదట పడుకుంది. నిద్రపోయింది. గుర్రు పెట్టింది. చీకట్లు, కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడంలేదు. ఎలా పులిని కొట్టడం? ధ్వనినిపట్టి కొడ్దామనుకున్నాడు. గురికూడా పెట్టాడు. కాని కొట్టలేదు. ఆ ఒక్కదెబ్బపోతే! తాము పులినోట పడాల్సిందే. వేరే ఎట్టి గత్యంతరం లేదు.
సింగి మౌనంగా ఉంది.
వెర్రిగా అడవిని చూస్తూంది.
సింగన్న సింగిని చూచాడు.
"గుబులు గున్నాదే."
"నువ్వున్నవుగద"
అది జవాబు మాత్రమే. సింగి గుండెలో భయం గూడు కట్టుకొంది. అది కనిపిస్తూనే ఉంది. తాను సింగిని రక్షించాలి. ఏం చెయ్యాలి?
కాళరాత్రి, కీచురాళ్ళ ధ్వని, గుడ్లగూబల అరుపులు, ఎక్కడో ఏముందో? ఏ పాము చెట్టు నెక్కుతుందో?" నిరంతరమైన అప్రమత్తత.
రేయి ఎంతకాలం ఉండగలదు? చీకట్లు ఎంతకాలం దగా చేయగలవు? ఎవడు ఉషస్సును అడ్డగలిగాడు? ఆపగలిగాడు?
చీకట్లు చీలిపోయాయి, ఉషస్సు మొలిచింది. సూర్యుడు తాడుపట్టుకుని పాకాడు. ఆ విషయాలు గమనించలేదు పులి. గురక మానలేదు. నిద్ర లేవలేదు.
తుపాకి "ఢాం" అన్నది.
పులి గొంతులోకి దూసుపోయింది.
గాండ్రుమని చెట్టంత ఎత్తు ఎగిరి పడిపోయింది పులి.
ఆ కేకకు అడవిలోని జంతువులు కకావికలైపోయాయి.
పులి అరచింది. తన్నుకున్నది. తుదకు మెడ వాలిపోయింది. పులి శవం రక్తంలో తేలింది.
సింగి సింగన్నను చూచింది. ఆ చూపులో గౌరవం ఉంది. ఆదరం ఉంది. వలపు ఉంది. ప్రేమ ఉంది. అసలు గుండెల వలయాలున్నాయి.
సింగన్న ఉక్కిరి బిక్కిరి అయినాడు. అగ్గిలో ఆజ్యం పడింది. భగ్గున్న మండింది. అయినా అణచుకున్నాడు. తాను చెట్టు దిగాడు. తుపాకి అందుకున్నాడు. సింగిని దింపాడు. ఇద్దరూ పులిని చూచారు. నిన్న అదంటే బెదిరిపోయారు. ఇవ్వాళ కాలితో తన్నారు!!!
చిత్తడి నేలలో ఇద్దరూ సాగిపోయారు. కింది గూడెందాకా సింగిని సాగనంపి సంగం గుండెతో ఇంటితోవ పట్టాడు సింగన్న.
* * * *