Home » Yandamuri veerendranath » ధ్యేయం


                           అధ్యాయం- 3

    "ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద స్టేజీ. మానవులంతా తమ తమ పాత్రలు పోషించి వెళ్ళే నటీనటులు" అన్నాడొక మహాకవి.

    ఈ విశాల ప్రపంచంలో చిన్న అణువులాంటి కాలనీ అది. యాభై ఇళ్ళతో కూడిన ఆ కాలనీ ఏర్పడి ఇరవై ఏళ్ళవుతోంది. విశ్లేషించి చూస్తే ఆ కాలనీలోనే ఒక ప్రపంచం కనబడుతుంది.

    ఆస్తులు అంటే వేరే ఏమీ లేకపోయినా కనీసం స్వంత ఇల్లయినా వుండాలన్న సెంటిమెంటుతో..... కాస్త ఖరీదు ఎక్కువయినా సిటీ మధ్యలో వుంటామన్న ఆశతో......అప్పో, సప్పో చేసి ఇళ్ళు కట్టుకున్న మధ్యతరగతి కుటుంబీకులే అక్కడ చాలామంది. చేసిన అప్పులు తీర్చడానికి కొందరు అద్దెల కిచ్చేస్తే, స్వంత ఇల్లంటూ వుండికూడా అద్దెకొంపల నివాసం ఎందుకని ఇతర ఖర్చుల్ని అదుపు చేసుకుని అక్కడే వుండిపోయిన వాళ్ళు మరికొందరు. అద్దె ఇళ్ళ ఇరుకునుంచి బయటపడ్డ వాళ్ళు విశాలమైన ఇంట్లో వుండి సంబరపడితే, పై ఖర్చులకయినా కలిసొస్తుందని రెండు గదులు అద్దెకు ఇచ్చి మళ్ళీ ఇరుకునే అనుభవిస్తున్నవాళ్ళు కొందరు. ఆ కాలనీలో ఇరవై ఏళ్ళుగా స్థిరనివాసం ఏర్పరచుకున్న అయిదారు కుటుంబాల వాళ్ళు ఈ కథలో ప్రధాన పాత్రధారులు.

    రకరకాల పాత్రధారులతో ఆ కాలనీ నిజంగానే ఒక నాటకం జరుగుతున్న స్టేజీలాగానే వుంటుంది. ఆ నాటకాన్ని  తిలకిస్తూ, రకరకాల మనుష్యుల రకరకాల తత్వాలను అర్థం చేసుకుని అబ్బురపడుతూ, ఆవేశానికి లోనవుతూ.... ఆవేదనతో  కుమిలిపోతూ.. నిలబడ్డ ప్రేక్షకులు కాలనీ మధ్య పార్కులోని చెట్లూ, మొక్కలూ.

    ఎంతమంది జనం మారినా, ఎన్ని  అనుభవాల కథలు మిగిల్చి వెళ్ళినా ఆ  సారాన్నంతా తమలో ఇముడ్చుకుంటూ మనిషి మనిషికీ గల తేడాని విశ్లేషించుకుంటూ, వాళ్ళ ఆనందాన్ని, దుఃఖాన్ని వాళ్ళకు  కూడా తెలియకుండానే  తాముకూడా పంచుకుంటూ ఆ కాలనీలో ఒక భాగమై పోయాయా చెట్లు.

    ఆ తోటకి ప్రాణం పోసింది దశరధ్, కౌసల్య అయితే, వాటిని సంరక్షించింది రాము, నిఖితలు. అందుకే ఆ కుటుంబంతో ఆ చెట్ల అనుబంధం విలువకట్ట లేనిదైపోయింది. ఆ తోటకి నందనవనం అనీ, ఒక పక్క జంటగా పెరిగిన  రెండు  గున్నమామిడి చెట్లకి కల్పవృక్షం, కల్పతరువు అని పేర్లు పెట్టింది నిఖిత.

    "నీ మొహం చెట్లకి పేర్లేమిటి?" అని వెక్కిరించింది మహతి.

    "ఏం వాటికీ ప్రాణం వుందని సైన్స్ లో చదువుకోలేదూ. కుక్కలకి, పిల్లులకి పెట్టగా లేంది చెట్లకి పేర్లు పెడితే  తప్పేమిటట" అని వాదించింది.

    "అసలు కల్పవృక్షం అంటే ఏమిటో నీకు తెలుసా?" రెట్టించింది మహతి. వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో వాళ్ళ అభిరుచుల్లో అంతకుమించినంత వ్యత్యాసం వుంది.

    "మనకి నీడ నిస్తుంది. పండుగలకి తోరణాలు కొట్టుకోవడానికి ఆకులభిస్తుంది. పత్రిఏడూ కాయలనిస్తుంది. ఉయ్యాలలు కట్టుకుని ఊగనిస్తుంది. ఇంకేం వరాలు తీర్చాలేం?' అంది నిఖిత, కోపంగా. మహతి మరి మాట్లాడలేకపోయింది. పదేళ్ళ క్రితం సంభాషణ అది.

    "ఎనిమిదేళ్ళ నిఖిత ఆలోచనలకి కౌశల్యం ఆ రోజు అబ్బురపడితే, మిగతావాళ్ళు మాత్రం హాస్యంగా నవ్వుకున్నారు. ఎంత నవ్వుకుని, ఏం చెప్పుకున్నా  అనుకోకుండా ఆ చెట్లకి ఆ పేర్లు అలవాటయి స్థిరపడిపోయాయి. మొక్కలు చెట్లుగా పెరిగిన వెంటనే వాటిచుట్టూ ఎత్తయిన సిమెంటు చప్టా కట్టించింది కౌసల్య. మామూలుగానే చాలామంది విమర్శించారు. కాలక్రమేణా ఆ చప్టా మధ్యాహ్నంపూట ఆడవాళ్ళ ముచ్చట్లకీ, రాత్రివేళ మగరాయుళ్ళ రాజకీయ చర్చలకీ, అన్ని వేళలా పిల్లలు ఆడుకోవాడనికీ,చదువుకోవడానికీ కూడా ఆ నీడే ఉపయోగపడుతుంది. అందుకే అక్కడి మనుష్యుల జీవిత కథలూ, ఎవరికీ చెప్పగూడని రహస్యాలు కూడా వాటికి  బాగా తెలుసు. తమతోపాటు పెరిగిన నిఖితలాంటి పిల్లలంటే వాటికి మరింత అభిమానం. ఆ పిల్లలు తమ ఆప్తులయినట్లు వాళ్ళ ఆనందానికి, దుఃఖానికి ప్రతిస్పందిస్తూ, వాటి గురించే ఆలోచిస్తుంటాయి.

    ప్రీతమ్, వరూధిని అంచెలంచెలుగా పతనమవుతున్న విధానం వాటిని కలవరపరుస్తుంటుంది. వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ అనేవి పిల్లలు వాళ్ళంతట వాళ్ళే అలవరచుకోవాలనే భ్రమతో.....వాళ్ళకో దారి చూపించకుండా విచ్చలవిడిగా వదిలేసిన తల్లిదండ్రుల్ని చూసి మౌనంగా విచారిస్తాయి.

    సునీత భర్త ఆ చెట్టుకింద కృష్ణమూర్తికి అతని కొడుకు ప్రీతమ్ పదహారేళ్ళ వయసులో సెక్స్ పట్ల తన ఇంట్లో చొరబడటం గురించి అన్యాపదేశంగా హెచ్చరించాడు.

    అతడు చెప్పింది కృష్ణమూర్తికి అర్థమైంది. కానీ అర్థంకానట్టు నటించాడు.

    ఇంటికి వచ్చి ఆ విషయం భార్యకు చెప్పాడు. అతడి భార్య సునీత విచ్చలవిడితనాన్ని ఎత్తి చూపిస్తూ, తమ కొడుకు మంచితనాన్ని సమర్థించి తృప్తిపడింది. ఇద్దరూ ఇక ఆ విషయం కొడుకుతో చర్చించలేదు.

    కానీ.......... కృష్ణమూర్తికి సునీత గురించి ఆలోచన అప్పుడే మొదలయింది. పరాయి కుర్రాడి పొందుకోసం తపిస్తున్నదంటే తనకూ అవకాశం వుందేమో అనుకున్నాడు. ఆ సాయంత్రమే సునీత ఒంటరిగా వుండడం చూసి, ఆమె ఇంటికి వెళ్ళాడు.

    అతని కొడుకు తన గురించి చెప్పాడేమోనన్న అనుమానంతో పాటు, అతడిని కాదంటే తన విషయం అతను కూడా అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో సునీత అతడికి లొంగిపోయింది. అయితే ఆ విషయంలో ఆమె ఎప్పుడూ పశ్చాత్తాప పడవలసిన అవసరం రాలేదు. వాళ్ళ సంబంధం కేవలం శృంగారపరమైంది. ఇచ్చిపుచ్చుకోవడంలో సమవుజ్జీలవడంతో వాళ్ళ  సంబంధం ఇన్నేళ్ళుగా సాగుతూనే వుంది.

    ఈ కథంతా తెలిసి ఆ చెట్టు నవ్వుకుందేమో.......

    ఆ కాలనీలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న మరో కుటుంబంలో పిల్లలు మహతి, సుకుమార్.

    కొడుకు వంశోద్ధారకుడనీ, తమని స్వర్గానికిచేర్చే వారధి అని నమ్మిన అన్నపూర్ణ, విశ్వేశ్వర్ లు కూతురిపట్ల అలాంటి వివక్షతే చూపించారు. దాంతో ప్రేమరాహిత్యం మహతిని వంటరిదాన్ని చేస్తే, ఆ వంటరితనం కన్న తల్లిదండ్రులపట్ల ద్వేషాన్ని పెంచుకునేందుకు దోహదం చేసింది. ఆ చెట్టుకింద కూర్చొని తనలో పెరుగుతున్న కక్షని ఎలా తీర్చుకోవాలో ఆలోచిస్తుంటుందామె. ఆమె బాధ చూసి ఆ చెట్టుకూడా నిశ్శబ్దంగా బాధపడిందేమో...

    ఇక అదే తరంతోపాటు, కాలనీలోనే పెరిగినవాడు అవినాష్.

    జీవితంలో ఎలాంటి లోటులేని వ్యక్తి అతడు. ఆ కాలనీ మొత్తంలో మొదటినుంచీ అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో వున్న కుటుంబం అది. ఒక్కడే కొడుకు. ఎమ్.టెక్., ఎం.బి.ఎ. చేసిన ఉత్తమ విద్యార్థి. ఎలాంటి చెడు వ్యసనం లేని  బుద్ధిమంతుడు. ఆల్విన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నావాడు. కానీ అవినాష్ ని చూస్తే జాలేస్తుంది. అన్నీ వుండి, ఏమీలేని వాడతను. జీవితం అంటే చదువు, ఉద్యోగం, డబ్బు మాత్రమే కాదని మరేదో జీవితం వుంటుందని తెలుసు. కానీ అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో జీనియస్ గా  పరిగణింపబడే వ్యక్తి. మేనేజ్ మెంట్ విషయాల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకుని మెప్పించగలిగే అతను సడన్ గా పక్కింటాయన ఎదురుపడితే ఏం మాట్లాడాలో తెలియక తలొంచుకుని చూడనట్లుగా వెళ్ళిపోతాడు.

    ఇరవై ఏళ్ళుగా ఆ కాలనీలో వుంటున్నా ఎవరితోటీ స్నేహం పెంచుకోలేదతడు. చిన్ననాటి స్నేహితులు కూడా ముఖ పరిచయస్థులుగానే మిగిలిపోయారు. ఎవరైనా పోరపాటున పలకరిస్తే 'హలో' అన్న తర్వాత ఏం మాట్లాడాలో అతడికి తెలియదు. కాబట్టి ఎవర్నీ కలవకుండా జాగ్రత్త  పడతాడు. దీనికి కారణం మాత్రం ముమ్మాటికీ వాళ్ళమ్మ పార్వతే. డిసిప్లిన్ పేరిట తండ్రి శంకరం అతడిని ఎవరితోటి కలవకుండా చేస్తే, అతడిచుట్టూ రక్షణ కవచం ఏర్పరచి ఎవరూ అతడికి దగ్గర కాకుండా చేసింది పార్వతి. ఇప్పుడిప్పుడే అతడా లక్ష్మణరేఖ దాటే ప్రయత్నంలో వున్నాడు. అది  విజయవంతమయితే ఎవరూ ఊహించని గొప్ప మార్పు అవుతుంది. ఆ మార్పు ఎవరు తేస్తారన్నది కాలమే నిర్ణయించాలి.

    చెట్లు మాత్రం ప్రేక్షకుల్లా వున్నాయి.


                          *    *    *

    అన్నేళ్ళ తరువాత నిఖితతో కలిసి వచ్చిన అమ్మాయిని ధాత్రిగా గుర్తుపట్టాయి ఆ చెట్లు.

    ధాత్రి! తండ్రి, ఇంటికొచ్చిన చాకలిపిల్ల చెయ్యి పట్టుకోగా గొడవ జరిగి, ఆ కాలనీనుంచి రాత్రికి రాత్రి ఇల్లు మార్చేసిన శ్రీలక్ష్మి, విష్ణువర్ధనుల కూతురు!

    దాదాపు పదేళ్ళు దాటాక ధాత్రి నిఖితతో ఆ కాలనీలోకి మళ్ళీ అడుగుపెట్టింది. ప్రతి యిల్లు, ప్రతి చెట్టూ తనను పలకరిస్తున్నట్టే అనుభూతి చెందుతుందామె మనసు. ఆ పార్కు , ఆ మామిడిచెట్టు కింద గట్టు ఆమెకెంతో ఇష్టమైన ప్రదేశం. ఆ గట్టుమీద కూర్చుని నిఖితద్వారా కాలనీలో వున్న అందరి గురించి తెలుసుకుంది. బ్రతుకు పుస్తకంలో బాల్యపు స్మృతుల పుటలను తిరగేస్తోంది.    

    "జీవితం రైల్లో ఎన్నో మజిలీలు అంటారు. నా జీవితంలో ఈ కాలనీ ఒక మజిలీ కాదని, ఇదే ణా గమ్యస్థానమని అనుకునేదాన్ని. సడెన్ గా  నన్నిక్కడనించి మరో సొసైటీలోకి తీసికెళ్ళేసరికి నీటినుంచి బయటపడ్డ చేపపిల్లలా గిలగిలా కొట్టుకుపోయాను. చాలారోజులు దిగులుగా ఏడుస్తూ గడిపాను. మళ్ళీ ఈ కాలనీకే వెళ్ళిపోదామని మా అమ్మను పోరుపెట్టేదాన్ని. అందులో అప్పుడప్పుడే స్థిరపడ్డ స్నేహం మనది. ఆ వయసులో సడెన్ గా స్థలం మారిస్తే పిల్లల మనసులో చాలా అగాధాలు ఏర్పడతాయి. ఇది నా అనుభవం" అంది ధాత్రి.

    "ఇంతకీ స్థలం మార్పవల్ల మీ నాన్నగారిలో మార్చేమయినా వచ్చిందా?" అడిగింది నిఖిత. "పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోగానీ పోవంటారు. మా  డాడీ విషయంలో అది అక్షరాలా నిజం. ఈ కాలనీయే కాదు. దేశాన్ని  మార్చినా  ఆయనలో  మార్పురాదు. ఆయన మారడు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన  మమ్మీ మెంటల్ పేషంటయిపోయింది. అదికూడా నా ప్రాణానికే వచ్చింది. డాడీ  ద్వారా కుటుంబానికి కలుగుతున్న అపకీర్తిని నా ద్వారా వచ్చే కీర్తితో కప్పిపుచ్చాలని ఆవిడ ప్రయత్నం . అందుకని మంచి డాన్సర్ వి కావాలి. మంచి టెన్సిస్ ప్లేయర్ వి కావాలి అని చంపుతుంటుంది".

    "నీలో మంచి టాలెంట్ వుంది ధాత్రీ. కొంచెం సాధన చేస్తే మంచి ప్లేయర్ వి అవుతావు. అదొక్కటే సాధించు చాలు. ఈ భావాలన్నీ నువ్వే మర్చిపోగలవు" అంది లిఖిత ఓదార్పుగా.

    "అది అనుకున్నంత సులభం కాదులే నిక్కీ. ఇంట్లో పరిస్థితి అలావుంటే ఎవరికైనా కాన్ సన్ ట్రేషన్ కుదరటం కష్టం. అది అనుభవిస్తే గానీ తెలియదు".

    నిఖిత మరి వాదించదల్చుకోలేదు. వాదనలతో మనుషులు మారరు. అనుభవాలే వారిని మార్చాలి.

    "అవినాష్ మారినట్లున్నాడే. అతడెప్పటికి పి.పి.గానే మిగిలిపోతాడనుకునే దాన్ని" అంది ధాత్రి సంభాషణ మళ్ళిస్తూ.

    "అతడిలో చెప్పుకోదగ్గ మార్పు నాకయితే కనిపించలేదు" అంది  నిఖిత నిర్లిప్తంగా.

    "అరే, మీ ఇద్దరినీ పుస్తకాల షాపులో ఒకేచోట చూసి నేను మరేదో ఊహించాను".

    "అలాంటిదేంలేదు ధాత్రి. అలాంటి అవకాశం కూడా లేదు. కాకతాళీయంగా కనిపిస్తాడు. మాట్లాడతాడు. అదే ఈ కాలనీలో కనిపిస్తే గుర్తే పట్టనట్లు వెళ్ళిపోతాడు. అంతే...... అది సరేగానీ మా ఇంటికి వెళదాం పద. నాన్నగారికి మందులిచ్చే వేళయింది" అది నిఖిత లేస్తూ.

    "ఏం ఆయనకు వంట్లో బాగోలేదా?" ధాత్రి ప్రశ్నించింది. నిఖిత సమాధానం చెప్పకుండా  కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందో దృశ్యం కదలాడింది. ఆమె ఆలోచన్లు గతంలోకి జారుకున్నాయి.


                         *    *    *

    నిఖిత ఆరోజు ఒంటరిగా చెట్టుక్రింద కూచునుంది. ఆ రోజు ఆమె పుట్టినరోజు అవటంవల్ల తలంటుకుని అక్కడికి వచ్చింది. తనకు నేస్తమయిన కల్పతరువు క్రింద సిమెంటు చప్టామీద కూర్చుని ఆ చెట్టు నాటిన క్షణాల్ని గుర్తు చేసుకోసాగింది.

    ఇంతలో తండ్రి అటునించి వెళ్ళడంచూసి "ఎక్కడికి వెళ్తున్నారు డాడీ" అంటూ అడిగింది. ఆయన ఆమెను చూడగానే "అరే, నువ్వు ఇక్కడున్నావా తల్లీ. బజారు వెళ్తున్నాను. ఈ రోజు నీ బర్త్ డే కదా ఏం కావాలో చెప్పు  తీసుకు వస్తాను" అన్నాడు. నిఖిత నవ్వింది.

    "అలా అడిగి తెస్తారా ఏమిటి డాడీ? అయినా నాకేం  వద్దు. అన్నీ అడక్కుండానే తెచ్చి పెడుతున్నారుగా. ఇంక నాకేం అవసరముంటాయి?"

    "అలా కాదు. ఈ రోజు నీ పుట్టినరోజు. ఏదయినా కొత్త వస్తువు కొనివ్వాలని వుంది. అదేదో నీకు ఇష్టమయిందయితే బావుంటుందని నిన్ను అడగటం కోసమే వెతుకుతున్నాను".

    నిఖిత ఆలోచనలో పడింది. తనకేమవసరం వున్నాయబ్బా అనుకుంటూ, ఎందుకో తల పైకెత్తిన ఆమెకు కల్పతరువు కొమ్మకు వేలాడుతోన్న మామిడికాయలు కనిపించాయి. ఆమె వాటిని చూపిస్తూ "ఆ.....అవి కావాలి" అంది నవ్వు అదిమిపెడుతూ. అతనో క్షణం తలపైకెత్తి చూసి "సరే అయితే, నేనే కోసి పెడతాను" అంటూ చెట్టెక్కడం మొదలుపెట్టాడు.

    ఆమె తండ్రిని ఆశ్చర్యంగా చూసింది. ఆ వయసులో ఆయన చెట్టెక్కుతూంటే చూడటం ఆమెకి భలే ముచ్చటేసింది. అయినా ఎవరయినా చూస్తే ఏమయినా అనుకుంటారేమోనని "మీరేమిటి? చెట్టెక్కడమేమిటి డాడీ?" అని అడిగింది.

    "ఏమ్మా? కూతురి చిన్న కోరిక తీర్చటం కోసం కాస్తవయసుని తగ్గించుకోవటంలో తప్పేముంది" అంటూ మరికాస్త పైకి వెళ్ళాడు.

    కాయలు చివరి కొమ్మన వ్రేలాడుతూ వున్నాయి. అవి అందుకోవటం కోసం, ఆ కొమ్మకి కాస్త క్రిందుగా వున్న మరో కొమ్మమీద కాలు పెట్టాడు. అవి అందలేదు. క్రిందనించి నిఖిత ఊపిరి బిగపట్టి చూస్తోంది. ఆమెకి ఎందుకో తండ్రిని దిగిపొమ్మని అడగాలనిపించింది.

    ఆయన ఇంకాస్త ముందుకు జరిగాడు. లావార్తి కొమ్మ కాస్తా......ముందుకు వెళ్ళేకొద్దీ సన్నగా వుంది. చూసుకోకుండా  ఒక్కసారిగా ఆ కొమ్మ చివర పెద్ద అంగ  వేశాడు. ఆ బరువుకి  ఆ కొమ్మపూర్తిగా వంగిపోయింది. అతను పైకి చూస్తూ  అడుగు వేయడం వల్ల క్రింద సపోర్ట ఒక్కసారిగా జారిపోయి అప్రయత్నంగా పట్టు సడలింది.

    అంతే, అంత ఎత్తునుంచీ  క్రిందపడ్డాడు. వెన్నెముక విరిగిపోయింది!

    క్రింద నించుని చూస్తున్న నిఖిత కేక గొంతులోనే ఆగిపోయింది.

    స్పృహ తప్పి పడివున్న  ఆ తండ్రిని, శిలాప్రతిమలా నోరు తెరుచుకుని చూస్తున్న ఆ కూతుర్ని 'కల్పతరువు' జాలిగాచూస్తూ నిట్టూర్పు విడిచింది.

    ఎన్నో కథల్నీ , వ్యథల్నీ తనలోనే దాచుకుని నిబ్బరంగా వున్న ఆ చెట్టు- తనకు ప్రాణం ఇచ్చి నీళ్ళు పోసిన ఆ చిన్నారి 'నిఖిత' భవిష్యత్తుని తల్చుకుని సన్నగా  వణికింది. మనిషికన్నా చెట్లే కొన్ని విషయాల్లో  వ్యక్తిత్వమూ, ధైర్యమూ వున్న జీవాల్లా ప్రవర్తిస్తాయి. అడ్డంగా కాండాన్ని నరికేసినా, మరో ప్రక్క నుంచి చిరుగువేసి బ్రతుకు నందనవనం చేసుకోవాలని ప్రయత్నిస్తాయి. చాలామంది వ్యక్తులు అలాకాదు. జీవితంలో చిన్న ఎదురుదెబ్బ తగిలితే అక్కడితో బ్రతుకే అంతమయిపోయిందనుకుంటారు. కొద్దిమంది మాత్రమే ఎన్నో బుతువుల్ని చూసి జీవితసారాన్ని జీర్ణించుకున్న వృక్షాల్లా ఆటుపోట్లకి నిలబడగలుగుతారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra