Previous Page Next Page 
ధ్యేయం పేజి 17


    చాచి లెంపకాయ కొట్టాడు ఇన్ స్పెక్టర్. "పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు. మీ యిద్దరూ మీ ఎడ్రస్ లు ఇవ్వండి.

    "సారీ సర్ చాలా తప్పయిపోయింది. మమ్మల్ని క్షమించి వదిలెయ్యండి" చెప్పింది వరూధిని. కంగారులో మెదడు పనిచెయ్యడంలేదు.

    "ఇప్పుడు వదిలేస్తే ఆ తప్పు మీరు మళ్ళీ చేస్తారు. పోలీస్ స్టేషన్ లాకప్ లో  ఒకరోజు పడేసి కేసు బుక్ చేస్తే  జీవితంలో మళ్ళీ ఆ పని చేయరు" అంటూ  గేటు బయట ఆగివున్న జీప్ వేపు నడిచాడు. ఇన్ స్పెక్టర్. వెనకే ఆ యిద్దరూ అదురుతున్న గుండెలతో అనుసరించారు కానిస్టేబుల్ వీళ్ళని చూస్తూ 'ఎక్కండి' అన్నాడు జీప్  దగ్గరికి చేరుకున్నాక.

    కంపించే కాళ్ళతో ఇద్దరూ ఎక్కారు.

    జీప్ స్టేషన్ ముందు ఆగగానే కానిస్టేబుల్ వీళ్ళని బయట నించోపెట్టి  లోపలికెళ్ళాడు. వరూధిని పోలీస్ స్టేషన్ ఆవరణలో అడుగు పెట్టడం అదే మొదటిసారి. భయంగా చూస్తోంది ఆ పరిసరాల్ని. సుభాష్ లోనూ భయం వుంది. కాకపోతే ఆడపిల్ల ముందు బయటపడలేక  భయాన్ని అదుపులో పెట్టుకోలేక, పైకి మేకపోతు  గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

    కొద్దిసేపటికి లోపలినుండి ఇద్దర్నీ రమ్మన్ని పిలుపొచ్చింది. భయం భయంగానే లోపలి అడుగుపెట్టారు. ఇన్ స్పెక్టర్ ముందుకు వెళ్ళి నించున్నారు. ఆయన  తన టోపీ తీసి టేబుల్ మీద  పెడ్తూ "ఊ. చెప్పరా ఎక్కడనుండి కొట్టుకొచ్చావ్ ఈ అమ్మాయిని?" అని అడిగాడు.

    సుభాష్ సమాధానం చెప్పకుండా తల దించుకున్నాడు. ఇన్ స్పెక్టర్ లాఠీని అతని గడ్డం కింద ఆన్చి ముఖాన్ని లేవనెత్తి "సరే అయితే ఇద్దర్నీ ప్రాస్టిట్యూషన్ క్రింద బుక్ చేయమంటావా?" అన్నాడు. వరూధిని అరచేతుల్లో చెమట పట్టసాగింది. కదిలిస్తే ఏడ్చేట్టు వుందామె. స్పృహ తప్పేలా వుంది. ఈ విషయం తండ్రికి తెలిస్తే ఆపైన మరి వూహించుకోలేకపోతోంది.

    అతను తలెత్తి "సారీ సర్ ఈ ఒక్కసారికి వదిలేయండి" అన్నాడు.

    "నో.... నో..... మీలాంటి వాళ్ళని వదిలేస్తే మిమ్మల్ని చూసి మరి కొంతమంది తయారౌతారు" అన్నాడు ఇన్ స్పెక్టర్.

    "మరోసారి మేమసలు కలుసుకోం సార్. ఈ ఒక్కసారికి వదిలేయండి. ప్లీజ్" సుభాష్ ప్రాధేయపడ్డాడు. ఇన్ స్పెక్టర్ వినలేదు.

    "మా నాన్నగారు మున్సిపల్ కౌన్సిలర్......" అన్నాడు చివరి అస్త్రంగా. ఆ మాటలకి ఇన్ స్పెక్టర్ ముఖంలో మార్పు వచ్చింది.

    కొంచెం ఆగి సాలోచనగా "నిన్ను వదిలేయాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. అది ఈ అమ్మాయి వేశ్య అయిన పక్షంలో....." అని మళ్ళీ ఆగి, "అన్నట్టు ఈ అమ్మాయి నీ  గర్ల్ ఫ్రెండా లేక నిన్ను చూసి సైగచేసి రమ్మందా?" అని అడిగాడు,

    "నిజం చెప్పు లేకపోతే మైనరు బాలికను తీసుకొచ్చి రేప్ చేయబోయావని బోక్కలో తోయిస్తా అన్నట్టు....అమ్మాయ్! నీ వయసెంత?" వరూధిని వేపు తిరిగి అన్నాడు.

    "ప......... పదిహేడు" కళ్ళనీళ్ళలో సమాధాన మిచ్చింది వరూధిని.

    "అంటే మైనర్ అన్నమాట. పన్నెండేళ్ళకి తగ్గదు శిక్ష..... అన్నట్టు ఈ అమ్మయిని ఎత్తుకొచ్చావా? లేక ఈ అమ్మాయే నిన్ను చూసి చేయి వూపిందా? నిజం చెప్పు. మొదటిది నిజమైతే నీకు శిక్షపడుతుంది. లేక ఈ అమ్మాయే నిన్ను చేయి వూపి రమ్మంటే మాత్రం కౌన్సిలర్  కొడుకు నంటున్నావ్ కాబట్టి నిన్ను మాత్రం  వదిలి పెట్టేస్తాను".

    ఇన్ స్పెక్టర్ మాటల్లో హింటే దొరికిందో లేక త్వరగా బయటపడాలన్న ఆతృతో మొత్తానికి అబద్ధం ఆడాడు. "నిజంగా నాకేం తెలీదు సర్. నేను రోడ్డు వెంట వెళ్తుంటే ఈ అమ్మాయే చేయి వూపి పిల్చింది సార్" అన్నాడు.

    నెత్తిమీద పిడుగు పిడినట్టు అనిపించింది వరూధినికి. భూమి నిలువుగా చీలిపోయినట్టు కంపించింది. ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది.

    "నో.... నో ...... ఇతడు అబద్ధమాడుతున్నాడు. నేనలాంటిదాన్ని కాదు. నన్ను  నమ్మండి".

    ఇన్ స్పెక్టర్  ఆమెని ఆగమన్నట్టు చేత్తో సైగచేసి "అంటే ఈ అమ్మాయి వేశ్య అంటావ్......... అంతేగా?"

    "యస్సర్" ఖచ్చితంగా చెప్పాడు సుభాష్.

    వరూధినికి ఒక్కసారిగా అతని మీదపడి గొంతు పిసికేయాలన్నంత ఆవేశం వచ్చింది. "యూ బాస్టర్డ్" అంటూ పరిసరాల్ని కూడా గమనించకుండా అతని మీదకు ఉరకబోయింది.

    ఇన్ స్పెక్టర్ ఆమెని చూసి 'స్టాప్ దేర్' అన్నాడు. ఆమె చప్పున స్పృహలో కొచ్చినట్టు అలాగే ఆగిపోయింది. ఆయన సుభాష్వైపు తిరిగి 'నౌ యూకెన్ గో అన్నాడు. సుభాష్ సంతోషంగా 'థాంక్స్' చెప్పి కనీసం ఆమెవైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు బయటికి.

    ఆమె అతను వెళ్ళినవైపు నిస్సహాయంగా చూస్తూ "అతను.....అతను అబద్ధం చెప్పాడు సార్. మాయమాటలు చెప్తూ నన్నక్కడికి అతనే తీసుకువెళ్ళాడు సార్....సార్.....ప్లీజ్, నాకేం తెలీదు. నేనలాంటి దాన్ని కాదు నన్నొదిలేయండి" అంది.

    ఇన్ స్పెక్టర్ రెండు క్షణాలు ఏడుస్తున్న ఆమెనే పరిశీలనగా చూశాడు.

    'మొహంలో ఇంకా పసితనం పోలేదు. అప్పుడే బాయ్ ఫ్రెండ్స్ కావాల్సి వచ్చారు. ఇలాంటి అమాయకురాళ్ళు వున్నంతకాలం అలాంటి కుర్రాళ్ళు చెలరేగిపోతూనే వుంటారు' అనుకున్నా డావేదనగా.

    "కూర్చో" అన్నాడు. ఆమె తలదించుకుని కూర్చుంది. కొద్దిగా ఆశ్చర్యం వేసింది. లాకప్ లో పెడతాడేమో అని భయపడ్డ ఆమెకి, ఇన్ స్పెక్టర్  కూర్చోమని చెప్పడంతో భయం ఆశ్చర్యంగా మారింది.

    "ఊ, ఇప్పుడు చెప్పు. అతనెవరు? అతనికీ, నీకూ ఏమిటి సంబంధం?" అని మర్యాదగా అడిగాడాయన. ఆ కంఠంలో లాలనకి కరిగిపోయింది.

    మొత్తం జరిగింది చెప్పింది. అంతా విని కొద్దిక్షణాలు మౌనంగా వుండిపోయాడు ఇన్ స్పెక్టర్.

    "అతన్ని నమ్మి నువ్వు బయటికి వస్తే ఏం జరిగిందో చూశావుగా?" అన్నాడు.

    ఆమె మౌనంగా తలదించు కూర్చుంది.

    "చూడమ్మా...... ఆ అబ్బాయి మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు. ఎలాగూ ఇన్ ప్లుయెన్స్ మీద అయిదు నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడు. ఆ విషయం నాకు  ముందే తెలుసు. కానీ, అతని నిజస్వరూపం ఏంటో నీకు తెలియాలనే ఇదంతా చేశాను. బాయ్ ఫ్రండ్స్ వుండకూడదని నేననటంలేదు. కానీ అది కేవలం ఫ్రెండ్ షిప్ వరకే పరిమితం కాదు. ఆపోజిట్ సెక్స్ తో ఫ్రెండ్ షిప్ చేయాలనిపించిదంటే అది ఖచ్చితంగా ఆకర్షణే. ఆ ఆకర్షణలో, ఆరాధనలో కొట్టుకుపోతూ మిమ్మల్ని మీరు అవతలి వారి మీదికి తోసి అబ్బాయిలు జారుకుంటారు".

    ఆమెకు జ్ఞాన చక్షువులు తెరుచుకుంటున్నట్టుగా అనిపించసాగింది. భయం స్థానే గౌరవం చోటు చేసుకోసాగింది.

    ఆయన చెప్పుకుపోతూనే వున్నాడు. "ఇందులో నీ తప్పు ఎంతవుందో, అతని తప్పూ అంతే వుంది. కానీ చివరికొచ్చేసరికి ప్రేమిస్తున్నానని చెప్పిన నిన్నే, ఒక వేశ్యగా ముద్రవేయడానికిక్కూడా వెనకాడలేదు. సో.....ఇప్పటికయినా కళ్లు తెరుచుకొని, బుద్ధిగా చదువుమీద మైండ్ కాన్ సన్ ట్రేట్ చెయ్యి. వెళ్ళు" అన్నాడు.

    ఒక్కక్షణం ఆమె ఏం విన్నదో అర్థంకాలేదు. అర్థంకాగానే ఆనందంతో లేచి నిలబడి అంది. "చాలా థాంక్స్ సార్ . నా కళ్ళు తెరిపించారు. మరోసారి యిలాంటి స్నేహాల జోలికి పోనని ప్రామిస్ చేస్తున్నాను".

    ఆమె కృతజ్ఞతతో చేతులు జోడించి వెనుదిగిరింది.

   
                          *    *    *


    మనుష్యులు చిన్న సంఘటల్తోనే మారిపోరు. అది కథల్లోనే సాధ్యం. ఈ సంఘటనని ఆమె జీవితానికో గుణపాఠం మార్చుకుంటుందో, తేలిగ్గా తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.

 Previous Page Next Page