"తను చేసిన పనివలనే ఈ అపరాధం జరిగిందని భావించి ఆ కుర్రవాడు ఆపరేషన్ కయ్యే ఖర్చంతా తనే భరిస్తానని చెప్పి, పాపం వున్న డబ్బంతా అక్కడ కట్టేసి, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. కష్టాలన్నీ కలిసికట్టుగా ఒకేసారి వస్తాయనుకుంటా. పాపం ఆ రోజే అతడిని ఉద్యోగం లోంచి తీసేసేరు. ఆ పి.ఎఫ్., గ్రాట్యుయిటీ అంతా ఇక్కడే ఇలా ఖర్చు చేయవలసి వచ్చింది.... మొత్తం పన్నెండువేలో__పదమూడువేలో...."
"పన్నెండు వేలు...."
"ఆఁ పన్నెండు వేలు...."
"మీకు తెలుసా? ప్లీజ్ - ఆ కుర్రవాడు ఎక్కడుంటాడో?"
"కుర్రవాడేమిటమ్మాయి? అతడు స్పురద్రూపుడు. ఆరడుగుల ఎత్తు, విశాలమైన నుదురు, ఎల్లప్పుడూ బిగుసుకునే దవడ కండరం-"
"అతడెక్కడుంటాడో చెప్తారా?"
తను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పుందని అర్ధమై ప్రసాదరావు వెనక్కి తగ్గి, "ఇల్లు తెలీదమ్మా- వీధి తెలుసు. చాలా ఇరుకు వీధి" అన్నాడు.
"అయినా అతడిని వెతికి పట్టుకోవాలి. అతడి డబ్బు అతడికి తిరిగి చెల్లించాలి."
"డబ్బుకోసమే అయితే అక్కరలేదమ్మా!"
"మైగాడ్ డబ్బే కాదండీ, అతడిని ఒకసారి చూడాలి. తను తప్పు చేసేనని అతడు అనుకుని వుండవచ్చుగాక! కానీ ఆ తప్పుని వప్పుకొని, ఉన్న డబ్బంతా అర్పించటం మామూలు మనుష్యులు చెయ్యలేని పని. అందుకే అతడిని చూడాలి. నాన్నగార్ని బ్రతికించింది నిజానికి అతడే అని చెప్పాలి."
"అవునమ్మా! పాపం అతని హృదయం ఎంత క్షోభిస్తుందో ఈ సత్యాన్ని అతడికి తెలపటం మన విధి. పదమ్మా పద...."
ఇద్దరూ క్రిందికి దిగారు ప్రసాదరావు కారు బైటకి తీశాడు. ఇద్దరూ వేణు ఇంటివైపు వెళుతూంటే కార్లో అన్నాడు, "నేను పొగట్టం అని కాదు గానీ అమ్మాయ్! కుర్రాడంటే అలా వుండాలి! నా కారు ఆపు చేసినప్పుడు రౌడీ అనుకున్నాను. మీ నాన్నగారి నోట్లో మందు బోస్తున్నప్పుడు ప్రాచీన సాంప్రదాయాన్నీ, రోగ సూత్రాల్నీ పుక్కిట పట్టిన మహానుభావుడు అనుకున్నాను. మీ నాన్నగారి నోట్లో మందు బోస్తున్నప్పుడు ప్రాచీన సాంప్రదాయాన్నీ, రోగ సూత్రాల్నీ పుక్కిట పట్టిన మహానుభావుడు అనుకున్నాను. ఆస్పత్రిలో తన దగ్గిర వున్న డబ్బంతా ఇచ్చేస్తున్నప్పుడు కర్ణుడే దిగి వచ్చాడనుకున్నాను. ఒకే మనిషిలో ఇన్ని గుణాలుండటం గొప్పే. ఏదో నవలలో...."
"ఇంకా ఎంత దూరం?"
తన మాటల్ని ఆమె వినటం లేదని గ్రహించి ప్రసాదరావు తన వాక్ర్పవాహాన్ని ఆపుచేసేడు. వెధవది_ తనకసలు చేతకావటంలేదు ఈ అమ్మాయిల్ని ఆకర్షించే మార్గం నిశ్చయంగా ఇది అయివుండదు. అంతలో కారు వీధి ముందు ఆగింది. ఇంతసేపూ బింకంగా కథ అల్లి చెప్పాడన్న మాటేగానీ, అతడి గుండె అదురుతూనే ఉంది.
కారణం_ ఇదంతా ప్రీ ప్లాన్ డ్ కాదు.
నర్సింగ్ హోంలో తనతో తెగతెంపులు చేసుకుని, పేషెంట్ ని తీసుకుని వేణు వెళ్ళిపోయాక, మొత్తం ప్లానంతా నడి సముద్రంలో కలిసి పోయిందనీ, ఇక తను ఓడిపోయినట్టే అనీ అనుకున్నాడు. కానీ వేణు ఆ ఆస్పత్రిలో డబ్బు అడ్వాన్సు కట్టి, జగపతిరావు ఆపరేషన్ కి సాయపడ్డాడు అని తెలియగానే.... తాము వేసిన ప్లాన్ కన్నా, జరుగుతున్న యదార్ధ సంఘటనే ఎంతో ఫేవర్ బుల్ గా వుందనిపించింది. వెంటనే తను రంగంలోకి దిగి, తన కార్లోనే జగపతిరావుని ఆ రోజు ప్రొద్దున్న ఆప్సత్రికి తీసుకువెళ్ళింది- అన్న విషయం ప్రేమకి తెలిసేలా గూర్ఖా ద్వారా ఏర్పాటు చేసేడు. ఇప్పుడీ కథ క్లయిమాక్సుకి వచ్చింది.
అయితే ఇక్కడో చిక్కుంది.
అతని పరోక్షంలో జరుగుతున్నదేదీ వేణుకి తెలీదు. తను కథని ఇట్నుంచి నరుక్కుంటూ వస్తూన్న సంగతి అతడికి జాగ్రత్తగా తెలియచెప్పి, ఈ నాటకాన్ని కొనసాగించమని కోరాలి. అసలతడే ఒక మూడ్ మనిషి. జాగ్రత్తగా హాండిల్ చేసి, జరిగిందంతా చెప్పాలి. దానికి కనీసం అయిదు నిమిషాలన్నా పడుతుంది! ముఖ్యంగా, ఆయుర్వేద మందు విషయం, ఆస్పత్రి అడ్వాన్సు విషయం....
కారు వీధిముందు ఆగింది.
"నువ్విక్కడే వుండమ్మాయ్! నేను వెళ్ళి వెతుక్కు వస్తాను" అన్నాడు. ఇంతలో ప్రేమ కారు దిగి, "పదండి నేనూ వస్తాను" అంది.
ప్రసాదరావు గతుక్కుమన్నాడు. కొంప మునగబోతూంది.
"ఆ ఇరుకు సందుల్లో నువ్వెందుకమ్మా- నేను వెళ్ళి తీసుకొస్తాలే" అని సర్దబోయాడు.
"ఫర్వాలేదండీ" అని ఆమె డోర్ తాళంవేసి, నడక సాగించింది.
ప్రసాదరావు గుండెల్లో రాయి పడింది. దారుణం_ గన్ షాట్ గా ఓ దారుణం జరగబోతూందని మనసు చెబుతూంది. చాలాకాలం తరువాత దేముడు గుర్తుకొచ్చాడు.
* * * *
వేణు తన ఇంట్లో మోకాళ్ళమీద తల పెట్టుకుని కూర్చున్నాడు. అతడికి భవిష్యత్తంతా అగమ్యగోచరంగా కనబడుతూంది! ఇల్లు అంటే ఇల్లు కాదు కూలిపోవటానికి సిద్ధంగా వున్న ఓ గది అంతే. ఆ గదిలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుని వున్నాడు.
అంతలో తలుపు చప్పుడయింది.
"వేణూ!" అన్న పిలుపు- ఆ కంఠం ప్రసాదరావుది. రాజుల చప్పుడు వేణు విస్మయంతో చప్పున లేచి వెళ్ళి తలుపు తీసేడు.
ముందు ప్రసాదరావు వున్నాడు. పక్కనే ప్రేమ.... కొద్దిసేపు వేణుకి తను చూస్తున్న దృశ్యం కలో - నిజమో తెలియలేదు. కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయాడు.
ప్రసాదరావు తొందర ప్రసాదరావుది. తనకీ ఆ అమ్మాయికీ మధ్య ఏం సంభాషణ జరిగిందో ఆ వివరాలన్నీ ఆ అమ్మాయి వినకుండా ముందు వేణుకి చెప్పకపోతే కొంప మునిగిపోతుంది.
ఈ అమ్మాయి కారులోనే వుండిపోకుండా తనతోపాటు రావడం- మొత్తం ప్లాన్ నే తలక్రిందులు చేసేట్టు వుంది. ఆ అమ్మాయి చూడకుండా వెనుకనుంచి వేణుకి 'ఏం మాట్లాడొద్దు' అని సైగలు చేయసాగాడు. కానీ వేణుకి అర్ధంకాలేదు.
ప్రేమ పరిస్థితి వేరే విధంగా వుంది. వేణుని చూడగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి, "మీరా?" అంది రైల్లో టికెట్టు కలెక్టర్ తో దెబ్బలాడినవాడు, తన స్నేహితురాలి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయేలా చూసినవాడూ అతడే అని ఆమె వెంటనే గుర్తుపట్టింది.
వేణు పరిస్థితే అయోమయంగా వుంది. ప్రసాదరావు, ప్రేమ ఇలా కలిసొస్తారనీ అతడు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడంటే ఈ ప్లాను ఇలా పాడయింది కానీ, అనుకున్నది అనుకున్నట్టు జరిగివుంటే, మొత్తం నాటకాన్ని ప్రసాదరావు "తెర వెనుక" వుండి మాత్రమే ఆడించాలన్నది ముందు అనుకున్న నిర్ణయం. మరి ఈ కొత్త మలుపేమిటో ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధంకాలేదు.
ఈ లోపులో ప్రేమ అడుగు ముందుకేసి, "మీరు ఆయుర్వేదంలో పేరు మోసిన ధన్వంతరి అని నాకు తెలీదు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు" అంది.
"ధన్వంతరా? ధన్వంతరేమిటి?" బిక్కమొహం వేసి అడిగాడు వేణు. ఆ పేరు అతడు జీవితంలో ఎప్పుడూ వినివుండలేదు. అదేమిటో అతనికి అర్ధంకాలేదు.
ప్రసాదరావు చప్పున అడుగు ముందుకేసి, "అదేనబ్బాయ్! నువ్వు కారులో ఇచ్చినమందే ఈమె తండ్రిని బ్రతికించిందని నీకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చారు ఈమె" అన్నాడు.
"కారులో ఇచ్చిన మందా? కారులో మందేమిటి?" అయోమయంగా చూస్తూ అడిగాడు వేణు.
"నవమూలికా కషాయం" అంది ప్రేమ వేణు వంక చూస్తూ.
"న....వ....మూ....లి....కా.... కషాయమా?" ఆశ్చర్యపోతూ అన్నాడు వేణు.
"అదేనబ్బాయ్! పొటాషియం-డి-సల్ఫిట్" అంటూ కన్ను కొట్టబోయి, అదే సమయానికి ప్రేమ అటు తిరిగేసరికి కళ్ళలో ఏదో నలకపడ్డట్టు నులుముకున్నాడు.
ప్రేమ అతడివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ, "ఒక రోగిని చూడగానే అతడికి ఎంతో కాలంనుంచీ విషప్రయోగం జరుగుతుందన్న విషయం ఇట్టే కనుక్కున్న మీరు ఆయుర్వేదంలో ఉద్దండులై వుండాలి" అంది.
"ఆయుర్... వేదమా?" అన్నాడు వేణు. ఈ ముసలోడు ఆ అమ్మాయికి ఏం చెప్పాడో అర్ధం కావటంలేదు.
"మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారటగా? ఆ ఆలోచన దారుణం సుమండీ" అంది ప్రేమ.
వేణూకి ఈ సంభాషణ వింటూంటే కొద్ది కొద్దిగా మతిపోతూంది. కోపంగా, "నేను ఆత్మహత్యా.... నాన్సెన్స్" అన్నాడు.
ప్రసాదరావు ఇక ఈ సంభాషణ కొనసాగితే కొంప మొత్తం మునుగుతుందనీ తనే చొరవ తీసుకున్నాడు.
"నువ్వు నా కారు ఆపి, పడిపోయిన పేషెంటుని ఎక్కించుకొమ్మని అడిగినప్పుడు రౌడీవే అనుకున్నాను అబ్బాయ్! కారు మీ ఇంటికి తీసుకొచ్చి ఈ పేషెంట్ నోట్లో నవమూలికా కషాయం పోస్తున్నాడని ఏదో కుర్రకుంక వైద్యం చేస్తున్నాడని అనుకున్నాను. కానీ నీ వైద్యంతో అసలు విషం సంగతి బయటపడినప్పుడు నీలో ఒక గొప్ప వైద్యుణ్ని చూశాను. ఇవన్నీ ఒక ఎత్తు, ఆస్పత్రిలో ఫీజు నువ్వే చెల్లించటం ఒక ఎత్తు. ఉద్యోగం మానేస్తూ ఉంటే చివరలో వచ్చిన ఆఖరి పి.యఫ్., గ్రాట్యుయిటీ కలిపి, నువ్వు ఆస్పత్రిలో చెల్లించావు. నీ మందువల్లే ఇలా జరిగిందని నువ్వు భావించావు. కానీ అసలు జరిగిందేమిటో తెలుసా? జగపతిరావుకి ఎంతో కాలంనించీ విషప్రయోగం జరుగుతూందని నువ్వు ఇచ్చిన ఆ మందు_ అనే పొటాషియం_డి_సల్ఫైడ్, దానివల్లనే అసలు విషయం బయటపడింది" గబగబా చెప్పేసి, 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాడు.
అప్పటికే వేణుక్కూడా విషయం అర్ధమయింది. 'ఓరి ముసలోడా!' అనుకున్నాడు మనసులో. 'జగపతిరావు ప్రాణాలమీదకు రాగానే తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పటికప్పుడు చక్కగా మరో మలుపు తిప్పాడన్నమాట!!"
అతడు ఇలా ఆలోచిస్తూ వుంటే ప్రేమ అతడితో, "మీకు ఎలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియటంలేదు" అంది.
వేణు నవ్వి వూరుకున్నాడు. ఆమే_ "మిమ్మల్ని నేను ఇంతకు ముందు చూశాను" అని తిరిగి అన్నది.
వేణు, ప్రసాదరావు మొహమొహాలు చూసుకున్నారు.
"ఎక్కడుంది?" అని ఏమీ తెలియనట్లు అడిగాడు వేణు.
"రైల్లో ఒకరోజు మారు టిక్కెట్టు కలెక్టరుతో దెబ్బలాడినప్పుడు, తర్వాత నా స్నేహితురాలు మీనా పెళ్ళిలో..."
ప్రసాదరావు కల్పించుకుని, "అవునమ్మాయ్! వేణు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోడు. అందుకే పెళ్ళి మధ్యలో ఆగిపోకుండా అలా కత్తి చూపించి బెదిరించాడు. పైకి రౌడీలా కనపడతాడు కానీ, చాలా సామాజిక స్పృహ వున్నవాడు" అన్నాడు.
ఏదో నవలలో అమ్మాయిలు విప్లవకారుల్ని ప్రేమిస్తారు. అది చదివి, ఈ బాణం వేశాడు అతడు. కానీ ప్రేమ "పెళ్ళిలో జరిగిన సంగతులన్నీ మీకెలా తెలుసు?" అని అడిగింది.
గతుక్కుమన్నాడు ప్రసాదరావు.
'దెబ్బ తిన్నావురా గురుడా!' అనుకున్నాడు వేణు. ఈ ముసలాడు మిగతా సమయాలన్నింటిలోనూ అద్భుతంగా ప్లాన్ వేయగలడు. కానీ, ఆడవాళ్ళు ముందుకి వచ్చేటప్పటికి మాత్రం కంగారుపడి అంతా అభాసుపాలు చేస్తాడు. ఈ విపత్కర పరిస్థితిని తప్పించాల్సిన బాధ్యత తన మీదే వుందని గ్రహించాడు వేణు.
"నేనే చెప్పాను ఆయనకీ విషయాన్ని కారులో" అని ఆగి, "నేను మిమ్మల్ని ఇంతకుముందే చూసేను ప్రేమగారూ! ఒకరోజు స్ట్రయిక్ లో లాఠీఛార్జీ జరిగినప్పుడు మిమ్మల్ని రౌడీల, పోలీసుల కంట పడకుండా గదిలో దాచింది నేనే!"
"ఓ" అంది ప్రేమ కళ్ళని విస్పారితం చేసి.
ఆమె కళ్ళల్లో అభినందన చూసి ప్రసాదరావు తెగ ఆనందపడి పోయాడు.
"అంతేకాదు, మీ నాన్నగార్ని కార్లో ఎక్కించుకునేటప్పుడే ఆయన జగపతిరావుగారని నాకు తెలుసు. ఆయన్ని మీ ఇంటికే డైరెక్టుగా తీసుకొచ్చెయ్యొచ్చు. కానీ ఆయన్ని చూడగానే ముందు విషానికి విరుగుడు ఇవ్వటం అవసరం అనిపించింది. అందుకే ఇంటికి తీసుకొచ్చి ఆ మందు ఇచ్చాను. అది వికటించిందేమో అని భయపడి, ఆస్పత్రిలో చేర్పించి, అక్కణ్నుంచి మీకు ఫోన్ చేశాను. అలా చేయటం నా కనీస కర్తవ్యంగా భావించాను" అన్నాడు నాటకీయంగా.