Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 19


    "స్ట్రయిక్ టైమ్ లో అక్కడెందుకున్నారు మీరు?" అని అడిగింది.

    వేణు మొహంలో సన్నటి బాధావీచిక కదలాడింది. మొహాన్ని మరింత విచారంగా పెట్టి, "నేను మొన్న మొన్నటివరకూ మీ ఫ్యాక్టరీలో కార్మికుణ్నే ప్రేమగారూ! కొన్ని విచ్చిన్నకర శక్తుల నాటకంవల్ల పనిలోంచి తొలగించబడ్డాను" అన్నాడు.

    "అవునమ్మాయ్! ఇంత త్యాగమూర్తిని మనం కేవలం కథల్లోనే చదువుతాం. నీ తండ్రిగారి ఫ్యాక్టరీలోంచి తొలగించబడి, మళ్ళీ ఆ తండ్రిగారి ఆరోగ్యం కోసమే తన ఆఖరి జీతపు డబ్బుల్ని కూడా ఖర్చుపెట్టి, ఆ విషయం వెల్లడి చేయకుండా వుండిపోయాడంటే, ఈ యువకుడు నిజంగా యువకుడు కాదు, మహావ్యక్తి, కోటికొక్కడు, యుగపురుషుడు.... అమ్మో!"

    ఈ చివరలో 'అమ్మో' అన్నది వేణు కాలు తొక్కడంవల్ల అరిచిన అరుపు.

    అదృష్టవశాత్తూ ప్రేమ దాన్ని అంతగా పట్టించుకోలేదు.

    వేణుతో, "పనిలోంచి తొలగించబడ్డారా?__ ఎందుకు?" అని అడిగింది.

    వేణు షార్ప్ గా ఆలోచించాడు. తనంటే దయానందానికి వ్యక్తిగతంగా పడదని ప్రేమకి ఇప్పుడే తెలియటం అంత మంచిదికాదు. అందుకే కిటికీ దగ్గరికి వెళ్ళి, మసక నీడ తన మొహంమీద ప్రతిబింబించేలా నిల్చుని, శూన్యంలోకి చూస్తూ, "అదంతా నా దురదృష్టం. ఇంకా విషయం వదిలిపెట్టేయండి" అన్నాడు.

    ఆమె దాని గురించి రెట్టించకుండా, "అదృష్టవశాత్తూ నాన్నగారికి ఇప్పుడు బాగానే వుంది. మీరొకసారి మా ఇంటికొస్తే మీరు ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి ఇచ్చేస్తాను" అంది.

    ప్రసాదరావు ఆనందంతో చప్పున 'అలాగే_అలాగే' అనబోయాడు. కానీ వేణు దానికన్నా ముందే అనేశాడు- "డబ్బుదేముందండీ? మీరనుమతిస్తే చిన్న కోరిక కోరతాను."

    ప్రసాదరావు మొహంలో నవ్వు మాయమైంది. ఉద్యోగం విషయం గురించి మాట్లాడతాడేమో! 'తొందరపడ్డావు వేణు' అనుకున్నాడు.

    ఈ లోపులో ప్రేమ "ఏమిటది?" అని అడిగింది.

    "నేను మీ నాన్నగారి పట్ల చేసింది మంచికే దారితీసిందో, ఆయనకి చెడే జరిగిందో నాకు తెలీదు. కానీ, కేవలం ఆస్ప్రత్రిలో డబ్బు చెల్లించి నేను చేతులు కడిగేసుకోదల్చుకోలేదు. ఆస్పత్రిలో వుండగా ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండి. అంతే చాలు అన్నాడు."

    అప్రయత్నంగా ప్రేమ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "దానికేం? అలాగే, తప్పకుండా" అంది. ప్రసాదరావు ఆనందంతో తబ్బిబ్బయి వేణు వైపు చూసేడు. తను అనుకున్న దానికన్నా ఈ కుర్రాడు విపరీతంగా ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేసేస్తున్నాడు.

    ప్రేమ చేతులు జోడించి, "రేప్రొద్దున్న మీ కోసం ఎనిమిదింటికి ఆస్పత్రిలో చూస్తూ వుంటాను. నమస్తే" అని, ప్రసాదరావువైపు తిరిగి, "మీరూ వస్తారా?" అంది.

    'అమ్మో! ఇంకేవన్నా వున్నదా? జగపతిరావు నన్నుచూస్తెం మొత్తం కథంతా అడ్డు తిరుగుతుంది' అని మనసులో అనుకుని పైకి, "రేపా? రేపు నాకు కొద్దిగా పనుందే" అన్నాడు ఇబ్బందిగా.

    పోన్లెండి అన్నట్లుగా తలూపి, "రేపొస్తారుగా?" అంది.

    "తప్పకుండా" అన్నాడు వేణు కూడా చేతులు జోడించి.


                                                    *    *    *    *


    "చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలబ్బాయ్ నువ్వు. అక్కడ వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేస్తావో తెలీదు కానీ, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ దెబ్బతో వాళ్ళింట్లో ఒకడిగా చేరిపోవాలి. వాళ్ళకి దగ్గరవ్వాలి."

    "నేను చూసుకుంటాను. ఇక ఆ విషయం నాకు వదిలిపెట్టండి" అన్నాడు వేణు.

    "బెస్టాఫ్ లక్!"


                       *    *    *    *


    ఆస్పత్రి వరండాలో నడుస్తూ అతడు జగపతిరావు వున్న గది దగ్గిరకు వచ్చాడు. కిటికీలోంచి ప్రేమ బత్తాయిపండు వలుస్తూ కనిపిస్తూంది. జగపతిరావు తలదిండు భుజాలక్రింద వేసుకుని పైకి కూర్చుని వున్నాడు. ఆరోగ్యం బాగా పుంజుకున్నాడని చూడగానే తెలుస్తూంది.

    వేణుకి ఇది మంచి అవకాశంగా కనిపించింది. గుమ్మంలోంచి లోపలికి ప్రవేశించాడు. లోపలికి అడుగు పెడుతూనే హతాశుడయ్యాడు.

    గోడ కిటువైపున కుర్చీలో కూర్చుని వున్నారు ప్రసాదూ, దయానందమూ. అందుకే కిటికీలోంచి చూసినప్పుడు కనిపించలేదు. వాళ్ళని చూడటం అంత మంచి శకునంలా కనిపించలేదు వేణుకి. తరువాత వద్దామా అనుకున్నాడు. కానీ, అప్పటికే ఆ గదిలో వున్న నలుగురూ అతడిని చూసేసేరు.

    ముందు లేచింది ప్రేమ. "రండి....రండి!" అంటూ ఆహ్వానిస్తూ తండ్రివైపు తిరిగి, "నేను చెప్పానే, ఆయనే" అన్నది.

    జగపతిరావ్ కూడా సంతోషంతో "రావోయ్- రా!" అన్నాడు.

    దయానందం వేణూని చూసి ఉలిక్కిపడ్డాడు జగపతిరావు రోడ్డుమీద పడిపోగానే, ఎవరో ఆస్పత్రిలో చేర్పించారని తెలిసి కూడా డాక్టర్లు ఏమీ చెయ్యలేరనే ధీమాతో వున్నాడు. కానీ ఆపరేషన్ జరిగి, జగపతిరావు బైటపడ్డాడని తెలిసి పళ్ళు కొరుక్కున్నాడు. అంతలో జగపతిరావు మీద విషప్రయోగం జరుగుతున్నట్టు డాక్టర్లు వెల్లడి చెయ్యగానే మొత్తం రహస్యం అంతా బయట పడుతుందేమోనని భయపడ్డాడు. కానీ ప్రేమకి ఆ అనుమానమే అసలు రాకపోవడంతో సంతృప్తిగా వూపిరి పీల్చుకున్నాడు.

    "నువ్వు ఇచ్చిన మందు వలనేనటగా నేను బ్రతికింది? థాంక్స్!" అన్నాడు జగపతిరావు.

    వేణు నవ్వి వూరుకున్నాడు.

    ఇంతలో ప్రక్కనుంచి దయానందం కంఠం వినిపించింది. "అయితే నువ్వు ఆయుర్వేదం ఎప్పుడు నేర్చుకున్నావ్ వేణూ?" అని.

    అందులో వెటకారాన్ని గుర్తించి కూడా, గమనించనట్టు "చిన్నప్పట్నుంచీ ఒక గురువుగారు నేర్పారు. అత్యవసర పరిస్థితులలోనే దాన్ని వాడమన్నారు" అన్నాడు- కేవలం దయానందానికి మాత్రమే కనబడేలా నవ్వి.

    "ఇతను నీకు తెలుసా నాన్నా?" ప్రసాద్ అడిగేడు.

    "మన ఫ్యాక్టరీలోనే వర్కర్ బాబూ!"

    "ఇప్పుడు తీసేసేరు" అన్నాడు వేణు.

    "అయ్యయ్యో! అదేం!" అని సానుభూతి ప్రకటించాడు జగపతిరావు. ఆయనకి ఫ్యాక్టరీ వ్యవహారాలూ అంతగా తెలియవు.

    వేణూ ఏదో అనబోతూ ఉంటే దయానందం కల్పించుకుని, "అవన్నీ ఫ్యాక్టరీ గొడవల్లెండి" అన్నాడు.

    జగపతిరావు మాట్లాడలేదు. ఈ విషయాల్లో దయానందం మాటే చెల్లుతుందనీ, జగపతిరావు పట్టించుకోడనీ ఆ కొద్దిపాటి సమయంలోనే గుర్తించాడు వేణు.

    సంభాషణ అనవసరమైన వైపుకి తిరుగుతూ ఉందని గ్రహించి ప్రేమ "నాన్నా...." అంది వారిస్తున్నట్టు.

    అది గ్రహించి మాట మారుస్తూ, "నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదోయ్! ఆ రోజు నువ్వేగాని పూనుకోకపోతే ఈపాటికి పైకెళ్ళిపోయి వుండేవాడిని" అన్నాడు జగపతిరావు.

    వేణు మాట్లాడలేదు. జగపతిరావు విఅపు పరిశీలనగా చూసేడు. 'ఇతడేనా ఒక అమాయక యువతిని మోసంచేసి, మరో యువతిని అన్యాయంగా జైలుకి పంపాడు?' అని గుర్తొచ్చేసరికి తన కర్తవ్యం గుర్తొచ్చింది. ప్రేమవైపు చూసేను. తాము అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగితే, 'ఈ అమ్మాయిని పువ్వుని నలిపినట్టు నలిపెయ్యాలి! గర్భం వచ్చేక వదిలెయ్యాలి! చెయ్యగలడా తను?' అతడింకోసారి ఆమెవైపు చూసేడు. ఆమె అందమైనదే! కానీ ఆ అందం కన్నా ఎక్కువయినది ఆమెలో మరొకటి ఉన్నది. అది మల్లెపువ్వులాంటి స్వచ్చదనం.

    అతడో క్షణం కళ్ళు మూసుకున్నాడు. కానీ వెంటనే తేరుకున్నాడు. కాంట్రాక్టు వప్పుకున్నాక ఈ ఆత్మవిమర్శ అనవసరం.

    దయానందం మొత్తం వాతావరణాన్ని చూసేడు. తండ్రీ కూతుళ్ళిద్దరూ వేణుపట్ల ఆపేక్ష చూపడం గమనించాడు. దయానందం తెలివైనవాడు. ఫ్యాక్టరీలో కూడా వేణు తనకి క్రమక్రమంగా పక్కలో బల్లెంగా తయారవటం అతడు ముందే గుర్తించాడు. అందుకే ఏదో నెపం పెట్టి అతడిని పనిలోంచి తొలిగించాడు. మళ్ళీ యిక్కడ ఇలా ప్రత్యక్షమవుతాడని అనుకోలేదు. దీన్ని మొక్కగానే తెంపెయ్యటం క్షేమకరం అని భావించాడు. వెంటనే మొహంమీదకి చిరునవ్వు తెచ్చుకున్నాడు.

    "వేణూ! ఈ రోజు నువ్వు మాకు చేసినసాయం మాటల్లో వివరించలేనిది. ఆస్పత్రిలో చేర్పించటం ముఖ్యంకాదు. మీ దగ్గరున్న డబ్బంతా ఆస్పత్రిలో చెల్లించటం_ అదీ గొప్ప విషయం. నీ విషయం ఇప్పుడే మేము చర్చించుకున్నాం. నీ సాయాన్ని డబ్బుతో కొలుస్తున్నాం అనుకోకపోతే_ నీకు ఓ బహుమతి ఇస్తున్నారు జగపతిరావుగారు స్వీకరించు. నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక్క నిముషం బైట కూర్చుంటావా?" అన్నాడు.

    అతడు అంత తీయగా మాట్లాడేసరికి వేణుకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.

    అయినా ప్రయత్నాన్ని వదల్చుకోలేదు. అతడూ అంత నమ్రతగానే, "మీకు నా కృతజ్ఞతలు. మీరిచ్చే బహుమానం నాకు వద్దు. కేవలం మానవతా దృక్పథంతో నేను ఆ సాయం చేసేను తప్ప_ఏదో ఆశించి కాదు. ఉద్యోగం లేనివాడిని_ ముందు దానిని వెతుక్కోవాలి. వెళ్ళొస్తాను" అన్నాడు.

    అతడు ఆ మాటలు అనటంలో ఉద్దేశ్యం, తనలా అనగానే, 'తిరిగి ఉద్యోగంలో చేరిపోవోయ్' అని వాళ్ళు అంటారని. అతడి ఉద్దేశ్యం నెరవేరేది. కానీ జగపతిరావు ఏదో మాట్లాడబోయేటంతలో దయానందమే ముందు అనేసేడు. "నీ ఆశయం గొప్పదే కానీ వేణూ డబ్బు కూడా అంత తీసి పడెయ్యవలసిన వస్తువు కాదు. ఒక్క నిముషం దయచేసి బయట కూర్చుంటావా?"

    వేణుకి ఇంకేం చెయ్యాలో తోచలేదు. అందరివైపు చూసి, బయటకి నడిచాడు. తన పరోక్షంలో లోపల జరగబోయేది ఏమిటో తెలుసు. దయానందం ఫ్యాక్టరీలో తను తాగి మిషను పాడుచెయ్యటం గురించి చెప్తాడు. సమ్మెలు చేసే రౌడీగా చిత్రీకరిస్తాడు. తండ్రీ, కూతుళ్ళ మనసు విరిచేస్తాడు.

    లోపల సరీగ్గా అదే జరుగుతూంది.

    దయానందం చెప్పినదంతా విని జగపతిరావు అయోమయంలో పడ్డాడు. "అయినా అతడు నా ప్రాణం రక్షించాడే" అన్నాడు.

    "ఏమో! మనకి ఏం తెలుసండీ? అతడు వాడిన మందువల్లే ఈ ప్రమాదం జరిగిందేమో? డాక్టర్లు ఆ విషయం కప్పిపుచ్చి 'స్లో=పాయిజనింగ్' అంటున్నారేమో?" అన్నాడు దయానందం.

    "అయినా మనమేమీ అతడి ఋణం ఉంచుకోవటం లేదుగా? అతడు ఖర్చుపెట్టిన డబ్బుకాక మరో అయిదు వేలు ప్రజెంటేషన్ గా ఇద్దామంటున్నాను. ఒక ధన్వంతరికి అయిదువేలు ఎక్కువే కదా?"

    "అయిదు వేలిస్తేనా.... వెరీగుడ్__ వెరీగుడ్! అలా చెయ్యండి" అన్నాడు జగపతిరావు ఆ నిర్ణయానికి హర్షం వెలిబుచ్చుతూ.

    "అబ్బాయ్! బయట నిల్చున్న ఆ కుర్రవాణ్ని పిల్చుకురా! ఇప్పుడే చెక్కు ఇచ్చేద్దాం."

    ప్రసాద్ బయటికి వెళ్ళాడు. దయానందం ఓరగా ప్రేమవైపు చూశాడు. అతడి మాటలు ఆమె మీద కూడా కావల్సిన ప్రభావాన్నే చూపించినయ్. ఆ రోజు పెళ్ళిలో కత్తి తీసిన రౌడీ గుర్తొచ్చాడు. 'నిజంగా అతడు సమ్మెల్లో కొట్లాటలు తెచ్చే రౌడీయేనేమో!' అనుకుంది. ఆ తర్వాత రైల్వే కంపార్ట్ మెంట్ లో అతడి 'జులుం' జ్ఞాపకం వచ్చింది. ఆమె మనసు కొద్దికొద్దిగా విరిగిపోయింది. ప్రసాదరావు వేసిన మొదటి రెండు ప్లాన్ లూ ఈ విధంగా ఫెయిల్ అయ్యాయి.

    ఇంతలో ప్రసాద్ లోపలికి వచ్చి, "అతడు బైట లేడు. వెళ్ళిపోయినట్టున్నాడు" అన్నాడు.

 Previous Page Next Page