"గిరీ" తట్టి పిలిచింది. ఆమెకా స్థలం చూస్తేనే భయం వేస్తోంది. వణుకు పుట్టిస్తోంది.
"నేను శేఖరాన్ని __పద్మజా! గిరిని కాను" అన్నాడు అతను.
ఉలిక్కిపడి అతని మీద నుంచి చెయ్యి తీసేసింది.
అతని కళ్ళలోకి చూసింది. అవి శేఖరం కళ్ళలా అనిపించాయి.
"గిరీ, ఏమిటి మీరంటున్నది?" భయంతో ఆమె కంఠం వణికింది.
"నిజమే చెపుతున్నాను పద్మజా, నేను శేఖరాన్ని. చచ్చిపోయినా నీ చుట్టూ తిరుగుతుంటానని చెప్పలేదూ?" అతని కంఠంలో స్పష్టమైన మార్పు కనిపిస్తూంది.
పద్మజకు ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. పక్కనే ఉన్న సిమెంటు బెంచీమీదకు వాలిపోయింది.
"పద్మా, పద్మా" ఎవరో తట్టి లేపుతున్నారు.
మెల్లిగా కళ్ళు తెరిచింది.
ఆత్రుతగా తనవైపు చూస్తున్నాడు గిరి.
"ఏం జరిగింది పద్మా? ఎందుకిటువైపు వచ్చావు" గాభరాగా అడుగుతున్నాడు.
"వాళ్ళింకా నీ కోసం చూస్తున్నారు పద్మ. ఆలస్యమైతే మనం ఇక్కడే ఏదో ప్రారంభించాం అనుకుంటారు" అంటూ నవ్వేడు. ఇప్పుడతను మామూలు గిరిలానే వున్నాడు. అవే అల్లరికళ్ళు. నవ్వే పెదవులు....
పద్మజకు అంతా అయోమయంగా వుంది. తను భ్రమ పడిందా! ఆ స్థలంలోకి రాగానే శేఖరం అన్న చివరి మాటలు గుర్తొచ్చి అలా ఊహించుకుందా? ఆమె కేమీ అర్ధంకాలేదు.
* * *
అతిధులు ఒక్కొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెపుతున్నా పద్మజ మనసు మనసులో లేదు. సోమశేఖరం చావూ, అతని మాటలూ తననెంత ప్రభావితం చేశాయో యిప్పుడే అర్ధమవుతున్నది. తను చదివిన చదువూ, చదువు నేర్పిన ధైర్యమూ, ధైర్యంతో పదిమందిలో తను మెలిగే తీరూ అన్నీ అంత బలహీనమయినవా? ఒక్క చావు దృశ్యం తనను భ్రాంతిలోకి నడిపేటంత బలీయమైనదా? లేక రక్తంలో జీర్ణించుకుపోయిన విశ్వాసాలు మానసికంగా తననంత బలహీనపరుస్తాయా? డాక్టరు రామకృష్ణ వెళ్ళొస్తానని చెప్పినప్పుడు జరిగిన సంఘటన అతడితో చెప్పబోయి నిగ్రహించుకుంది. ఇంత చిన్న విషయానికే యింత వర్రీ ఏమిటని నవ్వుతారని భయం.
రాత్రి బాగా గడిచిపోయింది.
"పద్మా, పదిరోజులు ఆఫీసు విషయాలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చెయ్యి. మిమ్మల్ని ఎవరం డిస్టర్బ్ చేయం" అంటూ గిరివైపు తిరిగి, "గిరీ, మీ అక్కయ్య అనుకోకుండా ప్రయాణం కాన్సిల్ చేసుకోవలసి వచ్చినందుకు బాధపడుతూ నాకు ఉత్తరం వ్రాసింది. పెళ్ళి ఫోటోలు పంపమంది. రాగానే పంపించు. నేను రేపే ఉత్తరం వ్రాస్తాను" అంటూ ప్రకాశరావుగారు కూడా వెళ్ళిపోయారు.
నౌకర్లు వస్తువులన్నీ తీసి సర్దుతున్నారు. గిరీ, సాగర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రంగు రంగుల దీపాలతో మెరిసిపోతున్న తోర, మనుషులంతా ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో చిన్నబోయినట్లయింది.
ఆ రాత్రే ఆ దంపతులకి మొదటి రాత్రి.
పద్మజ మెల్లిగా యింట్లోకి నడిచింది. ఈ రోజు రాత్రి తనకెంతో ప్రత్యేకమైన రోజు. చాలా ఉత్సాహంగా వుండాలి! ఒక చిన్న భ్రమకే పంతగా చప్పబడిపోవటమేమిటి__నాన్సెన్స్.... అనుకుంటూ తన గదిలోకి అడుగుపెట్టింది. బాత్రూంలో గీజర్ ఆన్ చేసి బట్టలు తీసుకోడానికి బీరువా తీస్తే ఎదురుగా కనిపించాయి శేఖరం డైరీలు. వాటిలో తను చదివిన విశేషాలు గుర్తురాగానే కోపం వచ్చింది. అది చదివే తను మనసు పాడుచేసుకుంది అనవసరంగా. అయినా యిది ఎవరి కళ్ళనన్నా పడితే అసహ్యం అనుకుంటూ వాటిని ఎక్కడ పెట్టాలా అని ఓ క్షణం ఆలోచిస్తూ పక్కనే వున్న లైబ్రరీ రూంలోకి నడిచింది. అక్కడ షెల్ఫ్ క్రింద భాగంలో ఒక చిన్న అర వుంది. తండ్రి అక్కడ కొన్ని ఫైల్స్ దాస్తుండేవాడు. ఒకసారి దాన్ని చూసి చిన్నతనంలో తనూ హిమజ చిన్నపిల్లగా వున్నప్పుడు దాన్ని ఏడిపించటానికి అన్నీ అక్కడ దాచిపెట్టేది. ఆ అరగురించి హిమకూ, తనకూ తప్ప ఎవ్వరికీ తెలియదు. పెద్దవాళ్ళయ్యాక అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. పద్మజ అడ్డంగా వున్న పుస్తకాలన్నీ తీసి పక్కనపెట్టి డైరీలు పడేసింది ఆ అరలోపల శాశ్వతంగా.
స్నానం చేస్తూ బాత్రూంలోకి అద్దంలో తన అందాన్ని చూసుకుంది పద్మజ. ఇన్నాళ్ళూ ఇది కళ్ళబడింది తనకూ, ఈ అద్దానికే. ఈనాడు మొదటిసారిగా మరొకరికి అందులోనూ ఒక పురుషుడికి కంపించడమేకాదు, అంకితమవబోతోంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన కొత్తలో కలిగేవి తనలో పిచ్చి భావాలు. తరువాత చదువు దాన్ని డామినేట్ చేసింది....మళ్ళీ యిన్నాళ్ళకి....
తెల్లటి బట్టల్లో బెడ్ రూంలోకి అడుగుపెట్టింది పద్మజ. హిమజ, రాధ కలసి అలంకరించారు ఆ గదిని. ప్రపంచం ఇంత మారిపోతున్నా ఇంకా ఈ తతంగా లెందుకని కోప్పడింది. కానీ రాధ ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఏమీ అనకు అంది.
ఇప్పుడనిపిస్తూంది - ప్రపంచం ఎంత మారినా మనిషి మనసు లోతుల్లో అనుభూతి మారదని!
ఆమె గదంతా కలియజూసింది.
రెండు మంచాలనూ కలుపుతూ తెల్లటి దుప్పటి కనిపించనంతగా మల్లెలతో నింపారు. అక్కడక్కడా రంగు రంగుల గులాబీలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ పక్కమీద వున్నాయి. గోడమీద నిలువెత్తు బొమ్మ ఒక అమ్మాయిది. చెట్టునానుకుని నిలబడి వుంది. ఆహ్వానించే కళ్ళు అరమోడ్పులవగా యవ్వనం అప్పుడే వికసించినట్లు - వాల్ పేపర్ మీద....
"బాగుంది కదూ!"