Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 16

    పద్మజ మనసు శాంతించింది. గిరిని భర్తగా  ఎన్నుకొని  తనేం పొరపాటు చేయలేదు. తన జీవితం చక్కటి మలుపు తిరగబోతోంది.

    తన జీవితం ఎట్లా  మలుపు  తీరుగబోతోంది ఆ క్షణంలో  ఆమెకు తెలియదు. భర్తగా గిరి తన జీవితాన్ని  నవ్వులమయం  చేస్తాడనుకుందేగాని, చచ్చిపోయిన సోమశేఖరం  అడ్డొచ్చి  తన భవిష్యత్తుని నవ్వులపాలు చేస్తాడని కలలోనైనా  ఊహించగలిగితే  ఆమె ఏం చేసి వుండేది? బహుశా పెళ్ళే చేసుకునేది కాదేమో!


                         *    *    *


    పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. శేఖరం కాళ్ళ దగ్గిర  పడివున్న పిస్టల్ లోంచి వచ్చిన బుల్లెట్లే అతడి శరీరంలోంచి దూసుకుపోయిందని ఆ రిపోర్టు వచ్చింది. దాంతో అది ఆత్మహత్య అని తేల్చి ఫైలు క్లోజ్ చేసేశారు.

    శేఖరం మరణానికి  ఎక్కువ ప్రాముఖ్యం  ఇవ్వకుండా  ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది.

    "పద్మజా! ఇవన్నీ  శేఖరం  పేపర్లు, డైరీలు. వీటిని వేరుగా జాగ్రత్త చేసేవాడు.  నీకేమయినా కావలసిన  సమాచారం ఉంటుందేమో చూసుకో" ఒక పెద్ద కవరు అందించింది సోమశేఖరం వాళ్ళమ్మ.

    ఆవిడ  తన స్వంత  ఊరికి  వెళ్ళిపోతోంది. ఆవిడను  రైలెక్కించి వచ్చాక క్యాజువల్ గా ఒక డైరీ తీసింది పద్మజ.

    "నువ్వూ, నేనూ  కలిస్తే ముద్దొచ్చే  సాయంత్రమైనా  ఆఫీసు సమస్యలూ, ప్రజలూ, ప్రపంచమూ ముందు పరుచుకుంటాం. అందులో  మన పాత్రే వుండదు. పద్మజా! నాకు కావలసింది వీటిని మర్చిపోయే ఏకాంతం. ఆఫీసు విషయాలు మాట్లాడే నీ పెదవులను నా చూపుడు వేలితో మూసి 'ఇలా కాదు నోరు మూయాల్సింది' అని నువ్వు చిలిపిగా అంటే వినాలని  వుంది. ఆ క్షణంలో నువ్వు ఊహించలేని నన్ను నీ ముందు ఉంచాలని"

    పేజీ తిప్పింది__ 

    "ఈ మధ్య కాస్త తీరిక దొరికితే సాహిత్యం తిరగేస్తున్నాను మీ కోసం. కృష్ణశాస్త్రి గీతాలు  నీకు చాలా ఇష్టం కదూ! అవి చదువుతుంటే  కనిపించింది. "మధు కీల," అంటే ఏమిటో డిక్షనరీలో  చూశాను. "తీయని జ్వాల" అట. అర్ధం తెలిస్తే అనిపించింది - నేను  ఆ జ్వాలకు  చాలా దగ్గరలో ఉన్నాను, అది నా చుట్టూ వెలుగుతున్నదే అని ఈ వెల్లువను తట్టుకోలేను. నిలకడగా నీ ముందు ఉండలేను. ఏమిటి నా జీవితం? ఒక ప్రశ్నార్ధకమేనా!"

    మరోచోట__

    "పెళ్ళి చేసుకోరాదూ అని అంత మామూలుగా నువ్వన్నా, నాకు పెళ్ళికాదు ముఖ్యం - ప్రేమ ఆరాధన, సున్నితమైన ఆర్ద్రభావాలు నా హృదయాన్ని కోసేస్తుంటే  ఆ గాయం  మాన్చే హృదయం  నాకు కావాలి. ఏ నిధులూ వద్దు నాకు నీ హృదయ సన్నిధి తప్ప. జీవితంలో మొదటి కోరిక, ఆఖరి కోరిక ఇదే? అందుకే  నీకు చెప్పాలంటే భయపడుతున్నాను. ఏ పరిస్థితుల్లోనూ  నీవు కాదంటే ఈ శేఖరం ఇక ఉండడేమో ?"

    ఇక చదవలేక మూసేసింది పద్మజ. అన్నీ కవర్ లో చుట్టేసి లోపలి బీరువాలో పడేసింది. అప్పటికే  ఆమె కళ్ళనిండా  నీళ్ళు  నిండుకున్నాయి. సోమశేఖరం  ఎప్పుడూ మౌనాన్ని ఆశ్రయించి వుంటాడనుకుంది. కానీ ఆ నిశ్శబ్దంలో  ఇన్ని అర్దాలుంటాయనుకోలేదు. ఒక్కొక్క అర్ధమే ఆమె హృదయాన్ని  పరపరా కోస్తూంది....దురదృష్టవశాత్తూ....అతడు ఈ లోకంలోంచి  వెళ్ళిపోయాక....


                         *    *    *


    ....పెళ్ళి రిసెప్షన్  జరుగుతోంది. దాదాపు అయిదు వందల మంది ఆహూతులతో తోటంతా  నిండిపోయింది. అందరికీ అన్నీ అందేలా సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు  పదార్ధాలు సర్దుతున్నారు నౌకర్లు.

    చాలావరకు హై అఫీషియల్స్ కాబట్టి  అదో పార్టీలాగా  కాకుండా డిగ్నిఫైడ్ గెట్ టుగదర్ లా అనిపిస్తోంది.

    ఓ పక్కన గిరి ఒక గుంపులో  నిలబడి నవ్విస్తున్నాడు.

    "అసలు పెళ్ళికి  నిర్వచనం  ఏమిటి?"

    "పెళ్ళంటే  పూజారులు స్పాన్సరు చేస్తే ప్రభుత్వం  అనుమతినిచ్చే లాటరీ అని నిర్వచనం చెప్పాడో జోకిస్టు" అన్నాడు గిరి నవ్వుతూ.

    మరో పక్క __

    "మన పెళ్ళెప్పుడు?" అని అడుగుతున్నాడు సాగర్.

    "మనం తలుచుకున్నప్పుడు" సమాధానం చెప్పింది హిమజ.

    "మీ అక్కయ్యను అడగమంటావా?"

    "అంత తొందరెందుకు, కావాలంటే చెప్పండి. రేపే అరేంజి చేస్తాను" అంది పద్మజ పక్కగా వచ్చి,

    "పద్మజా, గిరి ఎక్కడ?"

    "ఇప్పటిదాకా ఇక్కడే వుండాలి. పిలుస్తానుండండి అంకుల్ !" అని వెళ్ళింది. గిరి ఎక్కడా కనిపించలేదు. తోటంతా తిరిగింది పద్మజ.

    "శివయ్యా, అయ్యగారు కనిపించారా?" అడిగింది.

    "ఇప్పుడే అటువైపు వెళ్ళడం చూశానమ్మా" తోట వెనుకభాగం వైపు చూపించాడు.

    "అటెందుకుకెళ్ళారు!"

    సోమశేఖరం హత్య జరిగిన ప్రదేశాన్ని గేటు పెట్టించి మూసేయించింది పద్మజ.

    సన్నజాజి పందిరి వెనగ్గా, సరిగ్గా శేఖరం చచ్చిపోయిన స్థలంలో  కూర్చున్నాడు గిరి.

    "గిరీ! ఏమిటి ఇక్కడ కూర్చున్నారు?" అడిగింది.

    అతను మాట్లాడలేదు.  చూపులు నిస్తేజంగా  ఎటో చూస్తున్నాయి. 
 

 Previous Page Next Page