"రాత్రికి రమ్మని కబురు చేసారు. ఆ కబురు ఆ పిల్లకు అందించిన పాపిని నేనే దొరసానీ. ఆపాపిని నేనే"
మరుక్షణం రాజ్యలక్ష్మి చేతిలో తుంగభద్ర చెంపలు ప్రేలిపోయాయి.
"ఎంత పని చేసావే దుర్మార్గురాలా! ఒక నిండుప్రాణం తీసావుకదే? ఆ కబురు మోయడానికి నీకు సిగ్గెలా లేకపోయిందే? ఆ మాట ఆ పిల్లతో చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? ఆ పిల్ల ముఖం చూస్తేనే పవిత్రమైన మంగళగౌరిలా కనిపిస్తుందే? ఆ పిల్లను దొరవారి పక్కలోకి రమ్మని ఎలా చెప్పగలిగావు? నీ నాలిక చీలికైపోను"
ఆమె చేతిలో దెబ్బలు తిన్నాక పాపభారం కొంత తగ్గినట్టుగా అయింది. తుంగభద్రకు. పరితాపం కొంత తగ్గింది. "దొరవారి మాటను కాదనేంత ధైర్యమా మాకు దొరసానీ! చెప్పింది చేసే సేవకులమేగానీ దొరవారికి నీతులు చెప్పేవాళ్లం కాదు కదా? ఇది మంచిదా చెడ్డదా అని విచక్షణ చేసే అధికారం మాకెక్కడిది? మేమెంత? మా బ్రతుకెంత?"
"ఎంత పనిచేసింది పరమేశ్వరి. ఒక్కమాట నా చెవిన వేస్తే ఎంత బాగుండేది?"
"మీరు మాత్రం ఏం చేయగలిగేవారమ్మా? దొర వారి బారినుండి ఆమెను ఎలా రక్షించేవారు?"
"ఎందుకు రక్షించలేక పోయేదాన్ని. అంత అవసరమైతే నా సౌభాగ్యాన్నే త్యాగం చేసేదాన్ని పరమేశ్వరికి."
"అమ్మగారూ"
"ఒక ఆడదాని శీలంకంటే సౌభాగ్యం ఎక్కువకాదు. అవసరమైతే ఆయన ప్రాణాన్ని తీసేదాన్ని .పరమేశ్వరిని రక్షించేదాన్ని"
"రాజాసాబ్ తనని కాంక్షించాడని ప్రపంచానికి తెలియడమే తనకు పరువు తక్కువగా భావించిందా పిల్ల. గంగ కౌగిలిలోకి సంతోషంగా వెళ్లిపోయింది."
పరమేశ్వరి కన్నవాళ్ల గుండెల్లో మండే అగ్నికీలలు ఇప్పుడు రాజ్యలక్ష్మి గుండెల్లోకి ప్రాకాయి.
ఇన్నేళ్లుగా ఒక కామాంధుడితో కాపురం చేసిందా? తనకంత కళ్లు మూసుకుపోయాయా?
గుర్రపు పందాలకు వెళ్లిన మోహనవంశీ వచ్చేవరకు ఆ మంటలు అలా మండుతూనే వున్నాయి.
గుర్రపు పందాలలో రెండు లక్షలవరకు పోగొటటుకుని రెండురోజుల తరువాత వచ్చాడాయన.
స్నానం చేసి మల్లెపువ్వుల్లాంటి దుస్తులు ధరించి కొడుకుతో ఆడుకొంటున్న సమయంలో రాజ్యలక్ష్మి ప్రవేశించింది.
"మిమ్మల్నో ప్రశ్న అడగాలని వుంది"
"ఇబ్బందిపెట్టే ప్రశ్న అయితే ఇప్పుడు వద్దు. ఎందుకంటే నా మనసు బాగుండలేదు. హార్స్ రేసెస్ లో రెండు లక్షలు పోయాయి."
"ఈ పందెమే ఆఖరు కాదుకదా. మళ్లీ ఆడతారు. మళ్లీ గెలిచేచోట దుఃఖం పనికిరాదు. కాని ఒక ఆడదానిమానం పోతే ఒక మనిషి ప్రాణంపోతే అది మళ్లీ వచ్చేదికాదు. అది పోగొట్టుకున్న వాళ్లకి ఎంత దుఃఖంగా వుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?" ఉద్విగ్నస్వరంతో అడిగింది రాజ్యలక్ష్మి.
ఎప్పుడూ తన మనసు తెలిసి నడుచుకునే అర్ధాంగి ఇప్పుడు తన మనసు బాగాలేదని చెప్పినా ఇటువంటి ప్రశ్న ఎందుకు అడిగినట్టు? కనుబొమలు ముడివేసి చిరాకుగా చూసాడు మోహనవంశీ.
"శయ్యలో మీకెప్పుడైనా నేను అసంతృప్తి మిగిల్చానా? ఎందుకు మీరిలా స్త్రీల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు?" వాడి బాణం వదిలాననుకుంది.
కానీ దాన్నొక గడ్డిపోచలా తీసేసి తేలిగ్గా నవ్వేసి, "దాన్ని అసంతృప్తి అనరు. రసికత. ఎక్కడ పువ్వుంటే అక్కడ భ్రమరం వాలుతుంది. ఎక్కడ అందముంటే అక్కడ రసికుడైన మగవాడి మనసు వాలుతుంది. అంతే"
"మన తొలి సంతానం కుముదిని బ్రతికేవుంటే ఇంచుమించు పరమేశ్వరి వయసులో వుండేది. పరమేశ్వరికంటే ఎన్నోరెట్లు అందంగా తయారయ్యేది. అందంగా వుంది కదాని మీ మనసు వాలేదన్నమాట."
"ఏమిటా మాటలు?" ఆయన ముఖంలో కళలు దిగిపోగా కంపరంగా అన్నాడు.
"పరమేశ్వరి మన ఆస్థాన పండితులవారి కూతురు. బ్రాహ్మణ వధువు. కూతురులాంటి పిల్లమీద మీకటువంటి భావం ఎలా కలిగింది? మీ పక్కలోకి రమ్మని ఎలా కబురు చేయగలిగారు?"
"ఎవరు నీకీ విషయాలన్నీ చెప్పింది?" భగ్గున మండిపడుతూ అడిగాడు.
చాటున వుండి వింటున్న తుంగభద్ర ఇక తనకు మూడిందని అనుకుంది.
"కన్నకూతురి మరణంతో కాలిన కడుపులు చెప్పాయండీ. ఏం? వెళ్లి వాళ్లను చంపేస్తారా? చంపేయండి. మీకు పుణ్యమే వస్తుంది. చావొక్కటే వాళ్లకు శాంతినిచ్చేది"
మోహనవంశీ విసురుగా లేచి వెళ్ళబోయాడు.
అడ్డుగా నిలబిడంది రాజ్యలక్ష్మి. గుండెలమధ్య ఒదిగివున్న మాంగల్యాలను పైకి ఎత్తి పట్టుకుని "ఇవి నా మెడలో పడ్డప్పటి నుండి ఎంత ప్రేమగా, గౌరవంగా చూసాను. ఎంతో ఇష్టంగా , పవిత్రంగా మోసాను. కానీ పరమేశ్వరి మరణం వెనుకవున్న మీ నీచ ప్రవర్తన తెలిసాక ఇవి నా గుండెలమీద మోయడం అంతులేని అవమానంగా, ఒక గుదిబండను మోసినట్లుగా భావిస్తున్నాను"
అంతకంటే అవమానం ఏం జరగాలి ఏ మగవాడికైనా? చాచి లెంపకాయ కొట్టినట్టుగా వుంది. జేవురించిపోయింది ఆయన ముఖం.
"అంత బరువెందుకు? తీసివెయ్యి"
"ఆ రోజు రానివ్వకపోవడం మీ చేతిలోనే వుంది"
"అంటే?"