Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 17


    వాళ్ళ పెళ్ళి శుభలేఖలు చూసేక తామింకా శుభలేఖలు వేయించాలని గుర్తుకు వచ్చింది రాజారావుకు. తండ్రి తో అంటే - "అదెంత, ఒక రోజు పని - " అనేశాడు. శుభలేఖలో చెల్లెలి పేరు చూసి అతను పరవశించాడు కాని అచ్చయిన ఆ పేరు వంక ఎంత ఖర్చు - ఎన్ని ప్రయత్నాలు ....
    మర్నాటికి కూడా బస్సు విషయం ఇంకా తేలలేదు. రానూ, పోనూ అంతదూరానికి చిన్న ఖర్చులేవీ దొరకడం లేదు. పెద్ద బస్సు లయితే చాలా అడుగుతున్నారు. బాబూరావు పెద్ద తమ్ముడు రాము ఈ సంగతులు చూస్తున్నాడు. అతను చిన్నవాడైనా చాలామంది పెద్దవాళ్ళతో పరిచయముందట. వాళ్ళింట్లో వ్యవహారజ్ఞుడిగా అతనికి పేరుంది. అందరూ అతన్ని రాము అనే అంటారు. బస్సు కుదరని పక్షంలో ట్రయిన్ లో బయల్దేరి వస్తామన్నాడు భీమరాజు. ఏ సంగతీ ఒకటీ రెండు రోజుల్లో ఉత్తరం రాస్తానన్నాడాయన.
    భీమరాజు కా ఊళ్ళో ఒక గురువుగారున్నాడు. అయన ఒక స్వామీజీ. యువకుడైనా చాలా గోప్పవాడనీ వెళ్ళే ముందాయన - దర్శనం చేసుకోవాలనీ అయన బలవంత పెడితే తప్పనిసరై రాజారావు వెంకట్రామయ్య అయన దర్శనానికి వెళ్ళారు. బాబురావు కూడా వాళ్ళతో వచ్చాడు.
    స్వామీజీ యువకుడు. సుమారు ముప్పై అయిదేళ్లుంటాయి. అయన ముఖంలో తేజస్సు చెప్పకనే తెలుస్తోంది. భక్తు లెందరో వచ్చి ఆయనకు సాష్టాంగపడి వెడుతున్నారు. భీమరాజు , బాబురావు వెంకట్రామయ్య కూడా సాష్టాంగ పడడంతో మొహమాటం కొద్దీ, రాజారావు కూడా అలా చేశాడు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా వుంది. భీమరాజు రాజారావునీ, వెంకట్రామయ్యనూ స్వామీజీ కి పరిచయం చేయగా ఇద్దరూ మరోసారి ఆయనకు నమస్కరించాడు. అక్కడ కాస్త కుంకం తీసుకుని బొట్టు పెట్టుకున్నారందరూ. పువ్వులు కొన్ని తీసి స్వామీజీ ప్రత్యేకంగా యిచ్చాడు భీమరాజుకి.
    "మా నాన్నగారికే కాదు నాకు కూడా ఈ స్వామీజీ అంటే గురి. అయన మాటలు మనసును చల్లబరిచేలా ఉంటాయి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వామీజీని సంప్రదించనిదే నాన్నగారు చేయరు. అయన మీ చెల్లాయి జాతకం చూసి చాలా మంచి జాతకం . మీ అమ్మాయి పెళ్ళి మీ కోడలు పాదం పెట్టిన అతి కొద్ది కాలంలో జరిగిపోతుంది ----అన్నాడు.....' అన్నాడు బాబురావు రాజారావుతో.
    రాజారావుకు తక్షణం స్వామీజీ మీద గౌరభిప్రాయం కలిగింది. తన చెల్లెలి కాయన మహోపకారం చేశాడు. ఆయనమీద నమ్మకమున్న భీమరాజుకు - తన ఇంటికి రాబోతున్న పెద్ద కోడలి మీద జీవితాంతం అభిమానమూ, గౌరవమూ ఉంటాయి.
    రాజారావు మాట్లాడకపోవడం చూసి ---"మీరు నాస్తికులని విన్నాను- మీ కిష్టం లేని చోటుకు బలవంతంగా తీసుకెళ్ళామనుకుంటే క్షమించండి...." అన్నాడు బాబురావు.
    రాజారావు వులిక్కిపడి --' నేను నాస్తికుణ్ణి ని ఎవరు చెప్పారు?" అన్నాడు.
    "ఏమో - విన్నాన్లెండి. దేవుడంటే మీకు నమ్మకం లేదని...."
    రాజారావు ఆశ్చర్యపడ్డాడు -- "నేను నాస్తికుణ్ణి ఏంటండి - ఎటొచ్చి దేవుడాలయాల్లో లేడు - ఎక్కడపడితే అక్కడే ఉన్నాడని నమ్ముతాన్నేను. చాలామంది దేవుడాలయాల్లో మాత్రమే ఉన్నాడని నమ్మేవాళ్ళకు నేను నాస్తికుణ్ణి---" అన్నాడు. ఆస్తికుడైన బాబురావు దృష్టిలో తను నాస్తికుడిగా ఉండడం రాజారావుకు కిష్టం లేదు.
    "దేవాలయాల్లో మాత్రమే లేకపోయినా - ఏకాగ్రత కోసం ఒక స్థలమంటూ ఉండాలి కదా ---- మన దేవాలయాలన్నీ అటువంటి ఉద్దేశంతో పవిత్రమైన స్థలాల్నేన్నుకుని నిర్మించబడ్డవే ----' అన్నాడు బాబురావు.
    "కాదనను. కానీ దైవభక్తి పాపభీతిని కలిగించాలి కానీ పాపాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు దేవాలయాల్లోకి వెళ్ళే వారిలో ఎంతమంది ఏకాగ్రత కోసం వెడుతున్నారు చెప్పండి. చేసిన పాపానికే కాక చేయబోయే పాపానికి కూడా పరిహారం చెల్లించుకునేందుకు అడ్వాన్సుగా లంచమిస్తున్నారు దేవుడికి -----అని చెప్పినవాళ్ళు నాస్తికులైతే నేనూ నాస్తికున్నే-----" అన్న రాజారావు తన గురించి నాస్తికుడని ఎవరు చెప్పి వుంటారా అని ఆలోచిస్తున్నాడు.
    బాబురావా విషయాన్నాట్టే పొడిగించలేదు.
    తను నాస్తికుడన్న అభిప్రాయం - రాజారావింట్లోని గృహసభ్యులందరికీ ఉంది. తను దేవుణ్ణి నమ్ముతానని అతను స్వయంగా చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటె చాలా దైవకార్యాలనతను పరిహసించడం జరిగింది. దానికీ దేవుడి మీద నమ్మకానికీ సంబంధం లేదని అతను చెప్పినా వాళ్ళ కర్ధం కాదు. వాళ్ళలోనే ఎవరో ఒకరు బాబురావుకీ సమాచారాన్నందించి ఉండాలి.
    ఆ రాత్రే మళ్ళీ ఆర్టీసీ బస్సులో బయల్దేరారు తండ్రీ కొడుకు లిద్దరూ స్వగ్రామానికి.
    

                                                11
    మోహనరావుని రిసీవ్ చేసుకునేందుకు శ్రీకాంత్ స్టేషనుకు వెళ్ళాడు. మెయిల్ టైము కే వచ్చింది. కానీ అప్పటికి ఆఖరు లాంచీ వెళ్ళిపోయి అరగంట దాటిపోయింది.
    'సుమారు చేరడానికి రెండే రెండు మార్గాలున్నాయి. ధవళేశ్వరం వెళ్ళి బొబ్బర్లంక దాకా ఆనకట్ట మీద నడవడం. బొబ్బర్లంక నుంచి మనూరికి రిక్షాలు దొరుకుతాయి. లేదా - ఇక్కడే రావులపాలెం బస్సు ఎక్కితే --రావుపాలెం లో దిగి మనూరెళ్ళే బస్సెక్కాలి. ఎటొచ్చి రెండోది చుట్టూ దారి -----' అన్నాడు శ్రీకాంత్.
    "వచ్చేక తప్పుతుందా, మళ్ళీ చుట్టూ దారెందుకు- ధవళేశ్వరం పోదాం ----" అన్నాడు మోహనరావు.
    శ్రీకాంత్ సైకిలు మీద వచ్చాడు. మోహనరావు రాజమండ్రి రైల్వే స్టేషన్నించి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ రిక్షా కట్టించుకున్నాడు. అక్కడ కూలీలు దొరుకుతారేమోనని ప్రయత్నించారు. దొరకలేదు. చివరకు శ్రీకాంత్ సైకిలు మీద మోహనరావు సూట్ కేస్ పెట్టుకున్నాడు. సైకిలు ను  నడిపించుకుంటూ శ్రీకాంత్ - అతనితో పాటు మోహనరావు - ఆనకట్టల మీద నడక ప్రారంభించారు.
    "మెయిల్లో కలకత్తా నించి ఇరవై నాలుగ్గంటల ప్రయాణం తర్వాత ఈ నడకంటే కష్టంగానే వుంది. లేకపోతె చిన్నప్పుడు అప్త్రరాల్ కింద నడిచేవాణ్ణి ----" అన్నాడు మోహనరావు ఆయాసపడుతూ.
    బొబ్బర్లంక వెళ్ళేసరికి అదృష్టవశాత్తు ఒక రిక్షా దొరికింది. మోహనరావుకు రిక్షాను చూడగానే లాటరీలో ప్రైజొచ్చినంత సంతోషం కలిగింది. అతనిప్పుడు బాగా అలసిపోయిన్నాడు. రిక్షా ఎక్కగానే అందులో సోలిపోయాడు.
    ఇంటికి వెళ్ళగానే అతని కళ్ళు కూతురు మోహిని గురించి వెదికాయి. మోహిని కూడా తండ్రిని చూడగానే పరుగెత్తు కుంటూ వచ్చి కాళ్ళు చుట్టేసింది. మోహనరావుకు కూతురంటే వెర్రి ప్రేమ. అతను దాని మీద ముద్దుల వర్షం కురిపించాడు.
    "ప్రయాణం బాగా జరిగిందా?" పలకరించాడు రాజారావు. వెంకట్రామయ్య పెద్ద కొడుకు వైపు ఆప్యాయత నిండిన చూపులు చూశాడు.
    మోహనరావు ----"కలకత్తా నించి రాజమండ్రీ రావడ మొక ఎత్తూ - అక్కణ్ణించీ ఊరు రావదమింకో ఎత్తూ ----' అన్నాడు. అని విరజ వంక చూశాడు. ఎన్నో అర్ధాలు నిండిన కళ్ళతో ఆమె అతని వంక చూస్తోంది.
    "ఎలాగున్నాయ్ - పెళ్ళి పనులు .....' అన్నాడు మోహనరావు భార్య వంక చూసి. జావాబు పార్వతమ్మ నుంచి వచ్చింది.
    'వడియాలు పెట్టేశాను. అప్పడాలు కూడా అయిపోవలసిందే కానీ - బాబి వద్దన్నాడురా -----' అందావిడ.
    "ఒంట్లో కులాసాగా ఉంటోందా అమ్మా....' పలకరించాడు మోహనరావు.
    "ఏం కులాసారా --' అంది పార్వతమ్మ నీరసంగా ముఖం పెట్టి......' గుండె నీరసం..."
    మోహనరావు అవులించాడు ----" ట్రయిన్ ప్రయాణం చేసి చేసి నాకూ గుండె నీరసం వచ్చింది కాసేపు అన్ని కబుర్లు బంద్- నాకు విశ్రాంతి కావాలి " అన్నాడు.
    
                                   *    *    *    *

 Previous Page Next Page