"కాదు, నాది"
అతని మీద అభిమానం పెరిగిపోయింది జయసుధకి.
"ఇప్పుడు మీరేం చేస్తున్నారు?" అడిగిందామె.
"మీతో మాట్లాడుతున్నాను-"
"ఇది ఆరో క్లాసులో ఉపయోగించిన టెక్నిక్" నవ్వుతూ అంది.
"మీరు ఇంక ఆనాటి జయసుధే అనుకున్నాను - కాదా?"
"చెప్పండి! ఏం చేస్తున్నారు?"
"మన ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం చేస్తున్నాను"
"అంటే?"
"అంటే అదే! ప్రభుత్వాలదగ్గర బాంకుల దగ్గరాడబ్బుల్లేనప్పుడల్లా పేపర్లో పాతిక వేకెన్సీలకు అభ్యర్ధులను అప్లయ్ చేయమనిప్రకటనలు చేసి ఎగ్జామినేషన్ ఫీజు రూపంలో కొన్ని కోట్ల రూపాయలు నిరుద్యోగుల దగ్గరకాజేస్తూంటారు కదా! అలాంటి సమయాల్లో మిగతా నిరుద్యోగి సమూహాలతోపాటు నా వంతు ఆర్ధికసహాయం నేనూ అందజేస్తూంటాను."
"ఓ! ఇంకా ఉద్యోగం దొరకలేదన్నమాట"
"ఎవరూ దొరకనీయటంలేదు"
"పోనీ బాంక్ లోన్ తీసుకుని ఏదయినా బిజినెస్ పెట్టకపోయారా?"
"అదీ ట్రై చేశాను. బాంక్ లోన్స్ మనకురావాలంటే అందులోసగం అది ఇప్పించే మధ్యవర్తికీ, బాంక్ ఆఫీసర్లకూ ఖర్చు చేయాలి. ఇంకెందుకుపని కొస్తుందది? బాంక్ లోన్స్ కేవలం ఎగ్గొట్టేవారికే ఉపయోగపడతాయ్ గానీ నిజంగా దానితో ఇండస్ట్రీగానీ వ్యాపారంగానీ పెట్టాలనుకునేవాళ్ళక్కాదు".
జయసుధకి అతనిని చూస్తే జాలి వేస్తోంది-తన చిన్ననాటి ఫ్రెండ్ అలాంటి నిస్సహాయస్థితిలో వుండటం!
"జయసుధా" పిలిచాడు భవానీశంకర్.
"ఊ!"
"మీరు ఇంత అందంగా వుండడం ఎలా మానేజ్ చేశారు. అయ్ మీన్ ఏ సబ్బువాడడం వల్లమీకింత అందం వచ్చింది?"
ఆమె నవ్వేసింది. "నేను సబ్బు వాడను. కుంకుడుకాయవాడతాను-"
"బై ది బై మీకుపెళ్ళి అయిపోవటంగానీ, సెటిలవటంలాంటి కార్యక్రమం గానీ ఏదయినాజరిగిందా?"
"చాలా సంబంధాలు సెటిలయినంతపనయి కొంచెంలో వెనక్కుతిరిగాయ్"
"కారణం ఏమిటో?"
"తెలీదు! కట్నంవద్దంటారు - నేనునచ్చానంటారు - తర్వాత అంతు వుండరు."
"అయితే ఆ వేకెన్సీకి నేను అప్లయ్ చేసుకోవచ్చా?"
ఆమె సిగ్గుపడింది.
"ప్రస్తుతం ఆ వేకెన్సీలేదు" అంది టీజింగ్ గా.
"అరే! ఏమయింది?" ఆతృతగా అడిగాడు.
"ఇంతకుముందే ఫిలప్ అయిపోయింది."
"ఎవరది?"
"బెర్తు నెంబర్ ట్వల్వ్!"
"భవానీశంకర్ అమాంతంఆమె బెర్తు మీదకు ఒరిగి ఆమె మెడ మీద ముద్దుపెట్టుకున్నాడు.
"థాంక్యూ వెరీమచ్- మీ బాడీ గార్డు ఉద్యోగం నాకిచ్చినందుకు -కానీ నాలాంటి ఉద్యోగంసద్యోగంలేని నిరుద్యోగి, మిడిల్ క్లాస్ పక్షి మీ బాడీగార్డవడానికి మీ వాళ్ళు వప్పుకుంటారా?"
"బహుశా వప్పుకుంటారు"
"ఎందుకని?"
"ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మా నాన్నగారికి తెలుసు."
"ఎలా తెలుసు?"
"ఆయనకూ ఇంతవరకూ ఉద్యోగం దొరకలేదు కనుక!"
భవానీశంకర్ అదిరిపడ్డాడు.
"మైగాడ్! మీ నాన్నగారికి ఇంత వరకూ ఉద్యోగం దొరకలేదా?"
"లేదు! బహుశాత్వరలో దొరకవచ్చు. ఈ మధ్య ఎటెండ్ అయిన ఇంటర్ వ్యూలో ఆఫీసరొకాయన మా నాన్నగారితో పాటు కాలేజీలో చదివాడట. తను త్వరలో రిటైరవుతున్నాడనీ, ఆ వేకెన్సీలో నాన్నగారిని అపాయింట్ చేసేట్లు చూస్తాననీ మాటఇచ్చాడట".
"మరి ఉద్యోగం లేకుండా మిమ్మల్నందరినీ ఎలా పోషిస్తున్నారింతకాలం?"
"ఏవో ఆస్థిపాస్తులున్నాయి. అవన్నీ కొంచెం కొంచెంగా అమ్ముతూ గడుపుతున్నారు."
"వెరీగుడ్! అయితే ప్రాబ్లెమ్ లేదు. నాకూ ఉద్యోగం దొరక్కపోయినా మానేజ్ చేసుకోవచ్చు. నేనూ కొన్ని అమ్మటంద్వారా, అవునా?" ఆమె నవ్వేసింది.
"నన్ను ఆయనతోమాట్లాడవద్దని నువ్వెందుకు మాట్లాడుతున్నావక్కా?" మిడిల్ బెర్తుమీదనుంచి అడిగాడు బాలక్. ఇద్దరూ ఉలికిపడి బాలక్ వేపు చూశారు.
భవానీశంకర్ బాలక్ భుజం తట్టాడు ఆప్యాయంగా.
"అద్భుతమయిన ప్రశ్న వేశావ్ బాలక్! మీది సినీవంశం అని నువ్వేచెప్పావ్ కదా! కనుక మీ గోల్డెన్ సిస్టర్ కూడా అదే ఫక్కీలో 'బాత్ ఏక్ బెర్త్ కీ' అనే సినిమా కధ రచించింది. ఆ కథ ప్రకారం నేనూ ఈ రైలుదిగగానే తిన్నగామీతో పాటు మీ ఇంటికొచ్చేస్తున్నాను."
"ఎందుకూ?"
"మీ జయసుధ సిస్టర్ దగ్గర పి.ఏ.గా వుద్యోగం చేయడానికి"
"అంటే మేము తీయబోయేసినిమా తాలూకు ప్రొడక్షన్ వర్క్ చూడటానికా అంకుల్?"
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు. "మీరు సినిమా తీస్తున్నారా?"
"మా అమ్మ సినిమా తియ్యాలని ప్లాన్ లో వుందంకుల్! టైటిల్ కూడా రిజిష్టర్ చేయించింది"
"అలాగా ఏమిటది?"
"చారెడు రక్తం, పిడికెడుమట్టి, గుక్కెడు గంగ"
"అద్భుతం మైడియర్ బాలక్! ఆ సినిమా అయిదారువందల రోజులు ఆడేస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు."
"ఇంక లేచి కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంకుల్! ఈ బెర్తు డౌన్ చేసేయనా?"
"ఒండర్ ఫుల్ సజెషన్ మైడియర్ బాలక్" అంటూ ఉత్సాహంగా లేచినిలబడ్డాడు భవానీశంకర్. ఆ స్టేషన్ లో నుంచి రైలు వెళుతున్నవేగం చూస్తే అతన్నెందుకో ఒక్కక్షణం అనుమానం ఊగించి వేసింది.
* * *
చెరువు మాధవరం ఏ.ఎస్.ఎమ్ ప్రభాకర్ బయటికొచ్చాడు పరుగుతో. దూరంగా కొండపల్లివేపు గూడ్స్ ట్రెయిన్ వేగంగా పోతోంది. టైమ్ చూసుకున్నాడతను. ఇంకో అయిదు నిముషాల్లో 8 డౌన్ స్టేషన్ కొచ్చేస్తుంది. అప్పటికి గూడ్స్ ట్రెయిన్ కొండపల్లి సగం దూరం వెళ్ళి వుంటుంది. అది కొండపల్లి వెళ్ళాలంటే పదిహేడు నిమిషాలుకావాలి.
కానీ అదే 8 డౌన్ కొండపల్లిచేరుకోవడానికి ఆరు నిమిషాలు చాలు.
అంటే గూడ్స్ ట్రెయిన్ కొండపల్లి చేరుకునేలోపలే 8 డౌన్ వెనుకనుంచివెళ్ళి దానిని ఢీకొంటుంది. ఎలాగోలా తను 8 డౌన్ ఆపగలిగితే యాక్సిడెంట్ అవకుండా కాపాడవచ్చు. కానీ ఎలా ఆపటం-
ఆగకుండా పెద్దగా మోగుతోంది కంట్రోల్ బెల్. పరుగుతో వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.
"చెరువు-"
"ప్రభాకర్! 8 డౌన్ గంగినేని నుంచి లైన్ క్లియర్ లేకుండా వచ్చేస్తోందట! దానికి సిగ్నల్స్ ఇవ్వకు. డ్రైవర్ నిద్రపోయాడేమోతెలీదు. వెంటనే ట్రాక్ మీద డెటో నెటర్స్ పెట్టు-"
ప్రభాకర్ హడావుడిగా అల్మారా నుంచి డెటనేటర్స్ వున్న బాక్స్ తీశాడు. అందులోనుంచి మూడుడెటో నేటర్స్ తీసుకుని బయటకు పరుగెత్తాడు. "ఏయ్ బలరాం! త్వరగారా" బయటే కూర్చున్న పోర్టర్ వేపు చూసి అరిచాడతను. బలరామ్ హాండ్ సిగ్నల్ లాంప్ తీసుకుని ఏం జరిగిందో అర్ధం కాక అయోమయంగా అతని వెంబడి పరుగెత్తాడు. ఇద్దరూ స్టేషన్ కి కొద్దిదూరం పరిగెత్తాక మెయిన్ లైన్ మీద డెటోనేటర్ పెట్టి పిన్ చేసేశాడు ప్రభాకర్.
"ఇదిగో ఈ రెండోది కొంచెందూరంలో పెట్టు-" అంటూ డెటోనేటర్ అతనికిచ్చాడు. మూడూ ఫిక్స్ చేశాక లేచి వెనక్కు తిరిగి చూశాడు. దూరంగా 8 డౌన్ హెడ్ లైట్ కనబడుతోంది.
స్టేషన్ కి తిరిగి వచ్చేశాడతను.
డ్రైవర్ నిద్రపోయివుంటే డెటోనేటర్ ప్రేలిన పెద్ద శబ్దానికి ఠకీమని మెలకువవచ్చేస్తుంది. కంట్రోల్ రింగ్ మళ్ళీ మోతెక్కిపోసాగింది. దానికి తోడు కొండపల్లి స్టేషన్ బ్లాక్ బెల్ కూడా మోగుతోంది. బ్లాక్ ఫోన్ అందుకున్నాడతను.
"హలో ప్రభాకర్! ఏమయింది? 8 డౌన్ ఆపుతున్నావా?"
"డెటోనేటర్స్ పెట్టాను. సిగ్నల్స్ అన్నీ 'ఆన్'లో వుంచాను. అంతకంటే ఇంకేం చేయను?"
"సరే! చూద్దాం! ఒకవేళ 8 డౌన్ ఆగకపోతే నాతో చెప్పు మళ్ళీ-"
"ఇంతకూ గూడ్స్ ట్రెయిన్ సంగతేమిటి?"
"లూప్ కి సిగ్నల్స్ యిచ్చివుంచాను - లోడ్ తక్కువ వుందటకదా! కనుక పదినిమిషాల్లో క్లియర్ చేయవచ్చనుకుంటున్నాను. అలా చేయగలిగితే యాక్సిడెంట్ ఎవర్ట్ అవడానికి అవకాశం వుంది".
ఆ ఫోన్ వదలి కంట్రోల్ ఫోన్ అందుకున్నాడతను.
"యస్! చెరువు"
"ప్రభాకర్! ఏం చేశావ్?"
"డెటోనేటర్స్ పెట్టాను"
"వెరీ గుడ్! బండి ఆగగానేమాతో చెప్పు"
"ఓ.కె-"