Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 17


    "మౌలానీ దగ్గర ఉందా? ఎక్కడ?" అతను పక్కవాళ్లను కన్సల్ట్ చేశాడు.
    "సారీ జెంటిల్మెన్! న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ మౌలాలీ నాచారం మధ్య వున్నట్లు నాకిప్పుడే వర్తమానం అందింది. అంచేత ఈస్ట్ సైడ్ కర్షక పరిషత్ ఆఫీస్ వందకోట్ల కాపిటల్ తో పెడుతున్నట్లు తెలిసింది."
    ఈసారి ఎవరూ ఆశ్చర్యపోలేదు. అందరూ ఘోల్లున నవ్వారు.
    దాంతో అతను ఉపన్యాసం మానేసి బిజినెస్ లోకి దిగిపోయాడు.
    కొంతమందిని వెంబడి తిప్పుతూ మధ్యమధ్యలో మావేపు చూపిస్తూ ప్లాటు నెంబర్లున్న సర్వ్రాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. మేమందరం గుమిగూడి మాలో మేము డిస్కస్ చేసుకో సాగాము.
    "అంతా బోగస్! ఎయిర్ పోర్టూ లేదు. పార్లమెంటు భవనాలూ లేవు మనల్నందర్నీ టెంప్ట్ చేసి కొనిపించటానికి ప్రయత్నిస్తున్నాడు వాడు" అన్నాడు రంగారెడ్డి.
    "అదీగాక మనం ఈ ఏరియాలో ప్లాట్లు కొన్నామంటే ఈ ఏరియాకు చెందిన డెకాయిట్స్ దయమీద ఆధారపడి బ్రతకాల్సిందే" అన్నాడు శాయిరామ్.
    ఆ మాట వినడంతోనే అందరి గుండెలూ ఝల్లుమన్నాయ్.
    "అవును! ఇక్కడ స్థలాలు కొనటం చాలా రిస్క్! ఖర్మ కాలి ఎవడయినా నా కథలూ, కవితలున్న ఫైల్స్ ఎత్తుకుపోయాడంటే నేను ఘోరమయిన దెబ్బతింటాను. వాడు ఓ రచయితగా వెలిగిపోతాడు" అంది రాజేశ్వరి.
    అసలీ ఏరియా ఇంకో పాతికేళ్ళ వరకూ డెవలప్ కావటం అసంభవం" అన్నాడు గోపాల్రావ్. హఠాత్తుగా ఆ ప్లాట్స్ ఏజెంట్ మా దగ్గర కొచ్చాడు.
    "మీరే ప్లాట్స్ బుక్ చేసుకుంటున్నారా?" అడిగాడతను పెన్సిల్ పుస్తకం తీసుకుని. మేమెవ్వరం మాట్లాడ లేదు.
    "చెప్పండి! మీ కాలనీవాళ్ళకు గజానికి రెండ్రూపాయలు కన్సెషన్ కూడా ఇస్తున్నాను."
    "మా కొద్దు" అన్నాడు గోపాల్రావ్.    
    "వద్దా? ఎందుకని?"
    "ఈ ఏరియా ఇప్పట్లో ఛస్తే డెవలప్ కాదు"
    "ఎందుకని?"
    "మాకు కొంచెం కామన్ సెన్స్ ఉంది గనుక" అతనికి కోపంవచ్చింది.
    "సరే! కొంటే కొనండి లేకపోతే లేదు. కానీ తరువాత కే.వీ. భాస్కర్ లాగా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది మీరు"
    "కే.వీ. భాస్కర్ ఎవరు?" ఆత్రుతగా అడిగాం అందరం.
    "అతను కూడా పదేళ్ళ క్రితం అచ్చం మీలాగానే చౌకగా వచ్చిన స్థలం కొనను పొమ్మన్నాడు. ఇప్పుడు రోజూ ఆ స్థలం చుట్టూ తిరిగి భోరున ఏడుస్తూంటాడు."
    "ఎక్కడుందా స్థలం?"
    "అబిడ్స్ లో"
    అందరం కొద్దిక్షణాలపాటు నోరు తెరిచేశాం.
    "కమాన్! ఆలోచించండి! తలో అయిదువేలూ అడ్వాన్స్ కట్టండి! అంతే! ఇగాతా మొత్తం ఇన్ స్టాల్ మెంట్స్ లో ఇవ్వవచ్చు."
    మేము వప్పుకోలేదు.
    "మాకవసరం లేదు. నాగార్జునసాగర్ రోడ్ మీద ఇంతకంటే మంచి ప్లాట్లు వున్నాయని తెలిసింది. అక్కడికెళ్తాం" అన్నాడు గోపాల్రావ్.
    "వెళ్ళండి! అవి కొంటేగాని మీకు తగిన శాస్తి జరగదు" అన్నాడతను కసిగా.
    మేము అతని మాటలు వినిపించుకోకుండా నాగార్జునసాగర్ రోడ్ లో పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాము. ఆ ప్లాట్లు ఒక్కసారి చూడటంతోనే అందరికీ ఎంతో నచ్చాయి. పైగా ఆ ప్లాట్లలో నాలుగిళ్ళు కూడా కట్టించి వున్నాయ్ అందరం ప్లాట్లు చూసి ఎవరేది కావాల్సిందీ సెలక్టు చేసుకున్నాం.
    "ఈ ప్లాట్ల వెనుక వేపు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటి వెయ్యి ఎకరాల స్థలంలో కడుతున్నారు" చెప్పాడు బ్రోకర్.
    అందరం అప్పటికి తెలివి మీరిపోవటం వల్ల ఘోల్లున నవ్వాం.
    "ఏమిటి నవ్వుతున్నారు?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "అదే మీరు చెప్పిన పిల్లల కథ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్."
    "అంటే నా మాట అబద్దమంటారా?"    
    "అహ్హహ్హహ్హ" అంటూ నవ్వాం మళ్ళీ.
    అతనిమొఖం కందిపోయింది.
    "గజం ఎంత?" అడిగాడు జనార్ధన్.
    "పాతిక రూపాయలు."
    అందరం ఆశ్చర్యంగా మొఖాలు చూసుకున్నాం."
    ఎందుకంటే పాతికరూపాయల్లో ఇంటి స్థలాలు దొరుకుతాయన్న విషయం మాకంతవరకూ తెలీదు. కనీసం యాభయ్ రూపాయలు ధరలేందే స్థలం అనేది హైద్రాబాద్ చుట్టుపక్కల అడవిలోనయినా దొరకదు.
    "పాతిక రూపాయలా?" అనుమానంగా అడిగాం.
    అతను మమ్మల్ని అపార్ధం చేసుకున్నాడు.
    "సరే మీరంతగా అడుగుతున్నారు కాబట్టి ఇరవై చేసుకోండి." మాకు స్పృహ తప్పినంత పనయింది. నోట మాట పెగలటం లేదు.
    వెంటనే తలో అయిదువేలూ అడ్వాన్స్ కట్టాలని నిర్ణయించుకున్నాం.
    "ఎందుకయినా మంచిది డబ్బిచ్చే ముందు ఓసారి ఆ నాలుగిళ్ళ వాళ్ళనూ కలుసుకుని వద్దాం పదండి" అన్నాడు రంగారెడ్డి.
    అందరం రంగారెడ్డి వెంట ఆ ఇళ్ళ దగ్గరకు నడిచాం.
    ఆ ఇళ్ళుముందే కూర్చుని కనిపించారా ఇళ్ళ వాళ్ళు. మమ్మల్ని చూడగానే పరుగుతో వచ్చి చుట్టూ మూగిపోయారు వాళ్ళ పిల్లలు.
    వాళ్ళ చిరిగిపోయిన బట్టలూ, చింపిరి తలలూ చూసేసరికి మాకు భయం వేసింది.
    "సార్! ఆ వాటర్ బాటిల్లో నీళ్ళివ్వరా? సార్! గుక్కెడు నీళ్ళు కావాల్సార్! 24 గంటలయి పోయింది సార్ నీళ్ళు తాగి" అంటూ బ్రతిమాల సాగాడో కుర్రాడు.
    అందరి బాటిల్స్ లో నీళ్ళూ అందరికీ తాగిస్తూంటే పెద్దాళ్ళు కూడా పరుగుతో వచ్చి ఆ నీళ్ళు అందుకుని ఆశగా తాగసాగారు.
    "ఏమిటి ఈ ఇళ్ళు మీవేనా?" అడిగాడు రంగారెడ్డి వాళ్ళల్లో ఒకతనిని.
    "అవున్సార్" దీనంగా అన్నాడతను.
    "మరి నీళ్ళ కోసం ఇలా మొఖం వాచినట్లు గుమికూడుతున్నారేమిటి?"
    అతను ఇంక దుఃఖం పట్టలేకపోయాడు. ఛటుక్కున కూలబడి బావురుమని ఏడ్చేయ సాగాడు మాకు భయం పట్టుకుంది ఇదెక్కడి గొడవరా నాయనా అని.
    "అరె! అలా ఏడుస్తావేమిటయ్యా! ఏం జరిగింది?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.
    "అది 1988వ సంవత్సరం బాబూ" అన్నాడతను.
    మాకు గుండెలవిశిపోయినయ్- ఫ్లాష్ బాక్ మొదలెడుతున్నాడేమోనని. ఎందుకయినా మంచిదని రెండడుగులు వాన్ వేపు వేశాం. కానీ అతనా విషయం గ్రహించేశాడు.
    "ఫ్లాష్ బాక్ చాలా చిన్నది సార్! అది 1988వ సం|| సెప్టెంబరు నెల. మేమప్పుడు మీలాగానే ఇస్త్రీ బట్టలతోనూ జేబులో అయిదారు పదిరూపాయల నోట్లతోనూ, పిల్లాపాపలతోనూ సుఖంగా వుండే వాళ్ళం. కానీ మా సుఖం చూసి ఓర్వలేని ఓ ఇంటి స్థలాల బ్రోకరు మాదగ్గర కొచ్చాడు. అంతే! వాడి మాయలో పడిపోయాం. నగలు తాకట్టుపెట్టి స్థలం కొన్నాం. ప్రావిడెంట్ ఫండ్ లూ ఇతర హౌసింగ్ ల్లోనూ తీసుకుని ఇళ్ళు కట్టాం. అప్పుడు బోర్ వెల్ కథ ప్రారంభమయింది సార్" మళ్ళీ భోరున ఏడ్వ సాగాడతను. కథ సగంలో ఆపటం ఇష్టం లేక అతనిని ఓదార్చాం అందరం.
    "మొదటి బోర్ వెల్ ఫెయిలయింది సార్! వాటర్ డివైనర్ తో ఇంకోచోట బోర్ వేయించాం! అది నూటడెబ్భై అడుగులలోతు కెళ్ళి రాతిని కొట్టుకుంది. అప్పటికే మేము అడుక్కుతినే స్థితికొచ్చాం. ఆ తరువాత మూడో బోర్ వెల్ మూడొందల యాభై అడుగులు లోతు కెళ్ళింది. కాని ఒక్కచిక్క నీరు కూడా దొరకలేదు. అప్పుడు తెలిసింది సార్! ఈ ఏరియాలో ఎక్కడా ఒక్కచుక్క నీళ్ళు రాదని! కానీ ఏం చేస్తాం? తెగ నీరుందని మమ్మల్ని నమ్మించి ఈ గుంటలో పడిన వర్షపు నీరు చూపించి మమ్మల్ని మోసం చేసేశాడు వాటి ఓనర్. అప్పటి నుంచీ ఈ ఇళ్ళను వదులుకోలేక ఆరు కిలో మీటర్ల దూరం నీళ్ళు తెచ్చుకు తాగలేక జీవచ్చవాల్లా బ్రతుకుతున్నాం సార్."

 Previous Page Next Page