Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 17


    "ఓహో ! భార్య దగ్గర భర్త అప్పు తీసుకొంటున్నాడన్న మాట! అంతేగా మీరనేది? మరి నోటు కూడా రాసిస్తారా నాకు?" చురచుర చూస్తూ అందామె.
    ఆమె దగ్గరకు నడిచి, అతి సమీపంగా నిలబడి ఆమె కళ్ళల్లోకి చూశాడతను.
    "నేనేం వేరే ఉద్దేశంతో మాట్లాడటం లేదు సీతా! నీ డబ్బు నేనే నాకోసం ఉపయోగించుకొన్నట్లయితే అలా మాట్లాడేవాడిని కాదు. మరెవరి కోసమో ఖర్చు చేయబోతున్నాను కాబట్టి తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాను.......అంతే! ఇందులో నీ మనసు కష్ట పెట్టుకోవాల్సిన అవసరం లేదు" ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడతను. సీత అతన్ని గుండెల మీదకు వాలిపోయింది భారంగా.
    సీత సంతకం చేసిన చెక్కుని మార్చుకుని డబ్బు తీసుకొని గుంటూరు చేరుకున్నాడు ,మాధవరావు.

                                7

    రెండు రోజుల తర్వాత సంజీవయ్య ఆపరేషన్ జయప్రదంగా జరిగింది. వెంటనే సీతతో సహా తిరిగి హైదరాబాద్ చేరుకొన్నాడు మాధవరావు. అక్కడి పరిస్థితులు అతనికి మరింత చికాకు కలిగించాయి. అతను పనిచేస్తున్న కంపెనీలో సమ్మె జరుగుతోంది. కొందరు కార్మికులు ఉద్యోగం నుంచి తొలగించిన కారణంగా వివాదం ఏర్పడి అది సమ్మేలోకి దిగింది. ఫ్యాక్టరీ కాక కంపెనీకి ఆఫీసుకి సంబంధించిన వాడవటం చేత తాము సమ్మెలో పాల్గొనవసరం లేదని అనుకొన్నాడు మాధవరావు. కానీ కంపెనీ దగ్గరకు చేరుకోకుండానే అతనిని అడ్డగించారు కార్మికులు. గత్యంతరం లేక వెనక్కు తిరిగి వచ్చాడతను. సమ్మె మూలంగా ఆ నెల జీతం అందనే లేదు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. చేసేది లేక రెడ్డి దగ్గర కెళ్ళాడతను.
    "మీ కంపెనీ సమ్మె జరుగుతోంది కదా మరి ,మీకు జీతాలు ఇవ్వరా ఈ నెల?" ముందు రెడ్డే అడిగాడు.
    "ఎలా ఇస్తారు? పనిలోకి వెళ్ళితేనేకదా ఇచ్చేది?"
    మరి నీకు ఇంట్లో ఇబ్బందిగా లేదూ? ఒకవేళ డబ్బు అవసరమేమైనా వుంటే నన్నడుగు! అంతేగాని ఇంట్లో అమ్మాయిని కష్టపెట్టకు. నువ్వసలే మొహమాటపు పక్షివి. నాకు తెలుసుగా!" నవ్వుతూ అన్నాడతను.
    మాధవరావు నవ్వేశాడు.
    "ఇప్పుడు అందుకే వచ్చానిక్కడికి. ఐదు వందలుంటే సర్దు ప్రస్తుతానికి" అడిగాడతను. రెడ్డి వెంటనే లోపలి కెళ్ళి ఐదు వందల నోట్లతో తిరిగి వచ్చాడు.
    "ఐదు వందలు తీసుకొంటున్నాడు కదా, మళ్ళీ రెడ్డికి ముఖం ఎలా చూపించను అనుకొంటూ కనిపించకుండా పారిపోకు! డబ్బు అవసరమైతే మళ్ళీ రా! అతని కందిస్తూ అన్నాడు రెడ్డి.
    "సరే లేరా! నువ్వంతగా చెప్పాలేమిటి?' సిగ్గుతో అన్నాడు మాధవరావు, అదే మొదటిసారి అతను ఎవరినయినా  అప్పు అడగడం. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం తిరుగుతున్న రోజుల్లో డబ్బు లేక వరుసగా మూడు రోజులు పస్తులున్నాడు. సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్ కి రోజుకి రెండు సార్లు నడిచాడు. ఉద్యోగం దొరికిన కొత్తలో ఒక నెలంతా ఒంటిపూట భోజనంతో గడిపాడు. ఇంకా ఇలాంటి వెన్నెన్నో చేశాడు. కానీ ఎవ్వరినీ ఒక్క పైసా అప్పు అంటూ అడగలేదు. అడిగితె ఇచ్చే స్నేహితులు ఇద్దరు ముగ్గురున్నారు. అయినా అది ప్రిన్సిపుల్ ! అంతే! అప్పు అడగడం కంటే ఆకలితో మాడడం తన కిష్టం! కానీ తననే సర్వస్వంగా భావించి తనతో సంసారం చేస్తున్న సీతని మాత్రం తన ప్రిన్సిపుల్స్ తో భాదించి హింసించకూడదు. అందుకే నిరాడంబరంగా జీవితం గడపాలనుకొన్న తన ఆశయానికి సీత కోరికలు విరుద్దమయినా రాజీపడి సహిస్తూ వస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఆమె ఇష్టా ఇష్టాల్ని ఎందుకు చంపుకోవాలి? తన ఇష్టాల్ని ఆమె మీద బలవంతంగా ఎందుకు రుద్దాలి? దాని మూలాన సాఫీగా గడిచే సంసారంలో కలతలు రావూ? కలతలతో నిండిన సంసారాన్నీదడం కంటే ముందే రాజీపడటం వివేకమనిపించుకొంటుంది. డబ్బు తీసుకొని ఇల్లు చేరుకొన్నాడతను.
    గుంటూరు నుండి సంజీవయ్య రాసిన ఉత్తరం చూపించింది సీత. తనను మరో వారంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తున్నారనీ, ప్రస్తుతం తమ దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, ఎంతో కొంత పంపితే తను ఊరికి చేరుకోగానే ఎలాగోలా తిరిగి సర్దుబాటు చేస్తాననీ రాశాడు.
    వెంటనే రెండు వందలు మనియార్డర్ చేసేశాడు మాధవరావు. మిగతా డబ్బుతో ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చి ఇంటి అద్దె కట్టాడు. ఇదంతా మౌనంగా గమనిస్తూనే వుంది సీత. నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
    పది రోజులు గడిచినా సమ్మె జరుగుతూనే వుంది. మరోసారి కార్మికవర్గం నాయకులతో చర్చలు జరిపింది యాజమాన్యం. ఎటువంటి ఒప్పందమూ కుదరకపోయేసరికి కంపెనీ "లాకౌట్" ప్రకటించింది. దానితో కనీసం కొన్ని నెలల పాటైనా అందరూ జీతాలు లేకుండా గడపాలని తెలిసిపోయింది మాధవరావుకి. వెంటనే మరో ఉద్యోగానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరో పదిరోజుల్లో అదీ అంత తేలికయిన విషయం కాదని తెలిసిపోయింది. తమ కంపెనీలో పనిచేసే వారిలో చాలా మంది అప్పటికే ఎక్కడో చోట ఏదొక చిన్న ఉద్యోగంలో నయినా ఇరుక్కున్నారు.
    ఈ పరిస్థితి సీతకు కూడా ఆందోళన కలిగించింది. మాధవరావు ఓ పక్క , ఇంటి కొచ్చే షాపుల వాళ్ళ గొడవ మరోపక్క , మరోసారి ఇన్ స్టాల్ మెంట్ల పద్దతిలో ఎలాంటి సామానూలు కొనగూడదని నిశ్చయించుకొందామె.

                                             *    *    *
    
    మాధవరావు పరిస్థితి గమనిస్తూనే వున్నాడు రెడ్డి. అతనికి లోలోపల బాధగానే వుంది. తన స్నేహితుడు ఇబ్బందిపడటం సహించలేకపోతున్నాడతను. తనకు డబ్బుంది. కానీ ఎంత కాలమని మాధవరావుకి డబ్బిస్తూ సహాయం చేయగలడు? అదిసరయిన పద్దతి కాదు.
    చివరకు ఓ ఆలోచన వొచ్చిందతనికి.

 Previous Page Next Page