Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 17


    ఇళ మాట్లాడలేదు.
    "నామీద నమ్మకం లేదా?"
    "నువ్వు మోసం చెయ్యవు. అబద్దమాడవు. నాకు తెలుసు. కాని, యింకో విషయం నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను."
    "ఫరవాలేదు చెప్పు."
    "నాకోసం మళ్ళీ భక్తులు రావటం మొదలుపెట్టాకే, మా ఇంట్లో అనరూ కడుపునిండా అన్నం తింటున్నారు. వాళ్ళు మళ్ళీ మాడుతుంటే నేను చూడలేను" చాలా సిన్సియర్ గా చెప్పింది ఇళ.
    తెల్లబోయాడు చిచ్చు. ఈ మాటలకి అతడి దగ్గర సమాధానం లేదు. అంతలో దగ్గర్లో జనం వస్తోన్న సందడి వినిపించింది.
    పిచ్చిదానితో చిచ్చు వెళ్ళటం చేతబడి అత్తగారు చూసింది. వెంటనే రచ్చబండ దగ్గర రకరకాల ఊహాగానాలు చేస్తోన్న ఊరి పెద్దల దగ్గరికి ఉరుకులతో వెళ్ళింది.
    "పిచ్చిదానివెంట చిచ్చు అడవుల్లోకి పోతున్నాడు. నాకు మొదటి నుంచీ అనుమానంగానే ఉంది, సంగతులేమిటో తెలుసుకుందాం పదండి" అంది.
    అందరికీ ఈ వార్త కుతూహలం కలిగించింది. అప్పటివరకూ సెన్సేషనల్ గా ఏం జరక్కపోవటం వల్ల అందరూ నిరాశతో ఉన్నారు. ఇంచుమించు అందరూ చేతబడి అత్తగారితో సహా ఊరి పొలిమేరల్లోకి వచ్చారు. అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళడానికి వాళ్ళకి భయం వేసింది. అడవిదారులు వాళ్ళలో ఎవరికీ తెలీవు. ఎప్పుడైనా కోయవాళ్ళు ఊళ్ళలోకి వస్తారే తప్ప ఊళ్ళో జనం అడవుల్లోకి వెళ్ళి కోయవాళ్ళని కలుసుకోవడం జరగదు. వాళ్ళు కోయదొరలు కనిపించేవరకూ ఆగవలసి వచ్చింది. ఊళ్ళలోకి పనిపాటల కోసం వచ్చే కోయదొరలు కనిపించినా, వాళ్ళకి కూడా పిచ్చిది ఎటు వెళ్ళిందో తెలీదన్నారు. అడవుల్లోకి చాలా దారులుంటాయి. ఏ దారని చెప్పగలరు!
    చిచ్చు పిచ్చిదాని వెంట వెళ్ళిన విషయం జ్ఞానదేవ్ కి తెలిసి అతడు కూడా వచ్చాడు. అతడికి అడవిదారులు కొద్దిగా తెలుసు. అడవిలో ఒక దారివెంట పిచ్చిది ఒంటరిగా వెళ్తుండగా కొన్నిసార్లు చూశాడు. ఆ దారివెంట బయలుదేరాడు జ్ఞానదేవ్. జనం అతడివెంట పడ్డారు.
    జనాన్ని చూసి చిచ్చు గభాలున లేచి నిలబడ్డాడు. ఇళ భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది.
    కళ్ళు మూసుకుని కూచున్న ఇళని చూడగానే జనంలో ఉత్సాహం వెల్లువలా పొంగింది. ఇళని చుట్టుముట్టేశారు. ఒక్కొక్కడూ చిచ్చుని వెనక్కి నెడుతూ తను ముందుకి తోసుకుపోతున్నారు. ఆ రకంగా చిచ్చు ఇళని చుట్టుముట్టిన జనానికి ఎడంగా వచ్చిపడ్డాడు.
    "ఏం జరిగిందీ?"
    నాలుగు వైపుల నుంచీ అనేక కంఠాలు గోలగోలగా ఇళని అడుగుతున్నాయి. బిత్తరపోయిన ఇళ "నాకు తెలీదు. నిద్రలో నన్నెవరో పిలిచినట్లయి యిక్కడికి వచ్చాను" అంది.
    అప్పుడు జనం దృష్టిలో కొండరాయి దేవత పడింది.
    "ఇంకెవరు పిలుస్తారూ దుర్గే పిలిచి ఉంటుంది" అన్నారెవరో, అంతే. అక్కడికక్కడే అయిదు నిముషాల్లో మనిషి నుంచి మనిషి చకచక కథలు వ్యాపించిపోయాయి. "దుర్గ పది తలలతో యిరవై చేతులతో ఇళకి కలలో కనిపించింది. తనతో రమ్మని పిలిచి, ఈ అడవి మధ్య తను వెలసిన చోట దింపింది.
    "ఇళ ధ్యానంలో ఉంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయి ఇంట్లో మాయమై ఇక్కడ కనిపించింది. ఎదురుగా దుర్గని చూసి, ఇదంతా దుర్గ మహిమ అని తెలుసుకుంది!"
    ఇలా వారి వారి సృజనాత్మక ప్రతిభని బట్టి కథ స్వరూపం రకరకాలుగా మారిపోయింది. చివరికి ఒకడు చిచ్చుతోనే యిలా చెప్పాడు.
    "మంచంలో పడిన ఇళ దుర్గాదేవిని ప్రార్థించింది. "అమ్మా! అంశంతో పుట్టినదానిని. చిన్నతనం నుంచీ నీ భక్తురాలిని. నన్నెందుకిలా పరీక్షిస్తున్నావ్?"
    దుర్గ ఇళకి ప్రత్యక్షమయింది. ఇలా అంది.
    "బిడ్డా! నీ తల్లిదండ్రులు నరమానవుడితో నీకు పెళ్ళయి సంకల్పించి నాకు అపరాచం చేశారు. అందుకే నిన్నిలా శిక్షించాను. అడవిలో నేను వెలసిన చోటికి వచ్చి లెంపలేసుకుని నా విగ్రహానికి పూజలు జరిపిస్తానని మొక్కుకో. నీకు నయమవుతుంది. నా దయవల్ల నువ్వు ఆకాశ గమనంతో నేను వెలసిన చోటికి చేరుకోగలవు. నాకు పూజలు చేసిన వారికి ఈ లోకంలో సకలైశ్వర్యాలూ సిద్ధించి మరణించిన తర్వాత మోక్షం ప్రాప్తిస్తుంది."
    ఈ కథ విని నోట మాట రాక నివ్వెరపోయాడు చిచ్చు.
    జనం ఒక్కొక్కరూ కొండరాయి దేవతముందు లెంపలేసుకుని నేలమీద సాష్టాంగ నమస్కారాలు మొదలుపెట్టారు. చిచ్చు మాట పూర్తిగా మర్చిపోయి, జనం ఇళని వెంటబెట్టుకుని ఊళ్ళోకి బయలుదేరారు. చివరికి జ్ఞానదేవ్, చిచ్చు మిగిలారు.
    "నువ్వెలా వచ్చావ్ యిక్కడికి?" అడిగాడు జ్ఞానదేవ్.
    "పిచ్చిది ఇళని ఇక్కడ చూశానని చెప్పింది. నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను."
    "ఇంటికి రాగానే నీ బట్టలూ అవీ సర్దుకో. ఈ రోజే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవాలి" ఇంత కఠినంగా అని కొడుకు కోసం ఆగకుండా వెళ్ళిపోయాడు. తనకు కోపం వచ్చినట్లు చిచ్చుకి అర్థం కావాలి. లేకపోతే లొంగడు.
    ఒంటరిగా మిగిలిపోయిన చిచ్చు దగ్గరికి వచ్చింది పిచ్చిది.
    "చిచ్చులయ్యా! నువ్వేం చిచ్చువయ్యా? ఆ అమ్మాయినట్టా ఎందుకొదిలేశావ్?"
    మరబొమ్మలా నిలబడ్డ చిచ్చు నోట ఒకే ఒక మాట వెలువడింది.
    "టూట్."

 Previous Page Next Page