Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 16


    "హిహిహ్హిహ్హి"
    వికృతమైన నవ్వు వినిపించింది. అదిరిపడి అటు చూశాడు. ప్రమధపురి కంతకూ పరిచయమైన పిచ్చిది జుట్టు అట్టలు గట్టి బట్టలు చిరుగు పీలికలై, తిన్నగా స్నానం చెయ్యని శరీరం మురికిబెడుతూ_ అర్థం పర్థం లేకుండా ప్రమధపురిలో ఇల్లిల్లూ తిరిగే పిచ్చిది.
    హేతువాదినని చాటుకొనే తనను వెక్కిరించడానికి వచ్చిన సమాజ ప్రతినిధిలా తోచింది ఆ పిచ్చిది, చిచ్చుకి! తను చేసిన పనికి చాలా లజ్జ పడ్డాడు. చదువు, విజ్ఞానమూ, ఆలోచన ఉన్న తనే ఆశాభంగంలో, ఆరాటంలో తను ఏనాడు నిజంగా నమ్మని విగ్రహానికి మొక్కినప్పుడు మామూలు మనుషుల్లో మూఢ విశ్వాసాలు తగ్గకపోగా, ప్రబలడంలో ఆశ్చర్యమేముందీ.
    "ఇళ ఎక్కడుందో నాకు తెలుసు. హిహ్హిహ్హి." బుర్ర బరుక్కుంటూ అంది పిచ్చిది!
    "నిజంగా!"
    అప్రయత్నంగా మనసులో ప్రశ్న బయటికి వచ్చింది చిచ్చు నోట.
    "నిజంగా నిజంగా నిజంగా హిహ్హి పేలోమమ్మ గుడికాడ ఆడుంది?"
    "పేలోమమ్మ... పోలేరమ్మా!"
    "పోలేరమ్మ కాదు. పేలోమమ్మ... నా దేవత... ఆ గుడి నాది. ఆ దేవత నాది. ఆడుంది."
    నమ్మాలో, నమ్మక్కర్లేదో అర్థం కావడం లేదు చిచ్చుకి.
    "ఆ గుడి ఏడుందో మీకెవరికీ తెలీదు. నాకు తెల్సు. మా తాత నాకు సూపెట్టాడు. ఆల్ల తాతకి ఆల్ల తాత..."
    "సరే గుడి ఎక్కడుందో చూపిస్తావా!"
    "ఓ! చూపిస్తా రా!" అని చిచ్చు దగ్గరగా వచ్చి "హుష్? రహస్యం అంది" గుసగుసగా.
    "అక్కడ ఇళ ఉంటే మంచిదే. ఒకవేళ ఉండకపోయినా నష్టం ఏముందీ!" అనుకుని పిచ్చిదాని వెంట బయలుదేరాడు చిచ్చు. ఊరి బయట కోయవాళ్ళ కోసం తవ్విన బావి దగ్గరకి వచ్చారు ఇద్దరూ. అక్కడ పిచ్చిది ఆగి, మైలారమ్మకి లెంపలేసుకుని దణ్ణం పెట్టుకుంది. అది పసుపు రాసి బొట్లు పెట్టిన మైలురాయి. తర్వాత అడవిలోకి దారితీసింది. తుప్పలతో, ముళ్ళ డొంకలతో నిండిన అడవిలో 'జిగ్-జాగ్' మెలికలు తిరిగిన సన్నని కాలిబాట. దారి గుర్తుపెట్టుకోవాలన్నా సాధ్యం కావడంలేదు చిచ్చుకి. అడవి మధ్యకి తీసుకుపోతోంది పిచ్చిది. అనారోగ్యంగా వున్న ఇళ ఇంతదూరం, ఈ చిక్కు దారుల్లోంచి నడిచి రావడం సంభవమేనా! పిచ్చిది చకచక ముందుకు నడుస్తూ మధ్యలో వెనక్కి తిరిగి 'రా' అని చిచ్చుని హెచ్చరిస్తోంది. పిచ్చిది ఆగింది. చిచ్చు ఆమెను సమీపించాడు. ఎదురుగా నోరు తెరుచుకుని ఉన్నట్టుగా వున్న కొండరాయి. అది కొండబిలం కావచ్చు. కొండరాయికి పసుపు పూసి, కళ్ళూ, ముక్కు, ఎర్రరంగుతో దిద్దారు ఎవరో! పెద్ద కుంకం బొట్టు. కొండరాతికి ఎదురుగా నిలబడి వుంది. ఇళ చేతులు జోడించి కళ్ళు మూసుకుని "అదిగో పేలోమమ్మ! ఇదిగో ఇళ..." చూపింది పిచ్చిది. "హిహ్హిహ్హి" అంది. పిచ్చిదాని మాటలు వినిపించుకోలేదు చిచ్చు. ఇళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల భుజాలు పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు. 'ఇళా' పిలిచాడు ఆరాటంగా. కళ్ళు తెరిచింది ఇళ. ఎర్రగా జ్యోతుల్లాగా వున్నాయి అవి. పీక్కుపోయినట్లుగా ఉంది ముఖం. నిలబడలేనట్లు తూలిపోయింది. ఆమెని పొదివిపట్టుకుని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు, కింద కూచుని. కొండజాతి దిగువన కొంతమేర చాలా శుభ్రంగా వుంది. ఎవరో రోజూ అక్కడ ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గులేస్తున్నారు. సన్నగా ఏదో హోరుమంటున్న ధ్వని, నోరు తెరుచుకున్నట్టుగా ఉన్న కొండజాతి బిలంలోంచి వినిపిస్తోంది ఆ ధ్వని. సొమ్మసిల్లినట్లు చిచ్చు చేతుల్లో వేలాడబడిపోతోంది ఇళ.
    "పిచ్చీ? కొంచెం నీళ్ళు తెచ్చిపెడతావా?"
    అక్కడే నిలబడి ఇద్దర్నీ చూస్తోన్న పిచ్చిదాన్ని అడిగాడు.
    "హిహ్హిహ్హి? నీళ్ళే! నీళ్ళెక్కడియ్యి!" అని తుపుక్కున ఊసి_
    "అయ్యే నీళ్ళిక్కడ!" అంది. ఆ చర్య వెగటు కలిగించినా అదే అతడికొక ఉపాయం సూచించింది. పెదవులు నాలుకతో తడుపుకుని, ఇళ ముఖంమీదికి వంగి కనురెప్పలు, చెక్కిళ్ళు, నుదురు సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇళ కనురెప్పలు కదిలాయి. కాని కళ్ళు తెరవలేదు. మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి "చిచ్చూ?" అంది సంబరంగా. ఒకసారి చుట్టూ చూసింది. భయంగా "ఏం జరిగింది?" అంది. బెదిరిపోయిన పసిపాప తల్లి గుండెలో తలదాచుకున్నట్లు, చిచ్చు గుండెలో తలదాచుకుంది.
    లాలనగా ఆమె శిరసు నిమిరి "తెల్లవారుఝామున నువ్విక్కడికి వచ్చావు. ఎలా వచ్చావో గుర్తులేదా?" అన్నాడు. కొంతసేపు ఇళ మాట్లాడలేదు. ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించింది.
    "ఏకతార సంగీతం వినిపించింది. ఎప్పుడూ వినిపిస్తుంది. కలల్లో ఎక్కడో, ఏదో దాక్కుంది వెళ్ళి చూడాలని ఆశ. ఎలా వెళ్ళాలో తెలీదు ఎవరో తీసుకెళ్తున్నారు చాలా అందమైన అమ్మాయి! ముందు నడుస్తోంటే వెనుక వెళ్తున్నాను తీరా అది దుర్గాలా సౌమ్యంగా లేదు. చాలా భయంకరంగా ఉంది నాకు భయంగా ఉంది."
    మళ్ళీ చిచ్చు గుండెలో తల దాచుకుంది. ఇళ మాటలు చిచ్చుకి సరిగా అర్థం కాలేదు. ఎదురుగావున్న కొండ దేవత భయంకరంగానే వుంది. అది నిజంగా దేవత అయితే, ఇళ చెపుతున్నది దాన్ని గురించేనా! అయినా ఇంత దూరం ఎలా నడిచి వచ్చిందీ! ఈ దారి ఎలా తెలిసింది! అడవి మధ్య ఎవరికీ కనబడకుండా వున్న దారి.
    ఏ విషయమూ సరిగా నిర్ధారించుకోలేకపోయినా, ఇళ ఆరోగ్యం గురించి విదుషి చెప్పిన మాటలు తలుచుకోగానే స్థిమితంగా ఉండలేకపోయాడు చిచ్చు.
    ఇళ చుబకం కట్టుకుని ముఖం పైకెత్తి "నాదొక మాట వింటావా!" అన్నాడు.
    "ఏమిటి?"
    "నువ్వు నాతో హైదరాబాద్ వచ్చేయ్! ఇప్పుడే వెళ్ళిపోదాం!"
    భయంగా రెప్పలార్చింది.
    "ఏం భయం లేదు. నేను నిన్నేం చెయ్యను. ఇష్టం లేకుండా ఏదీ జరగదు?"
    "ఎందుకు హైదరాబాద్?"
    "నీ ఆరోగ్యం..." ఆగిపోయాడు చిచ్చు. ఈ విషయం ఇళకి తెలియనీయకూడదని గట్టిగా చెప్పింది విదుషి.
    "మెడికల్ ట్రీట్ మెంట్ లో సైకాలాజికల్ ఎఫెక్ట్ పాత్ర చాలా ఉంటుంది. ఇళ తనకేదో పెద్ద జబ్బు ఉందని అనుకుని, దానిగురించే ఆలోచించడం ప్రారంభిస్తే, ఎప్పుడో ముందుకొచ్చే ప్రమాదం ఇప్పుడే వచ్చేస్తుంది" అంది.
    "ఏమిటీ?"
    చిచ్చు ఆగిపోవటంతో అడిగింది ఇళ.
    "ఈ భక్తులూ, నిన్ను దేవి ఆవహించడం యిదంతా నీ భవిష్యత్తుకి ఎంత మాత్రం మంచిది కాదు ఇళ! నిష్కారణంగా నిన్ను నువ్వు ఉచ్చుల్లో బిగించుకున్నావు. నాతో హైదరాబాద్ రా. ఆ రోజు అదే నీ పెళ్ళిచూపులప్పుడు ఎందుకు పడిపోయావో, మొన్నటివరకూ ఎందుకు మంచంలోంచి లేవలేకపోయావో డాక్టర్ తో పరీక్ష చేయించి తెలుసుకుందాం. అవసరమైతే ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు."

 Previous Page Next Page