Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 17


    కళ్యాణి డి.ఎస్.పి. మార్తాండ్ గారి అమ్మాయి.
    అనూష లక్షాధికారి కూతురు. మాట పడే మనిషి కాదు. ఇద్దరూ తన అభిమానులే!
    ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తను ఊహించగలడు. ప్రస్తుతం ఎవరిని ఎలా అనునయించాలో అర్థం కాని స్థితిలో పడిపోయాడు సమ్రాట్.
    "సారీ అనూషా! కళ్యాణి ప్రవర్తనకు నువ్వేమీ అనుకోవద్దు...."
    "భలే వారే! నేనామాత్రం అర్థం చేసుకోలేనా? కళ్యాణి ఆవేశంతో వెళుతున్నది. వెంటనే వెళ్ళి ఆమెను శాంతపరచండి. లేకుంటే ఆమె ఏదైనా అఘాయిత్యానికి పాల్పడినా ఆశ్చర్యపోనక్కరలేదు!" అంది నవ్వుతూ అనూష.
    "అదీ నిజమే!" అంటూ హడావుడిగా పరిగెత్తాడు సమ్రాట్.


                                                  *    *    *    *


    తన వెనుక సమ్రాట్ రావడాన్ని కళ్యాణి గమనించింది.
    ఆమె తన నడక వేగాన్ని పెంచింది.
    "కళ్యాణి! ఆగు...నేను చెప్పేది విను!"
    "నాతో మీకేం పని? అయినా, అవతల అందగత్తె ఒకతి ఉన్నదిగా? విసురుగా అంది.
    ఆమె కోపానికి గల కారణం సమ్రాట్ కు ఇప్పుడు అర్ధమయింది.
    ఆడవాళ్ళలో ఈర్ష్యా ద్వేషాలు సహజంగా చాలా తొందరగా బయటపడతాయనడానికి కళ్యాణి చక్కటి ఉదాహరణ అనుకున్నాడు.
    "అనూష గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కళ్యాణి. ఆమె కేవలం నా దగ్గిర జీతం కోసం పనిచేస్తున్నది, జీవితం పంచుకోవడానికి కాదు. మా మధ్య ఏ సంబంధం లేదు. నా మాట నమ్ము!" అన్నాడు ఆమెను శాంతపరచాలనే దృష్టితో.
    "అసలు నేనంటే మీకు ఇష్టమేనా?" అమాయకంగా అడిగింది కళ్యాణి.
    "ఒట్టు కళ్యాణీ! నీమీద నాకు వల్లమాలిన అభిమానం!"
    "శుద్ధ అబద్ధం! మీకు చాలామంది అభిమానులున్నారు. అందరితోను మీరిలాగే చెబుతారు _ అవునా?" తిరిగి ఉక్రోషంగా అంది.
    "నువ్వు అనవసరంగా అపోహ పడుతున్నావు కళ్యాణీ! నా మాట నమ్ము." మరింతగా ప్రాధేయపడ్డాడు.
    "నేను నమ్మను! మీకు గౌతమి,సాహితి అభిమానులు కారా? వాళ్ళను మీరు ఇష్టపడడం లేదా?" రెట్టిస్తూ అడిగింది.
    సమ్రాట్ ఆలోచనలో పడ్డాడు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నది నూటికి నూరు పాళ్ళూ నిజమే! అభిమానులందరినీ తను ఆదరంతో చూడడం కళ్యాణికి నచ్చినట్టు లేదు!
    "మా ముగ్గురిలో ఎవరంటే మీకు ప్రత్యేకమైన అభిమానం!" ఆత్రుతగా అడిగి సమాధానం కోసం అతని కళ్ళలోకి సూటిగా చూసింది.
    "ఇందులో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనే ధోరణి వద్దు కళ్యాణీ! ఎవరికి ఉండే విలువలు వాళ్ళకు ఉంటాయి." పరిస్థితిని తేలిక పరుద్దామనే ఉద్దేశంతో అన్నాడు.
    "ఊహూ! అలా కాదు. మా ముగ్గురిలో మీకు ఎవరు ముఖ్యులో తేల్చి చెప్పాల్సిందే!"
    కళ్యాణి లేనిపోని పోటీ పెట్టింది. ఏదో ఒకటి ఆమెకు రుచించే విధంగా చెప్పందే ఒక పట్టాన వదిలేట్టు లేదనుకున్నాడు.
    "కళ్యాణీ! మీరు ముగ్గురూ క్లాస్ మేట్స్, ప్రాణ స్నేహితులు, ముగ్గురూ నా అభిమానులే. ముగ్గురూ కలసి నా దగ్గరకు వచ్చారు. మీ మధ్య కలతలు రాకూడదు. మీ ముగ్గురి మీదా నాకు ప్రత్యేకమైన అభిమానం వుంది. దయచేసి ఇంకెప్పుడూ ఈ ప్రస్తావన నా దగ్గరకు తీసుకురావద్దు" నిశ్చయంగా అన్నాడు.
    కళ్యాణికి అతని సమాధానం తృప్తినివ్వలేదు. "అయితే మీరు నన్ను అర్థం చేసుకోలేదు. నా ఉత్తరం మీకు అందిందా?" అంది సంశయంగా.
    అతను మౌనంగా ఉండిపోయాడు.
    "నా ఉత్తరం అందిందా?" మళ్ళీ రెట్టించి అడిగింది.
    "ఊఁ...." తల ఊపాడు.
    "ఉత్తరాన్ని చదివారా? లేక మడిచి జేబులో పెట్టుకున్నారా?"
    "ఆ....చదివాను."
    "అర్థమయిందా?"
    "ఏమిటి_భాషా? కవిత్వమా?" ఎదురుప్రశ్న వేశాడు.
    "రెండూ కాదు. భావం అర్థమయిందా?"
    "అర్థం కాకపోవడానికి అందులో ఏ భావం ఉందని?"
    "రచయితలు ఆ మాత్రం అర్థంచేసుకోలేరా? లేక కావాలనే ఇలా....?" కొంటెగా చూస్తూ అంది.
    "ఇక ముందెప్పుడూ నువ్వు నాకు ఉత్తరాలు రాయొద్దు కళ్యాణి! అవి ఎవరి చేతులలో పడినా మన ఇద్దరికీ మంచిది కాదు!" హెచ్చరిస్తూ అన్నాడు.
    "అలాగే! నేను రాయను. ఇక నుంచి మీరే నాకు రాయాలి" అంది నవ్వుతూ.
    సమ్రాట్ ఆమె వింత కోరికకు క్షణం కలవరపడ్డాడు.
    కళ్యాణి అసలు తన ఆఫీసుకు ఎందుకు వచ్చినట్టు? క్షణంలో తుఫాను సృష్టించింది. ఇలా ఆమె రోజుకొకసారి తన ఆఫీసుకు వచ్చి అలిగితే, ఇక తన రచనా వ్యాసంగం సాగినట్టే!
    కళ్యాణిని పరిచయం చేసిన గౌతమి మీద సమ్రాట్ కు కోపం వచ్చింది.
    ఇల్లు సమీపించడంతో కళ్యాణి సమ్రాట్ కు గుడ్ బై చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది.
    వాన కురిసి వెలిసినప్పటి ఆహ్లాదంలా తోచింది సామ్రాట్ కు. వెనుదిరిగాడు.


                                *    *    *    *


    అనూష వచ్చినప్పటి నుంచి సామ్రాట్ కు చాలా బరువు బాధ్యతలు తప్పాయి.
    ఏమీ చెప్పనవసరం లేకుండానే అవసరాన్నిబట్టి అన్ని పనులనూ చక్కబెడుతున్నదామె.
    ఆమె తెలివితేటలను గుర్తించిన విశ్వనాథ్ 'సామ్రాట్ పబ్లికేషన్స్'ను అభివృద్ధి చేసే బాధ్యతను కూడా ఆమెకే అప్పజెప్పాడు.
    'సామ్రాట్ పబ్లికేషన్స్'కు పాతిక సంవత్సరాల చరిత్ర ఉన్నా ఆర్థికంగా అంతగా రాణించలేదు. ఏదో పేరుకు ఉన్నది అన్నట్టు అప్పుడప్పుడు ఒకటి రెండు పుస్తకాలను ప్రచురించాడు విశ్వనాథ్.

 Previous Page Next Page