ఉండుండి రవళి రూపం కళ్ళముందు కదిలి ఏదో అభద్రతా భావాన్నీ, భర్తమీద ద్వేషాన్నీ కలిగిస్తూంది!
ఉదయం జీవన్ కి అబద్ధం చెప్పానన్న విషయం ఆ ఉద్వేగ క్షణంలో తప్ప.... ఆ తర్వాత ఆమెని పెద్దగా బాధించలేదు. హృదయాన్ని అశాంతిపాలు చేసి పీడించే అనుమానం దేన్ని తేలిగ్గానే అధిగమించింది!
ఆమెకిప్పుడు ఒంటరిగా వుండాలని వుంది! ఎవరితోనూ మాట్లాడాలని లేదు. జీవన్ కి యాక్సిడెంట్ అయిందని తెల్సి సిటీకి దగ్గర్లోని పల్లెలో వుంటున్న తల్లిదండ్రులు ఆ మధ్యాహ్నమే వచ్చారు.
వాళ్ళరాక ఆమెకేం సంతోషం కలిగించలేదు. ఎవర్నీ చూడాలని లేదు. అప్పటివరకూ వాళ్ళతో బలవంతంగా కూర్చుని కబుర్లు చెప్పింది. శరత్ చంద్ర ఫోను చికాకుని మరీ ఎక్కువ చేసింది. అందరికీ దూరంగా వుండాలనిపించే డిప్రెషన్ కి గురైంది.
ఆమెనే గమనిస్తోన్న తల్లిదండ్రులకి కూతురెందుకో బాధ పడుతోందని అర్ధం అయింది. పిల్లవాడికి దెబ్బతగిలితే కలిగే బాధలా వాళ్ళకి అనిపించలేదు.
"అమ్మాయ్! ఏమిటలా వున్నావ్?" అంటూ లోపలి కొచ్చింది తల్లి సుబ్బాయమ్మ.
"ఎక్కడినుండమ్మా ఫోను?" వెనకే వస్తూ అడిగాడు తండ్రి రాఘవయ్య. సమాధానం చెప్పాలనిపించలేదు. కొద్దిగా కదిలి మళ్ళీ పడుకుంది. ఇద్దరూ వచ్చి ఆమె ప్రక్కనే మంచమ్మీద కూర్చున్నారు. ఫోన్ వచ్చిన తర్వాతే కూతురి బాధ ఎక్కువైందని రాఘవయ్య అభిప్రాయం!
"ఎవరమ్మా ఫోన్ చేసింది?" మళ్ళీ అడిగాడు. ఆయన ముగ్గురు సంతానంలో చివరిది నీలిమ గారాబంగా పెంచాడు.
"మీ అల్లుడు!" తప్పదన్నట్లు చెప్పింది కళ్ళు మూసుకొనే. ఉలిక్కిపడ్డాడు ఆయన. పిల్ల బాధపడటాన్ని చూడలేడు. అందుకే తనకిష్టం లేకపోయినా ఆమె అడిగినదేదీ కాదనలేదు. కోరి..... శరత్ ని పెళ్ళాడింది నీలిమ. ఇప్పుడు ఏమిటో గొడవ? ఫోన్ లో ఏం మాట్లాడి వుంటాడు? నీలిమ ఎందుకలా అయిపోయింది? అనుకున్నాడు. 'ఇద్దరికీ సఖ్యత చెడలేదు కదా!' కంగారు పడిందతని మనసు.
గారాబంగా పెంచిన ఆడపిల్లల తల్లిదండ్రులంతే! కూతురి సంసారం గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ పట్టించుకొని.... చాలా చిన్నవాటిని కూడా పెద్దవి చేస్తారు. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న అపార్దాలు, వాళ్ళిద్దరు మాత్రమే పరిష్కరించుకోవాల్సిన చిన్న చిన్న గొడవలూ వాళ్ళదాకా వచ్చాయంటే ఇంతే సంగతులు! చాలా చిన్న విషయాలు కూడా కూతురిమీద ప్రేమతో చాలా పెద్ద విషయాలుగా కనపడి.... కూతురు చాలా బాధపడి పోతున్నట్లు ఫీలయి, సమస్యలో వాళ్ళే జొరబడుతుంటారు. చిలిపి తగాదాలని కూడా చిల్లరగా మార్చేస్తుంటారు.
"ఏం మాట్లాడాడు?" రాఘవయ్య అడగాలనుకున్న ప్రశ్న అతని భార్య అడిగింది.
గదిలో అప్పుడప్పుడే చీకటి ఛాయలు జొరబడుతున్నాయి. "ఏం లేదు. ఇంటికి రావడం అలస్యమవుతుందట" ఎంతో మామూలుగా చెప్పాననుకొంది. కానీ ఆ స్వరంలో పలికిన అయిష్టతని గుర్తించాడు తండ్రి. ఆ మాత్రానికే అంత బాధ పడాల్సి పనిలేదు. ఏదో జరిగింది అనుకున్నాడు.
ఆమె ఫోనులో మాట్లాడడం తిరిగి ఒక్కసారి గుర్తు చేసికొన్నాడు. భర్తతో మాట్లాడిన పద్ధతి ఎన్నో అనుమానాలని కలిగించింది!
"ఇంటికి ఆలస్యంగా రావడం మీ ఆయనకేమైనా కొత్తా?" సాగదీసింది సుబ్బాయమ్మ. కూతురు మాట్లాడలేదు.
నీలిమ శరత్ చంద్ర ని కులాంతర వివాహం చేసుకోవడం ముందుగా ఆ కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. హెడ్ క్లర్క్ గా ప్రభుత్వ ఉద్యోగం, పల్లెలో కొద్దిపాటి పొలం నుంచి వచ్చే ఆదాయంతో పొదుపుగా బ్రతుకుతూ నీలిమ అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు రాఘవయ్య.
నీలిమ శరత్ చంద్రని కులాంతర వివాహం చేసుకుంటానన్నప్పుడు ముందు భయపడిపోయినా, కూతురి మొండితనం, ఎమ్.సి.హెచ్. చదువుతున్న అల్లుడి హోదా, భవిష్యత్తులోని అతని సంపాదన, కూతురు సుఖపడుతుందన్న ఆశ.... వాళ్ళని త్వరగా లొంగదీశాయి. వాళ్ళ పెళ్ళి తన ఆశీస్సులతోనే జరిగింది.
కానీ, తరవాత్తరవాత.... సంపాదన విషయంలో శరత్ చంద్ర వాళ్ళకి చాలా ఆశాభంగం కలిగించాడు.
ఎమ్. బి.బి.ఎస్.లూ, ఎమ్.డి.లు చదివిన డాక్టర్లే లక్షలు సంపాదిస్తున్న రోజుల్లో సూపర్ స్పెషలిస్టు అయిన తమ అల్లుడు రాత్రింబవళ్ళూ చాకిరీచేసి నెలకి నాలుగు జీతంరాళ్ళు తేవడం ఏమిటో.... ఆ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
"ఏమ్మా, ఆలస్యం అయినా అల్లుడిగారికి రోజూ ఇంటికి వచ్చి పడుకోవడం కుదురుతుందా....?" చాలా మామూలుగా అడిగినట్లే అడిగారు రాఘవయ్య.
అదేం ఉద్యోగమే తల్లీ! చేతినిండా సంపాదించలేకపోయినా పెళ్ళాం బిడ్డలతో నిండుగా కాపురమైనా చెయ్యాలా? హాస్పిటల్లో తనొక్కడే డాక్టరయినట్లు చేస్తాడేమిటి మీ ఆయన?" విసుగ్గా అంది తల్లి.
"పోనీ, ఇంతపని చేస్తున్నందుకు పై ఆదాయమేమైనా వుంటుందామ్మా?" అడిగాడు తండ్రి.
"ఆ శాలరీ తప్ప ఒక్క రూపాయి కూడా ఇంటికి రాదు" అని ఇప్పటికి మాట్లాడింది నీలిమ.
శరత్ చంద్ర మీద రగిలిపోతున్న మనసుకి వాళ్ళ మాటలు కొంత స్వాంతన కలిగించాయి. తన బాధని వాళ్ళు కొంత మోస్తున్నట్లు కంఫర్ట్ ఫీలయింది.
"ఆ నాలుగురాళ్ళ కోసం రాత్రింబవళ్ళూ పనిచేసే వాళ్ళని నేనెక్కడా చూడలేదు. ముద్దూ ముచ్చటా లేని బ్రతుకైపోయింది. చెబితే విన్నావుకాదు. అయినా, మన ప్రారబ్దం కాకపోతే డాక్టర్లంతా ఇలాగే చేస్తున్నారేం? సంసారాలు వదులుకుని చాకిరీలు చేయడమేమిటమ్మా చోద్యం కాకపోతే?" తన ధోరణిలో సాగదీస్తూ మాట్లాడింది తల్లి. సమాధానం చెప్పడానికేం లేదు నీలిమ దగ్గర" కానీ, తల్లి విసురుతున్న రాళ్ళు మాత్రం బలంగా హత్తుకొంటున్నాయి హృదయంమీద.
"మమ్మీ.... బాత్ రూమ్ కెళ్ళాలి!" అనే జీవన్ కేక విని లేచింది నీలిమ.
ఆ పూట వంటపని చూడటానికి వంటగదిలో కెళ్ళింది సుబ్బాయమ్మ.
వస్తానని ఫోను చేసిన శరత్ చంద్ర రాత్రి పదకొండవుతున్నా ఇల్లు చేరలేదు.
జీవన్ కింకా నిద్ర పట్టలేదు. అసహనంగా నిట్టూరుస్తూ వెల్లకిలా పడుకొని వున్నాడు.
తన మంచంలోనే పడుకొన్న చెల్లెలు కూడా నిద్రపోవడం లేదని తెలుస్తూనే వుంది. పక్క కుదరనట్లు ఊరికూరికే కదులుతూంది.
తల్లిదండ్రులకు హాల్లో పక్కలు వేసివచ్చి, పిల్ల మంచమ్మీద ఓ చివర పడుకొంది నీలిమ.
గోడలో అమర్చిన నీలంరంగు బెడ్ లైటు వెలుగు ఆహ్లాదకరంగా లేదు. వాళ్ళ మనస్సులో తెరలా గదంతా మసకగా పరుచుకొని వుంది.
పిల్లల గదిని ఆనుకొని వున్న దంపతుల బెడ్ రూమ్ లో మంచాలు ఖాళీగా వున్నాయి. ఖాళీ గదిలో చీకటి నిద్రిస్తోంది. జీవన్ కి తన అవసరం వుంటుందని నీలిమ ఇప్పుడు పిల్లల దగ్గర పడుకొందిగానీ, మామూలుగా అయితే భర్త వచ్చినా రాకపోయినా తమ బెడ్ రూమ్ లోనే పడుకోవడం నీలిమకి అలవాటు. పిల్లల్ని విడిగా పడుకోవటం అలవాటు చేసి చాలా కాలమైంది.