Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 16


    "సార్.....!" అన్నాడు తడారిన గొంతుతో.

 

    అప్పటికే కారిడార్ మలుపు తిరుగుతున్నాడు శరత్. అతన్ని రవళీ మరికొందరు స్టూడెంట్స్ అనుసరిస్తున్నారు. అందరి మొహాల్లోనూ టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

 

    అయిష్టంగానే రికవరీ రూమ్ వైపు నడిచాడు కిరణ్. అప్పటికే హాస్పిటల్ అంతా ఈ వార్త పాకిపోయింది. ఆ ఆవరణలో ఏ ఇద్దరు డాక్టర్లు కలిసినా ఆదే విషయం మాట్లాడుకుంటున్నారు.

 

    భయం తప్ప భద్రత తెలుసుకోని జనం గురించి చర్చించుకుంటున్నారు! విచ్చలవిడి లైంగిక వాంఛల్ని రెచ్చగొట్టడం తప్ప.... విచక్షణ నేర్పించని సవాలక్ష ఆకర్షణలని తిట్టుకుంటున్నారు.

 

    ఏ పాపం ఎరుగకపోయినా మహమ్మారి బారిన పడవలసిన రోగి గురించి జాలిపడిపోతున్నారు!

 

    చాప క్రింద నీరులా ఈ దేశపు యువత రక్తంలో ప్రవహిస్తున్న ఎయిడ్స్ గురించి భీతిల్లుతున్నారు!

 

    ముందు ముందు వాళ్ళలో ఒకరుగా నిలబడి వైద్యం చెయ్యవలసి వున్న తమ గురించి తామే భయపడిపోతున్నారు!!


                                                *    *    *    *


    నలభయ్ నిమిషాల్లో వేగంగా రౌండ్స్ ముగించుకొని తన గదిలో కెళ్ళాడు శరత్ చంద్ర.

 

    టైము అయిదూ నలభయ్ దాటింది. రిస్టువాచి చూసుకొంటూ 'ఇవాళ కూడా పెందలాడే వెళ్ళలేకపోతున్నాను' నిస్పృహగా అనుకున్నాడు. మరో పది నిమిషాల్లో కాన్ఫరెన్స్ హాల్లో తనుండాలి! టేబిల్ మీది ఫోను దగ్గరకు లాక్కుని డయిల్ చేశాడు. అటువైపు మువ్వ లిఫ్ట్ చేసింది.

 

    "హలో మువ్వా! నేను.... డాడీని మాట్లాడుతున్నాను."

 

    "డాడీ.....! నువ్వా! ఇంటికొచ్చేస్తున్నావా?" అంది. తండ్రి మాటల్ని విన్న ఆనందం ఆ గొంతులో పొంగిపోతోంది.

 

    తనకోసం పలికిన ఆరాటం వింటూనే - ఓ పల్చని ఆనంద వీచిక అతని మొహంలో మెరిసి మాయమైంది.

 

    "ఇప్పుడొక మీటింగ్ వుందిరా! అదయ్యాక వచ్చేస్తాను!" ఇబ్బందిగా చెప్పాడు.

 

    "పో....! నువ్వెప్పుడూ అంతే! నాకిక్కడ బోర్ కొడుతోంది!" శరత్ చంద్ర ఫోన్ చేసినప్పుడు మువ్వ లిఫ్ట్ చేసిందంటే త్వరగా వదలదు. ఫోన్ లోనే డాడీని చూస్తున్నంత సంబరపడుతుంది! విషయాలన్నీ చెప్పాలనుకొంటుంది....! అలుగుతుంది....! కోప్పడుతుంది.......!

 

    "వచ్చేస్తాన్రా! ఫోను మమ్మీకివ్వు!"

 

    "మరేమో డాడీ.... అన్నయ్యా.... మంచంలోనే కూచునీ, బాటిల్లో యూరిన్ పోస్తున్నాడు! బాత్ రూంలో కాదూ.... మంచంమీదే....! మంచంమ్మీదే అని మళ్ళీ నొక్కి పలికి కిలకిలా నవ్వింది!

 

    దోసిళ్ళతో మెత్తని గులాబీ రేకులు హృదయమ్మీద జారవిడుస్తున్నట్లనిపించిందతనికి.

 

    టెన్షన్ తెలియని పసితనం! కొద్దిసేపు.... కొద్దిసేపంటే కొద్దిసేపు తనూ అలా అయిపోతే బావుణ్ణనిపించింది!

 

    నవ్వాపుకొని ఇంకా ఏవో చెబుతోంది మువ్వ. వాచివైపు చూసుకొంటూ "మమ్మీకి ఇవ్వు తల్లీ!" అన్నాడు బ్రతిమిలాడుతున్నట్లు.

 

    "తాతయ్యా అమ్మమ్మా వచ్చారు" అని చెప్పి, "మమ్మీ.... డాడీ పిలుస్తున్నాడు-" అని గట్టిగా అరిచింది. గుయ్యిమంది శరత్ చంద్ర చెవి.

 

    ఆ వైపు నీలిమ ఫోను అందుకున్న శబ్దం అయింది.

 

    "జీవూ ఎలా వున్నాడు నీలూ?" మృదువుగా అడిగాడు.

 

    "బాగానే వున్నాడు" నిర్లిప్తంగా చెప్పింది.

 

    "మందులు వేశావు కదూ!"

 

    "ఊ.....!"

 

    "అయామ్ సారీ నీలూ! ప్రొద్దున.... తొందర్లో నీతో మాట్లాడలేదు!"

 

    అటునుండి ఈ సారి 'ఊ' కూడా లేదు.

 

    "సరే నీలూ! నాకిప్పుడు ఎమర్జన్సీ మీటింగ్ వుంది. అది అవగానే ఇంటికొచ్చేస్తాను. ప్లీజ్! గెట్ యువర్ సెల్ఫ్ నార్మల్ డియర్"

 

    అటునుండి ఫోను టప్పున పెట్టేసిన శబ్దం! అతని చేతిలోని శక్తినంతా ఎవరో పిండేసినట్లు రిసీవర్ జారి టేబుల్ మీద పడింది. తనమాట వినడానిక్కూడా నీలిమకు ఇష్టం లేదన్న విషయం అతన్ని వ్యధ పెట్టింది.

 

    ఫోను సరిగ్గా సర్ది పై అంతస్థులోని కాన్ఫరెన్స్ హాలువైపు వెళ్ళడానికి గది బయటికి వస్తుంటే చలపతిరావు భార్య ఎదురుగా నిలబడి వుంది.

 

    "ఏమ్మా.....?" అంటూ నిలబడిపోయాడు. భర్త విషయం ఆమెకి తెలిసినట్లు లేదు.

 

    "డాక్టర్ గారూ! ఏడో నెంబర్ రూంలో ఖాదర్ గారి మనవడికి ఎలాగోలా ఆపరేషన్ చేసి బ్రతికించండి! ఆయన ఒకటే ఏడుస్తున్నారు. చూడలేకుండా వున్నాం" అర్ధిస్తున్నట్లు అడిగి అతని కొడుకు పోవడం - మొదలైన విషయాలు వివరించింది. చెబుతుంటేనే ఆమె గొంతు గద్గదమైంది.

 

    వింటున్న శరత్ చంద్రకి హృదయం చెమ్మగిల్లింది! కానీ..... కానీ తనేం చేయగలడు? ఆమెకేమని సమాధానం చెప్పగలడు. వాళ్ళని ఏమని సముదాయించమని సలహా ఇవ్వగలడు? పైకి చెప్పగలిగే సమస్యేనా తనది?!

 

    "చెయ్యడం కుదరదమ్మా" అన్నాడు ఏం చెప్పాలో తెలీక. అతని మాట తడబడింది.

 

    "ముందు చేస్తామనే చెప్పారట డాక్టరుగారూ! మీరేం అనుకోకపోతే.... మీకు విడిగా డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధంగా వున్నారు" ఎలా చెప్పాలో తెలీనట్లు తడబడుతూ చెప్పలేక చెబుతున్నట్లు చెప్పింది.

 

    "డబ్బా.....?" ఊహించని విధంగా ఛెళ్ళున చరిచినట్లయింది అతనికి.

 

    "మీ వారి ఆపరేషన్ కి నాకు ఎంత డబ్బిచ్చారు?" అన్నాడు.

 

    ఆమె తల వంచుకుంది!

 

    "ప్రతి పని అవరోధానికీ కారణం డబ్బు మాత్రమేకాదు! సారీ" అని ఆమె మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.


                            *    *    *    *


    ఫోను విసురుగా పెట్టేసి, తన బెడ్ రూంలో కెళ్ళి మంచమ్మీద వాలిపోయింది నీలిమ. ఆమె మనసంతా కలత కలతగా వుంది. కళ్ళు అగ్నిగోళాల్లో వున్నాయి. మెల్లగా రెప్పలు వాల్చింది.

 

    భర్తమీద అనుమానం.... ఉదయం తన కోపాన్ని పట్టించుకోకుండా వెళ్ళాడనే ఉడుకుమోత్తనంతో కలిసి మనసుకి పిచ్చెక్కిస్తోంది.

 Previous Page Next Page