"పిన్నీ! వున్నావు నాకు నీకంటే చుట్టం, ఆప్తులు లేరు కాని అలా మాట్లాడకు పిన్నీ. నాకు భయంగా వుంటుంది. నీలో అగ్ని చెలరేగిపోతూ వుంది. అది నాకు భరించటం దుస్సాధ్యం."
"డాక్టర్! ఈరోజు ఎంత సుదినం! మనిద్దరం మరింత చేరువకు వచ్చాము. జబ్బులు రావటం ఒకవిధంగా యెంత మంచిదో చూశావా?"
"అదిగో అటువంటి మాటలే..."
"చిరంజీవీ! ఏంచేయను? నేను మాట్లాడకుండా వుండగలనుకాని, మాట్లాడితే యిలా మాట్లాడకుండా వుండలేను. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, అభిమానం చిరంజీవి! అటువంటి నీతో అబద్దాలు చెప్పమంటావా?"
నేను నిస్పృహతో నిట్టూర్చి "పో పిన్నీ" అన్నాను.
ఆమె మెదలకుండా కూర్చుంది. నేనామె చేతిని మెల్లగా వదిలేశాను. రెండోచేయి నా హృదయంమీదే యింకా వుంది. నేను లజ్జితుడినయినాను. "నాకు జ్వరంగా వుందని నీకు తెలుసా?" అనడిగాను.
"తెలుసు రెండురోజులనుంచి నీవు రాకుండా వుండేసరికి నీకు తప్పకుండా జ్వరం వచ్చివుంటుందని అనుకున్నాను. వారితో చెప్పేసరికి 'పోయి వెంటనే చూసిరావే, మా నాయనకు యెలా వుందో" అన్నారు వెంటనే బయల్దేరి వచ్చేశాను."
"ఇల్లు నీకెలా తెలుసు?"
"మొదటిసారి నిన్ను మా యింటికి తీసుకురాలా? ఆ కుర్రాడు యిక్కడిదాకా వచ్చి చూపించి వెళ్ళాడు."
"బాబాయికి ఎలా వుంది పిన్నీ?"
ఆమె దీనిని వెనువెంటనే జవాబు చెప్పలేదు. తల ప్రక్కకు త్రిప్పుకొని "చనిపోయే వాళ్ళకు యెలా వుంటుందో అలాగే వుంది" అన్నది.
"పిన్నీ" అని అరిచాను. మళ్ళీ వెంటనే బలహీనంగా "అవును పిన్నీ, బాబాయి యింక అట్టేరోజులు బ్రతకడు" అన్నాను.
ఆమె మౌనంగా వూరుకుంది. "పిన్నీ నీకు బాధగా వుందా?" అన్నాను.
ఆం ఎముఖం వికాసం పొందింది. "జాతస్య మరణం ధృవమ్" అంది.
నేను నిట్టూర్పుని అణచుకున్నాను.
నా గుండెకు ఆమెచేయి అనుకోకుండా మరింత గట్టిగా అదిమి తీక్షణము. స్వచ్చము అయిన స్వరంతో "పక్వాని తరుపర్ణాని వతంతి క్రమశో యధా! తధైవ జంతవః కాలే కాత్రత పరివేదనా" అంది.
అలా అంటున్నప్పుడు ఆమె కంఠంలోని వెటకారం, వ్యంగ్యం, కసి స్పష్టంగా గమనించగలిగాను.
"అబ్బ" అన్నాను బాధతో.
"ఏమిటి?"
ఆమె చేయి నా గుండెకు అదుముకుంటూ వుండడంవల్ల గాజులు గుచ్చుకుని నొప్పిగా వుంది. "గాజులు" అన్నాను.
"సంకెళ్ళు" అంది నవ్వుతూ.
నేను ఉలిక్కిపడ్డాను ఆమె యింతలో అక్కడనుండి చేయి తీసివేయటంలో పట్టుతప్పి, నా హృదయానికి గట్టిగా రాసుకుని పుటుక్కుమని ఒకగాజు విరిగిపోవటమే గాకుండా గుచ్చుకుని చరచర నెత్తురు చిమ్మింది.
"అయ్యో!" అంది అనసూయ.
"నీ సంకెళ్ళు రక్తాన్ని కూడా చవి చూస్తాయా?" అన్నాను.
"తప్పదనుకుంటాను" అంది నవ్వుతూ, "బానిసత్వం విరిగిపోయే సమయంలో, స్వాతంత్ర్యం ఉద్యమంలో రక్తపాఠం సంభవించకపోదు కదా!"
'ఎంత కఠినరాలు ఈమె' అనుకుంటూ నిశితంగా ఆమెవంక చూశాను. ఆమె ముఖం శోభాయమానంగా వెలిగిపోతుంది. ఆమెలోని విచారాన్ని కనిపెట్టటం చాలా కష్టమని గుర్తించాను.
ఆమెతో పరిచయమైనా మొదటిక్షణంనుంచీ ఏమిటో అంతరంగికంగా చెప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాను. కాని అది ఏమిటో నాకు యింతవరకూ తెలియదు.
అనసూయ లేచి నిల్చుంది. "నీకు త్వరగా నయం కావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను" అంది.
నేను కోపంతో, విచారంతో "ఆ పని చేయకు. మరోవ్యక్తిని గురించికూడా నిన్ను నీవు కించపర్చుకోకు" అన్నాను.
ఆమె దీనికి ప్రత్యుత్తరం పలకకుండా మందహాసం చేసి వూరుకుంది. ఆమె యెటువంటి పరిస్థితిలోకూడా అంత అద్భుతంగా, మనోహరంగా చిరునవ్వు నవ్వగలదు. ఆఖరికి భర్త శాశ్వతంగా కన్ను మూయబోయే తరుణంలో కూడానేమో!
అనసూయ వెళ్ళిపోయింది. నేను యివాళ ఆమెను "పిన్నీ!" అని పిలిచాను. "నువ్వు" అని సంబోధించాను. ఆమెకూడా అలాగే చేసింది. అప్పుడు హృదయం తేలికపడినట్లనిపించింది. కాని వెళ్ళిపోయాక దాని తాలూకు ఛాయలు కూడా ఏమీ మిగలలేదు. నేను ఎప్పటి డాక్టర్ చిరంజీవిగా మిగిలిపోయా అదృష్టవశాత్తూ ఆమె యీనాడు సంభాషణలలో ఉద్రేకంగా మాట్లాడి నన్ను గందరగోళం చేయలేదు.
* * *
మూడు నాలుగురోజుల్లో నాకు స్వస్థత చేకూరింది. ఈలోగా ఆమె వచ్చి నన్ను మరోసారి చూచి వెళ్ళింది. మా యిద్దరి మధ్యా చాలా మామూలు సంభాషణ నడిచింది. తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను.
బాబాయి పరిస్థితి మరీ విషమించింది. చీకటి పడుతుండగా ఆయన భయంతో వణికిపోయేవాడు. అందువల్ల ఒక్కోసారి అర్ధరాత్రివరకూ వుండవలసి వస్తూ వుండేది.
నాకు జ్వరం నిమ్మళించి వాళ్ళ యింటికి వెళ్ళిన మొదటిరోజున అనసూయను తిరిగి "పిన్నీ!" అని పిలుద్దామనుకున్నానుగాని యెంత ప్రయత్నించినా నాలికను సాధ్యంకాలేదు. 'నువ్వు' అని సంబోధిద్దామను కున్నాను. కాని 'మీరు' అనే బయటకు వచ్చింది. సిగ్గుతో కుమిలిపోయాను. ఆమె నవ్వలేదు. ఆమె ముఖంలో యెటువంటి ఆశ్చర్యం పొడసూపలేదు. "రండి డాక్టర్! వారికెలా వుందో చెప్పండి. నాకు చాలా ఆందోళనగా వుంది" అన్నది లోనికి దారితీస్తూ.