Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 18


    కొన్నిరోజుల పిదప అన్నమాట- ఆ రాత్రి పదిగంటలైనప్పుడు, రోగియైన బాబాయి అలసి నిద్రపోతున్నప్పుడు, నేనూ అనసూయా ఒకరి ముఖం ఒకరు చూచుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, ఎందుకో ఆమె తలవంచుకొని, క్షణం గడిచాక పైకెత్తి మ్లాన మందహాసం చేసి "డాక్టర్! మీరెవర్నీ ప్రేమించలేదా?" అంది.    
                                                     * * *    
    నేను ఉలికిపడి మౌనం ధరించాను. ఆమె రెట్టించింది.    
    "ప్రేమించలేదు" అన్నాను.    
    "మీరు మంచిపని చేయలేదు డాక్టర్! ప్రేమించి వుండాల్సింది. మీరూ ప్రేమించబడేవారు. ఎప్పుడూ ప్రేమించబడకుండా వుండటంకన్నా ప్రేమించబడి విఘ్నం వాటిల్లినా మంచిదే" అంది నిర్లిప్తంగా.    
    ఇహ నాకు మాత్రం సిగ్గు ఎందుకు? నేనూ కటువుగా ప్రవర్తించాలి.    
    "మీకు జరిగిందేమిటి- అలా?" అన్నాను.    
    "అవును."    
    "ఏమిటి, ప్రేమ! భర్త వుండికూడా?"    
    "మీరు కంగారుపడకండి. నేను పెళ్ళి చేసుకోకముందు అది తటస్థించింది."    
    ఆమె నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పుకు పోసాగింది. "ఆయనగారూ, మా పెళ్ళి వ్యవహారం గురించి మీకు ఆనాడు చెప్పారు గుర్తుందా? కానీ నేనీయనకు సతీమణి నవుతానని కలలోకూడా అనుకోలేదు డాక్టర్! నేను స్కూల్ ఫైనల్ వరకూ చదువుకున్నాను. అప్పుడు నేను పిచ్చి అనసూయను. పెళ్ళయాక హఠాత్తుగా ఆడది చాలా కొత్త విషయాలు తెలుసుకొంటుంది. కనీసం తెలుసుకొనేందుకు అవకాశం వుంది.    
    "అసలు ఆడదాని జీవితంలో అసహ్యాలు యెక్కువ ఆమె పుట్టినప్పుడే బంధుమిత్రుల ముఖాలు కళకళలాడకపోవడంతో యీ అసహ్యం ప్రారంభ మవుతుంది. ఆమెకు జరిగిన సంగతులు ఆమెకు తెలియకుండా ముందు ప్రపంచానికి తెలుస్తాయి. పెళ్ళిచూపుల వ్యవహారం వరకూ వచ్చేసరికీ ఈ అసహ్యం పరాకాష్టనందుకుంటుంది. పెళ్ళిచూపుల సమయంలో ఆమె మనస్సు యెంత విప్లవాత్మకంగా వుంటుందో ఊహించగలరా డాక్టర్! కాని ఆమె నవ్వుతుంది. ముసిముసిగా నవ్వుతుంది. మిమ్మల్ని చప్పున ఆకర్షించే సిగ్గు నభినయిస్తుంది. ఇవే ఆమె పతనానికి దారితీస్తాయి.    
    అప్పుడు యీయనగారు నలభై ఏళ్ళు దాటినమనిషి! అయినా, మంచి దృఢంగా వుండేవారు. ఈయనక్రింద మా నాన్న చిన్న ఉద్యోగం చేస్తూండేవారు. నా పెళ్ళిని గురించి నానా తంటాలు పడుతూండేవాడు. కాని యింతలోనే ఒక అందగాడైన యువకుడు ఆ వూరు వచ్చి నా మనసు దోచుకున్నాడు.    
    "మా వూరి మీదుగా పోయే రోడ్డుమీద ప్రతి పది నిముషాలకూ ఒక బస్సు పోతూనే వుంటుంది. ఒకనాడు అటువంటి బస్సులోంచి దిగి ఊళ్ళోకి వచ్చాడు. ఆ సమయంలో నేను కూరగాయలకి  వచ్చాను. అతన్ని యధాలాపంగా చూశాను.    
    కాని, చూసీ చూడగానే సమ్మోహితురాలినయిపోలేదు. గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళెవరూ మొదటిచూపులో యెప్పుడూ ప్రేమించుకుని వుండరు. చూసి వెళ్ళిపోయాను. అతన్ని ఆ సాయంత్రం చూశాను, మరునాటి ఉదయం చూశాను. ఆ సాయంత్రం చూశాను.    
    "క్రమంగా నేను అతడ్ని చూసి ఆకర్షితురాలినయాను. అతని అందం నాకు బోధపడింది. క్లిష్టమైన ఘట్టమే ముందు సంఘటిల్లింది. కాబట్టి మిగతాది సులభంగా జరిగిపోయింది. అతను పట్టణాల్లో తిరిగిన యువకుడు. అక్కడి వాళ్ళ వేషభాషల్ని గురించీ ఆకక్ది వాతావరణాన్ని గురించీ విప్పి చెప్పేవాడు. పోనీ నన్ను ప్రలోభపరుద్దామని డాబులు పలికేవాడు. కాని నేను శ్రద్దగా ఆలకించేదాన్ని! ఆత్మ పరిశీలన చేసుకొనేసరికి నేను ఎటువంటి జీవితాన్ని వాంఛిస్తున్నానో తెలుసుకున్నాను.    
    "దాపరికమెందుకు? అతనికి నన్ను సమర్పించుకున్నాను.    
    "కథలో ఏమీ క్రొత్తలేదు డాక్టర్! టూకీగా చెబుతాను. అతను అందగాడు గాబట్టి పనిమీద మరో వూరు పోయినప్పుడు అక్కడ మరో యువతి ప్రేమకు అతను గురి అయినాడు. ఆమె ధనవంతురాలు తండ్రికూడా ఆటంకపర్చలేదు. కాబట్టి ఏకంగా అతను పెళ్ళిచేసుకొని వచ్చి నన్ను క్షమార్పణ అడిగాడు. 'క్షమించాను పొమ్మ'న్నాను తలవంచుకుని వెళ్ళిపోయాడు.    
    "నిజం డాక్టర్! అప్పుడు బాధపడలేదు. చాలా అసహ్యంగా, గర్వంగా చెప్పాను ఆమాట. కాని ఆ తర్వాత ఏకాంతంగా ఆలోచించుకునేసరికి వెయ్యి బల్లాలు ఒక్కసారి గుచ్చుకొన్నట్లు, కొండమీది రాయి ఒకటి దొర్లి మీదపడ్డట్లు, మంటల్లోకి దూకినట్లు బాధ కలిగి బిగ్గరగా ఏడ్చేశాను.    
    "కాని వెంటనే ఏమిటో అనిపించింది. అతని భార్య యెక్కువ కాలం బ్రతకదనీ, టి.బి. వచ్చి చచ్చిపోతుందనీ రాక్షసిలా నవ్వాను.    
    "సరిగ్గా అలా నవ్వుతుండగా కొండమీదకు వచ్చి యీయన నన్ను చూశాడు. అంతకుముందు కూడా చూసే వుంటాడు. కాని యీసారి సమ్మోహితుడైనాడు గావును, వెళ్ళి మానాన్నతో మాట్లాడాడు. మానాన్న స్వర్గం దొరికినట్లుగా ఉప్పొంగిపోయాడు. మా పెళ్ళి జరిగింది."    
    "ఇదీ కథ డాక్టర్! నన్ను వివాహమాడాక తనను దురదృష్టదేవత పట్టుకుందని ఆయనే చెప్పుకున్నారుగా, తరవాతది మీకు తెలిసిందే."    
    ఆమె తలవంచుకుని కూర్చున్నది మాట్లాడటం ఆపి, నేనడిగాను. "అయితే ఆ యువకుడిప్పు డెక్కడున్నాడు? అతని భార్య..."    
    ఆమె పెదవులు విచిత్రంగా హసించాయి. "ఏడాది తిరగకుండానే అతని భార్య మరణించింది. బహుశా టి.వి. అనుకుంటా ఇప్పుడతను ఢిల్లీలో పెద్ద పదవిలో వున్నాడు. మళ్ళీ పెళ్ళిచేసుకోలేదు."    
    ఆమె పడగ విప్పిన నాగులా తలయెత్తింది. నేత్రాలు రక్తారుణ కాంతితో ప్రజ్వరిల్లుతున్నాయి. "వినండి డాక్టర్! నా మనస్సులో వున్నమాట శ్రద్దగా వినండి. ఈయనతో పెళ్ళి జరిగినందుకు నేను చింతించలేదు. నా జీవితం భగ్నమైనదని ఆక్రోశించలేదు. ఆ రోజుల్లో అది జరగక తప్పలేదు. కాని.... పెళ్ళిపీటలమీద తల యెత్తి ఆయనవంక ఉదాసీనంగా చూసినప్పుడు 'ఈయన యెక్కువకాలం బ్రతకడనిపించింది. ముగుస్తోంది కథ. నా జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది నేను ఆశించిన జీవితాన్ని నేను సమీపించబోతున్నాను. గడువులో బంధాలు తెగిపోతున్నాయి. ఆ తర్వాత ఒక్కక్షణం, అమూల్యమైన కాలంలో వ్యర్ధం చేయను. నా జీవితం మీలాంటి వారికి చిత్రంగా, అసహ్యంగా కనబడవచ్చు కాని అదే నాకు పరమానందం. మీకు చెప్పానే ఒకసారి తెరలనుగురించి, ఆ తెరలను చీల్చుకొని లోపలకు దూసుకుపోవటంమీద నాకు వ్యామోహం నేను వితంతువునైన కొద్ది వ్యవధి లోనే ఢిల్లీకి ఎగిరిపోతాను. క్రొత్త పెళ్ళికూతుర్ని అవుతాను. అదీ యెలా? ఓహో! మీకు నా నిజస్వరూపం యింకా సరిగ్గా తెలియదుకదూ, ఇప్పుడే చూద్దురు గాని."

 Previous Page Next Page