రెండు ఊళ్ళు కలిశాయి. రెండు గుండెలు కలిశాయి. రెండు నదులు కలిశాయి. జీవితం నదిలా సాగిపోతుంటుంది. మరొక నది వచ్చి అందులో కలుస్తుంది. అది సంబరపు వేళ. అది ఆనందపువేళ. అల్లాంటి పండుగ జరుపుకుంటున్నారు కోయలు.
పడుచులకు అది మహా పర్వం. యువకులకు ఊళ్ళోని యువతులంతా అక్కచెల్లెండ్లె. ఊరంతా ఒకే కుటుంబం. ఒకే పెద్ద నుంచి వచ్చిన తెగ. పక్క ఊరి యువతులే మరదళ్ళు. ఊరి యువకులకు మరదళ్లు దొరికారు. చెట్టాపట్టాలు పట్టుకొని ఎగురుతున్నారు. వారి గుండెలు గంతులు వేస్తున్నాయి. కోయ యువతి గుండె విచ్చి చూపుతుంది. ఆమెకు దాచవలసింది లేదు. ఆమెకు రహస్యాలు లేవు. ఆమె అడవి బిడ్డ. అడవిలో దాచేదే ఉండదు. మగవాడు మొనగాడు. అడవిలోకి దూరాలి అంతే. అన్నీ అతడివే.
కోయగూడేనికి మత్తెక్కింది. గాలికి మత్తెక్కింది. మంట మత్తు మత్తుగా మండుతూంది. వాతావరణానికి మత్తెక్కింది.
మత్తులో పాటలు పాడుతున్నారు. పడుచులు ఆడపడచుల మీద సవాళ్లు విసురుతున్నారు. వారేం తక్కువా? జవాబుల బాణాలు విసురుతున్నారు. అవి మల్లెలవి. మల్లలలో విరజాజులవి. పూల బాణాల తాకిడికి తల్లడిల్లిన సింగన్న, కింద గూడెం సింగి కళ్ళలోకి చూచాడు. సింగి కళ్ళు వాలిపోయాయి. చూపులు రాలిపోయాయి. గుండెలో గుచ్చుకోవలసినవి గుచ్చుకున్నయి.
కోళ్ళు కూసేదాకా కోలాహలం కొనసాగింది. కుండలు ఖాళీ అయినాయి. మాంసం అయిపోయింది. మత్తు వదిలింది వేగుచుక్క బొడిచింది. గోరుకోళ్ళు కుంగాయి, తూరుపు ఎర్రవారుతూంది. మత్తుగా మందానిలం వీస్తూంది.
రెండు గూడాలు వేటకు సిద్ధం అవుతున్నాయి. వేటకంటే గూడెం యావత్తూ కదలాల్సిందే. పిల్లా పెద్ద, ముసలి ముతక, చూలాలు, చిన్నది భేదంలేదు అంతా అడవి మీద పడాల్సిందే! కోయకు అడవే స్వర్గం. అరణ్యమే నరకం. అడవిలో పడితే అతనికేదీ తెలియదు. పులి కరుచుకు పోతుందా పోనీ. మిగిలినవాడే కోయ. అతనికి చావు పుటకా రెండూ సమానమే. రెండూ సహజములే. చస్తానని వేట మానుకోలేడు. అది అతని జీవితంలో భాగం. చావులోనూ భాగమే. అడవికి వెరచే కోయ వుండడు. పులికి వెరచే కోయ పుట్టడు. అతడు అడవి మీద పడ్డాడంటే కలచివేస్తాడు; జంతువును వెంటాడి వేటాడ్తాడు. అన్నీ తాను తినడానికి చంపడు. చంపినవాటి నన్నింటినీ పట్టుకపోడు. అది అతని వేడుక. జంతువును చంపాడంటే పొంగిపోతాడు. వీరుడు అవుతాడు. శూరుడు అవుతాడు. తన బలాన్ని చూచుకుంటాడు. బుజాలను చూచుకుంటాడు. బల్లాన్ని చూసుకుంటాడు. తుపాకిని చూచుకుంటాడు. మురిసిపోతాడు. పొంగిపోతాడు.
రెండు గూడాలు వేటకు సాగాయి. బల్లాలు, బరిసెలు, ఒడిశలలు, తుపాకులు, దుడ్డుకర్రలతో బయలుదేరారు. ఉత్సాహంగా బయలుదేరారు. పదాలు పాడుతూ బయలుదేరారు. యువతుల గుంపు సవాళ్లు విసురుతూంది. యువకులు చేతులెత్తి జవాబు చెపుతున్నారు. వారు సద్దిమూటలతో బయలుదేరలేదు. వారి కది అవసరంలేదు. అడవి తల్లి వారికన్నీ సమకూరుస్తుంది. ఎక్కడ ఏ కాయ దొరికినా కడుపు నిండుతుంది. ఎక్కడ ఏ గడ్డి దొరికినా ఆకలి తీరుతుంది.
ఆటవికులు సాగిపోతున్నారు. ఆటవిడుపుకు తరలిపోతున్నారు. ఎండ యెక్కువౌతుంది. ఇనుప కమ్ముల్లాంటి శరీరాలకు చెమట పడ్తూంది. ఆ చెమటయే వారికి ఆనందం. అందులోనే బంగారం పండిస్తాడతను, సాహుకారు భోషాణం నింపుతుంటాడు.
పొలాలు దాటారు. పల్లపు ప్రదేశం దాటారు. అడవిలోకి దూరారు. అందులోకి సూర్య కిరణాలు చొరలేవు. చల్లని నీడ. యేట చెట్లు, మద్దులు, టేకులు, చెన్నంగులు, వెలగలు, ఉసిళ్ళు, ఇప్పులు ఒకటేమిటి లక్షరకాల చెట్లు. చెట్లకు అల్లుకున్న తీగలు సాగిపోతున్నది జనం. జైత్రయాత్ర సాగిస్తున్నది. జనం అమాయకమయిన జంతువులమీద క్రూరమృగాలమీద.
సింగన్న ముందుగా సాగిపోతున్నాడు. అతని చేతిలో తుపాకి ఉంది. అదీ అతని ధైర్యం. అతనిని అనుసరిస్తున్నారంతా. కొండ ఎక్కుతున్నారు. కొండ కొమ్ము అనుకునేది యెక్కితే అదీ బయలే. క్రింది నుంచి ఎత్తు అనిపించేది ఎక్కింతరువాత పల్లమే.
అడవి తుప్పలు, బరకలు, చుట్టూ చీకటి, చిత్రమైన చీకటి. భూమి పగిలినట్లు వున్నాయి గడ్డలు. ఇంకా ఎక్కుతున్నారు. పాటలు పాడుతున్నారు. అడవికి ప్రాణం వచ్చినట్లుంది. పాటలు పాడుతున్నట్లుంది.
సింగన్నకు ఏదో అలికిడి వినిపించింది. చేయి చూపించాడు అంతే, అంతా మౌనం చీమ చిటుక్కు మంటే వినిపించేట్లుంటుంది. అది వేట. వేటలో నియమం. సైగ అందిందా అంతా గప్ చిప్, చుప్ చాప్, ఒక్క మాట లేదు. ఒక్క పలుకు లేదు. మాటలన్నీ మనసుల్లోనే, సైగలన్నీ కళ్ళలోనే.
ఊపిరి బిగబట్టుకొని నుంచుంది జనం. కిక్కురు మనడం లేదు. అంతా నిశ్శబ్దం. క్షణం క్రితం జీవం పోసుకున్న అడవి జవ చచ్చి పడిపోయింది. తుపాకి బుజాన వేసుకొని పోతున్నాడు సింగన్న. గోడలా వాడిగా ఉంది దారి. రాతినేల ప్రతి నిముషం జారిపోతామనే భయం. చెట్లు మోళ్ళు సూదుల్లా ఉన్నాయి. జంతువు జాడ వెతుకుతూ పోతున్నాడు. అతని మాంసకండరాలు బిగుసుకుపోతున్నాయి. మలచినట్లుంది అతని దేహం. నిగనిగ లాడుతున్నాడు. ఇనుపభీమునిలా ఉన్నాడు. మెరకమీద మాయం అయినాడు.
అతడు పందెంవేసి సాగిపోతున్నాడు. పంతంతో సాగిపోతున్నాడు. తనను కవ్వించిన జంతువుకోసం పోతున్నాడు. వాసన చూచి జంతువు జాడ తెలుసుకోగలడతను. దాన్ని చంపందే బయటపడడు. అది కోయ పట్టుదల. కోయ ప్రతిజ్ఞ.
"ఢాం" తుపాకి పేలింది. అది కిందవున్న వారి గుండెల్లో పేలింది. జనంలో కేకలు, అరుపులు, పురుగులు.
"పడ్డది, ఒహ్హో పడ్డది." ఒకటే కేకలు అంతా ఉరికారు. పడుతూ లేస్తూ పరిగెత్తారు. ఎగుడు దిగుడు రాళ్ళదారి.
పెద్ద కణుజు పడివుంది. తుపాకీ పట్టుకొని నుంచొని ఉన్నాడు సింగన్న. నవ్వుతున్నాడు. అంతా అతన్ని చుట్టేశారు. ఆడా మగా దాని చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. సింగన్నను ఎత్తుకొని ఎగిరారు. ప్రశ్నల వర్షం కురిపించారు.
"ఎట్ల కొట్టినవే?"
ఆటలు, పాటలు అల్లరి, గందరగోళం. అడవి అదిరిపోతోంది. నిప్పు మండింది. కణుజు మాంసం కాలింది. అక్కడ వాటాల్లేవు. వాటికోసం తగాదా లేదు. ఎవరికి దొరికింది వారిది. ఎవరికి కావలసినంత వారికి.
అంతటితో చాలా? ఇంకా కావాలా? ఈ విషయంలో చర్చసాగింది. యువకులంతా ఇంకా కావాలన్నారు. వృద్ధులు అంతటితో చాలన్నారు. జనం రెండు పక్షాలుగా చీలింది. వాదోపవాదాలు జరిగాయి. కలహందాకా వచ్చింది. కొట్టుకునే వరకు వచ్చింది. అదంతా మామూలే వారికి. యువకులు నెగ్గడంతో సద్దుమణిగింది. నిర్ణయం జరిగిన తరువాత అంతా బద్ధులే. కొంతసేపు విశ్రాంతి తీసుకొని వేట సాగించాలనుకున్నారు. గుంపులు గుంపులుగా విడిపోయారు. చెట్లక్రింద రాళ్ళ మీద బండలమీద మెడలు వాల్చారు.
సింగన్నకు మెళుకువ వచ్చేవరకు పొద్దు వాలిపోయింది. లేచి చూస్తే ప్రక్కన ఎవరూలేరు - తుపాకీ తప్ప. లేచి తుపాకి బుజానికి తగిలించుకున్నాడు. అడవి తుప్పల్లోంచి దుబ్బల్లోంచి సాగిపోతున్నడు. మనిషి అలికిడి విని నెమళ్ళ గుంపు ఎగిరి మెట్టమీద కూర్చుంది. నెమలి తెలివైన పక్షి. అలికిడిని పట్టి తప్పుకుంటుంది. దాన్ని పట్టడం కొట్టడం రెండు కష్టమే. ఎంతోసేపు పొంచివుండి కొడితేగాని నెమలి పడదు. నెమలి మాంసం కోయకు ఎంతో ఇష్టం. నెమలిని వేతామనుకున్నాడు. క్రింది గూడెం వాళ్ళకు నెమలి మాంసం పెట్టాలనుకున్నాడు. పొద్దు చూచాడు. అట్టేలేదు. అయినా ప్రయత్నిద్దామనుకున్నాడు. పొదలచాటు నుంచి సాగాడు. పొంచి కూర్చున్నాడు. అయినా ప్రయత్నిద్దామనుకున్నాడు. పొదలచాటు నుంచి సాగాడు. పొంచి కూర్చున్నాడు. తుపాకి ఢామ్మనటం నెమళ్ళు లేచిపోవడం ఒకేసారి జరిగాయి. గురితప్పిపోయింది.
ఆ దెబ్బకు మెళుకువ వచ్చింది బండమీద పడుకొని నిద్రపోయిన సింగికి. లేచి అటూ ఇటూ చూచింది. ఎవరూలేరు. లేచి నుంచుంది. కేకలేదా మనుకుంది. ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది. ఆలకించింది. ధ్యానంగా విన్నది. అవును అది మనిషి అడుగుల చప్పుడే. అటువైపు చూస్తూ నుంచుంది.
గురితప్పిపోయింది. దాంతో క్షోభ చెందాడు సింగన్న. తరుముతున్న జంతువు దగాచేసి పారిపోయినట్లనిపించింది. ఒక్కడూ పలకరాతి మీద చతికిలపడ్డాడు. అడవి జంతువులా కూర్చుని నిట్టూర్చాడు. అడుగుల అలికిడి వినిపించింది. చుట్టూ కలయచూచాడు. తాను కూర్చున్న రాతిమీద పులిపెంటికలు కనిపించాయి! ఉదయం ఇక్కడ కూర్చుని ఉండాలనుకున్నాడు. లేచాడు. కాలితో పులి పెంట్రికలను చిదిమేశాడు. సాగిపోయాడు.
కింద ఎక్కడో పల్లంనుంచి వేటగాళ్ళ కేకలు వినిపిస్తున్నాయి. బహుశ అది రొప్పువేట. జనం తనను వదలి వెళ్ళిపోయారు. ఎంత మొద్దు నిద్రపోయాడు తాను. సాగిపోతున్నాడు. అతడు అటూ ఇటూ చూచాడు. రాతిమీద నుంచుని భయం భయంగా చూస్తున్న అమ్మాయి కనిపించింది. ఇంకాస్త ముందుకు సాగాడు.
సింగి.
ఒంటరిగా!