Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 17


    
    "కళ్ళు మూసుకోనక్కర్లేదు. ఇదేమీ హిప్నాటిజంకాదు. నేను హిప్నాటిస్ట్ ను కూడా కాదు. కేవలం ఆలోచన. నిజాన్ని ఛేదించటంకోసం."
    
    "కళ్ళు మూసుకుంటే ఆలోచనల లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నాను."
    
    "మీ ఇష్టం."
    
    కళ్ళు మూసుకుంది.
    
    "మీ తండ్రిలో ఒక్క మంచిలక్షణం కూడా కనిపించలేదా?"
    
    "గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఉద్యోగంలో చాలా డ్యూటీమైండెడ్ గా వుండేవారు. తోటి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ప్రవర్తించినా సహించేవారు కాదు."
    
    "అది ఆఫీసు విషయమనుకుందాం కుటుంబ వ్యవహారాల్లో....?"
    
    "అప్పుడప్పుడు ఆయనకు ప్రేమ ముంచుకు వచ్చేది. అలాంటి సమయాల్లో ఆ ప్రేమ ప్రవాహాన్ని తట్టుకోవటం కష్టంగా వుండేది."
    
    "ఇంకా...?"
    
    అడుగుతున్నకొద్దీ ఆమెకు ఒక్కొక్క పాయింటూ గుర్తొస్తున్నాయి. "అంత నిర్లక్ష్యంగా కనిపించే మనిషి పిల్లలుగానీ, భార్యగానీ అనారోగ్యానికి గురైతే బయటకు గంభీరంగా వున్నట్టు కనిపించినా, ట్రీట్ మెంట్ విషయంలో క్షణం ఆలస్యం చేసేవాడు కాదు. ఎంతో పీవిస్ట్ గా ప్రవర్తించే మనిషి అవసరమొస్తే డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేవారు."
    
    "కాబట్టి నువ్వెంతో ద్వేషిస్తున్న ఆ వ్యక్తిలో, తరిచి చూడగలిగినప్పుడు కొన్ని మంచిలక్షణాలు కనబడుతున్నాయన్నమాట కాబట్టి అతన్ని ఎందుకు క్షమించగూడదూ?"
    
    ఆమె తీవ్రమైన ఆలోచనలో పడినట్లే కనిపిస్తోంది.
    
    "నీ జీవితంలో మార్పు రావాలనుకుంటే నువ్వు ద్వేషం నుంచీ, అసూయనుంచీ, ఆగ్రహంనుంచీ బయటపడి క్షమించే స్థాయికి ఎదగక తప్పదు. ఇందాక చెప్పిన సూత్రమే. నీకు క్షమించటం చేతకానక్కరల్లేదు. 'నేను క్షమించాలి' అన్న భావనలోకి నీవు రాగలిగితే చాలు. 'నేను క్షమించాలి. నేను క్షమించాలి' అన్న భావన నీలో ప్రవహించగలగాలి.
    
    ఆమె ఆలోచనలు ఎక్కడికి వెడుతున్నాయో నేను తెలుసుకోగలుగుతున్నాను.
    
    "చూడూ" అన్నాను. "ఇతరుల్ని నేరం చేసినవారుగా చూడటం, తప్పులెంచుతూ ఉండటం, ఎప్పుడు లోపం కనబడుతుందా, దొంగను పట్టేసినట్లూ అవతలివాడిని అపరాధిగా ఎప్పుడు నిలబెడదామా అన్న తహతహా, ఇతరుల పట్ల పెంచుకున్న ద్వేషం.... ఈ భావనలతో ఇన్ని సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేశావు. ఒకవేళ నీ ప్రవృత్తి సబబైనదే అని సమర్ధించుకున్న....వీటివల్ల నీ జీవితంలో ఏదన్నా మార్పు వచ్చిందా? కొన్ని సంవత్సరాలక్రితం ఎలా వున్నావో ఇప్పుడూ అలాగే వున్నావు. అడుగు ముందుకు వెయ్యలేకపోయావు" 'నాకు క్షమించాలని వుంది' అని అనుకోవటం మొదలుపెట్టు. అలా అనుకోవటం మొదలుపెట్టిన తొలిక్షణంనుంచీ నీవు క్లీన్ అవటం మొదలుపెడతావు. అది ఓ కొత్తజీవితానికి ఆరంభమై తీరుతుంది."

    "మళ్ళీ చెపుతున్నాను. 'నాకు క్షమించాలని వుంది. నేను క్షమించటానికి ఇష్టపడుతున్నాను' అని నుకున్న ఈ క్షణం, నీ కొత్త జీవితానికి మొదటి క్షణమవుతుంది. ఇది ఫిలాసఫీ కాదు. ఆధ్యాత్మికత కాదు. దేముడికి సంబంధించిన విషయం కానేకాదు. సృష్టిలోని అద్బుతమైన ఏర్పాటు."
    
    ఆమె కనులు మూసుకుంది.
    
    "ఒక్క సత్యం గమనించు నీ తల్లిదండ్రులు ఎలాంటివారైనా గానీ... నీ జన్మ... నీ జన్మకు వాళ్ళే కారకులు."
    
    ఆమెలోని కదలికను స్పష్టంగా గమనించాను. మూసివున్న ఆమె కనులనుంచి అశ్రువులు జారిపడుతున్నాయి.
    
ఇహ నీ భర్తను గురించిన అపరాధభావం.
    
    "చూడూ! మంచీచెడూ....ఈ రెండింటికీ మధ్య వున్న తేడా చాలా చిన్నది. అతి సున్నితమైనది. కాని వాటి ఫలితాలు తీవ్రమైనవి. నీ ఎఫైర్ ఎంతదూరం వెళ్ళిందో నాకు తెలీదు. నేను పట్టించుకోను. కానీ ఈ ప్రపంచంలో ఇలాంటి అనుభవానికి గురైన వారిలో నీవు మొదటిదానివీకాదు. ఆఖరిదానివీ కాదు. చరిత్ర ఇలాంటి దయనీయ సంఘటనలతో, నిస్సహాయ సన్నివేశాలతో నిండిపోయి వుంది.
    
    "నీలో నీ భర్తపట్ల నీ గతాన్ని గురించిన అపరాధ భావం వుంటే... దానికి పరిష్కారం అనుక్షణం దాన్ని తలుచుకుంటూ కుమిలిపోవటం కాదు. నీ ప్రేమతో, సత్కామనతో, సద్భావనతో, సత్సాధనతో దాన్ని హరింపచేయటం ఇవన్నీ సమ్మిళితమై నీ భర్తపట్ల, పెంపొందుతున్నప్పుడు, అదో మహా ప్రవాహమై విలసిల్లుతున్నప్పుడు ఆ తేజస్సుతో గతంలోని అపశృతి దగ్ధమైపోతోంది. దాని ఉనికి చరిత్ర పుటలనుంచి దానంతట అదే తొలగిపోతుంది. ఉనికే లేనప్పుడు దాన్ని గురించిన భావానికి చోటేదీ? నీ భర్తపట్ల నీకు ప్రేమ వున్నదా?
    
    "ఉంది."
    
    "ఎలాంటి ప్రేమ?"
    
    "అన్ కండిషనల్ లవ్-ఎటువంటి ఫలితమూ ఆశించని ప్రేమ."
    
    ప్రశ్నా- జవాబు నేనే చెబుతున్నాను. అంటే ఆమెను, ఆమె తెలుసుకునే స్థితికి తీసుకువెడుతున్నాను. ఆ స్థాయికి ఆమెను తీసుకెళ్ళడానికి ఆమె స్థాయిని పెంచటానికి ప్రయత్నిస్తున్నాను.
    
    "అలాంటి ప్రేమను నీవు అందివ్వగలిగినప్పుడు నీలో గతం తాలూకు ఏ అపరాధ భావమూ లేదు. వుండటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ 'నిస్వార్ధం' ఓ పవిత్రాగ్ని ఆ పవిత్రాగ్నిలో ఎటువంటి అపవిత్రత అయినా దహించుకుపోవాల్సిందే!
    
    ఆమె ఏడుస్తోంది వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    
    ఇప్పుడు నీవు చెప్పిన ఏవేవో అస్వస్థతలు.

    
    "సైన్స్ ఒప్పుకుంది. మేధావులు ఒప్పుకున్నారు. మానసిక శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు."
    
    "ఏమని?"
    
    "మన శరీరాన్ని ఆక్రమిస్తోన్న చాల వ్యాధులకు మానసిక తీవ్రతే కారణమని."
    
    "దోమలు కుడితే వచ్చే మలేరియా విషయంలో, కలుషితమైన నీరు తాగితే వచ్చే జాండిస్, ఇంకా కొన్ని వ్యాధుల విషయంలో ఇది నిజం కాకపోవచ్చు. కానీ నీ శరీరాన్ని పీడించే దీర్ఘరోగాలు... ఆర్ త్రైటిస్, బీపీ, తలనొప్పి, డిప్రెషన్, గుండెపోటు, రక్తస్రావం, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వీటిలో మనిషిలో వుండే ద్వేషం, అసూయ, కాల్చుకు తినేసే కోపం, మితిమీరిన బాధ, వాటివల్ల ఏర్పడిన మానసికగాయాలు, మితిమీరిన ఆత్మనింద, నిన్ను నీవు అసహ్యించుకుంటూ బ్రతకటం, ప్రేమరాహిత్యం, కలవరపాటు, క్షమాగుణం లేకపోవటం, అసత్యధోరణి, శాడిజం.... ఇవి చాలావరకూ కారణాలు. రావటం మానసిక తీవ్రత వల్లే వచ్చినా ట్రీట్ మెంట్- వైద్యచికిత్స అవసరం కావచ్చు. అది వేరే విషయం.
    
    "కాని వాటికి కారణమైన నీ మానసిక భయంకరాలను దూరం చేసుకోగలిగితే మందులకు కూడా లొంగని నీ దీర్ఘకాలవ్యాధులు హరించుకుపోతాయి.

 Previous Page Next Page