"రాక్షసులకు ఇంతింత కోరలూ, మిడిగుడ్లు."
"అవి ఎవరి మనసులకైతే ఉంటాయో వాళ్లే రాక్షసులుగా పిలువబడతారు."
చాలాసేపు ఇరువురూ మాట్లాడలేదు. జంకి ఊరుకున్నట్లుగా వుంది. చివరకు అతను విసురుగా లేచి నిలబడి "నాగురించి నాకు అర్థమైనప్పుడు కదా నీకు అర్ధమయ్యేటట్లు చెప్పగలిగేది? ఈ రాత్రికి సెలవా?" అంటూ కదలబోయాడు.
ఆమె భయాందోళనతో లేచి "నన్ను తీవ్రసందేహాలకు గురిచేసి, నువ్వు హాయిగా నిష్క్రమిస్తున్నావా? సరే!" అంది కంపిత స్వరంతో.
అతను జాలిగా నవ్వి రెండడుగులు వేశాడు.
కానీ అనుకోని సంఘటన ఒకటి విచిత్రంగా జరిగిపోయింది. క్షణికమైన ఆవేశానికీ, పరిధులు దాటిన పిరికితనానికీ గురియై చప్పున అతనిచేయి మృదువుగా పట్టుకుని "నిన్ను వేడుకుంటాను. నువ్వు వెళ్ళిపోతే ఈ విషాదాన్ని భరించలేను" అంది.
తనను పట్టుకుని వున్న ఆమె మృదుహస్తంమీద తన చేతిని బుద్ధిపూర్వకంగా ఆనించి "ఇది పరీక్షాసమయం" అన్నాడు. ఇతరులు అవరోహించలేని వింత నిచ్చెనలు ఎక్కి పైకి వెళ్ళిపోతూ...
"ఎవరికి?" అందామె మ్లానవదనంతో.
"ఈ రెండింటిలో ఒకదానికి."
శశి ముఖం లజ్జారుణ రాగరంజితమై మరీ మనోహరంగా మారింది. చప్పున తన చేతిని వెనక్కి లాక్కుంది. ముసిముసిగా నవ్వి వూరుకుంది.
అతను మాట్లాడకుండా బయటకు నడిచాడు. అసహ్యం నీడవలె వెన్నాడుతుంది. సంక్షోభం అనే వస్తువు దానిని నీడవలె వెన్నాడుతోంది. శశి ఈ వేళ తన ముందు హృదయద్వారం సగం తెరిచింది. ఆ సగంచాలునని తాను బుకాయించాడు. ఛీ! వ్యర్ధజీవితం... ఆమె ఏమాత్రం తననుంచి సంగ్రహించింది?
తాను ఎవరు? చాలా క్రూరుడేమో! "అమ్మో వాడు!" అని నలుగురూ వేలెత్తి చూపిస్తారు తననిగురించి. దేనినైతే చెలగాటం ఆడకూడదో, దానితో ఆడుతున్నాడు. ఇది అమానుషం, పాపం అని మనసు ఘోషించకమానటం లేదు. కానీ ఈ మనసే ఇదివరకిది నీతిగా బోధించి వశపరచుకుంది. ఇది చాలా అన్యాయం అంది. తాను ఇప్పుడు తన అధీనుడు కాదు. ఎవరేం చెప్పినా చేసేందుకు సంసిద్ధుడిగా వున్నాడు. అపారమైన దుఃఖ సముద్రాన్ని ఈదటానికీ, ఈదేవాళ్ళకు చూచి ఏడవటానికీ, ఏడవనట్లు బింకం ప్రదర్శించటానికీ తయారైపోయాడు. మళ్ళీ ఇందులో తన తప్పేమీలేదని, అది విద్యుక్త ధర్మం అనీ ఏదో కంఠం ఘోషిస్తోంది.అజ్ఞాతంగా. ఈ కంఠం ఎవరిదై వుంటుందని ఆలోచించాడు. చిన్నక్క ఇంత స్వార్ధపరురాలు ఏమాత్రమూ కాదు. చిన్నక్కా! స్వార్ధమనేమాటకు అర్ధమేమిటి చెప్పవూ?" అని అతను ఒకవేళ ప్రశ్నిస్తే "త్యాగం గావును" అని చెప్పేస్తుంది నిస్సంశయంగా. మరి ఈ కంఠం పదేళ్ళనుంచి తాను ఊహించుకుని, పెంపొందింపజేస్తూ వచ్చిన శోకమూర్తి తాలూకు అయివుంటుంది.
"ఇంత ఆలస్యం చేశారేం?" అనడిగింది రాగిణి తలుపు తెరచి.
"ఊ" అని అస్పష్టంగా గొణిగి లోపలకు నడిచాడు.
ఆ రాత్రి అతను మంచంపై పడుకున్నాడు. రాగిణి లోపలగదిలో గిన్నెలు సర్దుతోంది. ఈ సంఘటన చాలా ఉల్లాసకరంగా వుంది. తాను ఈ ఇంట్లోకి వచ్చి దిగుదామని ఆలోచించలేదు. రైల్లో కూర్చునివుండగా హోటల్లో దిగుదామని అనుకుంటుండగా రాగిణి తలంపుకు వచ్చింది. రైలు దిగాక నిశ్చయం ధృఢపడింది.
కొంచెంసేపు వున్నాక రాగిణి వచ్చి సుదూరంలో చతికిలబడి "ఇంక కబుర్లు చెప్పండి?" అంది.
"అలాగే, నువ్వు ప్రారంభించు."
ఆమె కొంచెం ఆలోచించి "ప్రాక్టీస్ ఈ ఊళ్ళో పెడతారా? మీ ఊళ్ళో పెడతారా?" అని ప్రశ్నించింది.
"నేనసలు నా ప్రాక్టీస్ పెట్టదలుచుకోలేదు" ఠపీమని జవాబు చెప్పేశాడు రవి.
"ఏమి?"
"అలా అనిపిస్తోంది ఇప్పుడు నాకు. నేను సరదాకోసం చదివాను."
"మంచిమాటే! పెంకిమాటలు మాని కుదురుగా జవాబులు చెప్పండి . మీరు సరాసరి నా ఇంటికి వస్తారని ఏనాడూ నేను ఊహించలేదు. ఇప్పుడు అనిపిస్తోంది నాకు, నేను ఎంత ఋణపడివున్నానో అని "ఆమె కంఠం రుద్ధమయింది. "ఏమిటీ జీవితం? ఇన్ని నెలలు మిమ్మల్ని చూడకుండా ఎలా గడిపానో అర్ధంకావటంలేదు. నేను ప్రతిదినమూ లేచి నిద్రపోయేవరకూ ఏమి సాధిస్తున్నానో దురూహ్యం. నేను ప్రపంచానికి ఎంతో దూరంలో వున్నానని అనిపిస్తుంది. ఛీ! ఎవరైనా నన్ను తలుచుకుని నిట్టూరుస్తారేమోనన్న ఆశ విషయం అలావుంచి, అనుక్షణం బ్రతుకుమీద విరక్తితో, నామీద నాకున్న అసహ్యంతో జీవితం వెళ్ళిపోతోంది. ఇవాళ మీకు నిజంచెప్పాలి. ఒక్కో సంజవేళ మీమీద ఎంత కోపం వచ్చేదనుకున్నారు? మీకసలు మళ్ళీ కనబడకూడదని అనుకునేదాన్ని...."
"ఆ మనిషిమీదకూడా నీకెప్పుడూ అంతకోపం రాలేదన్నమాట."
"అబ్బ! ఏం మనుషులు మీరు ? మీ సమ్ముఖంలో ఎంతో ఆనందాన్ని ఆశిస్తుంటే ఇటువంటి మాటలు విసిరి గాయపరుస్తుంటారు. ఇవాళ నా పుట్టినరోజు. చాలా పవిత్రమైన దినం అని నా భావం. ఈ పవిత్రమైనవేళ అటువంటి పాడువిషయాలు ఎందుకు గుర్తుకుతెస్తారు? ఇది మీకు ధర్మమేనా?" అంటూంటే ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగి చెంపలనుండి జలజలా రాలిపోయాయి.
"రాగిణీ!" అన్నాడతను మితిలేని ఖేదంతో. "ఎంత పొరపాటు చేశాను?" ఇంతలో ఓ విషయం జ్ఞప్తికి వచ్చి, నాలిక కరుచుకుని "ఎంత మందమతిని రాగిణీ! ముందు కళ్ళు తుడుచుకో. ఎవరూ ఏడుస్తుంటే చూడకూడదని ఓ నియమం. కాస్తలేచి ఆ కొంకిని వున్న కోటు ఇటు అందియ్యి."
ఆమె కళ్ళు తుడుచుకుని లేచి మెల్లగా చెప్పినపని చేసి తిరిగి కూర్చోబోతుంది.
"అప్పుడే కూర్చోకు. ఇటు రా."
ఆమెకు ఏమీ పాలుపోలేదు. "ఫర్వాలేదు చెప్పండి, వింటాను" అంది లేనినవ్వు తెచ్చుకుని.
అతను వినిపించుకోకుండా "అబ్బ! రమ్మంటుంటే?"
చేసేది లేక రాగిణి అతనికి దగ్గరగా వచ్చి నిలుచుంది. ఈ క్షణం అతనికి మధురాతి మధురంగా తోచింది. జీవితం మధ్య ప్రేమలూ, స్నేహాలూ అనృతం. ఇదిమాత్రం నిజం. తన సామీప్యంలో అతిచొరవగా సంచరించిన ఇద్దరిలో ఈమెది అగ్రతాంబూలం ఈ మమతలో. అతను మత్తుగా కేటుజేబులు తడుముకున్నాడు. జేబుల్లో చేతులు వణుకుతున్నాయి . నల్లటి కోటు, నల్లని చీకట్లో నల్లగా కదుల్తోంది. ఈ మనోహరమైన సన్నివేశం భాగాలుగా కదుల్తోంది. ఈ మనోహరమైన సన్నివేశం భాగాలుగా విడగొట్టుకుంటున్న తను మూర్ఖుడు. కానీ కంపన అధికమైంది. ఎలాగో ఓ చిన్నపెట్టె బయటకు లాగి తెరిచాడు.