"రాగిణీ! ఇదేమిటో చూడు?"
విద్యుత్ వెలుగులో ఆమె నిశ్చేష్టురాలయింది. "ఎందుకిది?" అంది. తత్తరపాటుతో.
"జన్మదిన కానుక."
"నాకక్కరలేదు."
అతని మనస్సు చివుక్కుమంది. "అవతలివాళ్ళు ఎంత నొచ్చుకుంటారో అని ఆలోచించటం కూడా నీక్కక్కర్లేదు" అన్నాడు కోపంతో.
ఆమె తననితాను నిలద్రొక్కుకుని "ప్రపంచంలో ఇంతకంటే అన్యాయం వేరేవుందా? తప్పని మనస్ఫూర్తిగా నమ్మి ఓ పనిచేయటం, తిరస్కరించబూనటం కూడా నేరమేనన్నమాట!"
"తప్పా?" అన్నాడతను పాముకాటు తిన్న మనిషిలా.
"లేకపోతే ఏమిటి చెప్పండి? నేనెవరనుకున్నారు?"
"నువ్వింత పెడర్ధం తీస్తావనుకోలేదు."
"అయ్యో! అది మీరు చేస్తున్న పని" అని ఆమె మోకాళ్ళమీద అతనికి చేరువలో కూలబడి "మీకు పెంకితనం తప్ప మరొకటి తెలియదు" అంది.
తాను కోపితుడైనందుకు లజ్జాపరవశుడై "రాగిణీ! ఏమయినాకానీ ఇది నీవు స్వీకరించకపోతే నాకు మనశ్శాంతి లేదు" అన్నాడు మంద్రస్వరంతో.
ఆమె స్తబ్దురాలై, అచేతనంగా కూర్చుండిపోయింది. నేత్రాలు వాటంతట అవే మూతలుపడ్డాయి. మగత అందిచ్చిన బరువుతో, కపోలం ఎర్రబారి శృంగారమయమైంది. అధరాలు సున్నితంగా కంపిస్తూ సుందరాన్ని ఒలక బోస్తున్నాయి. కానీ వీటన్నిటినీ మించిన అమృతావేషాన్ని ఏవయితే వ్యక్తం చేయగలవో ఆ కన్నులు మూతబడి వున్నాయి ఇంకా. ఊపిరి బిగించింది. సర్వసంసిద్ధతతో తన మృదుహస్తం ముందుకుజాచి అతనికి అందించి "కానీయండి" అంది బలహీన స్వరంతో.
మూతలుపడ్డ కనుదోయి, తరిమి వేద్దామనుకున్నా పంతంతో పారిపోని ఏవో హాసచంద్రికలు వెల్లివిరియచేస్తున్న సుందర అమాయక వదనం. సర్వం తన స్వాధీనం కోల్పోయినట్లు నీరసంతో, నీరవంతో ప్రదర్శించబడ్డ ఆ అపూర్వ భంగిమ అతడ్ని పులకాంకితుడ్ని చేసి, కరుణ ప్రేమ సమ్మిశ్రిత భావసముద్రంలో ముంచెత్తాయి . తాను ఇప్పుడు ఎంత పసిగ ప్రవర్తించినా ఈ మోహిని చూడజాలదు. తనివితీరా ఎందుకు ముందుకు వాలకూడదు? అవును, ఈ సుందర వదనారవిందం - భ్రష్టురాలనని వాపోయిన స్త్రీ వదనం - ఇదివరలో ఎప్పుడూ ఎవరూ ఉండనంత సామీప్యం సృష్టించుకుంది. అనురాగగరిమ పెంపొందగా ప్రేమమీరా ఆ గులాబీవదనాన్ని స్పృశించాలనిపించింది.
సర్వం అతినిశ్శబ్దం. తనకోసమే సమస్త ప్రజ, ప్రపంచం ఊపిరి బిగబట్టారు. కానీ కరుణముందు, ఆత్మనిందముందు తమకం , ప్రేమలు తలలు వంచాయి. చేతిలో అంగుళీయకం ఒకసారి కదలికలో మెరిసింది. సుకుమారంగా ఆమె వ్రేలికి తొడిగాడు. హృదయం భోరున ఏడ్చింది. అక్కడ్నుంచి లేచి పారిపోవాలనుకున్నాడు. ఈ స్త్రీ జీవితం క్షుద్రం, నరకం. ఉంగరం తొడిగిన ఆ హస్తాన్ని పెదాలవరకూ తీసుకున్నాడు. తిరిగి మోహవివశుడు కాసాగాడు. "నాకిన్నాళ్ళూ ఏదో అన్యాయం జరిగింది. ఇప్పుడు దాన్ని అతిక్రమిస్తాను" అనుకున్నాడు.
"నువ్వు తుచ్ఛుడవు, పాపివి. ఈ జీవన్మరణ సంగ్రామంలో నీ అమానుష స్వార్ధంకోసం, పంతంకోసం ఒక వ్యక్తి జీవితం నాశనం చేయబోవటమే కాక పాపపంకిలం చేయబోతున్నావు....."
అతని నయనయుగళి బాధతో, భయంతో, ఆందోళనతో ఠపఠపమని కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా జుగుప్సకు అంతిమస్థాయీ, నిర్ధారణకు మొదటిదశ అవతరించబోయాయి. కానీ అతను తేరుకున్నాడు.
రవి బిగ్గరగా నవ్వి "రాగిణీ! కళ్ళు తెరువు. అదేమిటి? ప్రాణాయామం చేస్తున్నావేం?"
కానీ మరుక్షణంలో నిరుత్తరుడై వణికాడు. రాగిణిలో చలనం కలుగలేదు. రెప్పలు సాంతం స్తంభించిపోయాయి.
"రాగిణీ!" అన్నాడు కలవరపాటుతో. ఏమీ తోచక భుజాలు పట్టుకుని కుదిపాడు. ఆమెలో చలనం కలిగింది. నెమ్మదిగా కళ్ళువిప్పింది. ఒకేనిముషం అతన్లోకి ఆశ్చర్యంగా, సూటిగా చూశాక "ఎందుకలా కంగారు పడుతున్నారు?" అని అడిగింది.
"నువ్వు నిద్రపోయావా?"
"ఉహుఁ మెలకువగానే వున్నాను. కానీ నేను నా స్వాధీనం తప్పిపోయినట్లనిపించింది. నా నాలుకకూడా నా ఆధీనంలో లేదు. పలకలేకపోయాను."
అతను నిలువునా వణకటం సాగించాడు. తనకన్నా పాపి, ఉన్మత్తుడు ఎవరూ ఉండబోరు. అంతేగాక తాను నీచుడు. రాగిణి పాదాలు ఎంత పవిత్రమైనవో! వాటిని కళ్ళకు అద్దుకుంటే?
"ఏమిటి అలా చూస్తున్నారు?"
అతను ఏమీ పలకకపోయేసరికి ఆమె మామూలు మనిషిలా ఫక్కున నవ్వి "నాకేమయినా పూనిందనుకున్నారా? ఎంత ధైర్యస్థులండీ?" అంది.
"హమ్మయ్య!" అనుకున్నాడు. ఆమె ఈ సమయంలో గద్గదపు పలుకులు పలుకకుండా, శోకాలు తీయకుండా ఎలాగో కుమిలిపోకుండా అలా నవ్వటం ఎంతో తెరిపి ఇచ్చినట్టయింది.
రాగిణి కొత్తగా కనబడుతున్న తన వామహస్తాన్ని ఆనందంతో చూసుకుని "కృతజ్ఞురాలిని!" అంది.
* * *
"రాగిణీ!" అని పిలిచాడు ఓ అర్ధరాత్రివేళ.
రాగిణి గుమ్మానికి అనుకుని కూర్చుని, కునికిపాట్లు పడుతోంది. కానీ ఈ పిలుపు ఆమె వీనుల్లోకి సూటిగా వెళ్ళింది.
"నిద్రపోలేదూ మీరు?" అంది కళ్ళు తెరిచి, నులుముకుంటూ.
"పోయాను. కానీ అన్నీ పీడకలలే. భయంతో దద్దరిల్లిపోయాను. ఈ సమయంలో నువ్వుగానీ, మా చిన్నక్క గానీ ఇద్దరిలో ఎవరూ ఒకరు దగ్గర లేకుండా వుంటే ఏడిచి మొత్తుకునేవాడ్ని."
"అర్ధరాత్రివేళ కూడా మీ చిన్నక్కగార్ని స్మరించుకుంటున్నారు కదా! ఆవిడ ఎంత అదృష్టవంతురాలో..."