ఓ పదినిముషాలు గడిచాక యిద్దరూ తోగులు రిక్షాలో ఒకరిపక్క ఒకరు కూర్చుని బయలుదేరారు. ఆమె అతనికి దగ్గరగా జరిగి ఆనుకుని కూర్చుంది. ఒక స్త్రీతో అంత సన్నిహితంగా సంచరించటం, తాకుతూ కూర్చోవటం అతనికి జీవితంలో ప్రధమ పర్యాయం. తను నచ్చటం, నచ్చకపోవటం గురించి ఆమె ఏమీ వ్యాఖ్యానం చేయకపోవటం అతనికి సంతోషం కలిగించి ఆమె యందుగల యిష్టాన్ని ఎక్కువచేసింది.
రిక్షాలో కూర్చుని వున్నంతసేపూ ఆమె వసపోసిన పిట్టలా వాగుతూనే వుంది. "ఇందాక సినిమాలో డ్యాన్స్ చేసింది చూశారా? ఆ పిల్లా, నేనూ కలిసి చిన్నప్పుడు ఒక గురువుగారి దగ్గర భరతనాట్యం అభ్యసించాం. దాని అదృష్టం బాగుండి అది సినిమాల్లో చేరింది. నేను యిలా అయ్యాను" అంది.
"మీరు నన్ను యిదివరకెప్పుడైనా సినిమాహాల్లో చూశారా?" అని అడిగింది.
"లేదు" అన్నాడు.
"ఇదే మొదటిసారి అన్నమాట చూడటం. అసాధ్యులే! కాలేజీ స్టూడెంట్లందరికీ నేనంటే బలే గ్లామర్ లెండి. మంజులత అంటే వాళ్ళకి పెద్ద ఫేమస్. నేను తరుచు సినిమాలకి వస్తూ వుంటానుగా. హాలులోపలగానీ, బయటగానీ మాట్లాడదామని తెగ ప్రయత్నిస్తారు. కాని అక్కడ చిక్కనుగా ఎవరికీ. ఆఖరిసీను పూర్తి అయ్యేలోపల మెరుపులా దూసుకు వెళ్ళిపోతాను. అందుకే నాకు రాకెట్ అని పేరుపెట్టారు."
మృత్యుంజయరావు ఊఁకొట్టాడు.
"మాట్లాడరేం?" అంది మంజులత.
"ఏం మాట్లాడను?" అన్నాడతను బిక్కమొహంవేసి.
ఒక నిముషం గడిచాక ఆమె అతని భుజంమీదకొట్టి "ఏమండీ, ఆ ప్రక్కనుండి నల్లగా సిద్దెలాగా వస్తున్నాడే వాడిని చూడండి చెబుతాను" అంది చేత్తో ఒకడ్ని చూపిస్తూ.
పక్కసందులోంచి పంచా, లాల్చీ వేసుకుని నలభయిఏళ్ళు దాటినా లావుపాటి నల్లవాడొకడు నడిచి వస్తున్నాడు. ఒకటి రెండుక్షణాల్లో రిక్షా అతడ్ని దాటిపోయింది.
"హమ్మయ్య. చూడలేదు, బ్రతికిపోయాం" అందామె తేలిగ్గా నిట్టూర్చి.
"ఎవరువారు? చూస్తే ఏం?"
"మాయింటి యజమాని. వొట్టి త్రాష్ఠుడు. వారానికి రెండుమూడుసార్లు యింట్లో జొరబడి స్వంతవస్తువును వాడినట్లు వాడుకుంటాడు. మళ్ళీ దమ్మిడీ రాల్చడు. నేనెప్పుడు ఎవరితో ఎక్కడున్నానో ఆ అజ అంతా వాడికి కావాలి. చెప్పేదాకా వేపుకుతింటాడు."
మృత్యుంజయరావు తలవూపి వూరుకున్నాడు.
"ఏమండీ! మీ యింటికి తీసుకు వెడుతున్నారుకదా. అక్కడెవరూ చూడరా మనల్ని? మీకు భయంలేదా?" అని ప్రశ్నవేసింది ఓ క్షణం గడిచాక.
"మా యింటివాళ్ళు ఊళ్ళో లేరు. గదిలో నేను ఒక్కడ్నే వుంటున్నాను."
"ఆహాఁ! అలా చెప్పండి" అంది రహస్యం కనిపెట్టినట్లు మంజులత.
మళ్లీ ఆమె "ఏమండీ, ఒకవిషయం అడుగుతాను. ఏమీ అనుకోరుకదా!" అంది రిబ్బన్ మెలితిప్పుతూ.
"ఉష్! దూరంగా జరిగి కూచోంది. ఎర్రబుట్ట ఎదురొస్తున్నది" అన్నాడు తోగులు రిక్షా పక్కకి లాగిస్తూ.
మంజులత కిలకిల నవ్వి "వొట్టి భయస్తులా వున్నాడు గాడీ వాడు. ఈ ఊరుకాదా ఏమిటోయ్ నీది? ఎప్పుడూ చూసినట్లు లేదే!" అంది.
"నిన్నెప్పుడూ ఎక్కించుకెళ్ళలేదులే" అన్నాడు తోగులు.
ఎర్రబుట్ట అనగానే మృత్యుంజయరావు గుండె అదిరింది. సర్దుకుని కూర్చున్నాడు.
"చెప్పండి" అందామె.
"అడగండి."
"అక్కడికి నన్ను తీసుకుపోతున్నారు కదా! అక్కడ మీరొక్కళ్ళే వుంటారా? ఈ స్నేహితుల్ని నలుగురయిదుగుర్ని పోగుచేస్తారా?"
"ఛీ, ఛీ."
ఆమె అతని చెయ్యి గిచ్చి "మీరలాంటివారు కాదులెండి. మంచివాళ్ళ లాగానే కనిపిస్తున్నారు. వెనకటికి రెండుమూడుసార్లు పాడు అనుభవమైంది లెండి. అందుకని జాగ్రత్తపడుతున్నాను" అంది.
తనని చూసి రౌడీ అనుకునేవారు యీ భూమ్మీద లేరని ఆమెకు తెలియదని అతననుకున్నాడు.
"అసలు నేను యిళ్ళకు రావటానికి ఒప్పుకోనండీ. పోలీసువాళ్ళతో బాధేసుమండీ. ఏమిటో మిమ్మల్ని చూస్తే మంచి అభిప్రాయం కలిగింది."
అతను గర్వించాడు. అతనానందించాడు. "ఒకవేళ తననీమె ప్రేమించటం లేదుకదా?"నని మృదువైన ఆలోచన మెదిలింది.
కానీ చీటికీ మాటికి పోలీసులు అంటుందేమిటి?
"ఏమండీ? ఓ గమ్మత్ చెప్పమంటారా?" అంది ఓ ఘడియ తర్వాత.
అతనికి మాట్లాడటం కుదరటంలేదు. అందుకని "ఊఁ" నే కొట్టాడు.
"అందరూ యిళ్ళకే తీసుకువెడదామని ఉబలాటపడతారు. ఎందుక్యా అంతదూరమంటే వినిపించుకోరు. తేడా ఏమిటో నాకుచచ్చినా అర్ధంకాదు. తీరా అక్కడకు తీసుకుపోయి బావుకునేదేమీ కనిపించదు. వాళ్ళ ప్రతాపం అణగారి నీళ్ళుగారిపోవడం చూస్తే బలే నవ్వొస్తుంది నాకు" అంటూ కిలకిల నవ్వింది.
ఈ చివరిమాట అతనికి రుచించలేదు. పైగా చాలా అస్థిమితంగా బాధపడ్డాడు.
తమ యిల్లు సమీపిస్తుండేసరికి గుండెలు పీచుపీచుమంటున్నాయి అతనికి. ఎవరికైనా కనబడుతుందేమోనని వొణికిపోతున్నాడు. కాని అంత చీకటి రాత్రిలో, వర్షాకాలపు రోజులు కాబట్టి యిరుగుపొరుగువారంతా తలుపులు బిడాయించుకుని పడుకోబట్టి అతను బ్రతికిపోయాడు.
రిక్షా యింటికి చేరింది. తోగులు వాళ్ళు తిరిగి వచ్చేవరకూ దగ్గర్లోనే రిక్షాలో పడుకుని వుంటానన్నాడు. టీ తాగి వస్తానని వెళ్ళాడు.
మంజులత గదిలో తెగ అల్లరిచేసింది. "మీ గదికంటే నాగదే బాగుంది" అన్నది. సినిమాపాటలు, కూనిరాగాలు తీసింది. అతనిచొక్కా వేసుకుని అందులో తను ఎట్లా వున్నానని ప్రశ్నించింది.
ఆమె యీ చేష్టలేవీ అతనికి రుచించలేదు. ఒక్కోసారి భరించటంకూడా కష్టమైంది. మొట్టమొదట ఓ ఆడదాన్ని తనగదికి తీసుకువచ్చినందుకు, ఆ రాత్రంతా ఆమెతో గడపబోతున్నందుకు అతను గర్వించాడు. కాని కాసేపటికి అతని గర్వం కాస్తా నీళ్ళుకారిపోయింది.
"మీకు పెళ్ళికాలేదు కదూ! నన్ను పెళ్ళి చేసుకుంటారా?" అనడిగింది.
"పోనీ వుంచుకోండి. అంత యిబ్బంది వుండదు" అంది.
అతని దృష్టిలో ఆమె చాలా విచిత్రంగా ప్రవర్తించింది. మాట్లాడుతూ మాట్లాడుతూ అతని చెయ్యి పట్టుకుని తన హృదయానికి అదుముకునేది. హఠాత్తుగా తన ముఖాన్ని అతని చెంపకానిచ్చి రుద్దేది. ఒకసారి బరువుగా ఊపిరి పీల్చేది.
అతను మీనమేషాలు లెక్కపెడుతున్నాడు.
ఆమె మంచంమీద పడుకుని తన పెద్దపెద్దకళ్ళను అతనివైపు మరల్చి "రండి" అంది ఆహ్వానిస్తూ.
అతని శరీరం వొణుకుతోంది. తడబడుతున్న కాళ్ళతో గోడదగ్గరకు వెళ్లి లైటార్పేశాడు. మెల్లిగా మంచందగ్గరకు తడుముకుంటూ వెళ్ళి ప్రక్కన పడుకున్నాడు. అతని ఊపిరి బరువుగా వస్తోంది.
ఆమె తన కోమల హస్తాలను అతని వీపుచుట్టూ పోనిచ్చి దగ్గరకు లాక్కుంది. "లైటార్పేశారేం? సిగ్గేస్తోందా?"
"ఊఁ" అన్నాడు మైకంగా. అతనికేడుపు వచ్చింది.
"అలవాటులేదా?"
"ఉహుఁ."
ఆమె నవ్వి అతన్ని మరింత గట్టిగా కౌగిలిలో బంధించింది. అతనికి ఊపిరాడలేదు. ఏదో మత్తుమందు సోకినట్లుగా, తియ్యగా, గాలిలో తేలుతున్నట్లుగా అనుభూతి పొందాడు. జీవితంలో యిది ఘనకార్యం... స్పర్శ కాలుస్తోంది. స్పర్శ హాయిగావుంది. పాపం! ఈ అమ్మాయి చాలా మంచిది. డబ్బిస్తేమాత్రం ఎవరికి పట్టింది యింత ఆదరణ చెయ్యటానికి? వాళ్ళు ఉదాసీనంగా పడుకుంటే తను చెయ్యగలిగిందేముంది? ఆ మహాయాతనలో ఏదేదో వాగుతున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు. చెవిలో రహస్యాలు చెబుతున్నాడు.
అంతటి పరవశత్వంలో, జీవితంలోని మొదటి మధుక్షణాల మకరందంలో ఆశనిపాతంలా ఆమె నోటివెంట అపశృతి వెలువడింది. "ఇందాక మీ ప్రక్కన కూర్చున్నాడే సినిమాలో? అతనెవరండీ?"
ఉధృతంగా పొంగే నదికి ఆనకట్ట అడ్డుపడినట్లయింది. విషపూరిత బాణం గుండెల్లో గ్రుచ్చుకున్నట్లయింది. రక్తం అరక్షణంలో నీరుగా మారింది.
వినిపించుకోనట్లు నటించాడు.
"ఏమండీ మిమ్మల్నే. అతనెవరో చెప్పండీ" అన్నదామె విడిచిపెట్టకుండా. జుత్తులో వేళ్లు పోనిచ్చి సవరిస్తూ.
జుత్తులో వేళ్లుదూర్చటం బాగానే వుందిగాని, ఈ ప్రశ్నే అతనికి రుచించటల్లేదు. కాని ఆమె ఒత్తిడి చేస్తున్నది కాబట్టి యిహ చెప్పక తప్పేటట్లు లేదనుకుని "శేఖరం అని నా స్నేహితుడు. ఇద్దరం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం" అని గొణిగాడు.
కాని అప్పటికే సగం శవంక్రింద తయారయ్యాడు.
"ఆయన చాలా బావున్నారండీ. సినిమాలో కూర్చున్నంతసేపూ ఏవో కొంటెపనులు చేస్తూనే వున్నాడు. నా మనసు దోచుకున్నాడంటే నమ్మండి!"
అబ్బా! ఏమిశిక్షరా తండ్రీ యిది? అతను పూర్తిగా శవంక్రింద మారాడు. కోపం వచ్చింది. ఉక్రోషం వచ్చింది. ఏడుపు వచ్చింది. తన డబ్బుతో ఆ దుర్మార్గుడు సినిమా చూశాడు, తన డబ్బుతో యిప్పుడు ఆనందం జుర్రుకుంటున్నాడు.
"అతని ఇల్లు యిక్కడకు దగ్గరేనాండీ?"
కొంపతీసి పిల్చుకురమ్మంటుందేమోనని హడలిపోయాడు. "అబ్బే! చాలా దూరం! రెండు మైళ్ళుంటుంది" అన్నాడు దిండుమీద వేళ్ళాడేసి, కళ్ళు మూసుకుంటూ.
"మీరు మరీ కబుర్లు చెబుతారండీ. కాకినాడంతా కలిపినా రెండు మైళ్ళుండదు" అని ఆలోచిస్తున్నట్టు రెండు నిముషాలు మెదలకుండా వూరుకుని "ఎప్పుడూ లేదు. అసలు నా మనసు ఎవరిమీదకూ పోదు. ఇవాళ ఆయన మీదకు పోతుందేమిటి?" అంది ఆర్థ్రస్వరంతో. ఈ ఆర్థ్రత విని అతను మరీ చకితుడయ్యాడు, కృంగిపోయాడు.
"ఏమండీ! మీరు నాకో సహాయం చేసిపెడతారా?"
"చెప్పుతల్లీ! ఇహ నీ యిష్టమే యిష్టం. ఊఁ పేలు" అనుకుంది శవం.