Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 17

  

    ఆమె ఇవతలికి వస్తుండగా మెరుపుదాడి చేద్దామనుకున్నాడు.
   
    ఆమె ఇవతలకు వస్తోంది.
   
    అతను మెరుపుదాడి చేయబోయేటంతలో అప్పుడే నిద్రలేచిన సుధాకర్ ప్రక్కగదిలోంచి వస్తూ కనిపించాడు.
   
    ఇహ చేసేదిలేక కుమార్ తనకు తీరని కోరికల్లో దీన్నికూడా జతచేసి, రిక్షా ఎక్కుదామని బయటకు నడిచాడు.
   
    ఆ సాయంత్రం హరి బ్యాంకునుండి ఇంటికి వస్తూనే ధూంధాం అంటూ వచ్చాడు. అసలు ఉదయం భోజనంచేస్తుండగానే అతనికీ, అతని భార్యకూ చిన్న తగాదాలాంటిది వచ్చింది.
   
    భోజనం చేస్తున్నప్పుడు వాగ్వివాదాలు అతనికి రుచించవు. అంటే మిగతా అప్పుడు రుచిస్తాయని కాదు. సందర్భంలేకుండా సణిగే ఈ ఆడవాళ్ళంటే అతనికి మహా చికాకు.
   
    "రోజూ అంత ప్రొద్దుపోయి వస్తుంటే నాకు తెగ విసుగ్గావుంది బాబూ! ఎప్పుడూ ఫ్రెండ్సూ, పార్టీలు, సినిమాలూ అంటూ తిరక్కపోతే ఇంటిదగ్గర ఆడవాళ్ళగోడు ఏమన్నా పట్టించుకోవటముందా?" అంటూ మొదలుపెట్టింది విమల.
   
    "ఇప్పుడేం పట్టించుకోవటంలేదు? మీకిప్పుడేం తక్కువయింది?" అనడిగాడు హరి.
   
    "ఒకటని ఏమిటి? అసలు నా బ్రతుక్కి సుఖమంటూ వుందా? ఏం తక్కువయిందని కాదు, ఏముందణి అడగండి."
   
    "సుఖంలేదు, సుఖంలేదు అని ఏడిచేవాళ్ళకు ఎన్నివున్నా సుఖం ఉండదు కానీ, మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను....నువ్వడిన చీర కొంటున్నాను, అడపా దడపా సినిమాలకి తీసుకెడుతున్నాను, ఉండటానికి ఇల్లూ, తింటానికి తిండీ వున్నాయి. కొంచెమో గొప్పో హోదాగల ఉద్యోగంలో వున్న మొగుడున్నాడు నీకు. నిక్షేపంలాంటి పిల్లలిద్దరున్నారు. మూడోదో, మూడోవాడో అప్పుడే సగం రెడీ అయ్యారు. మీ అమ్మానాన్నా, మా అమ్మానాన్నా అంతా బ్రతికేవున్నారు. ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు?"
   
    విమల వెటకారంగా నవ్వింది. "చాలా! అవన్నీవుంటే అయిపోయినట్లేనా?"
   
    "అంతకన్నా వెటకారంగా నవ్వటం నాకూ వచ్చుగానీ, ఆ చాలనిది ఇంకా మిగిలిపోయిందీ ఏమిటోచెప్పు? పొరబాటేమయినా వుంటే సరిదిద్దుకుంటాను."
   
    "మేమేం చెప్పనక్కరలేదు, మీరేమీ సరిదిద్దుకోనక్కరలేదు. మా ఖర్మను మేము అనుభవిస్తాంలెండి."
   
    "ఆ బుద్ది వున్నదానివి అసలీ ప్రసక్తి  ఎందుకు ఎత్తావు ముందు?"
   
    "చెప్పటం చేతకాక కాదు, ఆలకించే నాధుడున్నాడన్న ఆశ అప్పుడప్పుడూ పీడిస్తూండటం బట్టి....."
   
    "అందుకే చెప్పి ఏడవచ్చుగా?"
   
    "అదిగో మాటలు సరిగ్గా రానియ్యండి. ఏడవటం గీడవటం అన్నారంటే మర్యాదగా వుండదు."
   
    "నీ అభిమానం, అంతస్తులూ నాకు తెలుసుగానీ, చెప్పదలుచుకుంటే చెప్పు. లేకపోతే అవతలకు ఫో, ఊరికినే నసపెట్టకు."
   
    విమలకు ముఖం ఎర్రబడింది. భర్తని చూస్తుంటే ఆమెకెందుకో అసంతృప్తిగా వుంది. ఏదో అర్ధంకాని వెలితి లోలోపల తొలచివేస్తూ వుంటుంది. ఒక్కోసారి కోపం ఆపుకోలేక గుక్కత్రిప్పుకోకుండా కడిగెయ్యాలని వుంటుంది. పిల్లలవల్ల కలిగిన చికాకుకు, తోడికోడలుకూ తనకూ వస్తున్న స్పర్ధలకూ ఎందుకో ఈ మొగుడే, లేకపోతే ఈ మగాళ్ళే కారణమనిపిస్తుంది.
   
    "మా అన్నయ్యకూడా మీకంటే పెద్ద ఆఫీసరే. మీకంటే బిజీగా వుంటాడు. అయిన రోజూ ప్రొద్దుటే పిల్లలకు పాఠాలు చెబుతాడు. నోట్సులు రాసి పెడతాడు. ఆఫీసు వదిలిపెట్టగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు. వంటింట్లో కూర్చుని వదినకు వంట చేస్తున్నంతసేపూ కబుర్లు చెబుతాడు. రెండు మూడు రోజులకొకసారి సినిమాకో, షికారుకో తీసుకెడతాడు. పేకాడడు, స్నేహితులు ఎప్పుడోగానీ ఇంటికి రారు. అసలు అతను స్నేహితులింటికి వెళ్ళటమనేదే లేదు....."
   
    "అయిందా......? మా అమ్మమ్మ  చెబుతూ వుంటుంది అడుగు, తీరిక సమయంలో ఆవిడ పింతల్లి మొగుడున్నాడట. ఆయన పంచా, లాల్చీ ఆవిడే తొడిగేదట. అన్నం తిన్నాక అలా శిలాప్రతిమలా నిలుచుంటే చెయ్యీ, నోరూ కూడా ఆవిడే కడిగి, పమిటచెంగుతో ఆవిడే తుడిచేదట. ఇంట్లో పాతికమందికి పైగా అన్నం వండిపెట్టి పెనిమిటికి నిరంతరం కాళ్ళు పిసుకుతూ సకలోపచారాలు చేస్తూ వుండేదిట...."
   
    "అయితే అలా వుంటేనే గృహిణి అని మీ ఉద్దేశమా?"
   
    "మీ అన్నయ్యలా వుంటేనే మొగుడు అని నీ ఉద్దేశమా"
   
    "మీ అమ్మమ్మగారి పింతల్లిది చాదస్తం. నేను చెప్పేది మంచి. మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చుగా.....?"
   
    "నేను చెడుపనేమీ చేయటంలేదే? ఎల్లకాలం పెళ్ళానికి ఎదురుగుండా కూర్చోవటం, ఆడంగిరేకుల కబుర్లు చెప్పడం, మంచిపనిగా నా దృష్టికి తోచటంలేదు. నా టేస్టు వేరు. పెళ్ళికాకముందు నా టేస్ట్ ఎలావుందో పెళ్ళయాక అలాగేవుంది. నాకప్పుడూ స్నేహితులంటే పిచ్చి, ఇప్పుడూ స్నేహితులంటే పిచ్చి, అప్పుడూ పేకాడటం, పార్టీలూ అలవాటు, ఇప్పుడూ అలవాటు. అప్పుడూ ఇంటికి ఆలస్యంగా రావటం అలవాటు, ఇప్పుడూ అదే అలవాటు. నేను చెడు అని అనుకోనిది నీకోసం మానుకోను...."
   
    "అయితే భార్యగా నాకిష్టం లేకపోయినా మానుకోరా?"
   
    "తప్పు అని నేననుకోనంతవరకూ ఎందుకు మానుకోవాలి?"
   
    "డబ్బు పెట్టి పేకాడటం తప్పుకాదా?"
   
    "నాకందులో తృప్తి, ఆనందం, సరదా వున్నాయి. నా లిమిట్సు నాకుతెలుసు. తెలుసుకోగలిగిన సంస్కారం వుంది నాకు., పెళ్ళాంపిల్లల కడుపులు మాడ్చి వాళ్ళకు కూడూగుడ్డా లేకుండా నానా ఇబ్బందీ పెట్టి ఆస్తంతా అమ్ముకుతినటం లేదుగా? మీకేం తక్కువ చేయటంలేదు. మీకేది కావాలో అన్నీ ఇస్తున్నాను. నీవు చెప్పే భార్యావిధేయులైన భర్తలు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తున్నాను. ఇంతకన్నా మీకేం కావాలి?"
   
    విమల చురచుర చూసింది. "అలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. ఆడదానికి మాత్రం మనసుండదా? ఆడదానికి కోరికలుండవా? తిండీ, బట్ట, ఇల్లూ ఇదేనా జీవితం? ఇంకేం అక్కర్లేదా?" అంది విసురుగా.

    "ఆఁ ఇంకా ఏమిటో చెప్పు?"
   
    విమల గబగబ ఆలోచిస్తోంది.
   
    "నీకు స్పష్టంగా తెలియదు. నువ్వు అనుకున్నది నేను చెబుతాను విను. సాయంత్రాలు నేనెక్కడికీ పోకూడదు. నీతోనే వుండాలి. నీతోనే మాట్లాడాలి. నీతోనే కాలక్షేపం చెయ్యాలి. నీతోనే బయటకు వెళ్ళాలి. అంతేగా నువ్వు కోరేది? నీకు నేను కొన్ని సాయంత్రాలు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇవ్వగలనుగానీ, అన్ని సాయంత్రాలూ దోచుకుంటానంటే ఒప్పుకోను. నాకు స్నేహితులున్నట్టే నీకూ కొంతమంది స్నేహితుల్ని ఏర్పరచుకో. అధి నీకు చేతకాదు. మేము ఎప్పటికప్పుడు కొత్త స్నేహితుల్ని, కొత్త పరిచయాల్ని పెంచుకుంటూ జీవితాన్ని విశాలం చేసుకుంటూ వుంటాం. ఇంటిప్రక్కవాళ్ళతో కూడా మీరు స్నేహం చేసుకోలేరు. అధవా....ఇరుగుపొరుగు ఎప్పుడయినా వచ్చినా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్లు ప్రవర్తిస్తారు. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళగురించి వ్యాఖ్యానాలు, వెటకారాలూ మొదలుపెడతారు. పెళ్ళికి ముందు మీకున్న స్నేహితురాల్నికూడా పెళ్ళయాక దూరం చేసుకుంటారు. మొగుడు మీతో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత సుఖపడిపోతున్నట్లు, లేకపోతే కష్టపడిపోతున్నట్లు ఒక్క విషయం తెలుసుకో నీకోసం నేను నా సరదాలూ, స్నేహాలూ చంపుకోలేను. తప్పుపని చేయనంతకాలం అసలు చంపుకోలేను."
   
    విమల ముఖం కోపంతో ఎర్రబడింది. నోటికొచ్చినట్లు మాట్లాడాలని లోపల్నుంచి పొంగుకువచ్చిందిగానీ, ఇంతలో అవతలినుంచి అత్తగారు వచ్చింది.

 Previous Page Next Page