Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 16


    నిట్టూర్చింది ఆమె.
    "బాబూ! నా బ్రతుకు పొద్దు వాటారిపోయింది. కష్టమయినా మీరే అనుభవించాలి, ఉంచుకున్నా పోగొట్టుకున్నా అనుభవించేవాళ్ళు మీరే.
    నలుగురిలో పరువు తగ్గకుండా బ్రతకాలనీ, నలుగురిలో తల వంచుకునేలా ఉండకూడదనీ నా పట్టుదల.
    అంతే!
    అమ్మా! నేను భూషయ్య కొడుకుని, ఆయన గౌరవానికి హాని కలిగించేట్టుగా జీవించను. ఫలానావారి అబ్బాయి తండ్రికి తగిన కొడుకని అనిపించేట్టుగా బ్రతుకుతాను.
    దేనికయినా కాలం కలిసిరావాలి.
    లేకపోతే మానవుడు ఎంత ప్రయత్నించినా వ్యర్ధమే" అన్నాడు.
    ఆలోచనతో, వ్యధతో ఇంక ఏమీ అనలేదు ఆమె.


                                        8


    పరీక్షా ఫలితాలు వచ్చాయి.
    గోపీ యూనివర్శిటీ సెకండ్ గా పాసయ్యాడు.
    తల్లి ఫోటో వద్దకువెళ్ళి దీపం వెలిగించి నమస్కరించి, "అమ్మా! ఇది నీవు వెలిగించిన దీపం. నీ చల్లని దీవనవల్లా, నీ మంచి మనసువల్లా మేము దినదినాభివృద్ధి పొందుతున్నాము. అన్నగా నా ధర్మం నెరవేర్చుకుంటున్నాను. తమ్ముడుకూడా విద్యార్ధిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఈ శుభసమయంలో నీవు లేవు అనే చింత తప్ప మరేమీ లేదు. పరోక్షంగానయినా నీ ఆశీస్సులు మాపై కురిపించు" అని మనసారా ప్రార్ధించాడు రమణయ్య.
    అన్నగారి పాదాలకు నమస్కరించాడు గోపీ.
    అతన్ని భుజాలుపట్టి పైకెత్తి, "గోపీ! చదివించినందుకు నా పేరు నిలబెడుతూ నీ పేరు నిలబెట్టుకుంటున్నావు. ఇంకా బాగా చదువు బాబూ" అన్నాడు కళ్ళలో ఆనందబాష్పాలు నిండగా.
    "ఇంకా చదువుతూ నిన్ను శ్రమ పెట్టలేనన్నయ్యా! ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుంటాను" అన్నాడు గోపీ.
    "గోపీ! అంతమాట అనవద్దు ఇందులో నాకు ఏమీ శ్రమలేదు. రైతుబిడ్డగా పుట్టాను. రైతుగా బ్రతికాను. మంచిరైతుగా పేరు తెచ్చుకున్నాను. నీవూ అంతే! చదువు అంతం తేల్చు. నీలాగా చదువుకున్న వాడు లేడు - అన్నంతగా చదువుకో. అప్పుడు మంచి ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది."
    "చదువుకు అంతం అంటూ లేదన్నయ్యా! ఎన్నేళ్ళు చదివినా ఇంకా ఉంటుంది. చదువు అనే తృష్ణకి పరిధిలేదు, మేరలేదు."
    "పోనీ, ఎమ్.ఎస్.సి. వరకయినా చదువు గోపీ! వట్టి డిగ్రీలతో ఏం ఉద్యోగం వస్తుందీ రోజుల్లో? కలెక్టరాఫీసులోనో, తాలూకా ఆఫీసులోనో గుమాస్తాగా బ్రతుకుతావా నీవు? వద్దు గోపీ. ఎమ్.ఎస్.సి. చదివి ఐ.ఎ.ఎస్. పాసై ,కలెక్టరువి కావాలినువ్వు."
    అన్నగారి ఆదరణకీ, ఆప్యాయతకీ పులకించిపోయాడు గోపీ. కళ్ళలో కృతజ్ఞతతో నీళ్ళు తిరిగాయి. "అలాగే, అన్నయ్యా! తప్పక ఎమ్.ఎస్.సి. పాసై ఐ.ఎ.ఎస్. చేసి కలెక్టర్నవుతాను. కానీ, ఆ రోజు, నీకోరిక తీరినరోజు నీవూ నాకోరిక తీర్చాలి. అప్పుడు నీవిలా ఇంకా కష్టపడుతూ ఉండకుండా నాతోవచ్చి ఉండాలి మీరంతా" అన్నాడు.
    రమణయ్య ఒడలు పులకరించింది. "తను పెంచుకున్న మొక్క వెఱ్ఱితలలు వెయ్యటం లేదు" అనుకున్నాడు.
    "గోపీ! నేను మట్టిమనిషిని, నాకీమట్టే తల్లి, ఈ మట్టే తండ్రి. ఈ మట్టివాసన నాకు సోకకపోతే నేను జబ్బుపడతాను. ఏ ఒక్క రోజయినా నేను పొలం వేపు వెళ్ళకపోతే నాకు జబ్బుచేస్తుంది. ఆ పైరగాలి, ఆ మట్టిగాలి పీల్చితేనే నేను ఆరోగ్యంగా ఉంటాను.
    "నా జీవనాడి తెలియని మనుషులు నన్నేమయినా అనుకోవచ్చు. కానీ, నేను పొలాన్ని విడిచి బ్రతకలేను. నన్ను ఇలాగే ఉండనీ ఎప్పటికయినా నేను మట్టిమనిషినే."
    అన్నగారి మాటలు విని బదులు చెప్పలేకపోయాడు గోపీ.
    తరువాహ మరోవారం రోజులకి అన్నీ సర్దుబాటు చేసుకుని విశాఖపట్టణం వెళ్ళిపోయాడు గోపీ. పట్టణం వెళుతున్న గోపీకి అత్తవారి ఇంటికి వెళ్ళే ఆడబిడ్డకి తల్లి అన్ని సారెలూ పంపినట్లుగా రకరకాల పిండివంటలు చేసి సరిదిద్ది పంపింది సరోజ. "ఎందుకు వదినా ఇవన్నీ" అన్నమాటలకు "చాలు చాలే ఇవన్నీ తినటానికని కూడా తెలియనివాడవు అంత పెద్ద చదువులేం చదువుతావు?" అంది ముసిముసి నవ్వులతో సరోజ.
    "గోపీ! ఈ సంవత్సరం కూడా మళ్ళీ టూర్ అంటూ ఎటో వెళ్ళకుండా సెలవుల్లోవచ్చేయ్" అన్నాడు రమణయ్య.
    "తప్పకుండా వస్తానన్నయ్యా!" అని వెళ్ళిపోయాడు గోపీ.
    ఈ రెండునెలలూ పినతండ్రికి బాగా అలవాటుపడిన బాబు గోపీ వెళ్ళిన నాలుగయిదు రోజులు బెంగ బెంగగా ఉన్నాడు.
    "అదిగో బాబాయ్!" అంటే అటేచూస్తూ పరుగు పరుగున ఉరికేవాడు. గోపీ కనుపించక బిక్కముఖం వేసుకుని వచ్చి తిరిగి తల్లిపై అలక సాగించేవాడు.
    "పాపం! అబ్బాయిగారిని కనిపెట్టుకుని ఉంటాడేమో ఎప్పుడూ! ఆయన చదువుకోవద్దూ?" అనేది సరోజ.
    "బాబాయ్ బాబాయ్!" అనేవాడు ఏడుస్తూ వాడు.
    "లేదులే, బాబూ! బాబాయ్ మళ్ళీ సెలవులకి వస్తాడుగా?" అని నచ్చచెపితే ఏడుపు మానేవాడు.


                                                 *    *    *


    పక్షవాతం వచ్చి మంచంలో పడింది మాణిక్యమ్మ.
    జయంతికి సంసార బాధ్యతలన్నీ పై బడ్డాయి. విశాల అంటీ అంటనట్లుగా ఉండేది. ఎప్పుడూ భగవద్గీతో, భాగవతమో, స్త్రీల రామాయణం పాటలో చదువుకుంటూ ఉండేది, జీవితమంతా అనుభవించి ముదిమిలో పడ్డ స్త్రీకి, విశాలకి తేడా కనిపించటంలేదు.
    చంద్రయ్య మరీ నిర్వ్యాపారుడై పోయాడు.
    తల్లి అప్పుడప్పుడూ మందలిస్తూ ఉండేది. ఇప్పుడామె మంచాన పడటంతో అతన్ని అనేవారే లేకపోయారు. జయంతికి భర్త విషయమే తెలిసేది కాదు. నాలుగుగోడల మధ్య అతను చూపే శృంగారమే ప్రేమగా భావించి అతను తనంటే ఎంత అభిమానపడతాడో ఊహించుకుని అతన్ని దైవంగా భావిస్తూ ఉంది.
    రాముడు అయ్యగారికి అండదండగా ఉంటూ, తన పబ్బం గడుపుకుంటూ చేతనైనంత వెనకేసు కుంటున్నాడు. వాడికి అయ్యగారి నడిగి ఒక అయిదెకరాల మాగాణి పొలం వ్రాయించుకోవాలని ఉంది. గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఎవరికి దక్కిందివాళ్ళకి. తనేం పాపం చేశాడు? అనుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు రాముడు.


                                *    *    *


    ఎమ్.ఎస్.సి.లో చేరాడు గోపీ. అతనికి స్కాలర్ షిప్ కూడా వచ్చింది. హాస్టల్లో చేరాడతను.
    ఆ సంవత్సరం యూనివర్శిటీకి కొత్త అందం వచ్చిందన్నారు. అందాన్ని అభిమానించి ఆరాధించే కుర్రవాళ్ళు, జగన్మోహినీ అవతారం యూనివర్శిటీ చదువు నేర్చుకోవాలని వచ్చిందన్నారు కొందరు. సినిమా వాళ్ళు చూస్తే లక్షలకి లక్షలిచి ఎగరేసుకుపోతారు అన్నారు కొందరు. మెరుపుతీగ నడక నేర్పింది అన్నారు కొందరు భావుకులు, అఖిల్ లావణ్య పుంజమ్ము సబ్జభవుడు మెలతగా జేసి దీని నిర్మించెనొక్కొ అన్నారు తెలుగు ఎమ్.ఎ. రసపిపాసులు. బ్యూటీ, మాడెస్టీ, పెర్సనాలిటీ, కలర్ కాంప్లెక్షన్స్ - అన్నీ తగిన పాళ్ళలో మిశ్రమం చేశాడు భగవంతుడు అన్నారు సైన్స్ విద్యార్ధులు.
    ఇంతమంది ఇన్నిరకాల వ్యాఖ్యలకి గురి అయిన ఆ చిన్నది రాధ. తిరుపతిలో బి.ఎస్.సి. పూర్తిచేసి, ఎమ్.ఎస్.సి. ఆంధ్రా యూనివర్సిటీలో చేరింది ఆ సంవత్సరం.
    రాధని చూసినవాళ్ళ కెవరికయినా పై మాటలు అతిశయోక్తి అనిపించవు. ఇంకా ఏదో కొరతగా ఉందనే అనిపిస్తుంది. ఉత్తరాయణ సంక్రమణ వేళలో సూటిగా పడే సూర్యకిరణం లాంటి నాసిక, ఇద్దరు శుక్రులు ముఖబింబంలో అమరారా అన్నట్టుగా ఆ నాసిక కిరువైపులా ఉండే కళ్ళూ, విశాలమైన నుదురూ, మొనదేలిన గడ్డమూ, శిల్పి చెక్కినట్లుండే శరీరమూ, కళ్ళు తిప్పుకోనివ్వవు, నాగరకత కాదని ముఖం తిప్పుకోవలసిందే కానీ, ఆమెని చూస్తూ అహర్నిశలూ గడపవచ్చు.
    అపర ప్రవరాఖ్యుడుగా పేరుపొందిన గోపీకూడా రాధని చూసిన క్షణంలో 'బ్యూటీఫుల్' అనుకున్నాడు. ఆ రోజు ప్రొఫెసరు ఏం చెప్పాడో అతనికి బుఱ్ఱకెక్కలేదు.


                                                *    *    *


    వెంకయ్య చనిపోయి రెండు, మూడేళ్ళయింది. అతని కొడుకు రామశేషు స్వంతంగా వ్యవహర్త అయ్యాడు. అతను రమణయ్య కంటే కాస్త పెద్దవాడు. అతడూ వున్న ఊళ్ళోనే పెళ్ళిచేసుకున్నాడు. ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు. పట్నాలు తిరిగి చదువు అంతో ఇంతో చదువుకున్న రామశేషుకి వ్యవసాయంపై మోజు కలగలేదు.
    భూమినంతా పాలేళ్ళ చేతిలోపెట్టి వడ్లవ్యాపారం ప్రారంభించాడు. ముందు కమీషన్ వ్యాపారంగా మొదలైంది అతని వ్యాపారం. అందులో రుచిమరిగి, రెండేళ్ళు గడవగానే స్వంతంగా వ్యాపారం చేయసాగాడు. తండ్రి ఉండగానే ప్రారంభించిన వ్యాపారం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా అభివృద్ధి చెందసాగింది.

 Previous Page Next Page