Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 16

 

    "గంపెడు మంది పిల్లల్ని కని సుఖంగా వున్నవాళ్ళు లేరా? నా కర్మమిలా కాళింది.'
    "పిల్లలున్న వాళ్ళంతా ఇలా అయిపోతున్నారని కాదు . ఈ అవస్థకు ఇంతమంది పిల్లలు కూడా ఒక కారణమని చెప్పాను . నీ ఆరోగ్యం పాడవుతున్నప్పుడైనా జాగ్రత్త పడవలసింది."
    "నిజమే! ఆ ఆలోచన లేకపోయింది చెప్పేవాళ్ళు లేకపోయారు."
    "అమ్మా" అంటూ వచ్చిన లత కొత్తావిడను చూసి ఆగిపోయింది.
    "నమస్కారం చెయ్యి" అంది పార్వతి .
    లత నమస్కారం చేసింది.....
    "శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు" అని దీవించింది కళ్యాణి.
    లత సిగ్గుపడి లోపలికెళ్ళిపోయింది.
    "అదే! ఇప్పుడు పెద్ద బెంగయి పోయింది" దిగులుగా అంది పార్వతి. "కళ్యాణి? నీ ఎరికలో ఎవరయినా కట్నం లేకుండా చేసుకునే రెండో పెళ్ళి వాడుంటే చూసి పెడుదూ! మరీ ముసలి వాడు కాకుండా చూడు....అన్న వస్త్రాలకి లోపం లేకుండా ఉంటె చాలు. గొప్పవాడు కానక్కర్లేదు."
    కళ్యాణి గుండెల్ని ఎవరో పిండినట్లయింది. కన్న తల్లే తన కూతురికి రెండో పెళ్లి వాడ్ని చూడమని అడుగుతోంది. మొదటి పెళ్ళి వాళ్ళయితే కట్నం అడగక మానరని, కట్నం అడిగితే తామిచ్చుకోలెమని రూడిగా అనుభవాలు నేర్పేశాయి గనుక.
    'అలాగే చూస్తాను. లతకేం! బంగారు బొమ్మ మంచి సంబంధమే వస్తుంది."
    "మనిషి బంగారు బొమ్మే గాని వంటిమీద బంగారం లేదు కదా కళ్యాణి! అందుకే ఏ సంబంధమూ కుదరటం లేదు."
    "కుదురుతుందిలే పార్వతి! అనవసరంగా క్రుంగిపోకు.'
    "కొత్తగా కుంగిపోయేదేమిటి లే! పూర్తిగా చితికి పోయాను జీవచ్చవాన్ని." కళ్యాణి కళ్ళలో నీళ్ళు చిమ్మాయి.
    "నేనిక వస్తాను.' అంటూ లేవబోయింది.
    "వుండు. కాస్త కాఫీ తీసుకు వేల్దువు కాని లతా! కాస్త కాఫీ తయారు చెయ్యమ్మా! ఒక కప్పు!"
    "ఇప్పుడెం వద్దులే! పార్వతి!"
    "అలా అనకు... అన్నీ ఇయ్యగలిగిన శక్తి ఉన్నవాడు నీకు ఏం ఇయ్యకుండా పంపిస్తాను. దేవతలగా అన్నీ మరిచిపోయి, అభిమానంతో చూడటానికి వచ్చావు. ఈ నీళ్ళ కాఫీ బాధ నీకు తప్పదు."
    "చ! నీళ్ళ కాఫీ అని కాదు సరేలే! కాఫీ వదులుకునేదేవరు?" వాతావరణంలోని బరువు దించడానికి హాస్యంగా నవేసింది.
    కొంచెం సేపట్లోనే లత కాఫీ తయారు చేసి ఇచ్చింది. కాఫీ తాగి కళ్యాణి పార్వతితో చెప్పి వెళ్ళిపోయింది.

 

                                                           6

 

    చింతలో ఉంది ఆవిడ. అహంకారం ఇంకా అలాగే ఉందా? సడలిపోయిన కళ్యాణి ముఖం చూస్తూ అన్నాడు శంకరం నవుతో. కళ్యాణి కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. తెల్లబోయాడు శంకరం. " ఏమిటి! ఆవిడ ఇప్పుడు కూడా నిన్ను అవమానించిందా?" కోపంగా అన్నాడు.
    "లేదు...లేదు...." కంగారుగా అంది ఆమె.
    "మరి ఎందుకా కన్నీళ్లు?"
    "సాయంత్రం మీరు వెళుతున్నారుగా! మీకే తెలుస్తుంది." వింతగా చూశాడు భార్య వంక శంకరం.
    ఆ సాయంత్రం శంకరం సత్యనారాయణ గారింటికి వెళ్ళే సరికి సత్యనారాయణ భార్యతో గట్టిగా దెబ్బలాడుతున్నాడు.
    "ఎలాగూ చస్తాను. నన్నెవరూ బ్రతికించలేరు కాస్త త్రాగనియ్యి - ఒక్క డోస్ చాలు."
    "వీల్లేదు , మీరు చస్తారు మహారాజులా! ఆ తరువాత మేం చావాలి. బ్రతకలేక ! మిమ్మల్ని ఏడుస్తూ అంటోంది పార్వతి.
    శంకరాన్ని చూసి గబుక్కున లోపలి వెళ్ళిపోయింది పార్వతి. అస్తిపంజరం లా మంచాని కతుక్కుపోయిన సత్యనారాయణ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి శంకరానికి.
    "ఎవరూ ......శంకరమా! రావోయ్ రా! ఎన్నాళ్ళ కొచ్చావ్? ఇంకా గుర్తున్నానన్నమాట?"
    "ఎంత మాటండి!" వినయంగా అన్నాడు శంకరం.
    'అండీ! ఇంకా నన్ను అండీ అంటున్నావా? ఓ పార్వతి , విను .......ఇంకా గోప్పవాన్నే నేను?" లోపలి నుంచి ఏ సమాధానమూ రాలేదు.
    "బాగున్నావుటోయ్? ఎలా ఉంది ఉద్యోగం? నా దగ్గర్నుంచి వెళ్ళిపోవటం మంచి పని చేశావులే! నువేవెళ్ళిందగ్గిర్నించి నాకు మరీ శని పట్టుకుంది.....అ! పిల్లలున్నారా? ఆరోగ్యం బాగుందా? తెలుస్తుందిలే! నన్ను చూశావా? బ్రతకలేను.......చావనివరూ హాయిగా ఇంకో నాలుగు రోజులు కడుపు తీర తాగావంటే విరగడాయి పోతాను. గానీ తాగనియ్యటం లేదు -- ఎన్నాళ్ళు బతికిస్తారో నేనూ చూస్తాగా?"
    శంకరం జాలిగా చూస్తూ కూర్చున్నాడు. అతనికి గొంతు పెగిలి మాటలు రావటం లేదు. ఇంతలో కాఫీ కప్పు తీసుకుని లత వచ్చి శంకరం గారికిచ్చింది.
    "అన్నట్లు నేను బ్రతకాలోయ్! " బెంగగా అన్నాడు సత్యనారాయణ. " మా లతకి పెళ్ళి చేయాలి... ఎక్కడన్నా సంబంధం చూడవోయ్! చిన్నవాడిని చూడు...ముసలాడిని చూడకు. వారిజకు- నా బుద్ది గడ్డి తిని , ముసలాడిని కుదిర్చాను" అంది.
    "చచ్చిపోయింది - " లోపలి నుంచి అరిచింది పార్వతి. గతుక్కుమన్నాడు సత్యనారాయణ.
    'అవును - చచ్చిపోయింది " దిండులో తల పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు.
    'ఊరుకోండి - ఎంత ఏడ్చిన చచ్చిన వాళ్ళు బతికొస్తారా?" అన్నాడు శంకరం. ఓదార్పుగా.
    'వచ్చినా మనం రానిస్తామా? దెయ్యాలనుకుని తరిమెయ్యమా?" సత్యనారాయణ అసందర్భంగా మాట్లాడటం బాగా అలవాటయి పోయిందనుకున్నాడు శంకరం. అంచేత అతని మాటలు పట్టించుకో కుండా కొంచెం సేపు కూర్చుని తను తెచ్చిన కమలాలు సత్యనారాయణ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకొని - "నువేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను ..." కళ్యాణి ముఖంలోకి చూస్తూ అన్నాడు శంకరం. "ఏం అనుకుంటాను? చెప్పండి - నేనూ ఒకటి చెప్పాలనుకున్నాను."
    "ఏమిటి?"
    "ముందు మీరే చెప్పండి...."
    "పోనీ , వాళ్ళ లతను మన రామచంద్రకు చేసుకుంటే లక్షణమైన పిల్ల!"
    "సరిగ్గా నేనూ అదే చెప్పాలను కుంటున్నాను."
    "అవునా? ఎంత మంచి దానివి కళ్యాణి!" కళ్యాణిని ఆప్యాయంగా దగ్గిరకి తీసుకోబోయాడు.
    "ఉండండి ..చిన్నపిల్లలా ....." ముసి ముసి నవులతో విదిపించుకొంది ఆమె. తల్లి రమ్మని అంటే రామచంద్ర వెళ్ళాడు. అసలు విషయం తెలుసుకుని 'పెళ్ళోద్దమ్మా? అసలు చేసుకోవాలని లేదు" అన్నాడు.
    "ఇన్నాళ్ళూ సుశీల పెళ్ళయితేనే కాని చేసుకోనన్నావు - సుశీల పెళ్ళయి అప్పుడే ఏడాది నిండుతోంది. ఇంకా ఏమిటి అభ్యంతరం రామూ?"
    'అబ్బ! నాకింకా చేసుకోవాలని లేదు - అంతే!" కొద్దిగా విసుక్కున్నాడు రామచంద్ర. చిన్నబుచ్చుకుంది కళ్యాణి. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
    రామచంద్ర కలవరపడ్డాడు తల్లిని సమీపించాడు. "నన్ను క్షమించమ్మా! నీ మీదే విసుక్కున్నాను? అన్నాడు జాలిగా. కళ్యాణి నవేసింది.
    "విసుక్కున్నా సహించగలను. కాని నువిలా పెళ్ళి లేకుండా ఉంటానంటే సహించను. పోనీ ఎవరినయినా ప్రేమించావా చెప్పు నువేవరిని ప్రేమిస్తే వాళ్ళనే చేసుకో. నాది కాని మీ నాన్నగారిది కాని అభ్యంతరం ఏం ఉండదు."
    "లేదు - లేదు" తీవ్రంగా అన్నాడు.
    'అంత గాభరా పడతావెంరా? మరి అసలు పెళ్ళి వద్దనటం దేనికి ? నా మాట విను. ఒక్కసారి వచ్చి లతని చూడు ఇష్టమయితేనే చేసుకో! లేకపోతె నిన్ను బలవంతం చేసే దెవరు? పిల్లనే చుడననటం ప్రేమించిన వాళ్ళు అనవలసిన మాట! నువు ఎవర్ని ప్రేమించలేదని నేను నమ్మాలను కుంటే నువలా మాట్లాడకూడదు."
    తల వంచుకున్నాడు రామచంద్ర. అంగీకరించినట్లే .అది చూసి తేలికగా నిట్టూర్చింది కళ్యాణి. చూసుకోవడానికి వస్తున్నట్లు ముందుగా ఉత్తరం వ్రాసి వెళ్ళారు. కళ్యాణి, రామచంద్రా, ముగ్గురూ వెళ్లకూడదని ఆగిపోయాడు శంకరం. ఎంత సర్దినా ఇంట్లో దరిద్రం ఒడుతూనే వుంది. ఎక్కడి నుంచో కుర్చీలు తెప్పించి వేశారు.
    కళ్యాణిని కన్నీళ్ళతో కౌగలించుకుంది పార్వతి.
    "నువు దేవతవి కళ్యాణి! ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియటం లేదు" అంది.
    కళ్యాణి పార్వతి కన్నీళ్లు తుడిచి "ఏం చెప్పనక్కర్లేదు - రత్నం లాంటి పిల్లని నా కొడుకు సుఖం కోసం నేనాశపడితే నన్ను పొగుడుతావేమిటి? సరే! ముందు లతను తయారు చేసి తీసుకురా! వెర్రిగా అలంకరించెవు సుమా! మావాడికి ఎంత నిడారంబరంగా వుంటే అంత ఇష్టం ---"

 Previous Page Next Page