Previous Page Next Page 
జన్మభూమి పేజి 16

    ఇప్పుడు ప్రతిదీ మార్కెట్ కి తరలిపోతున్నాయి. జనానికి డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయం అయిపోయింది లోకంలో. కేశవరావు కాస్త బాధగా అన్నాడు.
    "మన చిన్నప్పుడు డబ్బు అవసరాలకి యిప్పటికి చాలా తేడా వచ్చిందండి. మనకీనాటితరం వాళ్ళకున్న కోర్కెలు ఎక్కడుండేవి. యిప్పుడు ప్రతి తల్లితండ్రి పిల్లల కోరికలు తీర్చడమే ధ్యేయం అన్నట్లుగా సంపాదిస్తున్నారు. ఏం చేసయినా పిల్లలకి మంచి చదువులు చెప్పించాలని, వాళ్ళడిగిన బట్టలు, రకరకాల చెప్పులు, ఏది కావాలంటే అది కొంటున్నారు. మనం చిన్నప్పుడు చెప్పులేలేకుండా తిరిగేవాళ్ళం- మన చిన్నతనాన్న ఐస్ క్రీమ్ అన్నా కొనిపెట్టారా మనవాళ్ళు. వాళ్లేది కొంటే అది తొడుక్కునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి తెల్లారిలేస్తూనే పాలు కాదు చాక్లెట్లు లంచం ఇవ్వాలి. శలవస్తే ఐస్ క్రీమ్ పార్లర్ లకి, హోటళ్ళకి తీసికెళ్ళాలి. చిప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినడం ఫ్యాషనయిపోయింది. మధ్యతరగతివాళ్ళు ఎలా ఖర్చుపెడ్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది సిటీలో.  
    "అవును. యిదివరకు యజమాని ఒక్కడే సంపాదిస్తే యింటిలో అరడజను పిల్లలు తక్కువకాకుండా వుండేవారు. యిప్పుడు భార్యాభర్తలు సంపాదిస్తున్నారు. ఒకరిద్దరు పిల్లలు అవడంతో కలలు, ఆశలు వారిమీదే పెట్టుకుని వారిమీద అవసరాన్ని మించిన ఖర్చుపెడుతూ పిల్లలని పాడుచేస్తున్నారనిపిస్తుంది నాకు. అన్నింటికంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చాక పిల్లలలో ఎడ్జస్టు మెంటాలిటీ, షేరింగ్ గుణం తగ్గి స్వార్థం పెరిగింది. మా చిన్నప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుండేవారు. శలవులొస్తే అత్తలు, పిల్లలు అంతా వచ్చేవారు. అందరం కలిసి ఎంత సరదాగా వుండేవారం. ఏమిటో ఇప్పుడు ఆ ఆప్యాయతలు, అభిమానాలు ఏమీ లేవు. ప్రపంచమంతా మెటీరియలిస్టిక్ గా అయిపోయింది అనిపిస్తుంది. ఆ ఇంతకీ ఈ వూరొచ్చాక పాలు, పెరుగు, కూరలు మంచివి దొరుకుతున్నాయి. పోనీ ఆ విషయంలోనైనా హ్యాపీ కదా..."
    "నేను అనుకున్నంత బాధగా లేదులెండి ఇక్కడ - ఇంకా ఈ వాతావరణానికే కాస్త అలవాటు పడాలి. కాలక్షేపం టీ.వీ. తెలుగు పత్రికలు, నవలలతో అవుతుంది. సుగుణ వస్తోంది రోజూ...నిన్న వూర్లో ఆడవాళ్ళు అరడజనుమంది నన్ను కల్సుకోడానికి వచ్చారు. ప్రెసిడెంటు భార్య, మాష్టారి భార్య, వూర్లో మోతుబరి చౌదరిగారి భార్య యిలా కొందరు వచ్చారు. ఈ ఇల్లు చూసి ఆశ్చర్యపోయారంతా ఆ ఇల్లేనా అని..."
    "ఏమంటారు?"
    "ఏదో మామూలు మాటలు..."
    "మీరంతా కలిసి వూర్లో యేదన్నా కాస్త పనికొచ్చే మంచిపని చేయకూడదూ! చదువురాని ఆడవాళ్ళందరిని కాస్త కూడగట్టి నాలుగక్షరం ముక్కలు చెప్పడం, వాళ్ళకేమన్నా చేతి పనులు వస్తే చేయించడం లాంటి పనులు నీవు చెయ్యకూడదూ. ఉదయం పదిగంటలయ్యేసరికి నీ పని అయిపోతుంది గదా! అలా స్కూలుకి వెళ్ళి ఓ రెండు గంటలు చదువు చెప్పచ్చు. సైన్సు సబ్జక్టు గదా నీది. కాస్త పెద్ద పిల్లల క్లాసుకి సైన్సు. వీలయితే ఇంగ్లీషు లాంటివి చెప్పు. సరైన టీచరు వున్నట్టు లేదు స్కూల్లో... నీకు టీచింగ్ అలవాటుంది కదా"
    రాజేశ్వరి కాస్త ఆశ్చర్యంగా చూసి "గవర్నమెంటు స్కూలు గదా. నేను చెప్పొచ్చా" సందేహంగా అడిగింది.
    "చూడు రాజీ... నీవు జీతానికి పనిచేస్తానంటే రూల్సుగాని! ఫ్రీగా చెపుతానంటే వద్దని ఎవరంటారు. రాజీ... మనం ప్రతిఫలం ఆశించకుండా ఓ మంచిపని చేస్తే జనం వేదవాక్కులా పాటిస్తారు. అదే ప్రతిఫలం అడిగావనుకో, చెట్టెక్కి కూర్చుంటుంది లోకం. నీకేం జీతం అక్కరలేదు, సోషల్ సర్వీస్ చెయ్యి. నేను హెడ్మాస్టారుతో మాట్లాడుతాను. ఏ క్లాసుకి టీచరు కావాలో అడిగి చెపుతాను. ఓ రెండుగంటలు నీకూ కాలక్షేపం. లంచ్ టైముకి వచ్చేయవచ్చు ఇంటికి."  
    రాజేశ్వరి అంగీకారంగా తల వూపింది.
    "సుగుణతో చెప్పి పొలంలో పనిచేసే ఆడవాళ్ళని పిలవమని చెప్పి పిలిచి మాట్లాడు. సాయంత్రం ఓ గంట వచ్చి చదువుకోమని చెప్పు అందరికీ. ఆ ప్రెసిడెంటు భార్య అందరిని పిలిచి మాట్లాడు ఈ విషయం. నీ ఒక్కర్తివే ఏదో చేస్తున్నట్టుగా కాక వూర్లో అందరి సహాయ సహకారాలతో చేస్తున్నట్లు కనపడనీ - లేదంటే రేపు విమర్శలు, వెక్కిరింతలు రావచ్చు... ఏదో నీ చేతనయినట్టు ఆడవాళ్ళకి సాయం చెయ్యి-" భోజనం ముగించి లేచాడు కేశవరావు.
                                                             *    *    *
    మర్నాడు సాయంత్రం ప్రెసిడెంటుగారి యింటిముందు వూర్లో పెద్దలు, రైతులు అందరినీ సమావేశపరిచాడు ప్రెసిడెంటు అంజినాయుడు.
    "డాక్టరుగారు మనందరం కలిసి సహకార సేద్యం చెయ్యాలని, దానివల్ల చాలా లాభాలు వుంటాయని అంటున్నారు. ఆయన చెప్పే మాటలు ముందు వినండి. తరువాత మీ ఉద్దేశం, మీ అనుమానాలు లాంటివి వుంటే చెప్పండి" అంజినాయుడు ఉపోద్ఘాతంగా అన్నాడు.
    "సహకార సేద్యమేం కొత్త విషయమా ఏమిటి, అందరికీ తెల్సిందేగా. అది ఏం అంత సుళువుగాదు, జరిగేది కాదు" కాస్త వ్యంగ్యంగా అన్నాడు లక్ష్మయ్య చౌదరి.
    "ఎందుకు సుళువుకాదని మీరనుకుంటున్నారు..." కేశవరావు అడిగాడు.
    "నాలాంటివాళ్ళకు సహకారసేద్యం అవసరం యేమిటండి. వందెకరాలు నా పొలం పని నాకు చాలు. నాకు ట్రాక్టరుంది. చిన్న రైతులకు లాభమేమోకాని నాలాంటి వారికి అక్కరలేదు" దర్పంగా అన్నాడు.
    "ఆ బాబుని చెప్పనీండి చౌదరిగారూ... ఆరిని మాట్లాడనీయండి ముందు" కోమటి నరసింహం కాస్త తిరస్కారంగా అన్నాడు!
    "ఆ...ఆ... బాబుగారు చెప్పండి" నలుగురైదుగురు రైతులు ఉత్సాహంగా అరిచారు.
    "చూడండి, అమెరికా నుంచి నేను ఈ వూరు ఎందుకు వచ్చానో మీకు తెలుసునని అనుకుంటాను. ఇది నేను పుట్టిన వూరు. ఇది నా జన్మభూమి. ఈ వూరిని నా చాతనయినంతగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని, వూర్లో అందరినీ ఒక తాటిమీదకి తెచ్చి అందరం కల్సి ప్రగతి పథంలో నడపాలన్నది నా ధ్యేయం.
    ముఖ్యమంత్రి చెప్పినట్టు మన యిల్లు మనం ఎలా బాగుచేసుకుంటామో, మన పిల్లలని మనం ఎలా వృద్ధిలోకి తేవాలనుకుంటామో అలా- ఇందులో వుండేవారు మనందరి పిల్లలు అన్న భావనతో ఐక్యమత్యంగా ఈ వూరు మనం బాగు చేసుకుందాం. దానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తే నేను ముందుంది మీ అందరికీ కావల్సినవి చేస్తాను. ప్రతిది ప్రభుత్వం చెయ్యాలనుకుంటూ కూర్చుంటే ఏదీ జరగదు. ప్రభుత్వానికుండే పరిమితులు వారికి ఉంటాయి. ఆర్థికంగా ఆంక్షలుంటాయి. ముఖ్యమంత్రి ఎంత ఆశించినా ప్రభుత్వ యంత్రాంగం ఆయనతో సరిగా సహకరించదు.
    అడుగడుగునా రూల్సు రెగ్యులేషన్స్ మధ్య కోరిక వున్నా ఆయన ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దలేడు. అందుకే 'జన్మభూమి' పథకం ఆరంభించి ప్రజల అవసరాలు తీర్చుకోవడానికి ప్రజలే ముందుకువచ్చి వారి సమస్యలని పరుష్కరించుకోవాలని సూచించాడు. జన్మభూమి కింద మనం చేపట్టే పనులకి సగం డబ్బు ప్రభుత్వం యిస్తుందని చెపుతున్నారు.
    మన గ్రామంలో రోడ్లు, నీటి వసతులు, స్కూలు, ఆస్పత్రి వంటి సదుపాయాలని మెరుగుపరుచుకోడానికి మనం 'శ్రమదానం' చేస్తే, సగం ఖర్చు మనం అందరం భరిస్తే మిగతాది ప్రభుత్వం యిస్తుంది. ఆ విధంగా మనం మన వూరికి అన్ని సదుపాయాలూ సమకూర్చుకోవచ్చు. అందులో భాగంగా ముందుగా మనం ఈ వూర్లో వున్న మొత్తం సేద్యపు భూమిని అందరం కల్సి 'సహకార సేద్యం' పథకం కిందకి తీసుకువచ్చి చిన్న పెద్ద రైతులందరూ కల్సికట్టుగా పొలం పనిచేసి, వచ్చిన రాబడిని ఎకరాల నిష్పత్తిలో పంచుకుంటే ఒకరు నష్టపోవడం, ఇంకొకరు లాభపడడం, ఒకరు ఎక్కువకు అమ్ముకోవడం, ఇంకొకరికి తక్కువ రాబడి లాంటి సమస్యలుండవు. అంతా కలిసి విత్తనాలు, ఎరువులు, మందులు లాంటివి ఏక మొత్తంగా కొనుక్కుంటే లాభం వుంటుంది. మన పంట మనమే అమ్ముకుంటే మనకు రాబడి చాలా పెరుగుతుంది. ఏజెంట్లు, మిల్లర్లకి యివ్వకుండా మనమే ఒక రైసు మిల్లు పెట్టుకుని, మన బియ్యం, పప్పులు మనమే డైరెక్టుగా మార్కెట్ చేసుకుందాం. ఒక ట్రాక్టరు, ఒక హారెస్టింగ్ మిషను కొంటే పొలం కోయడం, కుప్ప నూర్పిడి అంతా త్వరితంగా జరుగుతుంది.  

 Previous Page Next Page