Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 16


    ఇంతలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి అక్కడకు నెమ్మదిగా వచ్చి తలవంచుకొని లోపలకు వెళ్ళిపోయింది.    
    "హరే, హిది ఏమిటీ చిత్రం" అని సాయిబు నోరావలించాడు. మిగతా వాళ్ళంతాకూడా పత్తికాయలంత గుడ్లేసుకుని చూస్తున్నారు. అంతా ఒక్కసారి బిగ్గరగా నవ్వారు. "ఇవాళ డాక్టర్ కి మజా" అన్నారు. "డాక్టర్ పచ్చి కిలాడీ వీడికి క్లబ్బు ఎందుకూ, గ్లిబ్బూ ఎందుకు? ఇంటిదగ్గరే క్లబ్, పైలా పచ్చీస్."    
    నాకు కోపంతో పిచ్చెక్కింది. గట్టిగా అరుస్తూ "మీరంతా రాక్షసులు గెటవుట్ - వెళ్ళండి."    
    "హరే, డాక్టర్ పాగల్ హోగయారే."    
    వాళ్ళంతా అనుమానంతో నావంక చూసి "బ్రూట్" అని తిడుతూ వెళ్ళిపోయారు.    
    అవమానంతో నాకు మతిపోయింది. తల పట్టుకొని కుర్చీలో కూర్చుండి పోయాను. జుట్టు పీక్కున్నాడు. లేచి గబగబ లోపలకు పోయేసరికి ఆమె  అప్పుడే వంటప్రయత్నంలో వుంది.    
    "ఇలారా" అని అరిచాను.    
    త్రుళ్ళిపడి, వెనుదిరిగి నా రౌద్రాకారం చూసి వణికిపోతూ నిల్చుంది.    
    "మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్రొద్దున్న చెప్పలా రావద్దని నన్ను నవ్వులపాలు చేద్దామనుకున్నావా?"    
    ఆ అమ్మాయి బితుకు బితుకుమంటూ "అమ్మకు యీ పూట నిదానంగా లేదు. నేను వెళ్ళనంటే 'ఆయన అలానే అంటారు. వెళ్ళకుంటే రేపు మండి పడతారు' అని నన్ను బలవంతాన పంపింది."    
    "మంచిపని చేసింది. ఇక్కడినుండి శీఘ్రం దయచెయ్యి. మీ అమ్మకు చెప్పు, ఇలాంటి తెలివితక్కువ పనులు ఎప్పుడూ చేయొద్దని తెలిసిందా?"    
    "తెలిసిందండి."    
    "సరే వెళ్ళు రిక్షా యెక్కి వెళ్ళు మీ యిల్లు చాలా దూరమనుకుంటాను."    
    "మరి.. మీకు ఈ పూట భోజనం?"    
    "నా ఏడుపేదో నేను ఏడ్చుకుంటాను. ఇదిగో యిది తీసుకుని, రిక్షాలో వెళ్ళు తప్పుకదూ, ఇలా ఒంటరిగా వంట చేయటానికైనా సరే రావటం! మీ అమ్మకు నెమ్మదించాక రమ్మను. అవునూ, ఇంతవరకూ నీకు పెళ్ళి కాలా? ఎందుకు చేయలా మీ అమ్మ?"    
    "అయిందండీ" అంటూ తలవంచుకుని బొటనవ్రేలితో నేలను రాస్తూ ఊరుకుంది.    
    "మరి అయితే యిదేం ఖర్మ?"    
    జవాబు చెప్పలేదు, తల ఎత్తలేదు.    
    "ఫర్వాలేదు చెప్పు."    
    "వదిలిపెట్టేశాడండీ."    
    నాకు జాలివేసింది. "అలాగా పాపం! ఇలా నిన్ను ఎక్కడికీ పంపవద్దన్నానని మీ అమ్మతో చెప్పు పోయిరా."    
    ఆమె తలవూపి వెళ్ళిపోయింది. నేను యివతలకు వచ్చి కుర్చీలో జారగిల బడి కళ్ళు మూసుకున్నాను. బ్రతుకుతాను. అన్ని బంధాలనూ వదిలించుకుని బ్రతుకుతాను. నాకు వద్దు ఈ స్నేహితులు నాకు వద్దు ఈ బాంధవ్యాలు నాకు వద్దు ఈ కశ్మల కల్మష ప్రపంచం.    
    ఆ పూట నేను భోజనం చేయలేదు. అర్ధరాత్రి కలత నిద్రనుండి మెలకువ వచ్చినప్పుడు బాగా చలిగా వుండి, జ్వరం వచ్చినట్లు తోచింది. మరునాటి ఉదయానికల్లా నూటమూడు డిగ్రీలు కాంపౌండర్ తో మందు కలిపి యివ్వమని చెప్పి, తాగి నేను గదిలో పడుకున్నాను. సీరియస్ కేసుమాత్రం ఏదైనా వుంటే సలహాకోసం లోపలకు తీసుకురమ్మని, మిగతా వాళ్ళకు మందులిచ్చి పంపివేయమనీ చెప్పాను.    
    గదిలో కళ్ళు తెరిచి చూస్తూ ఆలోచిస్తూ గడిపాను. ఆ రోజంతా యించుమించు అలానే గడిచిపోయింది. రాత్రికి కాంపౌండర్ తాను తోడుగా పడుకుంటానన్నాడుగాని అక్కర్లేదని పంపించేశాను. నౌకర్నికూడా పంపివేశాను.    
    ఆ సమయంలో నాకెవరూ శుశ్రూష చేసేవాళ్ళు లేరే అన్నదిగులు కలగ లేదు. భార్య లేకపోయిందే అన్న బాధ కలగలేదు. ఆమెకూడా అనసూయలా నటిస్తూ వుండినట్లయితే!    
    అనసూయ! ఈమెతో నాకు అనుకోకుండా ఎందుకు పరిచయం అయింది? బాబాయి కేవలం ఒక ఛాయామాత్రుడిగా వున్నాడు, ఈపాటికి ఈమె ఏమి చేస్తూవుంటుంది! నేను రాలేదని తలపోస్తూ వుంటుందా? లోకాన్ని గురించి కడిగా ఆలోచిస్తూ వుంటుందా!    
    నాకు యింకా చెప్పని లోతైన రహస్యం ఆమె జీవితంలో వుండివుండాలి. నేనెప్పుడూ ఫలానా విషయాన్ని గురించి చెప్పమని ఆమెను ప్రశ్నించలేదు. ఎప్పుడైనా కుతూహలం కలిగినా అణచుకొనేవాడిని. ఆమె యెప్పుడో చెప్పి వేస్తుంది.    
    మరునాడూ, ఆ మరునాడూ కూడా జ్వరం తగ్గలేదు. నేను పంతంపట్టి యెవరి సహాయమూ కోరకుండా మొండికేశాను.    
    ఆ మధ్యాహ్నం ఫ్లాస్కులోని కాఫీ అప్పుడే పోసుకుని త్రాగి తిరిగి పడుకున్నాను. ఇంట్లో నేనుతప్ప యెవరూలేరు. ఇంతట్లో వాకిట్లో అలికిడి అయింది. దగ్గరగా వేసివున్న తలుపులు త్రోసుకున్నట్లు చప్పుడు ఒక నిముషం గడిచాక నా గది గుమ్మందగ్గర అనసూయ ప్రత్యక్షమైంది.
    
    నేను గుడ్లప్పగించి చూస్తున్నాను. నన్ను చూసీ చూడగానే ఆమెముఖంలో చిరునవ్వు మాయమైంది. గబగబ దగ్గరకు వచ్చి ఫాలంమీద చేయివేసి చూసి "అబ్బ జ్వరం మండిపోతూందే డాక్టర్! మీరిలా పెంకివేషాలు వేయవచ్చా? ఎవరిచేతనైనా కాస్త కబురుచేస్తే వచ్చేదాన్ని కాదూ? ఈ పిన్ని చచ్చిపోయిందను కొన్నారా?" అంది గాద్గదికంగా.
    
    నాకు ఏడుపు వచ్చింది. నా రెండుచేతుల్తో బలహీనంగా ఫాలంమీది ఆమెచేతిని ముఖానికి అదుముకున్నాను.
    
    "పిన్నీ! నాకెవరూ లేరు పిన్నీ" అన్నాను.
    
    ఆమె మంచంమీద కూర్చుంది. అప్యాయంగా తన రెండోచేత్తో నా హృదయాన్ని నిమిరి "తప్పు, నేను లేనూ" అంది.

 Previous Page Next Page