నాకు చదవటం ఇష్టం. నేను చదవంది ఏదయినా సరే నా కంట పడిందంటే వెంటనే చదవందే ఉండలేను. నేను ఉత్తప్పుడే చదువుతాను. డ్యూటీలో వుంటే మాత్రం ఇంపార్టెంట్ విషయం తప్ప నవలలు చదవను. నా అలవాటుని డ్యూటీలో తప్పక పాటిస్తుంటాను. నవల చదవను.
ఇప్పుడు ఇంటిపట్టున వున్నాను. ఆడింది ఆట పాడింది పాట. నవలలు చదవవచ్చు నాటకాలు వేయవచ్చు. అడిగే నాధుడు వుండడు.
క్రైమ్ నవలలు ఇంగ్లీషువి చాలా బాగుంటాయి. తెలుగులో క్రైమ్ రాసే వాళ్ళు వున్నారు. కాని వాళ్ళలో నలుగురు మాత్రమే బాగా రాస్తారు. వాళ్ళ నవలలన్నీ చదవటం అయిపోయింది. ఈ మధ్యనే ఇద్దరు రైటర్లు ఇంగ్లీషు నవలని మక్కీ మక్కీ కాపీ చేసి తెలుగులో అటు మార్చి ఇటు మార్చి ఏ మార్చి కొత్తరకం శవసాహిత్యం సృష్టిస్తున్నారు. వాళ్ళు ఎన్ని నవలల్ని ఈ విధంగా కాపీ కొట్టగలరో చూద్దామని వాళ్ళ పుస్తకాలు తెచ్చుకొని చదవటం మొదలు పెట్టాను.
"అడుక్కునే దెయ్యం" అన్న నవల చదువుతూ కూర్చున్నాను. ఓసారి ఇలాంటి నవల నేను చదువుతుండగా చూసిన జయనారాయణ్ అనే నా మిత్రుడు. "ఇదేంటి భాయ్! చచ్చుసాహిత్యాన్ని చదువుతున్నావు!" అన్నాడు వెంటనే నేను ఏ మాత్రం తడుముకోకుండా "దేనినీ తీసేయకూడదు భాయ్! రాళ్ళల్లో రత్నాలుంటాయి. ఒక్కోసారి కనపడ్డాయి." అన్నాను.
"మంచిది ఇలాంటి రాళ్ళని నీ జీవితమంతా వెతుకు, ఒక్క రత్నం కూడా కనిపించకపోగా తల బొప్పి కడుతుంది." అన్నాడు.
ఇలాంటి ఏ నవల తీసుకున్నాసరే వాడి మాటలే నాకు గుర్తొస్తుంటాయి.
అడుక్కునే దెయ్యం నవల అరవై ఆరో పేజీ చదువుతుండగా ఓ విషయం గుర్తుకు వచ్చి సడన్ గా ఆగిపోయాను.
అరవై ఆరో పేజీలో రాసి వున్నది మరోసారి చదివాను అదే మేటర్.
అసమాన మన్నది రాకూడదు వస్తే అంతే మరి.
అమీ తుమీ తేల్చిందాకా నా మనసు ఆగదు.
అడుక్కునే దెయ్యం నవలని టీపాయ్ మీద వుంచి లేచాను.
నా అనుమానం అర్ధరహితం కావచ్చు. నా సిక్స్ సెన్స్ హెచ్చరికలో నిజంగా దాగి వుండవచ్చు. తాడో పేడో తేల్చుకోంది మనసు ఆగదు.
పది నిమిషాలలో రెడీ అయి ఇంట్లోంచి బైటపడ్డాను.
అద్దెబుక్స్ షాపులో అతన్ని అడిగాను. "అడుక్కునే దెయ్యం నవల రాసిన రచయిత నవలలన్నీ కావాలి వున్నాయా?"
"అతను మొత్తం తొమ్మిది నవలలు రాశాడు. ప్రస్తుతం షాపులో ఆరు నవలలు వున్నాయి." అన్నాడు అతను.
ఆరు నవలలు తీసుకున్నాను.
"అతని నవలలే అడుగుతున్నారు దేనికండీ!"
"ఈ మధ్య కాలంలో వెరైటీగా రాస్తున్నది అతనే చాలా బాగుంటుంది అతను కధ నడిపేతీరు" అన్నాను.
"నిజమే అందరూ అతని నవలలే కావాలంటారు."
"కొత్త నవల మరేదైనా వస్తున్నదా?"
"ఇహపై నెలకి రెండు వస్తాయి. ఎళ్ళుండి షాక్ అనే నవల మార్కెట్ లోకి వస్తుంది".
"ముందు నేనే తీసుకుంటాను తప్పక వుంచండి."
"అలాగే" అతను నవ్వుతూ చెప్పాడు.
నవలలు తీసుకొని యింటికి బైలుదేరాను.
14
మూడు నవలలు తిరగేసేసరికి రాత్రి పన్నెండు అయింది.
అనవసరంగా చదివిన నవలలే మళ్ళీ పూర్తిగా చదివాను అప్పుడు తెలిసింది దానిలో వున్న చిన్నక్లూ అతని నవలలన్నీ చదివితేగాని పూర్తి వివరం తెలియదు. అర్దరాత్రి అద్దె షాపులుండవు రేపటిదాకా ఆగాలి.
ఆగాను చేసేదేమీ లేక.
తెల్లారింది.
నావృత్తి ధర్మం నా అలవాటుపోనిచ్చుకోకుండా ఈ చిన్న విషయంలో కూడా జాగ్రత్తపడుతూ మరో అద్దె షాపుకి వెళ్ళి ఆ రచయిత రాసిన నవలలు అడిగాను.
"ఇతను రాసిన నవలలు మీద అందరూ మోజుపడరు. ఇలా వకేసారి నాలుగు నవలలు అడిగేది ఇద్దరు మీరు మూడోవారు" అన్నాడు అతను.
"ఆయిద్దరూ ఎవరు! తరచువస్తుంటారా, ఒక ఆడ ఒక మగానా లేక యిద్దరూ మగవాళ్ళేనా?" అన్న ప్రశ్నలు నా కంఠంలోనే ఆగిపోయాయి.
ఇలాంటి ప్రశ్నలు వెయ్యకూడదు. కళ్ళతో చూడాలి అంతే.
"నేను కాలక్షేపంగా నవలలు చదువుతుంటాగాని యితని నవలలు చదవలేదు. నిన్న ట్రైన్ లో ఇద్దరు యువతులు మాట్లాడుకుంటుంటే విన్నాను.
"అతని వే ఆఫ్ రైటింగ్ బాగుంటుంది. అతని నవలలంటే నేను పడిచచ్చేది అందుకే." అంది ఓ యువతి. వెంటనే రెండో యువతి "అవునౌను ఇతగాడు ఉత్తకాపీదాసుడు కదా" అంది వ్యంగ్యంగా ఆ తర్వాత యిద్దరూ వాదించుకున్నారు. వాళ్ళ సంభాషణ విన్న నాకు యితని పుస్తకాలు చదవాలనిపించింది." చిన్న కథ అల్లి వివరించాను.
నేను చెప్పింది విని షాపు అతను నవ్వాడు. నేనూ ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి వచ్చేశాను.