Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 15

 
    ఆవిడ గబగబా వచ్చి శంకరిని గాఢంగా కౌగలించుకొంది. "బాగున్నానేమే? మీ ఆయన రాలేదేం?"

    "నేనొక్కదాన్ని వస్తేనే ఇంత గొడవ జరిగింది కదా?" రుద్దవ్వరంతో అడిగింది శంకరి.

    "చాలా మంచిపని చేశావ్. నీ వయసులో నాకు నీ ధైర్యమి  వుంటే ఇలా ఇంత నిస్సారంగా రాలిపోయే దాన్ని కాదు. ఆ ఇంట ఏభై ఏళ్లు చాకిరీ చేశానా? నిన్ను తీసికెళ్లి ఓ పది నిమిషాలు కూర్చోబెట్టుకొని మంచీ చెడ్డ మాట్లాడేపాటి స్వతంత్రం కూడా నేను పొందలేదు. ఎంత చేస్తేనేం? గట్టుకు  రాళ్లు మోసినట్టు... నా సాదకేం?ఎలా వుంది నీ సంసారం? మీ ఆయన నిన్ను బాగా చూసుకొంటున్నాడా?"

    "మీ ఆయన్ని నువ్వు బాగా చూచుకొంటున్నావా  అని అడగాలి అత్తా"

    "అవునే ఇక్కడుండగా చూశాను కదా, వట్టి అమాయకుడు. మరి ఎలా వేగుతున్నావే  అతడితొ?"

    "అమాయకుడేగాని మాయలు, మోసాలు తెలియని ఒక మంచి మనిషి. అలాంటి మనిషితో బ్రతుకు నిశ్చింత కదా?"

    రుక్మిణమ్మ వదినగారు తమింటి వాకిటిలో నిలబడి "దానితో నీకేం మాటలు? ఇంట్లోకి రా' అని కసిరినట్టుగా పిలిచింది.

    "వస్తానే మళ్లీ ఎప్పుడు చూస్తానో. వీళ్ళంతా పతి వత్రలు, తల్లీ! గౌరవ మర్యాదలున్న సంసారులు" ఆవిడ షణుగుతూ వెళ్లిపోయింది.

    అడుగులు భారం వెనుదిరిగింది శంకరి.

    ఆమె అక్కడినుండి వెళ్లిపోయాక జయలక్ష్మి అంది. ఎదురింటామెతో "ఆ మనిషిని చూశారా ఎలా తయారయ్యిందో? ఇక్కడుండగా ఎలా వుండేది?సోగ్గాతయారయ్యేది?షిఫాన్ చీరలు, పాలిస్టర్ చీరలూ తప్ప కట్టేది కాదు. ఇప్పుడు చూడండి. దరిద్రమంతా ఆ చ్పీ లోనే అన్నట్టుగీ నగలన్నీ అమ్ముకు తిన్నట్టుంది. మెడలో  వట్టి దారం పోగే వేసుకొంది. చేసుకొన్న వాళ్లకి చేసుకున్నంత అని చేసిన పాపం ఊరికేపోతుందా? దేవుడు  ఈ భూమ్మీదనే అంతా చూపిస్తాడు"

    "అవునండోయ్ బాగా చిక్కిపోయింది. ఆ రంగు కూడా లేదు. చిదిమితే రక్తం కారేట్టుగా వుండేది. బాగా నల్లబడిపోయింది. మొదట చూసి శంకరేనా, కాదా అనుకున్నాను" అంది ఎదురింటామె.



                      *    *    *    *   


   
    నాలుగు రోజుల తరువాత ఆచారికి శంకరి నుండి ఉత్తరం వచ్చింది.
 
    "అన్నయ్యా!"

    నా పిలుపు నీ ఒంటిమీద తేళ్లూ, జెర్రులూ ప్రాకినట్టుగా అవుతూందా? (వదినకీ అలాగే అయిందట) కాని, అన్నయ్యను అన్నయ్యని పిలువక ఇంకేమని పిలువను? ఎదురుపడి 'అన్నయ్యా' అని పిలిచే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఈ తెల్లకాగితం మీద అక్షరాల తోటైనా పిలుచుకోనీయవా? నిన్నూ, వదిననూ, పిల్లలనూ ఒకసారి చూసిపోదామని ఎంతో ఆశతో వచ్చాను, ముఖ్యంగా సుభద్రను. రోజూ స్నానంపోసి, సాంబ్రాణి పొగపట్టి, ఉయ్యాలలో వేసేదాన్ని కదూ? దాన్ని నేను ఒక్క క్షణం మరిచిపోలేదు గాని అది నన్నెప్పుడో మర్చిపోయి వుంటుంది.
 
    అందరి మీద ఇంత ప్రేమున్న దానివి ఈ పని ఎందుకు చేశావని అడుగుతున్నావా?

    తన సుఖం తను చూసుకోవడంలో అన్నా చెల్లి బంధాలు త్రెగిపోనక్కర లేదుకదా? నా సుఖం నేను ఈ విధంగా చూసుకోవడం నీకు నీతిబాహ్య మనిపించవచ్చు. వితంతువు తిరిగి వివాహం చేసుకోవడం శాస్త్రాలదృష్టిలో శాస్త్రాలను  తగిలించుకొన్న వాళ్ల దృష్టిలో అధః పాతాళం లోకి క్రుంగిపోయేంత పాపకార్యం. ఎన్ని జన్మలెత్తినా తీరని దోషం. ఒక భార్యా విహీనుడు మళ్లీ పెళ్లిచేసుకొంటే, (ఇంట్లో తన క్రొత్తభార్య వయసులోనే పెళ్లీడు కెదిగిన కూతురున్నా) అది ధర్మబద్దమూ - లోకసహజమూ అయినప్పుడు -ఒక భర్తృవిహీన పునర్వివాహం చేసుకోవడం నీతిబాహ్యమూ, పాపకృత్యమూ ఎలా అవుతుంది?

    నిజానికి మగవాడు ఆసరా, నీడు అక్కరలేనివాడు. ఆడది ఒక ఆశరా లేకపోతే,  నీడ లేకపోతే బ్రతకలేదుకదా? పునర్వివాహం ఒక పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ అవలరం న్యాయంగా ఆలోచిస్తే. కాని, ఆది నుండి స్త్రీల అవసరాల్ని, హక్కులని ఎవరు గుర్తించారని? ఆడదంటే ఒక విలాస వస్తువు. ఒక కట్టుబానిస!

    నాలాంటి ఆడది తిరగబడి ప్రశ్నిస్తే 'ఇదంతా మొదటినుండి వస్తూన్న పద్దతి. ఇది మన ఆచారం. ఇది మన సంస్కృతి. అని నోరు మూయించాలని చూస్తారు ఏ కాలానికి అవసరమైంది ఆ కాలానికి  అమలు చేసేదే ఆచార మని నా వుద్దేశ్యం. కాదు,  ఏ కాలానికైనా   ఒకే ఆచారమని నా వుద్దేశ్యం. కాదు, ఏ కాలానికైనా ఒకే ఆచార మంటే అది - ఆచారం కాదు దురాచారమంటాను  నేను.

    శతాబ్దం క్రింద ఎవరూ ఊహించనటువంటి మార్పు మనిషి జీవన సరళిలో వచ్చింది, కాని ఆచారాల్లో మార్పు రాకూడదు, పద్దతుల్లో మార్పు రాకూడదు, ముఖ్యంగా స్త్రీల విషయంలో విధింపబడిన విధి నిషేధాల్లో ఏ విధమైన మార్పు రాకూడదూ అంటే ఎలా?

 Previous Page Next Page