వీళ్ళు వీళ్ళేసరికి ఇంట్లో భీమరాజుగారూ, బాబూరావూ కూడా లేరు - అని ఆఫీసు టైము కావడం వల్ల.
"ఈరోజు మీరు వస్తారని తెలుసు. కానీ ఎప్పుడో తెలియదు ...." అంటూ తలుపు చాటు నుంచి చెప్పింది భీమరాజు గారి భార్య రుక్మీణి.
రాజారావు సంతృప్తిగా పరిసరాలను పరికించాడు. ఇల్లు బాగానే వుంది. మనుషుల సంస్కారం వాళ్ళు మాట్లాడే తీరులోనే తెలుస్తోంది. సెలవుల కారణం వల్ల కాబోలు చాలామంది పిల్లలింట్లోనే వున్నారు. ఇంటికి బాబూరావే పెద్దకొడుకు.
భోజనాలు చేసేవచ్చామని చెప్పడం వల్ల తండ్రీ కొడుకు లిద్దరికీ విశ్రాంతి ఏర్పాట్లు జరిగాయి. చెరో మడత మంచం వేశారు. ఒక టేబిల్ ప్యాన్ అరేంజ్ చేశారు. బాబురావు పెద్ద తమ్ముడు దగ్గర్లో వున్న టెలిఫోన్ బూత్ నించి తండ్రికి ఫోన్ చేసి వీళ్ళు వచ్చినట్లు కబురందించాడు.
తనకు కాబోయే బావగారి కుటుంబంతో పూర్తీ పరిచయం లభించింది రాజారావుకి. అప్పగింతల బట్టలను దృష్టిలో వుంచుకుని వారి వారి వయస్సును మనస్సులో మననం చేసుకున్నాడతను. వాళ్ళ పేర్లు అతని బుర్రలో కెక్కలేదు. అతని దృష్టంతా పెళ్ళి తంతు మీదనే వుంది. ఇంచుమించు అర్జునుడి ఏకాగ్రత అతనికి లభించినట్లుంది.
ఆలోచనలేలాగున్నా ఒక్క విషయం గ్రహించాడు రాజారావు. లక్ష్మీ ఈ ఇంట్లో సుఖపడుతుంది. వాతావరణంలో తన ఇంటికీ యీ ఇంటికీ పెద్ద తేడా కనబడడం లేదు. అతని మనస్సు తెలికపడ్డమే కాక అతనిలో కొత్త ఉత్సాహం కూడా కలిగింది.
ఒక రాత్రల్లా చేసిన బస్సు ప్రయాణం కలిగించిన అలసట కారణంగా తండ్రీ కొడుకు లిద్దరకూ విశ్రాంతి అవసరం బాగా కనిపిస్తోంది. ఇద్దరూ కూడా మేను వాల్చేసరికి మిగతా పని ఫ్యాను గాలి చూసుకుంది.
ఒంటిగంట ప్రాంతంలో రాజారావుకు మెలకువ వచ్చింది. తమను గురించే ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అతను చటుక్కున లేచాడు.
"మెలకువ వచ్చిందాండీ ----' బాబురావు పెద్ద తమ్ముడు పలకరించాడు.
"మమయ్యగారోచ్చినట్లున్నారు ---' అన్నాడు రాజారావు.
"అవును ఇప్పుడే వచ్చారు-----" అన్నాడతను.
రాజారావు తువ్వాలుతో ముఖం తుడుచుకుని అక్కణ్ణించి కదిలాడు.
"ఈయనే మా నాన్నగారు ----" బాబూరావు పెద్ద తమ్ముడు పరిచయం చేశాడు. రాజారావు వెంటనే ఆయనకు నమస్కరించాడు.
"నమస్కారమండీ --మీరేనా రాజారావంటే -----' అన్నాడాయన.
రాజారావు ------ 'అవునండీ -----' అంటూ వినయంగా జవాబిచ్చి భీమరాజుగారిని కాస్త పరీక్షగా చూశాడు. భీమరాజుగారు ఆజానుభాహుడు. వర్చసుట్టిపడే ముఖం. ప్రశాంతమైన నయనాలు. వీటి లోంచి బాబూరావు రూపాన్నూహించడానికి ప్రయత్నిస్తున్నాడతను.
"నాన్నగారిని లేపమంటారా ......." అన్నాడు రాజారావు మళ్ళీ.
"అబ్బే వద్దండీ- ప్రయాణం బడలిక మీద వచ్చారు - మీరు కూడా కాసేపు పడుకోవాల్సింది ....."
'అలా ఎలా కుదుర్తుంది లెండి - ఈ రాత్రికే మళ్ళీ వెళ్ళిపోవాలి మేము ........." అన్నాడు రాజారావు.
భీమరాజుగారు నవ్వేశాడు -------'మరీ చెప్పుల్లో కాలుపెట్టుకు వస్తే ఎలా - కనీసం మరోక్కరోజైనా వుండి వెళ్ళాలి...."
"నిజమేననుకోండి - కానీ అవతల చాలా వ్యవహారాలున్నాయ్. ఆడపెళ్ళి వారం కదా ....' అని ఇబ్బందిగా నవ్వాడు రాజారావు.
భీమరాజు గారు కాస్త చనువుగా రాజారావు భుజం తట్టి ------- 'ఆ మాట మాత్రం అనొద్దు. ఇది మీ యింట్లో పెళ్ళి అనుకోకండి. మనింట్లో పెళ్ళి అనుకోండి. పెళ్ళి జయప్రదంగా జరిగిపోవడానికి మీకూ మాకూ కూడా సమాన భాద్యత వుంది "----- అన్నాడు.
రాజారావు మనసు దూదిపింజలా తెలికపదిపోయింది. అతనూహించని అభిమానం, ఆప్యాయత - భీమరాజు గారి మాటల్లో ధ్వనించాయి. అతడ్ని పీడిస్తున్న ఎన్నో సందేహాలకు - సమాధానంగా అమృతోపమానమైన ఆ పలుకులు అతని చెవిలో పడ్డాయి. కృతజ్ఞతా పూర్వకంగా అతను భీమరాజు గారి వంక చూసి --- "మీ మాటలు నాకు చాలా ధైర్యంన్నిచ్చాయి. మీ మంచితనం మా అదృష్టంగా భావిస్తున్నాను. అంతమాత్రాన మా భాద్యతలను మరిచిపోలేము ....' అన్నాడు.
వెంకట్రామయ్య లేచినట్లున్నాడు- సరాసరి . అక్కడకే వచ్చి "ఎంతసేపయిందీ బావగారోచ్చి ---" అన్నాడు.
భీమరాజు నవ్వి -----"ఇప్పుడే వచ్చాను. మీవాడితో మాట్లాడుతున్నాను. మొత్తం మీద భలేవారండీ బావగారూ - నా ఉత్తరానికి జవాబు పత్రం రాశారు కాదు ----" అన్నాడు.
'అదేంటండోయ్ - ఇప్పుడు నేనిక్కడ కొచ్చింది- జవాబు గానే కదా -----" అన్నాడు వెంకట్రామయ్య.
'అయితే చాలా ఆలశ్యం చేశేశారండీ -----మే 25 వతేదీన వివాహ మూహూర్తమన్న విషయానికి ఫైనల్ కన్ ఫర్మేషన్ ఇమ్మంటూ రాశాను - ఏమీ లేదు. దూరాభారంలో చాలామంది బంధువులున్నారు. అందరికీ శుభలేఖలు వేయిద్దామని ఆశ. అంటే కాస్త ముందుగానే అచ్చేయించాలి కదా----అందుకని రాశాను. మీనుంచి జవాబు రాకపోతే చూసి, చూసి చివరకు తెగించి శుభలేఖలు వేయించేశాను. సాయంత్రానికి వస్తాయి - చూద్దురు గాని ....' అన్నాడు భీమరాజు.
"ముహూర్తం విషయంలో నిజంగానే మీ కనుమానమున్నట్లయితే నన్ను చూడగానే ఆత్రుతగా - దాని గురించే ప్రశ్నించి ఉండేవారు. అంటే ఆ విషయంలో మీకేమీ ఆదుర్దా లేదనేగా ...." అని నవ్వాడు. వెంకట్రామయ్య ---"డబ్బు సర్దుబాటయ్యేసరికి కాస్త ఆలశ్యమయింది. ఊరికే ఉత్తరాలు రాసి ప్రయోజనమేమిటి చెప్పండి -పని జరగాలి కానీ..... లెక్క అందగానే వెంటనే రెక్కలు కట్టుకుని మీముందు వాలాను ...."
భీమరాజు ముఖంలో తృప్తి కనబడింది- " ఇందాకా మీవాడీ రాత్రికే ప్రయాణమవ్వాలన్నాడు. అలా కుదరదు. రెండు మూడ్రోజులైనా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ రేపు రాత్రి లోగా వెళ్ళనిచ్చేది లేదు...."
వెంకట్రామయ్య నవ్వి ------"మీకో చిన్న విషయం చెప్పాలి. ఆ తర్వాత కూడా మీరు మమ్మల్ని ఇంకా ఉండమని బలవంత పెడతారనుకోను...." అన్నాడు.
భీమరాజు కుతూహలంగా "చెప్పండి -----' అన్నాడు.
"మీరు చెప్పిందానికి రెండు తక్కువయింది..... ప్రస్తుతానికి నాలుగే తెచ్చాం. పెళ్ళి నాటికి మిగతాదంతా సర్దుబాటైపోతుంది...." అన్నాడు వెంకట్రామయ్య కాస్త నెమ్మదిగా.
'చంపేశారు బావగారూ -' అన్నాడు భీమరాజు చటుక్కున. అయన ముఖంలో దెబ్బతిన్న వాటం కనబడింది--- "కనీసం ఈ విషయం ఉత్తరం ముక్క ద్వారా ముందుగా రాసి పారేయాల్సింది. మీరు ఆరూ ఇస్తారనే అభిప్రాయంతో అన్ని ఏర్పాట్లకు సిద్దపడ్డాం."
"నిన్నటివరకూ నాకూ తెలియదా సంగతి. కానీ మీరేం అనుమానపడవద్దు. ముహూర్తం టైముకు మిగతాదంతా మీకంద జేసే పూచీ నాది-------" అన్నాడు వెంకట్రామయ్య.
'అడ్వాన్సు గురించి కూడా అలాగే అన్నారు------' అన్నాడు భీమరాజు కాస్త చిరాగ్గా.
"నిజమే బావగారూ - కానీ అన్నీ అనుకున్న ప్రకారం చేయడానికి- సామాన్యుణ్ణి నేను. అనుమానం సంగతంటారు - ఈ నాలుగూ తీసుకుని తర్వాత పెళ్ళీ లేదు గిళ్ళీ లేదని మీరంటారని నాకు భయం లేదు. పెళ్ళి కానిచ్చేసి - మరి నావల్ల కాదు - ఇచ్చిందేదో పుచ్చుకుని వెళ్ళండని నేనంటానని అనుమానం మీకుందని నేనూ అనుకోను....'
"నా అభిప్రాయమది కాదు బావగారూ ....ఆరూ ఇప్పుడే ఇచ్చేద్దామన్న సత్సంకల్పం తోనే మీరప్పుడా మాటిచ్చారు. మీ మాట నమ్ముకుని నేను ప్రయత్నాలారంభించాను. ఇప్పుడు నాలుగే ఇవ్వగలనంటున్నారు . మిగతా మొత్తం పెళ్ళి నాటికి తప్పక యిస్తానంటున్నారు. కానీ మళ్ళీ అనుకోని పరిస్థితులేదురై డబ్బు సమకూరక పొతే .....అప్పుడు నేనేమైపోవాలి చెప్పండి! అందుకే నేనేవరికైనా మాటిచ్చేటప్పుడు వెనకా ముందు ఆలోచిస్తాను. ఒకసారి మాటిచ్చేక ఎలాగో అలా నిలబెట్టుకుంటాను....' అన్నాడు భీమరాజు.