ఈ విషయం చెప్పడానికతను తండ్రి దగ్గరకు వెళ్ళాడు ---- "మా మామగారుత్తరం రాశారు లక్ష్మీ పెళ్ళి ముహిర్తం తేదీ తెలియబర్చమని. వంట బ్రాహ్మలు సిద్దంగా ఉన్నారట. అది రావు గారి జట్టు. వాళ్ళింట్లో మనుషుల్లా అన్ని పనులూ చేసుకుపోతారు. కాస్త చార్జీ ఎక్కువైనా - వంటలు బాగా చేస్తారు. పొదుపుగా చేస్తారు పేచీ కోరు మనుషులు కాదు. వీళ్ళు మన చేయిదాటి పోకుండా రేపే శ్రీకాంత్ ని కాకినాడ పంపిస్తున్నాను. అడ్వాన్సిచ్చి వచ్చేస్తాడు అంతా మన అదృష్టం ------"
అంతా విని వెంకట్రామయ్య గారు --------"చూసేవా దైవ సంకల్పం "---అన్నాడు.
రాజారావుకు భయం వేసింది. నిజంగానే తన ప్రయత్నాల్లో ఏమీ లేదని అతనికనిపించడం మొదలయింది. కానీ ఇలా ఒక్కొక్క పనే సానుకూల పడుతూ రావడం తండ్రికి తన సిద్దాంతాల మీద మరింత నమ్మకం కలిగేలా చేస్తుందేమో నని అతనికి భయంగా వుంది.
తండ్రి తన సిద్దాంతాలు తప్పు - అని గ్రహించాలంటే లక్ష్మీ పెళ్ళి ఆగిపోవాలి ---' పొరపాటున కూడా అలా జరగకూడదు ----' అనుకున్నాడు రాజారావు.
అయినా దైవసంకల్పమెలాగున్నదో రాజారవుకీ తెలియదు.
10
"ప్రస్తుతానికి నాలుగువేలే యిద్దాం ----' అన్నాడు వెంకట్రామయ్య.
'అలా బాగుండదేమో - అడ్వాన్సుగా అరువేలిస్తామని మాటిచ్చేక ఇచ్చేయడమే మంచిది. ఎలాగు ఇవ్వడం తప్పదు ----' అన్నాడు రాజారావు సందేహంగా.
'ముందు సంగతి ఆలోచించవేం? మనకిక్కడ బోలెడు ఖర్చుంది. పెద్దాడు కలకత్తా నించి ఎంత డబ్బు తీసుకువస్తాడో ఖచ్చితంగా తెలియదు. అవతలవాళ్ళు మనం అన్నమాట ప్రకారం డబ్బిస్తామో యివ్వమోనని అపనమ్మకం కొద్దీ ముందు డబ్బడుగుతారు తప్పితే - వాళ్లకు పెద్ద అవసరమేమీ వుండదు. ఈ నాలుగువేలూ తప్పకుండా సరిపోతాయి ....' అన్నాడు వెంకట్రామయ్య.
"వాళ్ళకెంత సరిపోతుందీ అన్నది ముఖ్య విషయం కాదు. వాళ్ళకు మనమెంతిస్తామని చెప్పామో అదీ ముఖ్యం -----' అన్నాడు రాజారావు.
'చెప్పాననుకో , కానీ మనమూ మధ్య తరగతి వాళ్ళం. ఒక్కసారిగా అంత డబ్బు తేగలమని వాళ్ళూ అనుకోరు...."
'అనవసరంగా లేనిపోని అపార్ధాలకు దారి తీస్తుందేమోనని భయంగా వుంది....'
'అలాంటి అనుమానాలు పెట్టుకోకు. నేను చూసుకుంటానుగా వ్యవహారాన్ని -- ఎటొచ్చీ పరిస్థితి ని బట్టి వ్యవహరించడం కోసం ఇంకో రెండు వేలు కూడా దగ్గరుంచుకుందాం --" అన్నాడు వెంకట్రామయ్య.
ఏపనయినా వాయిదా పద్దతుల్లో చేస్తే కానీ వెంకట్రామయ్యకు తృప్తిగా వుండదు. అదే మనస్తత్వన్నాయన ఆఖరికి కట్నం డబ్బు లివ్వడం దగ్గర కూడా ప్రదర్శిస్తున్నాడు.
వీళ్ళిద్దరూ బయల్దేరుతుంటే ---"నువ్వొచ్చేసరికి అప్పడాలు పెట్టడం అయిపోతుందిరా బాబీ ----' అంది పార్వతమ్మ రాజారావు నుద్దేశించి.
'అంతపని మాత్రం చెయ్యకు. నాకు అప్పడాల పిండి చాలా యిష్టం - నేనొచ్చేదాకా అప్పడాల పని వాయిదా వెయ్యి ..." అన్నాడు రాజారావు.
రాజమండ్రిలో ఆర్టీసీ బస్సెక్కారు - వెంకట్రామయ్య, రాజారావూ . రాత్రి ప్రయాణం కాబట్టి పెద్ద బాధనిపించలేదు. బస్సులో రాజారావు పక్కన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కూర్చున్నాడు. రాజారావు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆఫీసరని తెలిసి అతను తను ఆసూయపడుతున్నట్లు చెప్పాడు - 'పని చేసినా చేయకున్నా - మీకు నెలజీతం ముడుతుంది . కావలసినంత సెలవుంటుంది. చెప్పలేనన్ని సేక్యూటీసుంటాయి. కానీ మాది చాలెంజింగ్ జాబ్. నా సంపాదన నా స్వశక్తి మీద ఆధారపడి వుంది. ఏ క్షణంలో నైనా ఉద్యోగం పోవచ్చుననే భయముంటుంది. నిజానికి మా అనుభవం ముందు మీ అనుభవం చాలదు. జీవితమంటే మాకర్ధమైనంతగా మీకు తెలిసుండదు. కడుపులో చల్ల కదలకుండా - నీడపట్టున చేసే ఉద్యోగం మీది. నేను కోరేది మీకులాంటి ఉద్యోగమే. కానీ అందరికీ ఆ అదృష్టముండదు కదా --' అన్నాడతను.
అతని మాటల్లోని నిజాన్ని చాలావరకు మనస్పూర్తిగా అంగీకరిస్తూ రాజారావు ---"నీడపట్టున వున్నా మండు టెండలో మసిలినా ప్రతిమనిషి తను జీవితాన్నర్ధం చెసుకుంటూన్నాననీ . జీవించడం కోసం పోరాటం సాగిస్తున్నానీ అనుకుంటాడు. ఏనుగు చుట్టూ మూగిన గుడ్డి వాళ్ళలా మన అనుభవాన్ని బట్టి అదే జీవితమను కుంటుంటాం మనం. ఎవరి సమస్యలు వారి కుంటూనే వుంటాయి. నామటుక్కు నాకు నా క్వాలిఫికేషన్ తో నాకంటే ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నవారిని చూసి అసూయగా వుంటుంది. అందుకవసరమైన అడ్డదారులు తొక్కడం నాకు చేతకాదు. ఆచేత కాని తనాన్ని నానత్ప్రవర్తనగా సరిపెట్టుకోవడం నాకు తృప్తినిస్తుంది. మీరు చేసే ఉద్యోగం- మీకు జీవితానికర్ధం తెలియబరుస్తోందనుకోవడం కూడా అటువంటి తృప్తిని మీకిస్తోందని నా అభిప్రాయం ----" అన్నాడు.
రాజారావు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తీరు అతనికి నచ్చింది -----"మీరు చెప్పింది నిజమే - మనిషికి అవసరమైనది సంతృప్తి. తన్ను తాను తృప్తి పరచుకుంటూ జీవిస్తాడు మనిషి. అలా చేయలేని నాడతనికి జీవితం పై విరక్తి కలుగుతుంది ----" అన్నాడతను.
రాజారావుకు తండ్రి మనసులో మెదిలాడు. ఆయనకు తెలివి తేటలున్నాయి. చదువుంది. సంస్కారముంది. కానీ విచిత్రమైన అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలతో ఏకీభవించే వారు అరుదు. అయినా అయన తన అభిప్రాయాలను మార్చుకోలేదు. అయన సంపద తరిగి పోయింది. బాధ్యతలు పెరిగిపోయాయి. అయినా అయన మనిషిగా దిగాజారిపోలేదు. తన సిద్దాంతాలనాయన తీవ్రంగా నమ్మడమే అందుక్కారణమయుండాలి. అయినా అయన నమ్మకం వమ్ము కావడానికవకాశాలున్నాయని ఎవరనుకుంటారు ? - చాలామంది దృష్టిలో అయన అదృష్టవంతుడే.....
రాజారావుకి ఒక చిన్న పురాణ కధ గుర్తుకు వచ్చింది. కృష్ణార్పణం అని భోజనం చేసే ఒక యోగి - నిత్య వుపవాసి అవుతాడు. నిష్కామంగా సంసారం నిర్వహించే శ్రీకృష్ణుడు ఆస్థలిత బ్రహ్మచారి అవుతాడు. సృష్టి రహస్యాన్ని తెలుసుకుని - సృష్టి లోని శాశ్వత మేదో, ఆశాశ్వతమెదో గ్రహించగలిగిన మహామనిషి - సామాన్యుడిలా సంసారసాగరంలో కొట్టు మిట్టాడుతున్నప్పటికీ అతడినే బంధాలు బాధించవు. తండ్రి నిర్లిప్తతకు ఇదే కారణమేమో!
ఒక మహాకవి బావాలనందరూ అర్ధం చేసుకోలేరు. కానీ ఆయనకి ప్రపంచ ఖ్యాతి లభిస్తుంది. సామాన్యుడి జీవితాన్నర్ధం చేసుకుని అతని సమస్యలను చిత్రీకరించే రచయితకు మహాకవి అన్న గుర్తింపు రాదు. యాబ్ స్ట్రాక్ట్, లైవుకీ , ప్రాక్టికల్ లైవు కీ వున్న భేదమే తన తండ్రీ మనస్తత్వానికి , తన మనస్తత్వానికి వుండి వుండాలి.
ఉదయం పది గంటల ప్రాంతాల బస్సు హైదరాబాదు చేరింది. తన మామూలు ధోరణిలోనే వెంకట్రామయ్య - ముందుగా వియ్యంకుడి ఇంటికి వెళ్ళవద్దన్నాడు. తనకు పరిచయమైన ఇదివరకటి హోటల్లోనే అతను మకాం పెడదామని సూచించాడు. రాజారావు అంగీకరించాడు.
హోటల్లో కాలకృత్యాలు తీర్చుకుని- కడుపు నిండా టిఫిన్ తీసుకుని తండ్రీ కొడుకులిద్దరూ భీమరాజు గారింటికి పయనమయ్యారు. తను పూర్వం వెళ్ళిన బస్సు నెంబరు వెంకట్రామయ్య కు గుర్తుంది.....
బస్సులో ఆ ప్రాంతాల్లో దిగేక - కొంచెం శ్రమ పడవలసి వచ్చింది ఇల్లు కనుక్కోవడానికి. అక్కడ ఇళ్ళన్నీ ఒకేమాదిరిగా ఉన్నాయి కాలనీ కావడం వల్ల. ఇంటి నెంబరు తెలుసును కాబట్టి వాకబు మీద ఇల్లు పట్టుకోగలిగారు.