"చాలా అత్యవసరమయిన పనిమీద వచ్చారు.
"ఐ సీ...అయితే తప్పకుండా మీ పెళ్ళి విషయం గురించే వచ్చి ఉండాలి."
"... ... ... ..."
"ఏం చేస్తున్నాడట అతను?"
సావిత్రికేం మాట్లాడాలో తెలీటం లేదు.
"ఏమైతేనేం...అతను చాలా అదృష్టవంతుడు.
"ఎందుకని?"
"ఇంత అందాన్ని పొందబోతున్నందుకు!"
"మా నాన్న సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..."
"ఏమిటది?"
"ఆయన ఫిలిం ఫెస్టివల్ కోసం వచ్చారు ఇక్కడికి."
"ఓ...అదా!"
"ఇప్పుడే కాదు__మొదటి నుంచీ అంతే! ఎప్పుడూ టూర్లు. షికార్లు, సినిమాలూ ఆయన చేసిన అప్పులన్నీ తీర్చుకొచ్చాను..."
శ్రీరామ్ నిశ్శబ్దం అయిపోయాడు. అతనికి సావిత్రి మీద జాలి కలిగింది.
ప్రతి ఒక్కరికీ వెనుక ఏదొక ముడి...
"ఇంటి సంగతులూ, మా ఆడపిల్లల పెళ్ళివిషయాలు ఇవేమీ ఆయనకు పట్టవు."
సావిత్రి తనను తాను మర్చిపోయింది.
ఎవరో ఆప్తులు లభించినట్లయిందామెకి. మనసులోని మాటలన్నీ ప్రవాహంలా దొర్లుతున్నాయి.
ఆఫీస్ చేరుకున్నా ఆమె మనసు ఇంకా శ్రీరామ్ చుట్టూతనే తిరుగుతుంది.
మొఖంలో ఎంత నైర్మల్యం? ఎంత చక్కదనం. అతనిని చేసుకునే అమ్మాయెవరో కాని అదృష్టవంతురాలు.
పదిహేను రోజులు గడచిపోయినాయి.
ఉదయం నుంచీ రాత్రి వరకూ సినిమాలు చూస్తూనే వున్నాడు విశ్వేశ్వర్రావు. ఆఖరి రోజున ఛార్జీలకు మరో వంద రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేసరికి మనసులో ఉన్న చికాకంతా మాయమయిపోయింది.
కన్నతండ్రి మీదే చికాకు కలగడం__! అయిష్టం పెరగటం...నిజంగా ఎంత దారుణం?
ఆరోజు రాత్రి డాబామీద కూర్చుని ఉంటే శ్రీరామ్ వచ్చాడు. కాసేపు ఏవేవో విషయాలు మాట్లాడాక...
"ఇవాళ మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను" అన్నాడతను. సావిత్రి గుండె వేగంగా కొట్టుకోసాగింది.
ఆత్రుత, ఆనందం, ఆశ...అన్నీ కలగాపులగమయి కదిలించి వేస్తున్నాయి.
ఏం మాట్లాడాలనుకుంటున్నాడతను? అదేనా?
"ఏమిటది?"
నిశ్శబ్దం! కొద్దిక్షణాలు!
"ఎప్పటినుంచో నా మనసులో ఉండిపోయింది... కనీ మీతో చెప్పేంత ధైర్యం లేక ఇంతకాలం పోస్ట్ పోన్ చేశాను."
సావిత్రి ఊపిరి బిగపట్టి వింటోంది.
"మీరు నాక్కావాలి సావిత్రీ! మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలనుకుంటున్నాను. మీఅంత అందమయిన అమ్మాయి నాలాంటి మామూలు మనిషిని చేసుకోడానికి ఒప్పుకుంటుందనుకోవటం కొంచెం అత్యాశేనేమో...అయినా ఐ వాంట్ టు ట్రై మై లక్!"
సావిత్రిని ఆ మాటలు అనిర్వచనీయమయిన స్థితిలోకి తీసుకెళుతున్నాయ్.
తన కలలు_కన్న కలలు, యింత కాలానికి నిజమవుతున్నాయ్.
"సావిత్రీ! త్వరగా మాట్లాడండి! ఇలా నిశ్శబ్దంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా ఆ విషయం చెప్పేసెయ్యండి! అది నా దురదృష్టం అనుకొని ఊరుకుంటాను."
సావిత్రికెలా చెప్పాలో తెలీటంలేదు. చాలా ఎగ్జయిటింగ్ గా వుంది.
"సావిత్రీ!" ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడతను. "చెప్పండి సావిత్రీ!" ఆతృతగా అడిగాడు. సావిత్రి తన చేతిని వెనక్కి లాగేసుకుంది.
"మీరంటే నాకిష్టంలేదని ఎలా అనుకున్నారు? మీరా ప్రసక్తి ఎప్పుడు తెస్తారా అని నేనూ యెదురుచూస్తున్నాను..."
శ్రీరామ్ ఆనందంతో పొంగిపోయాడు.
చటుక్కున ఆమెను దగ్గరగా లాక్కుని పెదాలమీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.
"ఎంత అదృష్టవంతుడినండీ! మీరు ఒప్పుకుంటారని కలలో కూడా అనుకోలేదు."
సావిత్రి అతని కౌగిలి నుంచి దూరంగా జరిగింది.
"బహుశా మనిద్దరి వంటరితనం మనల్ని దగ్గర చేసిందేమో..." అంది.
"సావిత్రీ! ఇంక మనం ఎందుకు వెయిట్ చేయటం. వీలయినంత త్వరలో పెళ్ళిచేసుకుందాం"
"ఒక షరతు."
"ఏమిటది?"
"మనం రిజిష్టర్ మ్యారేజీ చేసుకుందాం. తరవాత అందరికీ చెప్పవచ్చు."
"దానికి అభ్యంతరమేముంది? మీరెలా చెపితే అలా. మీవాళ్ళు ఒప్పుకోరని మీరనుకుంటున్నారా?"