"మావాళ్ళు కానీండి, మీవాళ్ళు కానీయండి ఏ సమస్య తలెత్తటం నాకిష్టంలేదు."
"అయితే రేపే ఆ ఏర్పాట్లు చేసేస్తాను. నెలరోజుల ముందే రిజిష్ట్రారాఫీస్ లో ఫారం ఫిలప్ చేయవలసి ఉంటుంది__"
ఆరోజునుంచి సావిత్రి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఉత్సాహం, ఆనందం, ఆశ__చెరగని చిరునవ్వు.
"ఏమిటీమధ్య ఫిలాసఫీ మాట్లాడటం మానేశారు అడిగింది శాంత ఓరోజు నవ్వుతూ.
"నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా?" నవ్వుతూ అడిగింది సావిత్రి.
"అబద్ధం నాదగ్గర చెప్పినా ఉపయోగం లేదు_ ఎందుకంటే నువ్వు మీఇంటి పక్కనుండే అతను ఓరోజు సాయంత్రం హోటల్ నుంచి కబుట్లు చెప్పుకుంటూ బయటకు రావడం చూశాను.
సావిత్రి ఆశ్చర్యపోయింది.
"మైగాడ్! అప్పుడే ఇంత పబ్లిక్కయిపోయిందా."
"పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట."
సావిత్రి నవ్వేసింది.
"మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలనుకుని వారంరోజులు అయింది..."
"కంగ్రాచ్యులేషన్స్! నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వో ఇంటిదానివవుతున్నందుకు."
"థాంక్యూ__"
"అయితే మనిద్దరం కల్సి ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉందామనుకున్న ప్లాన్ కాన్సిలేనన్నమాట"
"కావాలంటే నువ్వు మా ఇంట్లో ఉందువుగాని__"అంది సావిత్రి.
"ఇంకా నయం! ఇద్దరం కల్సి సంసారం చేద్దామన్నా కాదు..."
ఇద్దరూ నవ్వేశారు.
"పోనీలే! ఏం చేస్తాం! హాస్టల్లోనే కంటిన్యూ అవుతాను" అందామె.
ఆరోజు సాయంత్రం హోటల్ దగ్గర కల్సుకున్నప్పుడు శ్రీరామ్ మరింత ఉత్సాహంగా కనిపించాడు.
"సావిత్రీ రేపట్నుంచి మూడురోజులు హాలిడేస్ కదా. సరదాగా మైసూర్ వెళ్ళివద్దాం"
సావిత్రి నవ్వింది.
"ఇప్పుడే హనీమూనా?"
"మీఇష్టం! మీరేమనుకున్నా సరే! మొదటిసారి మనిద్దరం కల్సి చేసే ప్రయాణం కాబట్టి ప్లెయిన్ లో టిక్కెట్లు బుక్ చేశాను."
"చాలా కాస్ట్ లీ కదూ?"
"మనకోసం, మన ఆనందంకోసం "కాస్ట్ లీ" అనేదే ఉండకూడదు."
ఆ రాత్రి పొద్దుపోయేవరకూ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ గడిపేశారు.
ప్లెయిన్ జర్నీ చాలా వింతగా వుంది ఇద్దరికీ. అయితే అంత త్వరగా బెంగుళూరు చేరుకోవటం చాలా నిరుత్సాహం కలిగించింది.
టూరిస్ట్ బస్ లో మైసూర్ చేరుకుని హోటల్ లో దిగారు. సాయంత్రం బృందావన్ గార్డెన్స్ కెళ్ళారు. టూరిస్టులతో నిండిపోయి వుందది.
"సినిమాల్లో ఇది చూపించి, చూపించి బోర్ కొట్టించేశారు" అంది సావిత్రి.
రాత్రి చాలాసేపటివరకూ పూలతోటల మధ్య తిరుగుతూ గడిపారు. తిరిగి హోటల్ కి చేరుకునేసరికి రాత్రి పదకొండయిపోయింది.
అతని బెడ్ పక్కనే వున్న బెడ్ మీద పడుకోవటానికి సంకోచించిందామె. కానీ అంతలోనే సరిపుచ్చుకొని పడుకుంది...
శ్రీరామ్ ఉత్సాహంగా తను కాలేజీలో వుండగా వెళ్ళిన ఎడ్యుకేషన్ టూర్ గురించి చెబుతున్నాడు.
"మహాబలిపురం దగ్గర ఓ రాతి మీద ఎవరో చెక్కారు__నేను, నా భార్య సువర్ణా వచ్చాము. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాము."
దానికిందే ఇంకెవరో చెక్కారు.
"నేను వంటరిగా వచ్చాను...ఇంకా బోలెడు అద్భుతంగా ఎంజాయ్ చేశాను. ఇద్దరు సువర్ణలతో."
సావిత్రి నవ్వేసింది.
"ఏమిటి దాని అర్థం?"
శ్రీరామ్ కూడా నవ్వేశాడు.
హఠాత్తుగా అతను ఆమె దగ్గరకు జరిగి ఆమెను తనవైపుకి తిప్పుకున్నాడు.
"రేపు ఊటీ వెళదామా?" అడిగాడతను.
సావిత్రికి అతని స్పర్శ చక్కలిగిలి కలిగిస్తోంది. అంతకు ముందెన్నడూ అనుభవించని మత్తు నెమ్మదిగా శరీరమంతా అలుముకుంటోంది.
అతని చేతుల్ని నెమ్మదిగా తీసివేసిందామె.
"ఎందుకలా తోసివేస్తున్నావ్?" ఆమెను మరింత గాఢంగా తనలో పొదువుకుంటూ ముద్దుపెట్టుకున్నాడు.
సావిత్రి తట్టుకోలేకపోతోంది...ఇంకొద్ది క్షణాలు అతని కౌగిలిలో అలాగే వుంటే తనమీద తనకే కంట్రోల్ తప్పుతుంది.
"శ్రీరామ్_" ఇబ్బందిగా పిలిచిందామె.
"ఊ!"
"వదిలెయ్యండి."
"ఎందుకని?"