Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 15


    బద్దకంగా వళ్ళు విరుచుకున్నాడు.
    నెమ్మదిగా మంచందిగి, లుంగీ సర్దుకొని బాత్రూమ్ లో దూరి తలుపేసుకున్నాడతను.
    సంజీవరెడ్డి నగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని 'బి' టైపు ఇల్లు సాగర్ ది.
    అద్దెకొంప అది. సొందిగ్గా వుండే ఆ యిల్లు, చిన్న డ్రాయింగ్ గది, రెండు పడక గదులతో, ఒక స్టోర్రూమ్, ఒక కిచెన్ కలిగుంటుంది. అయితే ఒక్క బెడ్రూమ్ మాత్రం చిందర వందరగా బ్రహ్మచారి గదిలా వుంచి మిగిలిన గదులు నీట్ గా వుంచటం అతని ప్రత్యేకత. అతనా ఇల్లు తీసుకొని కొంతకాలమైంది.
    బాత్రూమ్ నుండి బయటపడి కిచెన్ లో దూరి కాఫీ కలుపుకున్నాడు. సిగరెట్టొకటి తీసి వెలిగించుకొని, కాఫే గ్లాసు నోటిదగ్గరికి తీసుకుంటూ వుండగా మ్రోగింది ఫోన్.
    అప్పుడు సరిగ్గా తొమ్మిదయింది సమయం.
    రిసీవర్ అందుకున్నాడు సాగర్.
    "యస్!"
    "మే ఐ స్పీక్ టు మిస్టర్ సాగర్?"
    "స్పీకింగ్"
    "తొమ్మిదయింది"
    "అవును"
    "రెడీ అయ్యావా?"
    అప్పటిదాకా ఆవరించుకున్న కొద్దిపాటి మత్తు ఒక్కసారిగా వదిలిపోయిందతనికి. ఒక్కమారుగా తానూ శృతీ క్రితంరోజు తీసుకున్న నిర్ణయం జ్ఞాపకం వచ్చిందతనికి.
    సరిగ్గా పదిగంటలకి భరద్వాజకి మందుతోపాటు స్లీపింగ్ పిల్ ఇస్తుంది శృతి. హబీబ్ ని పనిమీద తొమ్మిదిగంటల ముప్పై నిముషాలకల్లా బయటికి పంపేస్తుంది. తిరిగి అతను రావటానికి సుమారు మూడుగంటలు అంటే పన్నెండవుతుంది. ఈలోగా మత్తుగా పడుకున్న భరద్వాజ ఊపిరిని ఆపేయాలి తను.
    "సాగర్?"
    ఆలోచనలలోంచి ఈ లోకంలో పడ్డాడు. రిసీవర్ చుట్టూ బిగుసుకున్నాయతని చేతివ్రేళ్ళు.
    "బయలుదేరుతున్నాను"
    రిసీవర్ క్రెడిల్ చేసి చకచకా బట్టలు వేసుకొని తల దువ్వుకొని, శృతి తనకు ప్రజెంట్ చేసిన కర్చీఫ్ జేబులో కుక్కుకున్నాడు.
    చల్లారిన కాఫీ ఒక్క గుక్కలో తాగేసి, మిగిలిన సిగరెట్ సాంతం మూడే దమ్ముల్లో కాల్చేసి యాష్ ట్రేలో నలిపేసి బయటకొచ్చాడు. తాళం వేసి వాచీ చూసుకున్నాడు. తొమ్మిది గంటలా ముప్పై నిమిషాలు.
    ఇంకో అరగంటలో తాను భరద్వాజ యిల్లు చేరితే చాలు. తాపీగా స్కూటర్ కేసి అడుగులేశాడు సాగర్.


                             *    *    *    *


    టేబుల్ చుట్టూ అయిదుగురు కూర్చుని వున్నారు.
    ఓసారి తనచుట్టూ కూర్చున్నవారిని సాలోచనగా చూసి నోరు విప్పాడతను.
    "చౌదరి మరణించడం మనకు అనుకోని బోనస్"
    అందరూ అతన్నే చూస్తున్నారు.
    "క్రొత్తగా చేరబోయే ఇంజనీర్ మనవాడే అయితే అంత కష్టమవుతుందనుకోను"
    "అతను మనవాడే అవుతాడని గ్యారంటీ ఏమిటి?"
    "ఇన్ సైడ్ హెల్ప్ వున్నంతకాలం అదో పెద్ద ప్రాబ్లమ్ కాదు. మనకు కావలసిన వ్యక్తే జాయిన్ అవుతాడు. లాస్ట్ ఇయర్ తీసింగ్ వింగ్ లో అక్షయ కొచ్చిన నష్టం మూడుకోట్లు. ఈసారి హౌసింగ్ వింగ్ మనదెబ్బతో నాశనమయితే కోలుకొనే ప్రయత్నంలో వుంటారు వాళ్ళు. ఈలోగా మరెప్పటికీ కోలుకోని విధంగా దెబ్బతీయాలి మనం"
    కూల్ డ్రింక్ రావడంతో ఆగాడతను. అందరూ డ్రింక్స్ అందుకున్నారు.
    "ఈలోగా కారు ప్రమాదం, భరద్వాజ గుండెపోటు కొంత గ్యాప్ తెచ్చాయి. ఈ గ్యాప్ లో మనం మరోసారి ప్లాన్ ని పునరావలోకనం చేసుకోవాలని ఆ మీటింగ్ కి కాల్ ఫర్ చేశాను"
    ప్లాన్ లోని స్టెప్ నెంబర్ వన్....అంటే ఫిక్టీషియస్ ఫ్యాక్టరీని రూపొందించి, కాగితాలు తయారుచేయడం_పూర్తయిందిది"
    ఆగి కాగితంలో ఓచోట గుర్తుపెట్టుకున్నాడతను.
    "ప్లాన్ లో స్టెప్ నెంబర్ టూ....డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లోన్ అప్లికేషన్ తో సబ్మిట్ చేయడం. ఎక్కడా ఏమాత్రం తేడా లేకుండా ప్లాన్స్, లీగల్ డాక్యుమెంట్స్ రూపొందించడం.... ఇదికూడా పూర్తయింది.
    స్టెప్ నెంబర్ త్రీ....భరద్వాజ కాన్ఫిడెన్స్ సంపాదించడం.
    ఫ్యాక్టరీకి సంబంధించిన ఫిక్టీషియస్ అనెస్ మెంట్ పేపర్లు ఓ.కే. చేయించడం....ఇదీ పూర్తయ్యింది."
    ఇక లాస్ట్ స్టెప్....
    ఇన్స్పెక్షన్....లోన్ డిస్బర్స్ మెంట్....
    మరో నెలలో పూర్తవుతాయి.
    లాస్ట్ టైమ్ లీజింగ్ వింగ్ ని దెబ్బకొట్టినప్పుడు ప్రీతమ్ లీడ్ తీసుకున్నాడు గాబట్టి ఈసారి నేనే స్వయంగా లీడ్ తీసుకుంటున్నాను.
    "జాగిర్దార్! ఓ మంచి ఫ్లవర్ బొకే తీసుకుని భరద్వాజ ఇంటికెళ్ళు. మన కమిటీ తరఫున కాంప్లిమెంట్స్ ఇచ్చి, బోర్డ్ మీటింగ్ వివరాలు తెలుసుకో. అట్నుంచటే శ్రీధరం ఇంటికెళ్ళి పరామర్శించిరా" వెనక్కి వాలాడు అతను.
    అందరూ లేచారు.
    బయటకు వెళ్ళారు.
    జాగీర్దార్ స్కూటరెక్కి కదిలాడు.
    ప్రీతమ్ మళ్ళీ లోపలికొచ్చాడు.
    "ఏమిటి?"
    "మరేం లేదు. ఎలాగో చచ్చిపోయే మనిషి. పైగా జబ్బు పడ్డాడు. కావలిస్తే ఒకేసారి చంపేస్తే పోతుందిగా. ఎందుకిలా ఒక్కో దెబ్బే వేస్తున్నావ్ భరద్వాజకి?"
    "భరద్వాజని చంపితే జరిగేదేమీ లేదు. అంతేకాదు, అతనంత సులభంగా చావకూడదు కూడా."
    అతని అందమయిన ముఖంపై వికృతమైన నవ్వు మెరిసింది. ఒక్కక్షణం అదోలా గగుర్పొడిచింది ప్రీతమ్ శరీరం.
    "ఎందుకాయనంటే నీకంత కసి?"
    జవాబు చెప్పకుండా సిగరెట్టు వెలిగించుకున్నాడతను. లైటర్ నుండి విచిత్రమైన సంగీతం వెలువడింది. వాచీ చూసుకున్నాడు. సరిగ్గా పది గంటల యిరవై నిమిషాలయ్యింది.


                                               *    *    *    *


    అదే క్షణంలో భరద్వాజ ఇంటికి రెండు వందల గజాల దూరంలో తన స్కూటర్ పార్కు చేశాడు సాగర్.
    అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, చప్పుడు కాకుండా గేటు తెరిచాడు.
    సరిగ్గా అప్పుడే మార్కెటింగ్ లిస్టు యింట్లోనే మర్చిపోయి వచ్చిన సంగతి గుర్తుకొచ్చి సైకిలు వెనక్కి తిప్పాడు హబీబ్. అంతసేపూ దార్లో కనిపించిన ఓ మిత్రుడితో మాటల్లో పడటం వల్ల లిస్టు లేని సంగతి గుర్తించ;లేదు. అప్పటికే శృతి ఇవ్వమన్న నవలలు ఆమె స్నేహితురాలికిచ్చేసి, ఇంటి నుండి నాలుగు కిలోమీటర్లు వచ్చేసి వున్నాడతను. అక్కడ నుండి తిరిగి ఇంటికి పది నిమిషాల్లో చేరుకోగలడు. సైకిల్ తొక్కసాగాడు. ఒక కిలోమీటరు దాటగానే వెనకాల టైరు చిన్న శబ్దంతో పంచరు అయ్యింది....

 Previous Page Next Page